nirmalareddy
-
Kadali: మై వార్డ్రోబ్.. కలర్ఫుల్గా.. కడలి అలలా!
‘కొత్త డ్రెస్ వేసుకుంటే ఆ రోజంతా హుషారుగా అనిపిస్తుంటుంది. అందుకే ఉదయం లేస్తూనే ఆ రోజు వేసుకోదగిన డ్రెస్ గురించి ప్లానింగ్ చేసుకుంటాను’ అంటోంది రచయిత్రి, సాంగ్ రైటర్ కడలి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి సాహిత్యం, సినిమాల్లో కృషి చేస్తున్న కడలి పాఠకులకు పరిచితమే. ‘రైటర్ అంటే కాటన్స్ మాత్రమే వేసుకోవాలనేం ఉండదు. కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులు ఏవైనా వేసుకోవచ్చు. అందుకే నా వార్డ్‌రోబ్‌లో అన్నీ మోడ్రన్, కలర్‌ఫుల్ డ్రెస్సులు ఉంటాయి’ అంటోంది కడలి.‘‘మన వార్డ్రోబ్ మనకు ఒక అద్దం లాంటిది. ఈ విషయం చెప్పడానికి నేను రాసిన ఒక కథను పరిచయం చేయాలి. ఆ కథలో ఒక యంగ్ అమ్మాయి హీరోయిన్ అవ్వాలనుకుంటుంది. కానీ చుట్టూ రకరకాల మాటలతో డిప్రెస్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. రైలు పట్టాల దగ్గరకు వెళ్లి అక్కడ జరిగిన ఒక సంఘటనతో ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అద్దంలో తన ముఖం చూసుకొని అందంగా తయారవ్వాలనుకుని కళ్లకు కాటుక పెట్టుకుంటుంది. తర్వాత జీవితంపై ఆశతో స్వీయప్రేరణతో తనను మెరుగు చేసుకుంటుంది ఆ కథలో. అంటే మనం ఎలా ఉండాలో మన చుట్టూ ఉన్నవారు డిసైడ్ చేయరు. మనకు మనమే నిర్ణయించుకోవాలి.నాకు నేను ప్రేరణగా!నేను షార్ట్స్ కూడా వేసుకుంటాను. బట్టలను బట్టి ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఎలా జడ్జ్ చేస్తారో ఇప్పటికీ అర్ధం కాదు. అందుకే కొన్ని సభలకు టీ షర్ట్స్, జీన్స్ వేసుకెళతాను. ఈ అమ్మాయా రైటర్ రా?! అని ఆశ్చర్యపోయేవారున్నారు. ఏది సౌకర్యంగా ఉంటుందో అది వేసుకున్నంత మాత్రాన వ్యక్తిత్వానికి మార్కులు వేయకూడదు. ఎవరైనా అలా అన్నా నేను పట్టించుకోను. మీటింగ్ సందర్భాలలో కుర్తీస్ వేసుకుంటాను. రెడీ అవ్వాలి అనిపిస్తే మాత్రం ఏ మాత్రం రాజీ పడను. కాన్ఫిడెంట్‌గా ఉండాలి..నా మనసుకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను కాబట్టి కాన్ఫిడెంట్‌గా కూడా ఉంటాను. నా స్నేహితుల జాబితాలో ఫ్యాషన్ డిజైనర్లు ఉన్నారు. వారి డిజైన్స్ నాతో ట్రై చేస్తుంటారు. వాటిలో నచ్చినవి తీసుకుంటాను.అమ్మ చీరలను కొత్తగా!అమ్మ కట్టుకునే చీరలు చూసి నాకూ అలా చీరలు కట్టుకోవాలనిపిస్తుంది. మా అమ్మకు మూడు బీరువాల చీరలున్నాయి. రెగ్యులర్ చీరలు తప్ప వాటిని కట్టుకోదు. దీంతో అమ్మ చీరలను నేను కట్టుకుంటుంటాను. ‘అంచు చీరలు నీవేం కట్టుకుంటావు, పెద్దదానిలా’ అంటుంది. కానీ, బ్లౌజ్ డిజైన్‌తో స్టైలిష్ లుక్ తీసుకువస్తాను. దీంతో అమ్మ కూడా ఆశ్చర్యపోతూ ‘చాలా బాగుంది’ అని కితాబు ఇచ్చేస్తుంది. పండగలు, కుటుంబ ఫంక్షన్లు, వేడుకలకు సందర్భానికి తగినట్టు లంగాఓణీలు, పట్టుచీరలు అన్నీ ప్రయత్నిస్తాను.భిన్నంగా ఉండాలని..రచయిత్రి అనగానే ముతక చీరలు, కళ్లద్దాలు ఉండాలని చాలా మంది అనుకునేవారు. కానీ, నా వార్డ్రోబ్ మాత్రం వాటన్నింటికన్నా భిన్నం. రచయిత్రులు అంటే ఇలాగే ఉండాలి అనే ఆలోచనల్లోనుంచి ఒక మార్పు తీసుకురావాలని బుక్ లాంచింగ్ వంటి కార్యక్రమాలకు జీన్స్, టాప్స్ ట్రై చేస్తుంటాను. ప్రతీ రోజూ కొత్తగా ఉండాలనుకుంటాను. ఏ డ్రెస్ వేసుకొని రెడీ అవుతామో ఆ రోజు ఆ డ్రెస్ ప్రభావం మన మీద ఉంటుంది.ఫ్యాషన్ షోలు..దేశ, విదేశాల్లోనూ ఫ్యాషన్ షోలు నడుస్తుంటాయి. వాటిలో ప్రసిద్ధ డిజైనర్లు సీజన్‌ని బట్టి కలర్, డిజైన్ థీమ్‌ని పరిచయం చేస్తుంటారు. వాటి కోసం ఆన్లైన్ సెర్చింగ్‌తో పాటు, ఫ్యాషన్ మ్యాగజీన్స్ కూడా చూస్తుంటాను. ఆ కలర్ డ్రెస్ కాంబినేషన్స్ నేనూ ప్రయత్నిస్తుంటాను. ఎక్కువగా మాత్రం బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఇష్టపడతాను. ఆ కాంబినేషన్ డ్రెస్సులు కూడా చాలానే ఉన్నాయి నా దగ్గర’’ అంటూ వార్డ్రోబ్ విశేషాలను షేర్ చేసుకుంది. – నిర్మలారెడ్డి -
చేనేత ఫ్యాషన్‌లో విజేత!
ఫ్యాషన్ ప్రపంచంలో అత్యుత్తమ వేదికలైన న్యూయార్క్, ప్యారిస్, లండన్, వాంకోవర్ నగరాల్లో నిర్వహించే అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ వీక్‌లో డిజైన్లను ప్రదర్శించే అవకాశం రావడం డిజైనర్ల స్వప్నం. చిన్న వయసులోనే ఆ విశ్వ వేదికలపై అనేకమార్లు తను ప్రేమించిన చేనేత అద్భుతాలను ప్రదర్శిస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్ కుమార్ రామస్వామి. హైదరాబాద్‌కు చెందిన ఈ సృజనశీలి. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే మన చేనేతలతో సంప్రదాయ దుస్తులను రూపుకట్టడంలో మేటిగా నిలుస్తున్నారు. నగరంలో ఆలయం పేరుతో సొసైటీ ఏర్పాటు చేసి కంచి, బెనారస్, మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, నారాయణపేట.. మొదలైన చేనేతకారులకు ఒక వేదికను ఏర్పాటు చేశారు. శ్రవణ్ కుమార్ ఆవిష్కరించిన సరికొత్త అందాలు ఇటీవలే వాంకోవర్ ఫ్యాషన్ వీక్‌లో సందడి చేశాయి. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో కనువిందు చేయబోతున్నాయి. ఈ సందర్భంగా శ్రవణ్‌కుమార్ తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 18 వరకు (కెనడా) వాంకోవర్ ఫ్యాషన్ వీక్ జరిగింది. అందులో నేను రూపొందించిన ప్రత్యేక దుస్తుల ప్రదర్శన జరిగింది. ఎంతో మంది మన్ననలు పొందాయి. రాజా రవివర్మ పెయింటింగ్స్ నుంచి స్ఫూర్తి పొంది ఆ దుస్తులను డిజైన్ చేశాను. వీనుల విందైన సంగీతం మదిని ఎంత రంజింపజేస్తుందో, చూపరులకు అంతగా నా డిజైన్లు కనువిందు చేయాలన్నదే నా ప్రయత్నం. చేనేతకే పెద్ద పీట.. హాలీవుడ్ ప్రపంచానికి రాజధాని అయిన లాస్ ఎంజిల్స్‌లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ జరగనుంది. అందులో మన నారాయణ పేట అందాలు, గుజరాత్‌కి చెందిన్ అబ్రక్ చేనేత వస్త్రాలను కూడా ఈ షో లో ప్రదర్శించబోతున్నాను. నారాయణపేట అందాలు ఇప్పటికే లండన్, దుబాయ్ ఫ్యాషన్ వీక్‌లలో ప్రదర్శించడంతో అంతర్జాతీయంగా ఈ చేనేతకు మంచి పేరు వచ్చింది. ట్రెండ్‌ను ఫాలో అయ్యే ఫ్యాషన్ ప్రపంచం చేనేత వస్త్రాలను ఎప్పటికీ ముందువరసలో నిలుపుతుంది. చేనేతకారుల చేతుల్లో ఊపిరిపోసుకున్న ఖాదీ, పోచంపల్లి, గద్వాల్, కలంకారి, బెనారస్... వంటి ఫ్యాబ్రిక్స్ అంటే నాకు ప్రాణం. చేనేతకారులను సంప్రదించి నాకు నచ్చిన విధంగా డిజైన్లు చెప్పి మరీ వస్త్రాలను నే యిస్తాను. ఇందుకు దేశంలోని చేనేతకారులను చాలామందిని సంప్రదించాను. నేను డిజైన్ చేయించే ప్రతి చీరకూ చేనేతకారుడు ఆర్గానిక్ ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకుంటాను. సంప్రదాయ దుస్తులదే హవా! చేనేతలతో సంప్రదాయ దుస్తులను తయారు చే యడం నా ప్రత్యేకత అని చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడతాను. భారతీయతను చాటే లంగా ఓణీలు, షేర్యానీ, ధోతి, బ్లౌజ్‌లు, చీరలు.. ఇలా సంప్రదాయ తరహా దుస్తుల డిజైన్లు ఎంత మందిలో ఉన్నా చూపు తిప్పుకునేలా చేస్తాయి. చలికి.. ఇవి బెస్ట్... ♦ కాలానుగుణంగా దుస్తుల ఎంపిక ఉండాలంటున్న ఈ డిజైనర్ సూచనలు... ♦ చలికి సిల్క్ దుస్తులు బాగుంటాయి. వీటిలో ముఖ్యంగా బెనారస్ అందాన్ని, చలిని తట్టుకునే వెచ్చదనాన్నీ ఇస్తుంది. ♦ హై నెక్, ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్‌లు, ఎక్కువ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన దుస్తులు మేలు. ♦ ఎరుపు, మెరూన్, గోల్డ్, రాయల్ బ్లూ, పర్పుల్, ఆరెంజ్...ఇలా చలికాలానికి మంచి రంగు దుస్తులు ఆకర్షణీయంగా ఉంటాయి. ♦ మన దేశీయ చర్మతత్త్వాలకు అన్ని రంగులు సూటవుతాయి. ♦ దుస్తులు మిమ్మల్ని ధరించవు. మీరే దుస్తులను ధరించాలి. అవి సౌకర్యవంతంగా, చూడచక్కగా ఉండాలి. తారల ‘కళ’నేత... సినీ తారలు, రాజకీయ ప్రముఖులు దాదాపు అందరికీ నా డిజైన్స్ సుపరిచితమే! సినీ తారలలో నయనతార, తాప్సీ, ప్రణీత, శ్రేయ శరణ్, సమంత, దీక్షాసేథ్, సిమ్రాన్ కౌర్, అమలాపాల్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీ ఆర్... ఇలా చాలా మందికి దుస్తులు డిజైన్ చేశాను. అలాగే మురారీ, గ్రీకువీరుడు... వంటి తెలుగుదనం ఉట్టిపడే ఎన్నో సినిమాలకు డ్రెస్ డిజైనర్‌గా ఉన్నాను. సంతోషకరమైన పనిలోనే వృద్ధి... ‘నచ్చిన పనే ఎంచుకో! అందులోనే సంతోషం ఉంటుంది. ఆనందంగా చేసే పనిలోనే వృద్ధి ఉంటుంది’అని మా అమ్మ పార్వతీదేవి ఎప్పుడూ అంటుంటారు. దుస్తుల డిజైన్లు సృష్టించడం నాకు అమితంగా నచ్చిన విషయం. అందుకే ఈ రంగంలో ఎప్పుడూ కష్టమనిపించలేదు. ఒడిదొడుకులూ ఎదురుకాలేదు. మా పూర్వీకులు కర్నాటక వాసులైనా నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! నాన్న రామస్వామి. మేం ఆరుగురు అన్నదమ్ములు, ఇద్దరు చెల్లెళ్లు. మా పెద్ద చెల్లెలు జ్యోతి కూడా 15 ఏళ్ల వయసులో నాతో పాటు ఈ రంగంలో అడుగుపెట్టింది. దాదాపు 20 ఏళ్లుగా ఇద్దరం ఈ రంగంలోనే ఉన్నాం. హైదరాబాద్‌లో అత్యంత చిన్నవయసు డిజైనర్లుగా పేరు తెచ్చుకున్నాం. ఎప్పుడూ కోరుకునేది... చేనేతకు పూర్వవైభవం తేవాలన్నదే నా ఆశయం. ‘శ్రవణ్‌కుమార్ అంటే అంకితభావంతో పనిచేస్తాడు. చెప్పిన సమయానికి దుస్తులు అందంగా రూపొందించి ఇస్తాడు. ఎంతో సౌకర్యంగా ఉంటాయి. మరెంతో రిచ్ లుక్‌తో ఉంటాయి’ అని వినియోగదారుల మనసుల్లో నిలిచిపోతే చాలు. జీవితాంతం నేను కోరుకునేవి ఇవే!’’ - నిర్మలారెడ్డి -
పండగవేళ.. పల్లె కళ..
నేటి ఆధునిక ఫ్యాషన్లు చిన్నాపెద్దను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అయితే, పరుగులు పెట్టే మోడ్రన్ ఏజ్‌లోనూ ఒక్కసారి ఆగి,ప్రకృతి సింగారాలను ఒళ్లంతా నింపుకొంటే... పల్లె సిరులను నట్టింటికి తెచ్చుకొంటే... ఆ అందం, ఆనందం ఇబ్బడి ముబ్బడి అవుతాయి. విఘ్నాధిపతి వినాయకుని మట్టితో మూర్తిగా మలిచి, అందంగా అలంకరించి శ్రద్ధగా పూజలు జరుపుతాం.అలాగే పడతుల అలంకరణలోనూ ప్రకృతి సిరులకు స్థానం ఇస్తే పండగ పూట కళగా వెలిగిపోతారు. చేనేత..కళనేత.. మంగళగిరి ప్రింటెడ్ కాటన్ మెటీరియల్‌తో పరికిణీని తీర్చిదిద్ది, ప్లెయిన్ షిఫాన్ ఓణీకి రాసిల్క్ బార్డర్ జత చేసి, డిజైనర్ బ్లౌజ్‌లు ధరిస్తే పల్లెకళతో వెలిగిపోతారు. వీటి మీదకు టైటా ఆభరణాలు, పొడవాటి కురులను అల్లిన జడలు ప్రత్యేక ఆకర్షణను తీసుకువస్తాయి. పోచంపల్లి, గద్వాల్, కలంకారీ, ఇక్కత్.. ఇలా మన చేనేత ఫ్యాబ్రిక్స్‌తో తయారుచేసుకున్న దుస్తులు ఎప్పటికీ కొత్తదనంతో ఆకట్టుకుంటూనే ఉంటాయి. - భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్ ప్రాచీన కళ.. టైటా... ఏ లోహపు ఆభరణాలకూ తీసిపోని విధంగా ప్రత్యేకతను చాటుతున్న ఈ ఆభరణాలను ఆధునిక యువతులు అమితంగా ఇష్టపడుతున్నారు. నదీ తీరంలో కొట్టుకువచ్చిన ఒండ్రుమట్టిని సేకరించి, పొడిచేసి, ఉడికించి, తగిన అచ్చులలో పోసి ఈ ఆభరణాలను తయారుచేస్తాను. వీటిని వెలిసిపోని రంగుల తో తీర్చిదిద్దుతాను. సంప్రదాయ, ఆధునిక దుస్తుల మీదకు అందంగా నప్పే ఈ ఆభరణాలలో యాంటిక్ గోల్డ్ జుంకాలు, హారాలు ప్రాచీనకళతో ఉట్టిపడుతుంటాయి. వీటి ధరలు రూ.350 నుంచి 5వేల రూపాయల వరకు ఉన్నాయి. ధరించే దుస్తుల రంగులను బట్టి ఆభరణాలను తయారు చేయవచ్చు. - అరుణా దీపక్, టైటా ఆభరణాల నిపుణురాలు యాంటిక్ లుక్‌తో కనువిందుచేసే ఈ ఆభరణాలు కంచి, ధర్మవరం, ఉప్పాడ.. పట్టు చీరలకు సరైన ఎంపిక. - నిర్వహణ: నిర్మలారెడ్డి -
వేడుకలో... వెలుగు
వేడుక ఏదైనా నలుగురిలో ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు అతివలు.అందుకే డిజైనర్ దుస్తులు, అలంకరణ వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.కొనుగోలులో ఒకటికి పదిసార్లు సరిచూసుకుంటారు. తెలిసినవారిని సలహాలు అడుగుతుంటారు. అన్నీ సరిగ్గా ఉన్నా సరైన మేకప్ లేకపోతే వేడుకలో కళావిహీనంగా కనిపిస్తారు. అయితే ‘వేసవిలో మేకప్ చాలా కష్టం, ఎక్కువసేపు భరించలేం’ అనుకునేవారు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ముస్తాబైతే ఏ వేడుకలోనైనా వెలిగిపోవచ్చు. మేకప్‌కి ముందుగా: ఒక పాత్రలో మూడు టీ స్పూన్ల పాలు తీసుకొని, వేళ్లతో అద్దుకుంటూ ముఖంపై మృదువుగా మసాజ్ చేయాలి. జిడ్డు చర్మం గలవారు పాలలో సెనగపిండి కలిపి మసాజ్ చేయాలి. ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకొని, మెత్తటి వస్త్రంతో తుడుచుకోవాలి. పొడిచర్మం గలవారు క్లెన్సింగ్ మిల్క్‌తో మసాజ్ చేసుకొని, శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మలినాలు తొలగిపోతాయి. నాణ్యమైన మేకప్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. మేకప్ ఇలా... ప్రైమర్: దీంట్లో ఫేస్, ఐ ప్రైమర్ విడివిడిగా ఉంటుంది. వీటిని ముఖానికి, కళ్ల కింద రాసుకోవాలి. ఫౌండేషన్: ఎస్.పి.ఎఫ్ లేని ఫౌండేషన్‌ను బ్రష్‌తో వేసుకోవాలి (వేసవి కదా అని ఎస్.పి.ఎఫ్ మేకప్‌కి ముందుగా వాడితే మేకప్ తెల్లటి ప్యాచ్‌లుగా కనిపిస్తుంది. ఫొటో ఫ్లాష్‌కి ముఖం మరింత తెల్లగా అనిపించడమే కాకుండా, ఫొటోలలో కూడా మేకప్ ప్యాచ్‌లుగా పడే అవకాశం ఉంది). కన్సీలర్: దీనిని కంటి కింది భాగంలో ఐ బ్రష్‌తో వేయాలి. కన్సీలర్కి ముందుగా ఎస్.పి.ఎఫ్ లోషన్ వాడకూడదు. బ్లష్: ఫౌండేషన్ ముఖమంతా సరిగ్గా బ్రష్‌తో వేశాక.. చెంపలు గులాబీల్లా మెరిసిపోవడానికి బ్లష్‌ను ఉపయోగించాలి. అలాగని బ్లష్ మరీ ఎక్కువగా ఉపయోగిస్తే ఎబ్బెట్టుగా కనిపిస్తారు. బ్రోంజర్: ఫొటోలలో మంచి లుక్‌తో ముఖారవిందం కనిపించాలంటే చీక్ బోన్స్ దగ్గర అంటే బుగ్గల పైభాగంలో, చుట్టూ ‘మ్యాట్ బ్రోంజర్’ వాడాలి. దీనివల్ల మేకప్ పగలు కూడా సహజమైన చర్మకాంతిలో కనిపిస్తుంది. ఇల్యుమినేటర్: చీక్ బోన్స్, ముక్కు, కళ్ల కింద, నుదురు, కణతలు... ఇలా ముఖంలో హైలైట్‌గా కనిపించే భాగాలపై లిక్విడ్ ఇల్యుమినేటర్ బ్రష్‌తో చేసుకోవాలి. కనుబొమలు: ఐ బ్రో పెన్సిల్ లేదా జెల్‌తో కనుబొమలను తీరుగా తీర్చిదిద్దుకోవాలి. ఐ షాడో: కనురెప్పల పైన లేత రంగులను షాడో బ్రష్‌తో తీర్చిదిద్దాలి. కనురెప్పలను ఒంపుగా వచ్చేలా ఐ లైనర్, మస్కారాలను ఉపయోగించాలి. పౌడర్: మేకప్ పూర్తయ్యాక టచప్ కోసం పౌడర్ని అద్దాలి. పెదవులు: లిప్ స్టెయిన్, లిప్ లైనర్, లిప్‌స్టిక్‌లతో పెదవులను అలంకరించాలి. చెక్: మేకప్ అంతా సరిగ్గా వచ్చిందా లేదా అని అద్దంలో చూసుకుంటూ, అదనంగా ఉన్న పౌడర్, ఫౌండేషన్‌ని బ్రష్‌తో తీసేయాలి. కళ్లు, పెదవుల మేకప్ తీరుగా ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి. ఇలా వేసుకున్న మేకప్ 2 నుంచి 5 గంటల సేపు ఉంటుంది. మేకప్ కొన్ని గంటల పాటు డల్ కాకుండా ముఖం తాజాగా ఉండాలంటే మ్యాక్ స్ప్రే ఉపయోగించాలి.మేకప్ పూర్తయ్యాక ఆభరణాలను, కేశాలను, దుస్తులను నచ్చిన రీతిలో అలంకరించుకోవాలి. ఈ తరహా మేకప్ పెళ్లికూతురితో పాటు పెళ్లికి వెళ్లే అతివలకూ ఉపయోగ కరంగా ఉంటుంది. నోట్: గాడీ మేకప్ వల్ల వేసవి ఉక్కపోతలో చీకాకు కలగవచ్చు. అందుకని లైట్ మేకప్‌కు ప్రాముఖ్యత ఇవ్వాలి. సన్‌స్క్రీన్ లోషన్ వాడేవారు... మేకప్ చేసుకునే ముందు అంటే గంట ముందు సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. సన్‌స్క్రీన్ వాడాలనుకునేవారు ఫౌండేషన్ క్రీమ్‌తో కలిపి 3-4 చుక్కలు మాత్రమే లోషన్‌ను ఉపయోగించాలి. జిడ్డు చర్మం గలవారు మేకప్‌కి ముందు రెండు చుక్కల సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవచ్చు. వెంట తప్పనిసరి... మేకప్ చేసుకొని బయటకు వెళ్లేవారు ఫౌండేషన్‌ని కూడా వెంట తీసుకెళ్లడం మంచిది. వెళ్లిన చోట అవసరమైనప్పుడు కొద్దిగా టచప్ చేసుకోవచ్చు. ముఖంపై చమట, జిడ్డు చేరినప్పుడు క్లాత్‌ను ఉపయోగించకుండా టిష్యూ పేపర్‌తో అద్ది, తీసేయాలి. తరచూ మేకప్ వేసుకునేవారు... పెరుగు, సెనగపిండి కలిపి ముఖానికి మసాజ్ చేసుకొని, శుభ్రపరుచుకొని తర్వాత ఫ్రూట్ లేదా ముల్తానీ మిట్టితో ప్యాక్ వేసుకోవాలి. కలబంద (అలోవెరా) రసాన్ని ముఖానికి రాసి, మసాజ్ చేసి, శుభ్రపరుచుకొని, గుడ్డులోని తెల్లసొనతో ప్యాక్ వేసుకోవాలి. మేకప్ వల్ల వచ్చే చర్మ సమస్యలు, మొటిమలు తగ్గుతాయి. పసుపు, పాలు లేదా పసుపు, పెరుగు కలిపి ఏదైనా ఒక ప్యాక్‌ని ముఖానికి వేసుకోవాలి. - నిర్వహణ: నిర్మలారెడ్డి