సిక్స్‌టీస్ సింగారం
ఇంతకాలం కాంట్రాస్ట్ కలర్స్ (భిన్నమైన రంగులు) ఇంపుగా అనిపించేవి. దీంతో ఇవే మన దక్షిణ భారతీయ ఫ్యాషన్లలో హల్‌చల్ చేశాయి. ఇప్పుడిక చాలా క్లోజ్డ్ కలర్స్(దగ్గరగా ఉండేవి) అంటే ఉదాహరణకు ఎరుపులో మరికొన్ని షేడ్స్‌ను తీసుకోవచ్చు. ఎరుపు, నారింజ, ముదురు ఎరుపు.. ఇలా తీసుకుంటూ వాటికి బంగారు జరీ పెద్ద అంచులను జత చేర్చి దుస్తులను డిజైన్ చేయడం వల్ల ఒక క్లాసిక్ లుక్ వస్తుంది. ఇక్కడ ఫొటోలలో ఉన్న లెహంగాలు, బ్లౌజ్‌లు.. రాజా రవివర్మ పెయింటింగ్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని డిజైన్ చేసినవి. పట్టు ఫ్యాబ్రిక్ ఎప్పుడూ తన హుందాతనాన్ని, ప్రాభవాన్నీ కోల్పోదు. తరతరాల సంప్రదాయ కట్టుగా ఈ డిజైన్స్‌ని ముందుతరానికీ పరిచయం చేయవచ్చు.
సెల్ఫ్ ఎంబ్రాయిడరీ
పట్టు చీరలపైన అదే రంగుతో పెద్ద పెద్ద మోటిఫ్స్ సెల్ఫ్ (బూటా) ఎంబ్రాయిడరీ ఈ తరహా లుక్‌కి బాగా నప్పుతాయి. ఏ రంగు ఫాబ్రిక్ తీసుకున్నా దానికి పెద్ద పెద్ద జరీ అంచులను జతగా చేస్తే రిచ్ లుక్ వస్తుంది.
పూలకు బదులుగా ముత్యాలు
జుట్టు స్ట్రెయిటనింగ్ చేయించుకొని వదిలేయడం ఇన్నాళ్లూ ఓ స్టైల్‌గా నడిచింది. 1960-1970ల కాలంలో వాణిశ్రీ, సావిత్రి, జయలలితల కొప్పులు చాలా ప్రాచుర్యం పొందాయి. అలాంటి హెయిర్ స్టైల్‌నే ఇప్పుడూ అనుకరిస్తున్నారు. అలాగే పొడవాటి జడలు, ఫిష్ కట్ హెయిర్ స్టైల్ ఆకర్షణీయంగా మారుతున్నాయి. అయితే జడలు, కొప్పులలో పువ్వులు కాకుండా ముత్యాల దండ అమర్చడంతో చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
చేతికి కడియం, మట్టిగాజులు
ఉండీ లేనట్టుగా చిన్న బొట్టు, అస్సలు లేకపోవడం వంటివి ఇన్నాళ్లూ చూశాం. ఇప్పుడు నుదుటన పెద్ద బొట్టు, చెవులకు పెద్ద పెద్ద బంగారు బుట్టలు; మెడలో పొడవాటి హారాలు కాకుండా మెడను పట్టి ఉంచే అచ్చమైన బంగారు నెక్లెస్ ... ఈ తరహా దుస్తుల మీదకు బాగా నప్పుతాయి. ఇన్నాళ్లూ మల్టీకలర్‌లో ఉండే గాజులు, చమక్కుమనిపించే రాళ్ల గాజులు వేసుకునేవారు. ఇప్పుడు ప్లెయిన్‌గా ఉండే మట్టిగాజులు, చేతికి (భుజానికి కిందుగా) నాజూకుగా అనిపించే పట్టీ కాకండా యాంటిక్ లుక్‌తో ఉండే కడియాన్ని అమర్చుకుంటే రవివర్మ తీర్చిదిద్దిన అందమైన చిత్రరాజంగా మీరే వేడుకలో హైలైట్‌గా నిలుస్తారు.
- భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్