ఇంట గెలిచి రచ్చ గెలిచింది | Shraddha Kapoor Good Actor In Bollywood | Sakshi
Sakshi News home page

ఇంట గెలిచి రచ్చ గెలిచింది

Published Sat, Nov 16 2019 3:31 AM | Last Updated on Sat, Nov 16 2019 3:31 AM

Shraddha Kapoor Good Actor In Bollywood - Sakshi

కొందరు ఇంట గెలుస్తారు. కొందరు రచ్చ గెలుస్తారు. కొందరే ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు. శ్రద్ధా కపూర్‌ బాలీవుడ్‌ను గెలిచింది. అందంతో నటనతో గెలిచింది. అందుకే దక్షణాది భాషల వారికి ఫేవరెట్‌గా నిలిచింది.సాహో తర్వాత పెద్ద సినిమాల నిర్మాతలు ఆమె డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

2005. ఇండియా టీవీ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో శక్తి కపూర్‌ పట్టుబట్టాడు. సినిమా అవకాశాల కోసం ఔత్సాహిక నటి వేషంలో ఉన్న టీవీ యాంకర్‌ను లైంగిక అవసరం తీర్చమని అతడు అడిగే వీడియో దేశమంతా సంచలనం రేపింది. శక్తికపూర్‌ భయభ్రాంతం అయ్యాడు. గగ్గోలు పెట్టాడు. ఇండియా టీవీ వారిని నానా తిట్లు తిట్టాడు. అతడు పదే పదే చెప్పిన మాట ఒక్కటే ‘మీరు చేసిన ఈ పనికి నేను నా కూతురికి ఎలా ముఖం చూపించాలి. అది నన్ను చంపేస్తుంది’ అని. ఆ కూతురే శ్రద్ధా కపూర్‌ అప్పటికి ఆమె వయసు 20 సంవత్సరాలు. తండ్రి అంటే ఆమెకు చాలా ఇష్టం. ‘అందాజ్‌ అప్నా అప్నా’లో అతడు వేసిన పాత్ర ‘క్రైమ్‌ మాస్టర్‌ గోగో’ను గుర్తు చేసుకుంటూ తండ్రిని ‘గోగో’ అని పిలుస్తూ ఉంటుంది.

అలాంటి తప్పిదం/లేదా అతని చుట్టూ అల్లిన ట్రాప్‌ వల్ల శ్రద్ధా కపూర్‌ కుటుంబం బజారున పడింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలని పెద్దలు అంటారు. తండ్రి కోల్పోయిన చోటే తాను గెలిచి చూపించాలని శ్రద్ధా కపూర్‌ అనుకుంది. చూపించింది కూడా. శ్రద్ధాకపూర్, వరుణ్‌ ధావన్‌ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్‌. శక్తి కపూర్‌ అప్పట్లో డేవిడ్‌ ధావన్‌ సినిమాల్లో ఎక్కువగా నటించేవాడు. అలా శక్తికపూర్‌ కూతురు శ్రద్ధా, డేవిడ్‌ ధావన్‌ కొడుకు వరుణ్‌ ఫ్రెండ్స్‌ అయ్యారు. ఇద్దరూ షూటింగులు చూడ్డానికి వెళ్లేవారు. కాని ఇద్దరికీ సినిమా రంగంలో వస్తున్నట్టు అప్పటికి తెలియదు. శ్రద్ధాకపూర్‌ సైకాలజిస్ట్‌ కావాలనుకుంది. ముంబైలో అమెరికన్‌ స్కూల్‌లో ఇంటర్‌ చదువుతున్నప్పుడు 96 శాతం మార్కులు తెచ్చుకుంది. అప్పుడే కాలేజ్‌లో నాటకం వేసింది శ్రద్ధా. ఆ వేడుకకు హాజరైన సల్మాన్‌ ఖాన్‌ ఆమె నటన చూసి హీరోయిన్‌ వేషం ఆఫర్‌ చేశాడు.

