షిఫ్ట్ డ్యూటీల్లో పనిచేస్తుంటే సమస్యలు..!
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 38. నేను గత పదేళ్లుగా సొరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనమే తప్ప నయడం కావడం లేదు. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉంటే చెప్పగలరు. -బి.సురేశ్, హైదరాబాద్
సొరియాసిస్ అనేది దీర్ఘకాలిక సమస్య. ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సొరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. సాధారణంగా చాలా మంది సొరియాసిస్‌ను ఒక సాధారణ చర్మరోగంగానే భావిస్తారు. ఇది ఆటోఇమ్యూన్ వ్యాధి. శరీరంలోని చర్మకణాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు ఆ కణాలపై అనేక పొరలు ఏర్పడతాయి. తద్వారా చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడటం వంటివి మొదలవుతాయి. ఇలా చర్మంపై దద్దుర్లు ఏర్పడే రుగ్మతనే సొరియాసిస్ అంటారు. ఈ వ్యాధి ఏ వయసు వారికైనా రావచ్చు. కొందరిలో చర్మంపై దురదతో కూడిన వెండిరంగు పొలుసులు కూడా కనిపిస్తాయి. ఇది ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరిచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సొరియాసిస్ ఉన్న 15 శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు.
లక్షణాలు: చర్మం ఎర్రబడటం, తీవ్రమైన దురద, జుట్టు రాలిపోవడం, కీళ్లనొప్పులు, చర్మం పొడిబారినప్పుడు చర్మంపై పగుళ్లు ఏర్పడడంతోబాటు రక్తస్రావం అవుతుంది.
కారణాలు: వంశపారంపర్యం, మానసిక ఒత్తిడి, ఆందోళన, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో అసమతుల్యతల వల్ల, కొన్ని రకాల మందులు దీర్ఘకాలికంగా వాడటం వల్ల.
రకాలు: దీనిని ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి సొరియాసిస్ వల్గారిస్, గట్టేట్ సొరియాసిస్ (గట్టా అంటే బిందువు) పుష్టులార్ (పస్ అంటే చీము) ఎరిత్రోడెర్మల్ (ఎరిత్రో అంటే ఎరుపు)
నిర్థారణ: స్కిన్ బయాప్సీ, ఈఎస్సార్, సీబీపీ, ఎక్స్‌రే.
హోమియో చికిత్స: సొరియాసిస్ నివారణకు హోమియోపతి ఎంతగానో సహాయపడుతుంది. ఈ వ్యాధిని వెంటనే గుర్తించి, తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం. సాధారణంగా ఈ వ్యాధికి సల్ఫర్, ఆర్సెనిక్ ఆల్బం, కాలి ఆర్బ్, సొరినమ్, మెజీరియం, పిట్రోలియం వంటి మందులను వాడవచ్చు. స్టార్ హోమియోపతిలో రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని జెనిటిక్ కాన్‌స్టిట్యూషనల్ విధానంలో చికిత్స చేస్తారు. మీరు అనుభవజ్ఞులైన హోమియో వైద్యుని కలవడం ఉత్తమం.
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 45. నాకు తరచూ ఛాతీలో మంట వస్తుంటుంది. ప్రతిసారీ ఇది గ్యాస్ నొప్పే కదా అని అనుకుంటూ ఉంటాను. నాకు గుండెనొప్పి వచ్చినప్పుడు కూడా ఇలాగే తేలిగ్గా తీసుకుంటానేమోనని సందేహం వస్తోంది. గుండెనొప్పికీ, గ్యాస్‌తో వచ్చే ఛాతీనొప్పికి తేడాలు చెప్పండి. - డి. మనోహర్‌రావు, నకరెకల్లు
సాధారణంగా చాలామంది గుండెపోటును గ్యాస్ సమస్యగానో, కడుపులో/ఛాతీలో మంటగానో, వెన్నునొప్పిగానో, మెడనొప్పిగానో తేలిగ్గా తీసుకుంటుంటారు. వాస్తవానికి మీరు అజీర్తి లేదా గ్యాస్ సంబంధిత సమస్యతో బాధపడుతూ... కడుపులోనో లేదా గుండెలోనో మంటగా ఉంటే... ఒక్క యాంటాసిడ్ మాత్రతో తగ్గిపోతాయి. మెడ, వెన్ను లేదా ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో నొప్పి ఉంటే పెయిన్‌కిల్లర్ మాత్ర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇలా జరిగితే పరవాలేదు. కానీ ఇలా ఒకటి రెండు టాబ్లెట్లు తీసుకున్న తర్వాత కూడా ఉపశమనంగా లేదని మీరు భావిస్తే మాత్రం దాన్ని కచ్చితంగా గుండెనొప్పిగా అనుమానించాల్సిందే.
గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ మధ్యలో నొప్పితో పాటు తీవ్రమైన అసౌకర్యం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఛాతీ మెలిపెడుతున్నట్లుగానూ, ఛాతీపైన బరువు పెట్టినట్లుగా, ఒత్తిడి పడ్డట్లుగా ఉంటుంది. నొప్పి ఎక్కడినుంచి వస్తోందో బాధితులు గుర్తించలేరు. ఛాతీమొత్తం వ్యాపించినట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి చాలాసార్లు కండరాలకు సంబంధించిన నొప్పిలా, జీర్ణసంబంధ నొప్పి కూడా ఇలాగే అనిపిస్తూ తికమకపెడుతుంటుంది. రెండింటికీ తేడా ఏమిటంటే... గుండెనొప్పి ఒకసారి వస్తే అది కొనసాగుతూ ఉంటుంది. అందే కండరాలు లేదా జీర్ణకోశ నొప్పులైతే వస్తూపోతూ ఉంటాయి. అందువల్ల గుండెపోటును గ్యాస్ సమస్యగా తికమకపడకుండా దాని లక్షణాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక్కోసారి నొప్పి ఛాతీలో కాకుండా చంకల నుంచి మెడ, దవడలు, పొట్ట, దంతాల నుంచి కూడా మొదలుకావచ్చు. అసిడిటీ సమస్యలుండే వారిలో ఛాతీలో మంటగా కూడా ఉంటుంది. మనకు వచ్చే నొప్పి అసిడిటీ పెరగడం వల్ల వచ్చిన నొప్పి కాదని తేలితే... అది తప్పక గుండెనొప్పేనని అనుమానించాలి.
స్లీప్ కౌన్సెలింగ్
నా వయసు 30 ఏళ్లు. ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ ఇలా షిఫ్టుల్లో పనిచేస్తున్నాను. ఇటీవల నాలో చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోంది. దాంతో పాటు ఏ అంశంపైనా దృష్టి నిలపలేకపోతున్నాను. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వగలరు.
- సమీర్, హైదరాబాద్
మీలా పగలూ, రాత్రీ పనిచేసేవాళ్లు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ అనే సమస్యతో బాధపడుతుంటారు. రాత్రి, పగలు మార్చి మార్చి పనిచేయాల్సి రావడంతో ఆ షెడ్యూల్స్‌కు అనుకూలంగా మీ దేహం మారలేకపోవడంతో వచ్చే సమస్య ఇది. మన మెదడులో ఒక జీవగడియారం పనిచేస్తుంటుంది. మన తిండి, నిద్రల వేళలు, అందులో నమోదై ఉంటాయి. అది నిర్వహించే క్రమబద్ధతకు ‘సర్కేడియన్ రిథమ్’ అని పేరు. ఈ రిథమ్ దెబ్బతినడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. షిఫ్ట్‌లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్రపోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే తీవ్రంగా అలసిపోతుంటారు. వాళ్ల పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. పొద్దున్నే పనిచేసేవాళ్లలో, రాత్రిడ్యూటీలు చేసేవారిలో, పనివేళలు తరచూ నైట్ షిఫ్టులుగా, డే షిఫ్టులుగా మారేవాళ్లలో మీరు చెబుతున్న లక్షణాలైన కోపం రావడం, తీవ్రమైన అలసట, త్వరగా ఉద్వేగాలకు లోనుకావడం వంటివి కనిపిస్తుంటాయి.
ఇలాంటివారికి పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉండటం, నిస్సత్తువ, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి, స్థూలకాయం రావడం వంటి రిస్క్‌లు ఉంటాయి. ఒక్కోసారి వారు చేసే తప్పులకు భారీమూల్యం చెల్లించాల్సి రావచ్చు. అనారోగ్యాల బారిన పడటం ఎక్కువ కావచ్చు. ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కాఫీ వంటివి తక్కువగా తీసుకోవడం, నిద్రపోయే సమయాల్లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉంచుకోవడంతో పాటు వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. షిఫ్ట్ వర్క్ డిజార్డర్‌తో బాధపడేవారికి కృత్రిమ వెలుగులో ఉంచే చికిత్స ప్రక్రియ అయిన బ్రైట్ లైట్ థెరపీ, మెలటోనిన్ మందులతో స్లీప్ మాడిఫికేషన్ థెరపీ వంటివి అందుబాటులో ఉన్నాయి.