
మహోదయా! ‘ప్రణవ నాదమే ప్రాణము కాగా’, ‘శివరంజని పల్లవి శింజనీ రవళిని’ పద కవితా ప్రబంధాలుగా జాలువార్చిన కలం మీది. ప్రతి పాటలో ‘రాజహంస అడుగులున్న’ట్లు, ప్రస్ఫుటించిన మీ కవితా రూపానికి మాతృక ఏదో ‘అదే అదే నాకు అంతు తెలియకున్నది’. ‘వేల తారకల బృందములో వెలిగే చందురుడొకడే’ యన్నట్టు, ‘వలపుల సాంబ్రాణి’ని దట్టించిన మీ పదగుంఫన, తెలుగు సినిమా సాహిత్యపు నిలువెత్తు యవనికపై ‘సినారె’ యన్న మూడక్షరాలు ‘పదము – పల్లవి – పాట’ ఈ మూడింటి జీవనాడిగా మెరుస్తున్నాయి నేటికీ. మీ పల్లవుల జల్లులు మా తెలుగు లోగిళ్ళ ముంగిట వేసిన ‘ముత్యాల ముగ్గులై’ గలగలా నవ్వుతున్నాయి. ఇంకా ‘ఏదో ఏదో చెప్పాలనీ మనసంతా విప్పాలనీ’ గుండె కొట్టుకొంటున్నది. రెండు పద్యాలతో మీకు నివాళి.
ప్రాసల రాయుడేగె, రసబంధుర భావ మహత్వ కావ్య సంభాసిత మొప్ప; నాకమున భాగ్య మహోదయ దివ్య దీధితుల్ వాసిల, నాంధ్ర భోజుడయి వందితుడౌగద; దేవభాషకున్ శ్వాసయు నాసగాగ , నిజ శాసన కర్తగ వన్నె దిద్దగన్ మరణమ? కాదుకాదు, రసమాతృక లన్నియు భాగ్య మూర్తులై; తరణము సేయుచున్నవిట, తారల పంక్తుల దాపుజేరి, యా వరణము వోలె నిల్చినవి; వాక్య కవిత్వ మహత్వ రాశియౌ కరణము సింగిరెడ్డి; నవకావ్యము గూర్చగ నింద్ర సన్నిధిన్
-ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి