వెబ్ ఫ్లిక్స్ సిరీస్‌లో భాగంగా ఈవారం ఇస్తున్న సిరీస్ ‘మేరే పాపా హీరో హీరాలాల్’. మొదట ఇది డిస్కవరీ జీత్‌లో ప్రసారం అయింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో కూడా అందుబాటులో ఉంది. జబ్బు పడిన బిడ్డను కాపాడుకోడానికి తండ్రి పడే ఆరాటమే ఈ కథ. ఎమోషనల్ అండ్ ఇన్‌స్పైరింగ్.
అభిమానం మంచిదే.. విలువలూ ఉండాలి.సచ్ఛీలత మన సంస్కృతి.. సంస్కారం.. మన శ్వాస!ఒకచోట అభిమానం అడ్డొస్తుంది.. విలువలు కాళ్లకు అడ్డంపడ్తాయి.అయితే సచ్ఛీలత అవసరాన్నితీర్చలేదు.సంస్కారం చేయి చాచనివ్వదు!అభిమానాన్ని, విలువలను, సచ్ఛీలతను, సంస్కారాన్నీ వదులుకోకుండాగెలిచిన ఒక జీవితం.. మేరే పాపా.. హీరో హీరాలాల్!!‘‘గుడ్ ఈవినింగ్ లక్నో.. నా పేరు గున్‌గున్. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న కథ మర్చిపోయా. కాని అంతకన్నా మంచి కథ చెప్తా. మా నాన్న కథ. నాన్నకు నేల మీద పరిగెత్తే మూడు చక్రాల వాయుదూత్ ఉంది. అదే ఆటో. మా నాన్నను అందరూ ఆటో హీరాలాల్ అని పిలుస్తుంటారు. కాని ఆయన పేరు నాన్న. నేను నవ్వితే నవ్వుతాడు. నేను ఏడిస్తే ఏడుస్తాడు. ఆకాశంలో ఉన్న చందమామను నా కళ్లల్లో చూసి మురిసిపోతాడు. చుక్కల్లో దాక్కున్న అమ్మతో మాట్లాడిస్తాడు. నేను డాక్టర్ కావాలని ఆశపడ్తాడు. నా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్తాడు. నేను ఆయనకు యువరాణిని. యుద్ధం చేసిన రాణుల కథలు చెప్తాడు నాకు ఆ శక్తి రావాలని. అందుకే మా నాన్న నాకు హీరో.. హీరో హీరాలాల్. ఇదీ మా నాన్న కథ.. మీకు నచ్చిందనుకుంటా.. ఇక సెలవ్.. గుడ్ బై లక్నో... ’’
మేరే పాపా.. హీరో హీరాలాల్ అనే వెబ్‌సిరీస్‌లో గున్‌గున్ మాటలు అవి.
ఇప్పుడు గున్‌గున్ కథ
గున్‌గున్.. పదకొండేళ్ల అమ్మాయి. మెరుపు, మెరికకు పర్యాయపదం ఆ పిల్ల. అమ్మాయికి మూడేళ్ల వయసున్నప్పుడే యాక్సిడెంట్‌లో తల్లి చనిపోతుంది. అప్పటి నుంచీ గున్‌గున్‌కు అన్నీ తండ్రి హీరాలాలే. తనుండే వీధిలో పోలీస్ స్టేషన్‌లోని మీనా అనే ఇన్‌స్పెక్టర్ సహాయంతో లక్నోలోని ది బెస్ట్ స్కూల్లో చేర్పిస్తాడు. మీనా కొడుకు సుమీత్ కూడా గున్‌గున్ వయసువాడే. క్లాస్‌మేట్స్ కూడా. ఇద్దరు మంచి స్నేహితులవుతారు. మీనా భర్త మిలిటరీలో ఉండేవాడు. చనిపోతాడు. సుమీత్‌కు పైలట్ కావాలని కోరిక.