కాని ‘నాకు చదువుకోవాలని ఉంది’ అని చెప్పి అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీకి వెళ్లిపోయింది. అక్కడ చదువుకుంటూ ఉన్నప్పుడే శక్తికపూర్‌ ఉదంతం చోటు చేసుకుంది. శక్తికపూర్‌ పంజాబీ. అతని స్వస్థలం న్యూఢిల్లీ. శక్తికపూర్‌ భార్య ‘శివాంగని కొల్హాపురి’ పండిత వంశం నుంచి వచ్చింది. ఆమె తండ్రి పండరినాథ్‌ కొల్హాపురి శాస్త్రీయ గాయకుడు. చెల్లెలు పద్మిని కొల్హాపురి నటి. గాయని లతా మంగేష్కర్‌ వీరికి పండరినాథ్‌ వైపు నుంచి దగ్గరి బంధువు అవుతుంది. అయితే శ్రద్ధాకపూర్‌ తండ్రి వైపు నుంచి కంటే తల్లివైపు బంధువులతోనే బాల్యం నుంచి గడిపింది. తనను తాను ఒక మరాఠి స్త్రీగానే భావిస్తుంది. శక్తికపూర్‌ చేసిన తప్పు తన కుటుంబాన్ని, బంధువర్గాన్ని అసౌకర్యంలో పడేసిందని ఆమె భావించింది. సైకాలజిస్ట్‌ కావాలనుకున్న శ్రద్ధాకపూర్‌ నటి అవుదామని తీర్మానించుకుంది. బాలీవుడ్‌లో ఒక రివాజు ఉంది. మనకున్న పలుకుబడి అంతా కెమెరా ముందు వరకూ తీసుకెళ్లి నిలబెడుతుందికానీ కెమెరా ముందు ప్రతిభ మాత్రం మనమే చూపాలి.

అది చాలా బాగా ఉండాలి. లేకుంటే వెనక్కు పంపించేస్తారు. శ్రద్ధాకపూర్‌ ఎంతైనా ఒక హీరో కూతురు కాదు. విలన్‌ కూతురు. అందునా చెడ్డ పేరు మూటగట్టుకున్న విలన్‌ కూతురు. ఆమె జీరో నుంచి మొదలుకావాల్సిందే. అలాగే అయ్యింది. చాలా ఆఫీసులకు ఆడిషన్స్‌ ఇవ్వడానికి తిరిగింది. చివరకు ఆమెకు ఒక ఉమన్‌ డైరెక్టరే బాసటగా నిలిచింది. టీవీ రంగంలో పేరు తెచ్చుకుని బాలీవుడ్‌లో సినిమాలు తీస్తున్న లీనా యాదవ్‌ తన ‘తీన్‌ పత్తీ’ సినిమాలో శ్రద్ధాను సైన్‌ చేసింది. కాని ఆ సినిమా ఫ్లాప్‌. కొందరు మాత్రం ఈ అమ్మాయి ఎవరో బాగా చేసింది అని ఒకరిద్దరికి చెప్పారు. దాంతో యశ్‌రాజ్‌ ఫిల్మ్‌వారు పిలిపించి మూడు సినిమాలకు సైన్‌ చేయించారు. తొలి సినిమాగా ‘లవ్‌ కా ది ఎండ్‌’ సినిమాలో హీరోయిన్‌ వేషం ఇచ్చారు.

కాని ఆ సినిమా కూడా ఫ్లాప్‌. రెండు సినిమాల ఫ్లాప్‌ తర్వాత ఒక హీరోయిన్‌ పరిస్థితి కష్టమే అవుతుంది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ వారు ఆ తర్వాత ‘ఔరంగజేబ్‌’ (అర్జున్‌ కపూర్‌ హీరో) సినిమాలో వేషం ఆఫర్‌ చేశారు. కాని ఇక్కడే శ్రద్ధా కపూర్‌ ఒక మలుపు తిరిగే నిర్ణయం తీసుకుంది. ఔరంగజేబ్‌ ఆఫర్‌ సమయంలోనే మహేష్‌ భట్‌ కాంపౌండ్‌ నుంచి ‘ఆషికీ2’ ఆఫర్‌ వచ్చింది ఆమెకు. ఇదో లేక అదో. కాని శ్రద్ధా యశ్‌రాజ్‌వారికి సర్దిచెప్పి ‘ఆషికీ2’ చేసింది. ప్రియుడి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టే గాయని పాత్రలో శ్రద్ధా నటన జనానికి నచ్చింది. ఆ సినిమా పాటలు ఇంకా నచ్చాయి. సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. దాంతో శ్రద్ధా కపూర్‌ రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌కు చేరుకుంది. 18 కోట్లతో తీసిన ‘ఆషికీ 2’ 175 కోట్లను వసూలు చేసిందంటే ఆ క్రేజ్‌ తాలూకు వాటా శ్రద్ధా కపూర్‌కు కూడా దక్కింది.

