ఆర్చీని చంపేస్తారా?
వీక్షణం
కామిక్ పుస్తకాలు, కార్టూన్ షోల పేర్లు చెబితే పిల్లలే కాదు... పెద్దలు కూడా ఎగిరి గంతేస్తారు. ఒత్తిడి పెరిగిపోతున్న జీవితాల్లో రిలాక్సేషన్ కోసం ఉపయోగపడే మందులవి. అందుకే అందరూ వాటిని ఇష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే... వాటికి వీరాభిమానులు అవుతున్నారు. ఎంతగా అంటే... ఓ కామిక్ క్యారెక్టర్‌ని చంపేస్తున్నామని పబ్లిషర్ చెప్పగానే, వద్దు అని గొడవ చేసేంత!
ఆర్చీ ఆండ్రూస్... కామిక్ ప్రపంచంలో మార్మోగే పేరిది. దాదాపు డెబ్భై ఏళ్లుగా ఈ క్యారెక్టర్ అందరినీ ఉర్రూతలూగిస్తోంది. తన సాహసాలతో, అద్భుత విన్యాసాలతో, మంచితనంతో, హాస్యంతో పలు రకాలుగా ఆకట్టుకుంటూ వచ్చిన ఆర్చీ త్వరలో చచ్చిపోబోతున్నాడు. ఈ విషయం గురించి ఇటీవలే ఆర్చీ కామిక్స్ పబ్లిషర్, సీఈవో జాన్ గోల్డ్‌వాటర్ ప్రకటించారు. అంతే... తక్షణం ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అది తమకు ఎంతో ఇష్టమైన పాత్ర అని, ఆర్చీని చంపడానికి వీల్లేదని ఫోన్లు, ఉత్తరాలు, మెయిళ్లు వస్తుండటంతో షాక్ తిన్నాడు గోల్డ్‌వాటర్.
ఏడు దశాబ్దాలుగా పుస్తకాలు, యానిమేషన్లు, టీవీ షోలు, సినిమాల రూపంలో ఆర్చీ అందరినీ అలరిస్తున్నాడు. ఇక ఇప్పటికైనా అతడి కథకి ముగింపు చెబితే మంచిదనుకున్నాడు గోల్డ్‌వాటర్. అందుకే ప్రస్తుతం కొనసాగుతున్న ‘లైఫ్ విత్ ఆర్చీ’ సిరీస్‌లో చివరి ఎపిసోడ్‌ని సిద్ధం చేశాడు. కానీ అభిమానుల ఒత్తిడి ఇంతగా ఉన్నప్పుడు ఆయన ఆ పని చేయగలడా అన్నదే సందేహం. చూద్దాం... ఆర్చీ ఆండ్రూస్ ఆయువు పెరుగుతుందో లేదో!