ఒడి పట్టిన హీరో | Shah Rukh Khan Adopted One Boy To Lookout His Future | Sakshi
Sakshi News home page

ఒడి పట్టిన హీరో

Published Wed, Jun 3 2020 4:52 AM | Last Updated on Wed, Jun 3 2020 4:52 AM

Shah Rukh Khan Adopted One Boy To Lookout His Future - Sakshi

లాక్‌డౌన్‌ వల్ల నడిచినవారు ఎందరో. వారిలో గమ్యం చేరిన వారు ఎందరో. మధ్యలో రాలిపోయినవారు ఎందరో. కరోనా కలకలంలో కొన్నే తెలిశాయి. కొన్ని తెలియకనే ముగిశాయి. తెలిసినవి మాత్రం అందరినీ కలవర పరిచాయి. స్పందించేవారు స్పందిస్తున్నా సాయం చేసేవారు చేస్తున్నా అనంతమైన సహాయం అందాల్సిన పరిస్థితిలో పేదలు ఉన్నారు. ఊహించని చోట నుంచి ఓదార్పు లభించినప్పుడు వారు కాస్తయినా ఊరట చెందుతున్నారు. బిహార్‌లోని ముజప్ఫర్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటన అందరికీ తెలుసు. మే 25న మధ్యాహ్నం బిహార్‌లోని ముజప్ఫర్‌పూర్‌లో ఒక శ్రామిక్‌ రైల్‌ ఆగింది. అందులో నుంచి ఒక శవాన్ని దించేశారు. అది ఒక స్త్రీ శవం. ఆమె పేరు అర్బినా ఖాతూన్‌.

ఆమెకు రెండేళ్ల పసివాడు ఉన్నాడు. స్టేషన్‌లో శవానికి ఒక దుప్పటి కప్పి నేలన పరుండబెట్టాడు. ఆమె కొడుకు తల్లి నిద్రపోతూ ఉందని ఆడుకోవడం మొదలుపెట్టాడు. మధ్య మధ్య వచ్చి దుప్పటి తొలగించి తల్లిని నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. కన్నతల్లి చనిపోయిందని తెలియని ఆ పసి కందు ప్రయత్నాన్ని వీడియో ద్వారా చూసి దేశమంతా మనసు బరువు చేసుకుంది. ఆ పసివాడి కోసం ఇప్పుడు నటుడు షారూక్‌ ఖాన్‌ స్పందించాడు. వాడి భవిష్యత్తు తానే చూసుకుంటానని అన్నాడు. లాక్‌డౌన్‌ తర్వాత ఎక్కడి వారక్కడే చిక్కుకుపోయిన వలస కార్మికులలో అర్బినా ఖాతూన్‌ ఒకామె. ఆమెను భర్త ఒదిలేశాడు. బిహార్‌ నుంచి గుజరాత్‌ వలస వెళ్లి పిల్లవాడితో బతుకుతూ ఉంది.

మే 25న ఆమె అహ్మదాబాద్‌ నుంచి తన స్వస్థలం కతిహార్‌కు శ్రామిక్‌రైలులో బయలుదేరి మార్గమధ్యలో చనిపోయింది. ముజప్ఫర్‌పూర్‌లో ఆమె శవాన్ని దించేయాల్సి వచ్చింది. ఆకలి వల్ల చనిపోయిందో అనారోగ్యం వల్ల చనిపోయిందోగాని కడుపున పుట్టిన బిడ్డను అనాథను చేసింది. ఆ పిల్లాడు ఇప్పుడు కతిహార్‌లోని తాత, అమ్మమ్మల దగ్గర ఉన్నాడు. ఈ ఘటన షారుక్‌ ఖాన్‌ వరకూ చేరింది. పిల్లవాడిని తన ఆధ్వర్యంలో నడిచే మీర్‌ ఫౌండేషన్‌ దత్తత తీసుకొని వాడి బాగోగులు చూస్తుందని వెల్లడి చేశాడు. ‘తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు’ అని అతడు వ్యాఖ్యానించాడు. ‘ఆ వీడియోను నలుగురికీ తెలిసేలా చేసిన మిత్రులకు ధన్యవాదాలు’ అని తెలియచేశాడు. ఒక చిన్నారికి గట్టి ఆసరా దొరికింది. ఇంకా దొరకాల్సిన వారు వేనవేలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement