Adityaray Kapoor
-
గుట్టు రట్టు చేశాడు!
ఎంత దాయాలని ట్రై చేసినా సెల్రబిటీల రహస్యాలు ఎలాగోలా బయటికొచ్చేస్తాయ్. డ్రైవరో, మేకప్‌మేనో, మేనేజరో, పర్సనల్ అసిస్టెంట్సో.. ఇలా ఎవరో ఒకరు సీక్రెట్స్‌ని బయటపెట్టేస్తారు. అఫ్కోర్స్ వాళ్ల ద్వారా కాకుండా వేరే రకంగా కూడా బయటకు వచ్చే అవకాశం ఉందనుకోండి. ఈ మధ్య కత్రినా కైఫ్ గురించి బయటికొచ్చిన రహస్యాలన్నీ మాత్రం ఆమె డ్రైవర్ నుంచే వచ్చాయట. రణబీర్ కపూర్‌తో గొడవపడినా, ఆదిత్యారాయ్ కపూర్‌తో స్నేహంగా ఉన్నా.. ఇలా ఏ విషయం అయినా దాగకుండా బయటకు రావడం కత్రినాను ఆలోచనలో పడేసిందట. ఎవరో కావాలనే విషయాలను బయటపెడుతున్నారని గ్రహించిన కత్రినా ముందుగా తన డ్రైవర్ని అనుమానించారట. మీడియాకి రహస్యాలు చేరవేసి, అతగాడు డబ్బులు తీసుకుంటున్నాడని తెలిసి, కత్రినా ఖంగుతిన్నారని సమాచారం. ఆ డ్రైవర్‌ను చెడామడా తిట్టిన కత్రినా ‘ఇంకోసారి ఇలా చేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారని భోగట్టా. డ్రైవర్ మీద మాత్రమే కాదు.. తన దగ్గర పని చేసేవాళ్లందరి మీదా కత్రినా ఓ కన్నేసి ఉంచుతున్నారట. కానీ, ఎంతసేపని కాపలా కాయగలరు? పాపం దీనివల్ల ఈ బ్యూటీకి మనశ్శాంతి లేకుండాపోతోందట. తప్పదు మేడమ్.. సెలబ్రిటీ లైఫ్ అంటే మాటలా మరి? అని సన్నిహితులు సర్ది చెబుతున్నారట. -
హిందీలో... ఓ.కే. బంగారం
గతంలో ‘ఆషికీ-2’ చిత్రం ద్వారా అందరినీ ఆకట్టుకున్న జంట - శ్రద్ధా కపూర్, ఆదిత్యారాయ్ కపూర్. దీర్ఘకాలంగా ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులను ఓ శుభవార్త. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలసి మళ్ళీ తెర మీదకొస్తున్నారు. వారి లేటెస్ట్ సినిమా ‘ఓకే... జానూ’ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. మణిరత్నం దర్శకత్వంలో హిట్టయిన తమిళ చిత్రం ‘ఓ.కె. కన్మణి’ (తెలుగులో ‘ఓ.కె. బంగారం’)కి ఇది హిందీ రీమేక్. ఇక్కడ దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ ధరించిన పాత్రల్ని ఈ హిందీ రీమేక్ ‘ఓ.కె. జానూ’లో ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ధాకపూర్‌లు పోషిస్తున్నారు. ముంబయ్‌లోని మెరైన్‌డ్రైవ్ ప్రాంతంలో హీరో హీరోయిన్లిద్దరూ ద్విచక్ర వాహనం మీద వెళుతున్న దృశ్యాలను ముందుగా చిత్రీకరించారు. కథ రీత్యానే కాక, గత చిత్రాల రీత్యా కూడా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. షాద్ అలీ దర్శకత్వంలో ప్రసిద్ధ ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్‌జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఉత్తరాదిన కూడా హిట్టవుతుందేమో చూడాలి. -
సహజీవనం చేసేది వీళ్లిద్దరే!
ఆది, తార ప్రేమించుకుంటారు. ఇద్దరికీ పెళ్లి మీద నమ్మకం లేదు. కలిసి ఉన్నంత కాలం హాయిగా ఉండి, విడిపోదామనుకుంటారు. సహజీవనం సాగించి, చివరికి ఒకరిని ఒకరు విడిచి ఉండలేక పెళ్లితో ఒకటవుతారు. సహజీవనంపై ఈతరం ఆలోచనలకు అద్దంపట్టే కథాంశంతో అందమైన ప్రేమకథగా రూపొందిన ‘ఓకే బంగారం’ (తమిళంలో ‘ఓకే కన్మణి’) చిత్రకథ ఇది అని చూసినవాళ్లకి తెలిసే ఉంటుంది. దుల్కర్ సల్మాన్-నిత్యామీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దుల్కర్, నిత్యాలనే హిందీలో నటింపజేయాలనుకున్నారనే వార్త వినిపించింది. అయితే, ‘ఆషికి-2’ చిత్రంలో హాట్ కపుల్‌గా ఆన్‌స్క్రీన్ మీద రొమాన్స్ పండించేసిన ఆదిత్యారాయ్ కపూర్-శ్రద్ధాకపూర్ కూడా ఈ సహజీవనం సబ్జెక్టుకు బాగుంటారని చిత్రదర్శక-నిర్మాతలు షాద్-కరణ్ జోహార్‌కి అనిపించిందట. వాళ్లనే ఫైనలైజ్ చేశారు. విశేషం ఏంటంటే... గతంలో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘సఖి’ హిందీ రీమేక్ కూడా షాద్ దర్శకత్వంలో రూపొందింది. ‘‘మణిరత్నం-రచయిత గుల్జార్, ఏఆర్ రెహ్మాన్ కలిసి ఈ మళ్లీ ఈ ప్రేమకథను ఆవిష్కరించనున్నారు’’ అని కరణ్‌జోహార్ తెలిపారు. షాద్ దర్శకత్వం వహిస్తుండగా మణిరత్నం పేరుని కరణ్ ఎందుకు పేర్కొని ఉంటారు. బహుశా హిందీకి అనుగుణంగా చేసే మార్పుల విషయంలో మణిరత్నం సహకరిస్తారేమో! -
న్యూ... డేటింగ్!
బాలీవుడ్ తారలకు సినిమాలున్నా లేకపోయినా డేటింగ్ కామనైపోయింది. ఇప్పటికే... కనిపించీ కనిపించకుండా... వినిపించీ వినిపించకుండా... డేటింగ్ చేస్తున్న కత్రినా- రణబీర్‌ల మధ్య అసలేదన్నా విషయం ఉందో లేదో తెలియక అభిమానులకు నిద్దర పట్టడం లేదు. ఈలోగా మరో రిలేషన్ ‘తెర’పైకి వచ్చింది. శ్రద్ధాకపూర్, ఆదిత్యారాయ్ కపూర్ల మధ్య ఏదో జరిగిపోతున్నట్టు సమాచారం. ఇద్దరూ కలసి ఒకే సినిమాలో ఎంట్రీ ఇచ్చినప్పడు మొదలైన స్నేహం.. సాన్నిహిత్యంగా మారి.. సహజీవనం దిశగా సాగుతుందని బీ-టౌన్ టాక్. తన షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ కశ్మీర్లో ఉన్న ఆదిత్యను కలవడానికి వెళ్లిందట శ్రద్ధా. కానీ... తమది స్నేహం తప్ప మరేదీ కాదంటున్నారు వీరు. -
నేనే నమ్మలేకపోతున్నా!
‘ఖాన్’తో కలసి పరిణీతి చోప్రా ఓ సినిమా చేస్తోం దనే ప్రచారం బాలీవుడ్లో ఇటీవల జోరందుకుంది. అయితే ఆ ఖాన్ ఎవరో తెలియక ఆరా తీసేవారి సంఖ్య కూడా బాగా పెరిగింది. అయితే ఎట్టకేలకు ఆ ఖాన్ ఎవరో తెలిసిపోయింది. ఈ వివరాలను మీడియాకు స్వయంగా పరిణీతి చోప్రాయే వెల్లడించింది. ‘సైఫ్ అలీఖాన్‌తో కలసి ఓ సినిమాలో నటించబోతున్నా. ఆయనకు నేను ఎన్నోరోజులుగా అభిమానిని. ఇప్పుడు ఆయనతోనే కలసి సినిమా చేస్తున్నాననే విషయాన్ని నేనే నమ్మలేకపోతున్నా. పైగా ఇది ఆయన సొంత బ్యానర్లో నటిస్తున్న చిత్రం కావడం, సినిమాలో కథానాయిక పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉండడంతో మరింత సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా చిన్న చిన్న హీరోలతోనే సినిమాలు చేశాను. తొలిసారిగా సైఫ్‌తో చేస్తున్నందుకు ఏదోలా ఉంది. రణ్‌వీర్‌సింగ్, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, అదిత్యరాయ్ కపూర్లతో కలసి నటించినప్పుడు ఇలాంటి భావన కలగలేదు. ఎందుకంటే నటులుగా మా అందరి అనుభవంలో పెద్దగా తేడా లేదు. కానీ ఇప్పుడు సైఫ్‌తో నటిస్తుండడం ఇప్పటిదాకా నటించిన దానికి భిన్నంగా ఉంటుంద’ని చెప్పింది. సైఫ్ సతీమణి కూడా సినిమాలో కథానాయిక పాత్ర కోసం ‘ఇషక్జాదే’ భామనే ఎంపిక చేసిందట. ఆమె వ్యవహార శైలి కరీనాకు ఎంతో నచ్చినందునే పరిణీతిని కథానాయిక పాత్ర కోసం సిఫారసు చేసిందని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. సైఫ్ అలీఖాన్ సొంత బ్యానర్లోనే తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దినేశ్ విజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారానే విజన్ బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా హాస్యప్రధానంగా సాగుతుందని, అక్కడక్కడా భావోద్వేగాల రుచికూడా చూపుతూ క్లాస్, మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ఖాన్‌తో పరిణీతి కెమెస్ట్రీ ఏమేరకు కుదురుతుందో వేచి చూడాలి.