మధ్యతరగతి జమాఖర్చులు | To see what happens in the Wagle family watch the Wagle key 1990 | Sakshi
Sakshi News home page

మధ్యతరగతి జమాఖర్చులు

Published Wed, May 29 2019 5:14 AM | Last Updated on Wed, May 29 2019 5:14 AM

To see what happens in the Wagle family watch the Wagle key 1990 - Sakshi

అద్దె డబ్బు, కరెంటు బిల్లు, పిల్లాడి స్కూలు ఫీజుకాదేది మధ్యతరగతి కష్టానికి అనర్హం.మర్యాద నిలబెట్టుకుంటూ పైపై బింకాన్నినటిస్తూ జీవితాన్ని లాగించడమేమధ్యతరగతివాడి కర్తవ్యం.అందులో కొన్ని సరదాలు ఉంటాయి.గులకరాయిని కొండరాయి అనుకునేఆందోళనలూ ఉంటాయి.నవ్వులూ పూస్తాయి.ఏ దిక్కూ లేని మధ్యతరగతి వాడికి నవ్వే దిక్కుఅని చెప్పిన సీరియల్‌ ‘వాగ్లే కీ దునియా’.

మనదేశంలో మధ్యతరగతి కష్టాలు ఇన్నీ అన్నీ కావు. కొన్ని అయ్యో అనిపించేవి ఉంటాయి. మరికొన్ని మనసారా నవ్వుకునేవిగా ఉంటాయి. ఇంత చిన్నవి కూడా కష్టాలేనా అనిపించేవీ ఉంటాయి. శ్రీనివాస్‌ వాగ్లే కుటుంబపు కష్టాలు కూడా అలాంటివే. వాగ్లే కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే 1988–90నాటి కాలానికి వెళ్లి బుల్లితెరపై వచ్చిన ‘వాగ్లే కీ దునియా’ చూడాలి. ఇక్కడ వాగ్లే అనే అతను ఒక మధ్యతరగతి మనిషి. మనలాంటివాడు. మన ఇరుగుపొరుగు మనిషిలాంటి వాడు.

వాగ్లే ఇంటి పని
వాగ్లే ఓ ఆదివారం ఉదయం తీరికగా కూర్చుని పేపర్‌ చదువుతుంటాడు. పాడైన గడియారాన్ని షాపులో ఇచ్చి బాగు చేయించమని భార్య అంటే డబ్బులు వేస్ట్‌ అని, పైగా అందులోని ఒరిజనల్‌ సామాగ్రి షాప్‌వాడు తీసుకొని డూప్లికేట్‌వి వేస్తాడని, యాంటిక్‌ పీస్‌ అని.. తనే దానిని రిపేరు చేయడానికి పూనుకుంటాడు. గడియారం భాగాలను విడదీయడానికి స్క్రూ డ్రైవర్‌ కోసం ఇల్లంతా తుకుతాడు. చివరకు అటక మీద ఉండి ఉంటుందని పైకి ఎక్కి, పనికి రావని అటెక్కించిన సామాన్లన్నీ పనికి వస్తాయని భావించి ఒక్కోటి కిందకు దించుతాడు.

పాత సామాన్లను ఏమీ చేయలేక, అటు చెత్త సామాన్లవాడికి అమ్మకుండా తిరిగి వాటిని అటకెక్కించి అలసిపోతాడు. చివరకు గడియారం పీస్‌ను సామాన్లల్లో ఎక్కడ పెట్టాడో గుర్తుకు రాదు. పొరపాటున అటక మీద పెట్టానేమోనని అనుమానంతో తిరిగి సామానంతా కిందకు దించే పని పెట్టుకుంటాడు. ఈ వాగ్లేలో ప్రేక్షక జనం తమని తాము చూసుకున్నారు. మనసారా నవ్వుకున్నారు.

బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌
పెద్ద కొడుకు బ్యాడ్మింటన్‌ ఆడటానికి వెళుతున్నాడని తెలిసి ఇంటికి వచ్చాక ‘అమ్మకు సాయపడాలి కదా’ అంటూ మందలిస్తాడు వాగ్లే. తను కాలేజీ రోజుల్లో బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ అని, కుమారుల ఇద్దరికీ గుర్తు చేసి ఇంట్లోనే సామానంతా ఒక పక్కకు జరిపి ఇంటినే గ్రౌండ్‌ చేస్తాడు. కొడుకు స్కూల్‌లో గేమ్‌లో పాల్గొంటున్నాడని తెలిసి ఇంట్లో అంతా బయల్దేరుతారు.

అప్పటికే గేమ్‌లో ఎలా పాల్గొనాలో ఎన్నో జాగ్రత్తలు చెబుతాడు కొడుక్కి. గేమ్‌లో కొడుకు సరిగా ఆడటం లేదని, గ్రౌండ్‌ దాటి బయటకెళ్లిపోతాడు. గేమ్‌ ముగిశాక అంతా బయటకు వస్తుంటారు. తండ్రి ఎవరికీ కనపడకూడదని ఒక దగ్గర దాక్కొని ఉండటం చూసిన మనోజ్‌ తన ఫ్రెండ్‌కి వచ్చిన కప్పు తీసుకొని తనకే వచ్చిందని చెప్పడంతో వాగ్లే చాలా ఆనందపడిపోతాడు.తమకన్నా పిల్లలు బాగా రాణించాలని తామే దగ్గరుండి ఆటపాటలు నేర్పించాలని తపించిపోయే తల్లిదండ్రులు వాగ్లేలో చూసుకున్నారు. సరదాగా నవ్వుకున్నారు.

పనిమనిషి హడావిడి
వాగ్లే భార్య రాధిక ఇంటి పని ఒక్కత్తే చేసుకోవడం కష్టంగా ఉందని పనిమనిషిని మాట్లాడుతుంది. వాగ్లే కూడా అందుకు సరేనంటాడు. మొదటి రోజు అన్ని పనులు చకచకా చేసేసిన పనిమనిషి మరుసటి రోజు నుంచి ఆలశ్యంగా వస్తుంది. పనిమనిషి కోసం ఎదురు చూసి రాధిక ఇంటి పని అంతా తనే చేసుకుంటుంటుంది. చివరి సమయంలో వచ్చిన పనిమనిషి ఆలశ్యానికి కారణం కూడా చెప్పకుండా పని చేసుకుపోతుంది.

వాగ్లే, రాధిక ఆమెను ఏమీ అనలేకపోతారు. పనిమనిషి భర్త మాత్రం సమయానికి వచ్చి జీతం  డబ్బులు దబాయించి తీసుకెళతాడు. వాగ్లే అతని భార్య రాధిక దిగాలుగా చూస్తుంటారు.పనిమనుషులతో తంటాలు పడే కుటుంబాలలో ప్రతి ఒక్కరికీ కాస్త అటూ ఇటుగా ఇది తెలిసిన విషయమే. ఈ ఎపిసోడ్‌తో వాగ్లే కుటుంబంలో తమ కుటుంబాన్ని కలిపేసుకున్నారు సీరియల్‌ చూస్తున్న ప్రేక్షకులు.

పెన్‌ తెచ్చిన జబ్బు
వాగ్లే చిన్న కొడుకు రాజు తన అన్న మనోజ్‌ దగ్గర పెన్‌ తీసుకుంటాడు. సాయంత్రం స్కూల్‌ నుంచి వచ్చాక ఇస్తానని బతిమాలి తీసుకుంటాడు. చిట్ట చివరకు సరే అంటాడు మనోజ్‌.  స్కూల్‌ నుంచి వచ్చాక పెన్‌ కనిపించక రాజు టెన్షన్‌ పడుతుంటాడు. మనోజ్‌ వచ్చి తమ్ముడిని పెన్‌ ఇవ్వమంటాడు. అప్పటికే అన్న ఏమంటాడో అని భయపడుతున్న రాజు చూస్తున్నాను ఇస్తా, అంటాడు. ఆడుకొని వచ్చేసరికి పెన్‌ తీసి పెట్టాలి లేకపోతే అని బెదిరించి వెళతాడు. భయంతో తల్లి ఇచ్చిన పాలు కూడా తాగకుండా తండ్రి ఇచ్చిన బిస్కెట్‌ తినకుండా దిగాలుగా కూర్చుంటాడు. దాంతోపిల్లాడికి జబ్బు చేసిందని వాగ్లే, రాధిక భయపడతారు. రగ్గు నిండుగా కప్పి పడుకోబెడతారు. తనకేమీ కాలేదని చెప్పినా వినకుండా డాక్టర్‌ దగ్గరకు తీసుకెళతారు. డాక్టర్‌ దగ్గర ఫుల్‌ రష్‌ ఉంటుంది.

ఆ రష్‌లో పిల్లవాడిని వదిలేసి డాక్టర్‌ వాగ్లేకి టెస్ట్‌ చేసి, జబ్బు ఏమీ లేదని బలానికి టానిక్‌ రాసిస్తాడు. పైగా వాగ్లేని టెస్ట్‌ చేసినందుకు ఇరవై రూపాయలు తీసుకుంటాడు. ఇంట్లో పిల్లల మధ్య గొడవలు, వారి అనారోగ్యాలు,పెద్దల హడావిడి ఈ ఎపిసోడ్‌లో కనిపిస్తుంది. మరో ఎపిసోడ్‌లో వాగ్లే దీపావళి పండక్కి కర్టెన్ల కోసం ఫ్యాబ్రిక్‌ను కొంటాడు. తమ దగ్గరున్న డబ్బుకన్నా పది రెట్ల ఫ్యాబ్రిక్‌ కోసం పెట్టాల్సి ఉంటుంది. అందుకు ఆ కుటుంబం కర్టెన్స్‌ వద్దనుకొని సోఫా కవర్స్‌ను కొనుగోలు చేయడాన్ని ఇష్టపడుతుంది. ఇవే కాదు మొత్తం నలభై నాలుగు ఎపిసోడ్లలో గుర్తుండిపోయే సన్నివేశాలు ఎన్నో. మధ్యతరగతిలో నిత్యం ఎన్నో ఇష్టమైన ఇక్కట్లు, గడిచిపోయాక తలుచుకుని నవ్వుకునే కష్టాలు ఉంటాయి. వాటిని అందంగా సాహిత్యంలో చాలామంది రాశారు. టీవీలో ఈ సీరియల్‌ ఆ పని చేసింది. అప్పడూ, ఇప్పుడూ బుల్లితెరపై కామన్‌ మ్యాన్‌ అంటే ‘వాగ్లే కి దునియా’ గుర్తుకురాక మానదు.
– ఎన్‌.ఆర్‌

వాగ్లే ప్రపంచం

►వాగ్లే కి దునియా పూర్తి కామెడీ సీరియల్‌. వాగ్లే ధరించే ఖాదీ కుర్తాలు, ఆఫీసుకి వెళితే వేసుకెళ్లే కోటు–టై, కాన్వాస్‌ షూస్, బ్యాగీ ప్యాంట్స్, రాధిక కట్టే కాటన్‌ చీరలు.. మధ్యతరగతిని ప్రతిబింబిస్తుంటాయి

►ఆర్కేలక్ష్మణ్‌ తన మునివేళ్లతో భారతీయ మధ్యతరగతి నాడిని పట్టుకున్నాడు. కామన్‌ మ్యాన్‌ ఫీచర్‌ని తన స్కెచ్‌తో ఈ కార్టూనిస్ట్‌ సృష్టిస్తే దర్శకుడు కుందన్‌ షా బుల్లితెరకెక్కించారు. అప్పటికే ‘జానే భి దో యారో’, ‘ఏ జో హై జిందగీ’, ‘నుక్కడ్‌’ను పరిచయం చేసిన కుందన్‌ షా ‘వాగ్లే కీ దునియా’తో మరోమారు అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు

►మధ్యతరగతి మనిషి వాగ్లేగా అందరినీ ఆకట్టుకున్నవాడు అంజన్‌ శ్రీవాత్సవ్‌. ఇతని భార్యగా భారతి అచేర్కర్‌  నటించారు. సినీ నటుడు షారుఖ్‌ ఖాన్‌ ఇందులో ఒక ఎపిసోడ్‌లో అతిథి పాత్రలో కనిపిస్తారు. షారుఖ్‌ అప్పటికే ఫౌజీ సీరియల్‌ ద్వారా పేరు తెచ్చుకున్నారు

►2012లో వాగ్లే టీమ్‌ ‘డిటెక్టివ్‌ వాగ్లే’ పేరుతో మరోసారి బుల్లితెర మీద ప్రత్యక్షమైంది. ఇందులోనూ అంజన్‌ శ్రీవాత్సవ్‌ వాగ్లే రోల్‌ను పోషించారు. అతని భార్యగా సుల్భా ఆర్యా నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement