సహజీవనం చేసేది వీళ్లిద్దరే!
ఆది, తార ప్రేమించుకుంటారు. ఇద్దరికీ పెళ్లి మీద నమ్మకం లేదు. కలిసి ఉన్నంత కాలం హాయిగా ఉండి, విడిపోదామనుకుంటారు. సహజీవనం సాగించి, చివరికి ఒకరిని ఒకరు విడిచి ఉండలేక పెళ్లితో ఒకటవుతారు. సహజీవనంపై ఈతరం ఆలోచనలకు అద్దంపట్టే కథాంశంతో అందమైన ప్రేమకథగా రూపొందిన ‘ఓకే బంగారం’ (తమిళంలో ‘ఓకే కన్మణి’) చిత్రకథ ఇది అని చూసినవాళ్లకి తెలిసే ఉంటుంది. దుల్కర్ సల్మాన్-నిత్యామీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దుల్కర్, నిత్యాలనే హిందీలో నటింపజేయాలనుకున్నారనే వార్త వినిపించింది. అయితే, ‘ఆషికి-2’ చిత్రంలో హాట్ కపుల్‌గా ఆన్‌స్క్రీన్ మీద రొమాన్స్ పండించేసిన ఆదిత్యారాయ్ కపూర్-శ్రద్ధాకపూర్ కూడా ఈ సహజీవనం సబ్జెక్టుకు బాగుంటారని చిత్రదర్శక-నిర్మాతలు షాద్-కరణ్ జోహార్‌కి అనిపించిందట. వాళ్లనే ఫైనలైజ్ చేశారు. విశేషం ఏంటంటే... గతంలో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘సఖి’ హిందీ రీమేక్ కూడా షాద్ దర్శకత్వంలో రూపొందింది.
‘‘మణిరత్నం-రచయిత గుల్జార్, ఏఆర్ రెహ్మాన్ కలిసి ఈ మళ్లీ ఈ ప్రేమకథను ఆవిష్కరించనున్నారు’’ అని కరణ్‌జోహార్ తెలిపారు. షాద్ దర్శకత్వం వహిస్తుండగా మణిరత్నం పేరుని కరణ్ ఎందుకు పేర్కొని ఉంటారు. బహుశా హిందీకి అనుగుణంగా చేసే మార్పుల విషయంలో మణిరత్నం సహకరిస్తారేమో!