విశ్వసనీయత మీడియాకు సవాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత సాంకేతికయుగంలో విశ్వసనీయత మీడియాకు అతి పెద్ద సవాలుగా మారిందని, మీడియా సంస్థలు దాన్ని పాటించడం ముఖ్యమని ప్రధానిమోదీ అన్నారు. రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల ప్రదానోత్సవంలో బుధవారం మాట్లాడుతూ... సంబంధిత శిక్షణ, విద్యార్హతలు ఉన్నవారే గతంలో జర్నలిజం వృత్తిలోకి వచ్చేవారని, నేడు ఎవరైనా సరే మొబైల్ ఫోన్‌తో ఫొటో తీసి పంపవచ్చన్నారు.దేనిగురించైనా, ఎవరిపైనైనా మాట్లాడడానికి మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉందని, ఇతరుల అభిప్రాయాల్ని మీడియా ఇష్టపడదంటూ సరదాగా అన్నారు.
స్వాతంత్య్రం అనంతరం ఎక్కువ మీడియా ప్రచారం పొందిన రాజకీయ నాయకుడ్ని తానేనని, అందుకు రుణపడి ఉంటానన్నారు. ప్రభుత్వాన్ని మీడియా విమర్శిస్తే ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే రిపోర్టింగ్‌లో తప్పులు ఉండకూడదని, జాతీయ ఐక్యతే ముఖ్యమన్నారు. పలు అంశాలపై భారత్ వైఖరి వెల్లడించేందుకు ప్రపంచ స్థాయి భారత మీడియా సంస్థ అవసరమన్నారు. ప్రింట్, టీవీ, డిజిటల్ మీడియా రంగాల జర్నలిస్టులకు అవార్డులు అందచేశారు. కాగా, చమురు దిగుమతుల్ని తగ్గించే మార్గాలపై బుధవారం మోదీ నేతృత్వంలో భేటీ జరిగింది.