Sraddhakapur
-
రైట్ రైట్
న్యూ ఇయర్ వేడుకలను న్యూయార్క్‌లో ఘనంగా జరుపుకున్నారు హీరోయిన్ శ్రద్ధాకపూర్. ఆ వేడుకల మూడ్‌కు గుడ్‌బై చెప్పి వర్క్ మోడ్‌లోకి వచ్చేశారు. ప్రస్తుతం జైపూర్‌లో జరుగుతున్న ‘భాగీ 3’ చిత్రీకరణలో శ్రద్ధా పాల్గొంటున్నారు. ‘భాగీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో భాగం ‘భాగీ 3’. ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నారు. అహ్మద్ ఖాన్ దర్శకుడు. జైపూర్ రోడ్లపై రైట్ రైట్ అంటూ స్కూటీపై కంగారుగా శ్రద్ధాకపూర్ ఎక్కడికో వెళుతుంటే, బైక్‌పై టైగర్ ష్రాఫ్ ఆమెను ఫాలో అయ్యే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్‌లో రితేష్ దేశ్‌ముఖ్ కూడా పాల్గొంటున్నారు. ఇందులో రితేష్, టైగర్ ష్రాఫ్ బ్రదర్స్‌లా నటిస్తున్నారు. కాగా, ఓ ఫైట్ చిత్రీకరణను కూడా యూనిట్ ప్లాన్ చేసింది. ‘భాగీ’లో హీరో హీరోయిన్లుగా నటించిన టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ మళ్లీ ‘భాగీ 3’లో నటిస్తుండటం విశేషం. అలాగే రెండో భాగంలో హీరోయిన్గా నటించిన దిశా పటానీ మూడో భాగంలో అతిథి పాత్ర చేశారు. ఈ చిత్రం మార్చిలో విడుదల కానుంది. మరోవైపు శ్రద్ధాకపూర్ నటించిన ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3’ ఈ నెలలో విడుదల కానుంది. -
ఇంట గెలిచి రచ్చ గెలిచింది
కొందరు ఇంట గెలుస్తారు. కొందరు రచ్చ గెలుస్తారు. కొందరే ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు. శ్రద్ధా కపూర్ బాలీవుడ్‌ను గెలిచింది. అందంతో నటనతో గెలిచింది. అందుకే దక్షణాది భాషల వారికి ఫేవరెట్‌గా నిలిచింది.సాహో తర్వాత పెద్ద సినిమాల నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. 2005. ఇండియా టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో శక్తి కపూర్ పట్టుబట్టాడు. సినిమా అవకాశాల కోసం ఔత్సాహిక నటి వేషంలో ఉన్న టీవీ యాంకర్‌ను లైంగిక అవసరం తీర్చమని అతడు అడిగే వీడియో దేశమంతా సంచలనం రేపింది. శక్తికపూర్ భయభ్రాంతం అయ్యాడు. గగ్గోలు పెట్టాడు. ఇండియా టీవీ వారిని నానా తిట్లు తిట్టాడు. అతడు పదే పదే చెప్పిన మాట ఒక్కటే ‘మీరు చేసిన ఈ పనికి నేను నా కూతురికి ఎలా ముఖం చూపించాలి. అది నన్ను చంపేస్తుంది’ అని. ఆ కూతురే శ్రద్ధా కపూర్ అప్పటికి ఆమె వయసు 20 సంవత్సరాలు. తండ్రి అంటే ఆమెకు చాలా ఇష్టం. ‘అందాజ్ అప్నా అప్నా’లో అతడు వేసిన పాత్ర ‘క్రైమ్ మాస్టర్ గోగో’ను గుర్తు చేసుకుంటూ తండ్రిని ‘గోగో’ అని పిలుస్తూ ఉంటుంది. అలాంటి తప్పిదం/లేదా అతని చుట్టూ అల్లిన ట్రాప్ వల్ల శ్రద్ధా కపూర్ కుటుంబం బజారున పడింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలని పెద్దలు అంటారు. తండ్రి కోల్పోయిన చోటే తాను గెలిచి చూపించాలని శ్రద్ధా కపూర్ అనుకుంది. చూపించింది కూడా. శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. శక్తి కపూర్ అప్పట్లో డేవిడ్ ధావన్ సినిమాల్లో ఎక్కువగా నటించేవాడు. అలా శక్తికపూర్ కూతురు శ్రద్ధా, డేవిడ్ ధావన్ కొడుకు వరుణ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరూ షూటింగులు చూడ్డానికి వెళ్లేవారు. కాని ఇద్దరికీ సినిమా రంగంలో వస్తున్నట్టు అప్పటికి తెలియదు. శ్రద్ధాకపూర్ సైకాలజిస్ట్ కావాలనుకుంది. ముంబైలో అమెరికన్ స్కూల్లో ఇంటర్ చదువుతున్నప్పుడు 96 శాతం మార్కులు తెచ్చుకుంది. అప్పుడే కాలేజ్‌లో నాటకం వేసింది శ్రద్ధా. ఆ వేడుకకు హాజరైన సల్మాన్ ఖాన్ ఆమె నటన చూసి హీరోయిన్ వేషం ఆఫర్ చేశాడు. కాని ‘నాకు చదువుకోవాలని ఉంది’ అని చెప్పి అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీకి వెళ్లిపోయింది. అక్కడ చదువుకుంటూ ఉన్నప్పుడే శక్తికపూర్ ఉదంతం చోటు చేసుకుంది. శక్తికపూర్ పంజాబీ. అతని స్వస్థలం న్యూఢిల్లీ. శక్తికపూర్ భార్య ‘శివాంగని కొల్హాపురి’ పండిత వంశం నుంచి వచ్చింది. ఆమె తండ్రి పండరినాథ్ కొల్హాపురి శాస్త్రీయ గాయకుడు. చెల్లెలు పద్మిని కొల్హాపురి నటి. గాయని లతా మంగేష్కర్ వీరికి పండరినాథ్ వైపు నుంచి దగ్గరి బంధువు అవుతుంది. అయితే శ్రద్ధాకపూర్ తండ్రి వైపు నుంచి కంటే తల్లివైపు బంధువులతోనే బాల్యం నుంచి గడిపింది. తనను తాను ఒక మరాఠి స్త్రీగానే భావిస్తుంది. శక్తికపూర్ చేసిన తప్పు తన కుటుంబాన్ని, బంధువర్గాన్ని అసౌకర్యంలో పడేసిందని ఆమె భావించింది. సైకాలజిస్ట్ కావాలనుకున్న శ్రద్ధాకపూర్ నటి అవుదామని తీర్మానించుకుంది. బాలీవుడ్లో ఒక రివాజు ఉంది. మనకున్న పలుకుబడి అంతా కెమెరా ముందు వరకూ తీసుకెళ్లి నిలబెడుతుందికానీ కెమెరా ముందు ప్రతిభ మాత్రం మనమే చూపాలి. అది చాలా బాగా ఉండాలి. లేకుంటే వెనక్కు పంపించేస్తారు. శ్రద్ధాకపూర్ ఎంతైనా ఒక హీరో కూతురు కాదు. విలన్ కూతురు. అందునా చెడ్డ పేరు మూటగట్టుకున్న విలన్ కూతురు. ఆమె జీరో నుంచి మొదలుకావాల్సిందే. అలాగే అయ్యింది. చాలా ఆఫీసులకు ఆడిషన్స్ ఇవ్వడానికి తిరిగింది. చివరకు ఆమెకు ఒక ఉమన్ డైరెక్టరే బాసటగా నిలిచింది. టీవీ రంగంలో పేరు తెచ్చుకుని బాలీవుడ్లో సినిమాలు తీస్తున్న లీనా యాదవ్ తన ‘తీన్ పత్తీ’ సినిమాలో శ్రద్ధాను సైన్ చేసింది. కాని ఆ సినిమా ఫ్లాప్. కొందరు మాత్రం ఈ అమ్మాయి ఎవరో బాగా చేసింది అని ఒకరిద్దరికి చెప్పారు. దాంతో యశ్‌రాజ్ ఫిల్మ్వారు పిలిపించి మూడు సినిమాలకు సైన్ చేయించారు. తొలి సినిమాగా ‘లవ్ కా ది ఎండ్’ సినిమాలో హీరోయిన్ వేషం ఇచ్చారు. కాని ఆ సినిమా కూడా ఫ్లాప్. రెండు సినిమాల ఫ్లాప్ తర్వాత ఒక హీరోయిన్ పరిస్థితి కష్టమే అవుతుంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ వారు ఆ తర్వాత ‘ఔరంగజేబ్’ (అర్జున్ కపూర్ హీరో) సినిమాలో వేషం ఆఫర్ చేశారు. కాని ఇక్కడే శ్రద్ధా కపూర్ ఒక మలుపు తిరిగే నిర్ణయం తీసుకుంది. ఔరంగజేబ్ ఆఫర్ సమయంలోనే మహేష్ భట్ కాంపౌండ్ నుంచి ‘ఆషికీ2’ ఆఫర్ వచ్చింది ఆమెకు. ఇదో లేక అదో. కాని శ్రద్ధా యశ్రాజ్వారికి సర్దిచెప్పి ‘ఆషికీ2’ చేసింది. ప్రియుడి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టే గాయని పాత్రలో శ్రద్ధా నటన జనానికి నచ్చింది. ఆ సినిమా పాటలు ఇంకా నచ్చాయి. సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో శ్రద్ధా కపూర్ రాత్రికి రాత్రి స్టార్డమ్కు చేరుకుంది. 18 కోట్లతో తీసిన ‘ఆషికీ 2’ 175 కోట్లను వసూలు చేసిందంటే ఆ క్రేజ్ తాలూకు వాటా శ్రద్ధా కపూర్‌కు కూడా దక్కింది. అయితే శ్రద్ధా కపూర్‌కు డాన్స్ అంటే ఆసక్తి ఉంది. మంచి డాన్స్ సినిమా చేయాలనే ఆమె కోరికను రెమో డిసూజా దర్శకత్వంలో వచ్చిన ‘ఏబిసిడి2’ తీర్చింది. ప్రభుదేవా నటించిన ఆ సినిమాలో శ్రద్ధాకపూర్ తన ప్రతిభ చాటి తాను డాన్సింగ్ స్టార్ కూడా అని నిరూపించుకుంది. ఆ తర్వాత ‘భాగీ’, ‘రాక్ఆన్’ సినిమాలన్నీ ఆమె కెరీన్కు మేలు చేస్తూ వచ్చాయి. సౌత్‌లో హిట్ అయిన ‘ఓకే బంగారం’ రీమేక్ ‘ఓకే జాను’లో శ్రద్ధా హీరోయిన్గా నటించిది. దావుద్ ఇబ్రాహీమ్ చెల్లెలు హసీనా పార్కర్ బయోపిక్ ‘హసినా పార్కర్’లో నటించడంతో తన భుజాల మీద ఒక సినిమాను నిలబెట్టగలననే నమ్మకం బాలీవుడ్‌కు కల్పించింది. ‘స్త్రీ’ సినిమా సూపర్ హిట్ కావడం, ‘సాహో’ వంటి భారీ సినిమాలో నటించడంతో శ్రద్ధాకపూర్ బాలీవుడ్ తార నుంచి భారతీయ తారగా ఎదిగింది. శ్రద్ధాకపూర్‌కు ఇంగ్లిష్ భాష మీద మంచి పట్టు ఉంది. దేశదేశాల వారు ఇంగ్లిష్ భాషను ఎలా మాట్లాడతారో నకలు దింపుతుంది. ఆమెకు నాలుగు పశువులను పెట్టుకొని, సొంతగా కూరగాయలు పండించుకుంటూ విశ్రాంతిగా ఉండాలని కోరిక. ఆ పని భవిష్యత్తులో చేస్తానని కూడా చెబుతుంది. రోజూ డైరీ రాయడం, తన ఆలోచనలను రాస్తూ వెళ్లడం టీనేజ్ నుంచి చేస్తూనే ఉంది. శ్రద్ధా కపూర్ తన తాత నుంచి తల్లి నుంచి వారసత్వంగా సంగీతాన్ని పొందింది. చాలా సినిమాలలో పాటలు పాడింది. శ్రద్ధాకపూర్ ఇవాళ బాలీవుడ్లో గౌరవపూర్వకంగా తలిచే పేరు అయ్యింది. తండ్రి శక్తికపూర్ ఆమెను చూసి గర్వపడుతున్నాడు. శ్రద్ధా కపూర్ ప్రచండకాంతిలో అతడి మరక కనపడకుండా పోయింది. శ్రద్ధాకపూర్ రాబోయే రోజులలో ప్రేక్షకులు తల ఎత్తి చూసే పనులు తప్పక చేస్తుంది. చేయాలని ఆశిద్దాం. – సాక్షి ఫీచర్స్ డెస్క్ -
ఆయన నా బాయ్‌ఫ్రెండ్ అయితే బాగుంటుంది!
హిందీ విలన్ శక్తికపూర్ అంటే 1980ల్లో తెలియనివాళ్ళు లేరు. కానీ, ఈ తరానికి శక్తికపూర్‌ని పరిచయం చేయాలంటే, ‘శ్రద్ధాకపూర్ వాళ్ళ నాన్న’ అని చెప్పాలి. కొత్త తరం సెన్సేషనల్ హీరోయిన్స్ జాబితాలో శ్రద్ధాకపూర్ పేరూ ఉంటుంది. ‘ఆషికీ-2’, ‘హైదర్’ చిత్రాల ఫేమ్ అయిన శ్రద్ధ ప్రస్తుతం మణిరత్నం ‘ఓకే బంగారం’ హిందీ రీమేక్ ‘ఓకే జానూ’లో నటిస్తున్నారు. ఆమె పంచుకున్న మనోభావాల్లో కొన్ని ముచ్చట్లు... ► జీవితంలో నాకు నచ్చనిది ఏదీ లేదు. కానీ, ఒక్కోసారి జీవితం గురించి ఎక్కువ ఆలోచి స్తుంటా. అదే నన్ను బాధిస్తుంది. ఉదయమే నిద్రలేస్తా. ఆలస్యంగా పడుకోవాలంటే ఇరిటేషన్. అయామ్ నాట్ ఎట్ ఆల్ ఎ నైట్ పర్సన్. ► ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తే మనసు ప్రశాంతం. యాక్టింగ్ పక్కన పెడితే.. సింగింగ్, డ్యాన్సింగ్, ట్రావెలింగ్ ఇష్టం. చిన్న పిల్లలంటే మరీ ఇష్టం. పెళ్ల య్యాక ఎంతమంది పిల్లలు కావా లంటే, ఓ నంబర్‌తో సరిపెట్టలేను. ► సెలబ్రిటీల్లో మీ ఫ్యాంటసీ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే బాగుంటుందంటే, ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ ఫేమ్, హాలీవుడ్ నటుడు జానీ డెప్ పేరు చెబుతా. చిన్నప్పటి నుంచి నేనూ, వరుణ్ ధావన్ గుడ్ ఫ్రెండ్స్. ఒకరి గురించి మరొకరికి తెలుసు. బాలీవుడ్లో నా బెస్ట్ ఫ్రెండ్ వరుణే. ► మహారాష్ట్ర తరహా హోమ్‌ఫుడ్ చాలా ఇష్టం. ఇంటి భోజనం ముందు స్టార్ హోటల్స్ గట్రా బలా దూర్. హోమ్ఫుడ్ని మించిన టేస్టీ ఫుడ్ ఏదీ ఉండదని నా ఫీలింగ్. బిర్యానీ కూడా ఇష్టమే. పానీ పూరీ, వడా పావ్ హ్యాపీగా లాగించేస్తా. ► ‘బాఘీ’లో యాక్షన్, ఫైట్స్ చేశా. ‘ఎబిసిడి 2’లో డ్యాన్స్ బాగా చేశా. ‘ఆషికీ2’లో రొమాంటిక్‌గా కనిపించా. మీరు నటించిన సినిమాల్లో ఏది ఇష్టమంటే చెప్పడం కష్టం. లవ్, యాక్షన్, కామెడీ, రొమాన్స్.. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించాలనుంది. హారర్ సినిమాలు చూడడ మంటే భయం. వాటిలో నటించగలనో? లేదో? తెలియదు. ఎవరైనా మంచి అవకాశం ఇస్తే హాలీవుడ్‌లోనూ నటించాలనుంది. ► ఐదారేళ్ల వయసు నుంచి పదహారేళ్ల వయసు వరకూ పియానో వాయించా. మళ్లీ ఇప్పుడు ‘రాక్ ఆన్-2’ కోసం నా విద్య ప్రదర్శించా. ► నా పాటలన్నీ నాకిష్టమే. కానీ, ‘ఏక్ విలన్’లో పాడిన ‘గలియా..’ పాట ప్రత్యేకం. ఎందుకంటే, నేను పాడిన తొలి పాట అది. ► పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు, హలో చెప్పగానే ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ.. నా పేరు అరుస్తూ.. చీర్స్ చెబుతుంటే చాలా బాగుంటుంది. వాళ్లంటే ఎంత ప్రేమో మాటల్లో చెప్పలేను. ఇండస్ట్రీలోకి వచ్చాక సంపాదించిన ఆస్తి జనం అభిమానమే. ► ‘అందాజ్ అప్నా అప్నా’ మళ్లీ మళ్లీ చూడాలని పించే సినిమా. ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. సల్మాన్, ఆమిర్‌ఖాన్‌లు చేసిన ఈ మల్టీస్టారర్‌లో మా నాన్నగారు శక్తి కపూర్ విలన్‌గా నటించారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే, ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తుంటా. -
అమ్మో... మరీ ఇంతలానా?
వన్ ఫైన్ మార్నింగ్... ముంబైలోని 34 అంతస్తుల ఫేమస్ ఫైవ్ స్టార్ హోటల్. 34వ అంతస్తు నుంచి కిందకి చూడాలంటేనే గుండె జారిపోతుంది. అలాంటిది ఆ అంతస్తు పై నుంచి ఓ అమ్మాయి... ఇద్దరి సాయంతో కిందకు వేలాడుతూ, యాక్షన్ చేస్తున్నారు. దారిన పోయేవాళ్లందరూ టెన్షన్గాచూస్తున్నారు. ఏదైనా సినిమా షూటింగ్ కోసమేనేమో అనుకున్నారంతా! కానీ అదంతా కేవలం యాడ్ చిత్రీకరణ కోసమే. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు శ్రద్ధాకపూర్. ఓ ప్రొడక్ట్‌కు సంబంధించిన వాణిజ్యప్రకటన కోసం రిస్కీ షాట్లో నటించడానికి ఆమె రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలను తన ట్విటర్లో ‘సో... వెయిట్‌లెస్..’అంటూ షేర్ చేశారామె. అమ్మో...అంత రిస్కా అని సన్నిహితులు అంటున్నా, శ్రద్ధా కపూర్ మాత్రం మరేం ఫరవాలేదంటున్నారు. ‘ఆషికీ-2’ చిత్రంతో డ్రీమ్‌గాళ్‌గా ప్రేక్షకుల హృదయాలను మీటిన శ్రద్ధాకపూర్ తన ఇమేజ్ను అంచెలంచెలుగా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే డాన్స్ నేపథ్యంలో ‘ఏబీసీడీ-2’ నటించారు. ఇప్పుడు తాను నటిస్తున్న ‘బాగీ’ చిత్రంలో కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. అందుకేనేమో యాక్షన్ సీన్లలో నటించడానికి సై అంటున్నారు. -
సహజీవనం చేసేది వీళ్లిద్దరే!
ఆది, తార ప్రేమించుకుంటారు. ఇద్దరికీ పెళ్లి మీద నమ్మకం లేదు. కలిసి ఉన్నంత కాలం హాయిగా ఉండి, విడిపోదామనుకుంటారు. సహజీవనం సాగించి, చివరికి ఒకరిని ఒకరు విడిచి ఉండలేక పెళ్లితో ఒకటవుతారు. సహజీవనంపై ఈతరం ఆలోచనలకు అద్దంపట్టే కథాంశంతో అందమైన ప్రేమకథగా రూపొందిన ‘ఓకే బంగారం’ (తమిళంలో ‘ఓకే కన్మణి’) చిత్రకథ ఇది అని చూసినవాళ్లకి తెలిసే ఉంటుంది. దుల్కర్ సల్మాన్-నిత్యామీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దుల్కర్, నిత్యాలనే హిందీలో నటింపజేయాలనుకున్నారనే వార్త వినిపించింది. అయితే, ‘ఆషికి-2’ చిత్రంలో హాట్ కపుల్‌గా ఆన్‌స్క్రీన్ మీద రొమాన్స్ పండించేసిన ఆదిత్యారాయ్ కపూర్-శ్రద్ధాకపూర్ కూడా ఈ సహజీవనం సబ్జెక్టుకు బాగుంటారని చిత్రదర్శక-నిర్మాతలు షాద్-కరణ్ జోహార్‌కి అనిపించిందట. వాళ్లనే ఫైనలైజ్ చేశారు. విశేషం ఏంటంటే... గతంలో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘సఖి’ హిందీ రీమేక్ కూడా షాద్ దర్శకత్వంలో రూపొందింది. ‘‘మణిరత్నం-రచయిత గుల్జార్, ఏఆర్ రెహ్మాన్ కలిసి ఈ మళ్లీ ఈ ప్రేమకథను ఆవిష్కరించనున్నారు’’ అని కరణ్‌జోహార్ తెలిపారు. షాద్ దర్శకత్వం వహిస్తుండగా మణిరత్నం పేరుని కరణ్ ఎందుకు పేర్కొని ఉంటారు. బహుశా హిందీకి అనుగుణంగా చేసే మార్పుల విషయంలో మణిరత్నం సహకరిస్తారేమో! -
లక్కీ ఛాన్స్!
గాసిప్ ఎనిమిది సంవత్సరాల క్రితం అభిషేక్ కపూర్ డెరైక్షన్‌లో వచ్చిన ‘రాక్ ఆన్’ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. ఫర్హాన్ అఖ్తర్, ప్రాచీ దేశాయ్‌లకు మంచి పేరు తెచ్చింది. సక్సెస్ అయిన ఊపులో ‘రాక్ ఆన్’కు సీక్వెల్ తీసుకు రావడానికి రెండు మూడుసార్లు ప్రయత్నాలు జరిగాయి కానీ ప్రాజెక్ట్ పట్టాలకెక్కలేదు. ఇప్పుడు మాత్రం నిజంగానే ‘రాక్ ఆన్’కు సీక్వెల్ రాబోతుంది. ‘రాక్ ఆన్’లో నటించిన అర్జున్ రాంపాల్, ఫర్హాన్ అఖ్తర్‌లు సీక్వెల్లోనూ నటించనున్నారు. అయితే ప్రాచీ దేశాయ్ స్థానంలో శ్రద్ధాకపూర్ నటించనుంది అనే వార్తలు వెలువడుతున్నాయి. ఇంతకీ ‘రాక్ ఆన్’ సీక్వెల్లో ప్రాచీకి బదులు శ్రద్ధాకపూర్‌ను ఎందుకు తీసుకుంటున్నట్లు? ప్రాచీతో పోల్చితే శ్రద్ధా సక్సెస్‌లో ఉంది. ఆ సక్సెస్‌ను క్యాష్ చేసుకోవడానికే శ్రద్ధాకపూర్‌ను తీసుకున్నట్లు ఆ నోటా ఈ నోటా వినిపిస్త్తోంది. -
హోప్... సక్సెస్!
వరుస హిట్స్‌తో హుషారు మీదున్న అప్‌కమింగ్ స్టార్ శ్రద్ధాకపూర్... దాన్ని కొనసాగించాలని తాపత్రయపడుతోంది. ఈ ఏడాది విడుదలైన ‘ఏక్ విలన్, హైదర్’ చిత్రాలు మంచి విజయం సాధించడం... ఈ అమ్మడిలో ఉత్సాహం నింపాయట. 2015 కూడా ఇలాగే దూసుకుపోవాలని కోరుకుంటుందట. ‘వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడమే గానీ... వాటి కోసం ఆరాటపడను. నాదంతా ప్రవాహం ఎటుంటే అటు కొట్టుకుపోయే మనస్తత్వం. 2014 హ్యాపీ ఇయర్. రాబోయే సంవత్సరం కూడా ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అంది శ్రద్ధా. ప్రస్తుతం ఈ లవ్లీ గాళ్ ‘ఏబీసీడీ 2’లో నటిస్తోంది. వరుణ్‌ధావన్ హీరో. వచ్చే ఏడాది మధ్యలో విడుదల అవుతుంది. -
న్యూ... డేటింగ్!
బాలీవుడ్ తారలకు సినిమాలున్నా లేకపోయినా డేటింగ్ కామనైపోయింది. ఇప్పటికే... కనిపించీ కనిపించకుండా... వినిపించీ వినిపించకుండా... డేటింగ్ చేస్తున్న కత్రినా- రణబీర్‌ల మధ్య అసలేదన్నా విషయం ఉందో లేదో తెలియక అభిమానులకు నిద్దర పట్టడం లేదు. ఈలోగా మరో రిలేషన్ ‘తెర’పైకి వచ్చింది. శ్రద్ధాకపూర్, ఆదిత్యారాయ్ కపూర్ల మధ్య ఏదో జరిగిపోతున్నట్టు సమాచారం. ఇద్దరూ కలసి ఒకే సినిమాలో ఎంట్రీ ఇచ్చినప్పడు మొదలైన స్నేహం.. సాన్నిహిత్యంగా మారి.. సహజీవనం దిశగా సాగుతుందని బీ-టౌన్ టాక్. తన షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ కశ్మీర్లో ఉన్న ఆదిత్యను కలవడానికి వెళ్లిందట శ్రద్ధా. కానీ... తమది స్నేహం తప్ప మరేదీ కాదంటున్నారు వీరు.