అయితే శ్రద్ధా కపూర్‌కు డాన్స్‌ అంటే ఆసక్తి ఉంది. మంచి డాన్స్‌ సినిమా చేయాలనే ఆమె కోరికను రెమో డిసూజా దర్శకత్వంలో వచ్చిన ‘ఏబిసిడి2’ తీర్చింది. ప్రభుదేవా నటించిన ఆ సినిమాలో శ్రద్ధాకపూర్‌ తన ప్రతిభ చాటి తాను డాన్సింగ్‌ స్టార్‌ కూడా అని నిరూపించుకుంది. ఆ తర్వాత ‘భాగీ’, ‘రాక్‌ఆన్‌’ సినిమాలన్నీ ఆమె కెరీన్‌కు మేలు చేస్తూ వచ్చాయి. సౌత్‌లో హిట్‌ అయిన ‘ఓకే బంగారం’ రీమేక్‌ ‘ఓకే జాను’లో శ్రద్ధా హీరోయిన్‌గా నటించిది. దావుద్‌ ఇబ్రాహీమ్‌ చెల్లెలు హసీనా పార్కర్‌ బయోపిక్‌ ‘హసినా పార్కర్‌’లో నటించడంతో తన భుజాల మీద ఒక సినిమాను నిలబెట్టగలననే నమ్మకం బాలీవుడ్‌కు కల్పించింది. ‘స్త్రీ’ సినిమా సూపర్‌ హిట్‌ కావడం, ‘సాహో’ వంటి భారీ సినిమాలో నటించడంతో శ్రద్ధాకపూర్‌ బాలీవుడ్‌ తార నుంచి భారతీయ తారగా ఎదిగింది.

శ్రద్ధాకపూర్‌కు ఇంగ్లిష్‌ భాష మీద మంచి పట్టు ఉంది. దేశదేశాల వారు ఇంగ్లిష్‌ భాషను ఎలా మాట్లాడతారో నకలు దింపుతుంది. ఆమెకు నాలుగు పశువులను పెట్టుకొని, సొంతగా కూరగాయలు పండించుకుంటూ విశ్రాంతిగా ఉండాలని కోరిక. ఆ పని భవిష్యత్తులో చేస్తానని కూడా చెబుతుంది. రోజూ డైరీ రాయడం, తన ఆలోచనలను రాస్తూ వెళ్లడం టీనేజ్‌ నుంచి చేస్తూనే ఉంది. శ్రద్ధా కపూర్‌ తన తాత నుంచి తల్లి నుంచి వారసత్వంగా సంగీతాన్ని పొందింది. చాలా సినిమాలలో పాటలు పాడింది. శ్రద్ధాకపూర్‌ ఇవాళ బాలీవుడ్‌లో గౌరవపూర్వకంగా తలిచే పేరు అయ్యింది. తండ్రి శక్తికపూర్‌ ఆమెను చూసి గర్వపడుతున్నాడు. శ్రద్ధా కపూర్‌ ప్రచండకాంతిలో అతడి మరక కనపడకుండా పోయింది. శ్రద్ధాకపూర్‌ రాబోయే రోజులలో ప్రేక్షకులు తల ఎత్తి చూసే పనులు తప్పక చేస్తుంది. చేయాలని ఆశిద్దాం.
– సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement