అమ్మవారికి రోజుకో అలంకారం ఎందుకు?
అంతరార్థం
చాలా పండుగలలాగానే దేవీనవరాత్రులకు ఆధారమైనదీ దానవ సంహారమే. వరబలం వల్ల కలిగిన మదగర్వంతో మహిషుడనే రాక్షసుడు, వాడి అనుచరగణం లోకాల్లో కల్లోలం సృష్టించసాగారు. వారి ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి ఆదిపరాశక్తి తనలోని వివిధ అంశలకు చెందిన శక్తులన్నింటినీ ఒక్కటిగా చేర్చి జగదంబగా అవతరించింది. త్రిమూర్తులు సహా అష్టదిక్పాలకులు తదితర దేవతలందరూ తమ ఆయుధాలను, శస్త్రాస్త్రాలను ఆమెకు అందించారు. వాటిని ఆసరాగా చేసుకుని అమ్మవారు సింహ వాహనాన్ని అధిరోహించి కదన రంగానికి కదలి వెళ్లింది.
మాయావులైన రాక్షసులను ఏమార్చడానికి ఆమె కూడా రోజుకో అవతారం ధరించవలసి వచ్చింది. ఆయా అసురులను సంహరించడం వల్ల ఆమెకు వారి పేర్లే చిరకీర్తి నామాలుగా సుస్థిరమయ్యాయి. అమ్మవారు అలనాడు చేసిన దానవ సంహారానికి ప్రతీకగానే నేటికీ ఆమెను ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు నవావతారాలతో అలంకరించి, పదవ రోజున విజయ దశమి పండుగ జరుపుకుంటున్నాం.