‘కొత్త డ్రెస్ వేసుకుంటే ఆ రోజంతా హుషారుగా అనిపిస్తుంటుంది. అందుకే ఉదయం లేస్తూనే ఆ రోజు వేసుకోదగిన డ్రెస్ గురించి ప్లానింగ్ చేసుకుంటాను’ అంటోంది రచయిత్రి, సాంగ్ రైటర్ కడలి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి సాహిత్యం, సినిమాల్లో కృషి చేస్తున్న కడలి పాఠకులకు పరిచితమే. ‘రైటర్ అంటే కాటన్స్ మాత్రమే వేసుకోవాలనేం ఉండదు. కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులు ఏవైనా వేసుకోవచ్చు. అందుకే నా వార్డ్రోబ్‌లో అన్నీ మోడ్రన్, కలర్‌ఫుల్ డ్రెస్సులు ఉంటాయి’ అంటోంది కడలి.
‘‘మన వార్డ్రోబ్ మనకు ఒక అద్దం లాంటిది. ఈ విషయం చెప్పడానికి నేను రాసిన ఒక కథను పరిచయం చేయాలి. ఆ కథలో ఒక యంగ్ అమ్మాయి హీరోయిన్ అవ్వాలనుకుంటుంది. కానీ చుట్టూ రకరకాల మాటలతో డిప్రెస్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. రైలు పట్టాల దగ్గరకు వెళ్లి అక్కడ జరిగిన ఒక సంఘటనతో ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అద్దంలో తన ముఖం చూసుకొని అందంగా తయారవ్వాలనుకుని కళ్లకు కాటుక పెట్టుకుంటుంది. తర్వాత జీవితంపై ఆశతో స్వీయప్రేరణతో తనను మెరుగు చేసుకుంటుంది ఆ కథలో. అంటే మనం ఎలా ఉండాలో మన చుట్టూ ఉన్నవారు డిసైడ్ చేయరు. మనకు మనమే నిర్ణయించుకోవాలి.
నాకు నేను ప్రేరణగా!
నేను షార్ట్స్ కూడా వేసుకుంటాను. బట్టలను బట్టి ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఎలా జడ్జ్ చేస్తారో ఇప్పటికీ అర్ధం కాదు. అందుకే కొన్ని సభలకు టీ షర్ట్స్, జీన్స్ వేసుకెళతాను. ఈ అమ్మాయా రైటర్ రా?! అని ఆశ్చర్యపోయేవారున్నారు. ఏది సౌకర్యంగా ఉంటుందో అది వేసుకున్నంత మాత్రాన వ్యక్తిత్వానికి మార్కులు వేయకూడదు. ఎవరైనా అలా అన్నా నేను పట్టించుకోను. మీటింగ్ సందర్భాలలో కుర్తీస్ వేసుకుంటాను. రెడీ అవ్వాలి అనిపిస్తే మాత్రం ఏ మాత్రం రాజీ పడను.
కాన్ఫిడెంట్‌గా ఉండాలి..
నా మనసుకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను కాబట్టి కాన్ఫిడెంట్‌గా కూడా ఉంటాను. నా స్నేహితుల జాబితాలో ఫ్యాషన్ డిజైనర్లు ఉన్నారు. వారి డిజైన్స్ నాతో ట్రై చేస్తుంటారు. వాటిలో నచ్చినవి తీసుకుంటాను.
అమ్మ చీరలను కొత్తగా!
అమ్మ కట్టుకునే చీరలు చూసి నాకూ అలా చీరలు కట్టుకోవాలనిపిస్తుంది. మా అమ్మకు మూడు బీరువాల చీరలున్నాయి. రెగ్యులర్ చీరలు తప్ప వాటిని కట్టుకోదు. దీంతో అమ్మ చీరలను నేను కట్టుకుంటుంటాను. ‘అంచు చీరలు నీవేం కట్టుకుంటావు, పెద్దదానిలా’ అంటుంది. కానీ, బ్లౌజ్ డిజైన్‌తో స్టైలిష్ లుక్ తీసుకువస్తాను. దీంతో అమ్మ కూడా ఆశ్చర్యపోతూ ‘చాలా బాగుంది’ అని కితాబు ఇచ్చేస్తుంది. పండగలు, కుటుంబ ఫంక్షన్లు, వేడుకలకు సందర్భానికి తగినట్టు లంగాఓణీలు, పట్టుచీరలు అన్నీ ప్రయత్నిస్తాను.
భిన్నంగా ఉండాలని..
రచయిత్రి అనగానే ముతక చీరలు, కళ్లద్దాలు ఉండాలని చాలా మంది అనుకునేవారు. కానీ, నా వార్డ్రోబ్ మాత్రం వాటన్నింటికన్నా భిన్నం. రచయిత్రులు అంటే ఇలాగే ఉండాలి అనే ఆలోచనల్లోనుంచి ఒక మార్పు తీసుకురావాలని బుక్ లాంచింగ్ వంటి కార్యక్రమాలకు జీన్స్, టాప్స్ ట్రై చేస్తుంటాను. ప్రతీ రోజూ కొత్తగా ఉండాలనుకుంటాను. ఏ డ్రెస్ వేసుకొని రెడీ అవుతామో ఆ రోజు ఆ డ్రెస్ ప్రభావం మన మీద ఉంటుంది.
ఫ్యాషన్ షోలు..
దేశ, విదేశాల్లోనూ ఫ్యాషన్ షోలు నడుస్తుంటాయి. వాటిలో ప్రసిద్ధ డిజైనర్లు సీజన్‌ని బట్టి కలర్, డిజైన్ థీమ్‌ని పరిచయం చేస్తుంటారు. వాటి కోసం ఆన్‌లైన్ సెర్చింగ్‌తో పాటు, ఫ్యాషన్ మ్యాగజీన్స్ కూడా చూస్తుంటాను. ఆ కలర్ డ్రెస్ కాంబినేషన్స్ నేనూ ప్రయత్నిస్తుంటాను. ఎక్కువగా మాత్రం బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఇష్టపడతాను. ఆ కాంబినేషన్ డ్రెస్సులు కూడా చాలానే ఉన్నాయి నా దగ్గర’’ అంటూ వార్డ్‌రోబ్ విశేషాలను షేర్ చేసుకుంది. – నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment