బుజ్జితో నా జీవితం సప్తవర్ణాల ఇంద్రధనుస్సులా ఉంది!
గీతామాధురి... ఎంత ట్రెండీగా కనిపిస్తారో, అంత ట్రెడిషనల్. ఆమె పాడే పాటలు కూడా అంతే. క్లాస్‌గానూ పాడగలరు, మాస్‌గానూ మురిపించగలరు. చాలా షార్ట్‌టైమ్‌లోనే స్వీట్ సింగర్ అనిపించుకున్నారామె. నటుడు నందూని ఇటీవల పెళ్లాడిన గీతామాధురి కెరీర్ కబుర్లు... ఫ్యామిలీ ముచ్చట్లు...
బిజీగా ఉన్నట్లున్నారు?
ఓ వైపు పాటల్నీ, మరో వైపు మా వారినీ చూసుకోవాలి. మరి బిజీ గాక ఏముంటుంది చెప్పండి?
ఎలా ఉందండీ వైవాహిక జీవితం?
ఇంత ఆనందంగా ఉంటుందని మాత్రం ఊహించలేదు. నిజంగా బుజ్జి(నందు)తో నా జీవితం సప్తవర్ణాల ఇంద్రధనుస్సులా ఉంది. తను సినిమా వ్యక్తే అవ్వడం, ఇంట్లో మా అత్తగారికి కూడా ప్రోత్సహించే తత్వమే ఉండటంతో వ్యక్తిగతంగానే కాక, వృత్తిపరంగా కూడా సంతోషంగా ఉన్నాను.
మీ ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరు?
ప్రేమ ప్రపోజల్ ఆయన తెచ్చారు. పెళ్లి ప్రపోజల్ నేను తెచ్చాను(నవ్వుతూ).
మీ ఇద్దరూ కలిసి ఓ లఘుచిత్రంలో కూడా నటించినట్లున్నారు? ఇక ముందు కూడా నటిస్తారా?
లేదండీ... అసలు అలాంటి ఉద్దేశమే నాకు లేదు. నందుతోనే నా జీవితం అనుకున్నప్పుడు ఏదో చిన్న చిన్న కోరికలుంటాయి కదా! అందుకే... తనతో కలిసి ఆ షార్ట్‌ఫిలిమ్ చేశాను. నటించాలంటే దానికి కొన్ని అర్హతలుండాలి. నాలో ఆ అర్హతలు లేవని నా అభిప్రాయం. నా వరకు నాకు పాటలే లోకం. అంతే..
సరేకానీ... మీ ఆయన్ను మీరు ‘బుజ్జి’ అని పిలుస్తారా?
అవునండీ... అంతకుముందు లేదు. ఎందుకోగానీ ఉన్నట్లుండి ‘బుజ్జీ...’ అని పిలవడం మొదలుపెట్టాను. అందరిముందు అలా పిలవడం మాత్రం ఇబ్బందిగానే ఉంది. తనకెలా ఉందో మరి!
ఇంట్లో మీ ఇద్దరిలో పై చేయి ఎవరిది?
నన్నడిగితే... ఆయనదే అని చెబుతాను. ఆయన్నడిగితే నా పేరు చెబుతారు. నిజానికి ఇద్దరిదీ. ఎందుకంటే... ఏ విషయం అయినా... ఇద్దరం కలిసి కూర్చుని డిస్కస్ చేసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికొస్తాం. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పై చేయి, కింద చేయి అనే సమస్యలే ఉండవు!
గాత్రంతో ప్రయోగాలు భలే చేస్తారే. ఎక్కడ నేర్చుకున్నారు?
అవసరాలే నేర్పాయండీ. అలాంటి పాటలొచ్చాయి నాకు. తాగినట్లు పాడాల్సి వచ్చింది... పాడాను. ఏ మాత్రం ఎక్స్‌ప్రెషన్ లేకుండా పాడాల్సి వచ్చింది... పాడాను. రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్‌తో పాడాను. రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్‌తో హై పిచ్‌లో పాడాల్సి వచ్చింది... పాడాను. ఇలా... రకరకాలుగా పాడే అవకాశాలొచ్చాయి. అది నా అదృష్టమే కదా!
క్లాసికల్ నేర్చుకున్నారా?
మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్‌కు వచ్చేంత వరకూ కొచ్చర్లకోట పద్మావతిగారి వద్ద క్లాసికల్ నేర్చుకున్నాను. తర్వాత రామాచారిగారి దగ్గర కొన్నాళ్లు. ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడే నాకు సంగీతంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా వచ్చింది. నన్ను గాయనిగా సినిమాకు పరిచయం చేసింది రామాచారిగారే. ఆయన ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో ఓ పాటను నాతో పాడించారు. అదే టైమ్‌లో కీరవాణిగారికి పరిచయం చేశారు. అలా ‘ఖతర్నాక్’లో పాడే అవకాశం వచ్చింది.
మీకు బాగా పేరు తెచ్చిన పాటలు?
‘వీడొక్కడే’లో ‘అబ్బో వీడేంటో...’ పాట నాకు తొలి బ్రేక్. ఇక ‘చిరుత’లోని ‘చమ్కా చమ్కా చమ్కీరే...’ పాట అయితే నాకు ఎక్కడలేని గుర్తింపు తెచ్చింది. ‘నచ్చావులే’ టైటిల్‌సాంగ్ పాడినందుకు నాకు అవార్డు వచ్చింది. ‘గోలీమార్’లోని ‘మగాళ్లు వట్టి మాయగాళ్లు’, ‘మిర్చి’లోని ‘డార్లింగే... ఓసి నా డార్లింగే’, ‘ఇద్దరమ్మాయిలతో’లో ‘టాపు లేచిపోద్ది’... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు కదా! ‘నంబర్‌వన్’ స్థానంపై మీ అభిప్రాయం?
వేరే రంగాల గురించి నాకు తెలీదు. నా రంగం విషయానికొస్తే... ఇక్కడ అందరం నంబర్‌వన్‌లమే. ఎవరి అవకాశాలు వాళ్లకున్నాయి. నేను ఎక్కువ సినిమాలకు పాడుతున్నానంతే! అది నా అదృష్టం!
మీ తోటి సింగర్స్‌లో ఎవరు బెస్ట్ అంటే ఏం చెబుతారు?
ఎవరి ప్రత్యేకతలు వారికున్నాయండీ. సునీతగారు, ఉషగారు, కౌసల్యగారు, మాళవిక, శ్రావణభార్గవి, రీసెంట్‌గా పాడుతున్న సాహితి, లిప్సిక, రమ్య... ఇలా అందరూ బాగానే పాడుతున్నారు.
సంగీత దర్శకత్వం చేసే ఉద్దేశం ఏమైనా ఉందా?
అంత టాలెంట్ నాలో లేదు. అది మోర్ క్రియేటివ్ జాబ్. పాటలను ఎంజాయ్ చేయడం మాత్రమే నాకు తెలుసు! దట్సాల్!
- బుర్రా నరసింహ