చెడు అలవాట్లకు షాకిస్తుంది!
టెక్ టాక్ / పావ్‌లాక్ బ్రేస్‌లెట్
మితిమీరి సోషల్ మీడియాలో లీనం అయిపోవడం, స్మోకింగ్, మద్యపానం... అన్నీ చెడు అలవాట్లే. ఒకసారి తగులుకుంటే ఒకపట్టాన వదిలిపోవు కూడా. కానీ ఫొటోలో చూపిన పావ్‌లాక్ బ్రేస్‌లెట్ వాడారనుకోండి... చెడు అలవాట్లకు తొందరగా గుడ్‌బై చెప్పేయవచ్చు అంటున్నారు అమెరికన్ కంపెనీ ప్రతినిధులు. అదెలాగంటరా? చాలా సింపుల్. ఉదాహరణకు మీరు స్మోకింగ్ మానేయాలని అనుకుంటే... ముందుగా మీరు దాదాపు 200 డాలర్లకు లభించే ఈ పావ్‌లాక్ బ్రేస్‌లెట్‌ను మీ చేతికి తొడుక్కోవాలి.
సిగరెట్ తాగాలి అనిపించినప్పుడల్లా ఈ బ్రేస్‌లెట్‌ను ఒకసారి ఒత్తితే... మీకు వెంటనే కరెంట్ షాక్ కొడుతుంది. కొన్ని రోజులపాటు ఇలాగే చేస్తూ పోతే.. కొంత కాలానికి మీ మెదడు షాక్ కొడుతుందన్న భయంతో చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చేస్తుందన్నది ఆలోచన. పావ్‌లాక్ తాజాగా ఈ బ్రేస్‌లెట్‌లో మార్పులు చేసింది. సరికొత్త యంత్రం ఓ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా పనిచేస్తుంది.
మానేయాలనుకున్న అలవాట్ల జాబితాను ఈ ఆప్ ద్వారా బ్రేస్‌లెట్‌లోకి ఎక్కిస్తే... ఆ అలవాట్ల తాలూకు చర్యలు (స్మోకింగ్ అయితే వేళ్లు దగ్గరగా పెట్టుకుని చేతిని పెదవుల దగ్గరకు తీసుకెళ్లడం) గుర్తించి దానంతట అదే షాకులిస్తుందిట. ప్రస్తుతం అమెరికాలో అందుబాటులో ఉన్న ఈ బ్రేస్‌లెట్ రెండుమూడు నెలల్లో మన దేశానికీ రాబోతోంది.