స్కూల్ అథ్లెటిక్స్‌లో ఫస్ట్ ఉండాలనుకుంటాడు. మంచి డ్రాయింగ్ వేస్తాడు. గున్‌గున్ కూడా మంచి చిత్రకారిణి. అథ్లెటిక్స్‌లో సుమీత్‌ను గెలిపించడం కోసం అతని జట్టులో చేరుతుంది. రేస్‌లో పరిగెడుతూ పరిగెడుతూ పడిపోతుంది. ఆ అమ్మాయి అలా కళ్లు తిరిగిపడిపోవడం ఇది రెండోసారి. ఆసుపత్రి, వైద్యపరీక్షల తర్వాత.. గున్‌గున్ గుండెకు ప్రాబ్లం ఉంది, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారమని చెప్తారు డాక్టర్లు. దానికి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందనీ తేలుస్తారు. ఆటో నడిపే తండ్రి... అంత డబ్బు ఎక్కడినుంచి తేగలడు? రేకుల కప్పుతో ఉన్న చిన్న గది తప్ప ఇంకే ఆధారమూ లేదు అమ్మడానికైనా, తాకట్టు పెట్టడానికైనా! అతనుండే వాడకట్టులోని సన్నిహితులు శంకర్ (మెకానిక్), శాంతి (బడ్డీ కొట్టు యజమాని) అంతోఇంతో ఆర్థిక అండ ఇవ్వాలని చూస్తే అభిమానం అడ్డొచ్చి వద్దని చెప్తాడు.శంకర్ దగ్గర డబ్బు తీసుకోకపోవడానికి ఇంకో కారణం.. అతను జూదరి. జూదంలో గెలిచిన సొమ్మును తన కూతురి కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టపడడు హీరాలాల్. ఆ విషయం శంకర్‌తోనూ చెప్తాడు. ఇక శాంతి.. మహిళ.. పైగా ఒంటరి. అవసరమైతే తను ఆమెకి హెల్ప్‌గా ఉండాలి తప్ప నిస్సహాయురాలైన ఆమె సహాయం తీసుకోవడమేంటని అతని దృఢాభిప్రాయం. ఇంకో ముఖ్యమైన విషయం.. గున్‌గున్ హీరాలాల్ సొంత కూతురు కాదు. ఆ అమ్మాయి అనాథ. ఏడాది వయసున్నప్పుడే దత్తత తీసుకుంటారు హీరాలాల్ దంపతులు. ఇదీ అతని వ్యక్తిత్వం.
నిజాయితీకి పరీక్ష
డబ్బును కూడబెట్టే దారులను హీరాలాల్ సీరియస్‌గా వెదుకుతున్నప్పుడే రేడియో జాకీ సైరా అతని ఆటో ఎక్కుతుంది. గమ్యం వచ్చాక దిగిపోతూ ఆటోలో బ్యాగ్ మరిచిపోతుంది. వెంటనే చూసిన హీరాలాల్ ఆ వీ«ధంతా ఆమె కోసం వెదుకుతాడు బ్యాగ్ ఇవ్వడానికి. కాని ఆమె కనిపించదు. అలాగే ఇంటికివెళ్లిపోయి.. బ్యాగ్ తెరుస్తాడు. అందులో డబ్బుల కట్టలు ఉంటాయి. ఆశ పుడుతుంది. అప్పుడే కూతురు.. కట్టెలు కొట్టేవాడి నీతికి మెచ్చిన లక్ష్మీదేవి బంగారు, వెండి గొడ్డళ్లను బçహూకరించే కథ చదువుతుంటుంది. అది చెవినపడ్డ హీరాలాల్ చప్పున దార్లోకి వస్తాడు. బ్యాగ్‌లో ఉన్న సైరా ఐడెంటిటీ కార్డ్ ద్వారా ఆమె ఆఫీస్ అడ్రస్ తెలుసుకొని వెళ్లి బ్యాగ్ ఇచ్చేస్తాడు. అతని నిజాయితీకి కదిలిపోతుంది సైరా.హీరాలాల్ వివరాలను ఆరా తీస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఆమెకు గున్‌గున్ జబ్బు గురించి. రేడియో క్యాంపెయిన్ ద్వారా విరాళాలు సేకరించి గున్‌గున్ ఆపరేషన్‌కు ఇతోధిక సహాయం చేయాలనుకుంటుంది. ఆ క్రమంలోనే సైరా అలా గున్‌గున్‌ను రేడియో స్టేషన్‌కు పిలిచి.. లిటిల్ ఆర్‌జేగా పరిచయం చేస్తుంది. గున్‌గున్ చెప్పిన కథ తర్వాత ఆర్‌జే సైరా ఆ అమ్మాయికున్న జబ్బు గురించి చెప్పి, స్పందించిన వాళ్లు ఆర్థికంగా తోడ్పాటు అందించాలని కోరుతుంది.
గుండె కోత
మొత్తమ్మీద సైరా ప్లాన్ వర్కవుట్ అయి దాదాపు 18 లక్షల రూపాయలు విరాళంగా వస్తాయి. మిగిలిన రెండు లక్షలను ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ తన ఫీజ్ కింద మాఫీ చేసేస్తాడు. గున్‌గున్‌కు హార్ట్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ అవుతుంది. ఆపరేషన్ అయి కోలుకున్నాక మొట్టమొదట సుమీత్‌ను చూడాలనుకుంటుంది. కాని రాడు. వాళ్లమ్మ మీనా కూడా రాదు. ఫోన్‌లో గున్‌గున్ యోగక్షేమాలు అడుగుతుంటుంది అంతే. గున్‌గున్ చిన్నబుచ్చుకుంటుంది. సుమీత్ అన్నను చూడాలి.. తీసుకెళ్లమని తండ్రిని అడుగుతుంది. వాళ్లింటికి తీసుకెళ్తాడు. అక్కడ గోడ మీద సుమీత్ ఫొటోకి దండవేసి ఉండటం చూసి హతాశుడవుతాడు హీరాలాల్. అప్పుడు నిజం తెలుస్తుంది మీనా ద్వారా. గున్‌గున్ ఆపరేషన్ కోసమని ఆసుపత్రికి వెళ్లినప్పుడే కార్ యాక్సిడెంట్‌లో సుమీత్ ప్రాణాలు కోల్పోతాడు. ఆ గుండెనే గున్‌గున్‌కి అమరుస్తారు. కుప్పకూలి పోతాడు హీరాలాల్. తన అమ్మలాగా, సుమీత్‌వాళ్ల నాన్నలాగా సుమీత్‌కూడా నక్షత్రాల దగ్గరకు వెళ్లిపోయాడని గున్‌గున్‌కు అర్థమవుతుంది. అప్పటి నుంచి సుమీత్ ఆశయాలను తను నెరవేర్చాలని అనుకుంటుంది.
ఇంకా ఉంది
తన ఆటో ద్వారా స్మగ్లింగ్ చేయాలనుకున్న దందాబాజ్‌లను ఎదిరించి తన నీతి, నిజాయితీ, ధైర్యాన్ని ఇంకోసారి నిరూపించుకుని హీరాలాల్ నిజంగానే హీరో అవుతాడు. ప్రజల సంక్షేమ పనుల్లో మునిగిపోతాడు.
ముగింపు
ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అప్‌లోడ్ అయిన లేటెస్ట్ సీరీస్. కథనం చాలా స్లో. పాత థీమ్‌తోనే సాగినా చుట్టూ ఉన్న చాలా విషయాలు పెద్దవాళ్లను ఆలోచింపచేస్తాయి. స్నేహం విలువను చెప్తుంది. పిల్లల్లో డబ్బు, కుల, మత భేదాలను నాటొద్దని, సహనం, సహాయం చేసే నైజం నేర్పాలని.. ఆడపిల్లకు బేలతనాన్ని అలంకరించొద్దని, మగపిల్లాడికి అహంకారాన్ని ఫీడ్ చేయొద్దని ... పేరెంట్స్ అంటే పిల్లలకు గురువులు, స్నేహితులు అనీ చూపిస్తుంది ‘మేరే పాపా.. హీరో హీరాలాల్’ కథ. కుటుంబం అంతా చూడదగ్గ సీరియల్.
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment