
ఎంత సున్నితమైన గమనింపు చెప్పారన్నదాన్ని బట్టి కదా కవి గొప్పతనం తెలిసేది! సున్నితమైన సంవేదనలు కవిత్వానికి ప్రాణం పోస్తాయి. ఈ పాటకు సి.నారాయణరెడ్డి పోసినట్టు. ‘అక్బర్ సలీం అనార్కలి’ చిత్రం కోసం ఆయన రాసిన ‘సిపాయీ సిపాయీ హసీనా హసీనా’ పాట చూడండి.
‘నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో
ఈ వాలుకనులనడుగు అడుగు చెపుతాయీ’ అని ఆమె అంటోంది.
‘నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా’ అని అతడు పాడుతున్నాడు.
ఇంకా ముందుకు పోయి– ‘జడలోనా మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా
చిరుగాలిలో కురులూగితే నీ చేయి సోకెనని అనుకున్నా’ అని ఆమె చెబుతోంది.
దానికి అతడు ఎలా బదులిస్తున్నాడు? ‘ఆ మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే
ఆ గాలిలో చెలరేగినవి నా నిట్టూరుపులే’ అంటున్నాడు.
‘తడి ఇసుకను గీసిన గీతలు అల తాకితే మాసి పోతాయి
ఎదలోన వ్రాసిన లేఖలు బ్రతుకంతా వుండి పోతాయి’ అని కవి అన్నట్టుగానే శ్రోతల హృదయాల్లో నింపుకున్న ఈ పాట అలా ఉండిపోతుంది. దీనికి సంగీతం సి.రామచంద్ర. పాడినవారు మహమ్మద్ రఫీ, పి.సుశీల. 1979లో వచ్చిన చిత్రానికి దర్శకుడు ఎన్టీ రామారావు. సినారె దీనికి మాటలు కూడా రాయడం విశేషం. ఈ పాటలోని నటీనటులు దీప, బాలకృష్ణ.