వేడుకలో... వెలుగు | makeup in celebrations | Sakshi
Sakshi News home page

వేడుకలో... వెలుగు

Published Wed, May 14 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM

వేడుకలో... వెలుగు

వేడుకలో... వెలుగు

వేడుక ఏదైనా నలుగురిలో ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు అతివలు.అందుకే డిజైనర్ దుస్తులు, అలంకరణ వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.కొనుగోలులో ఒకటికి పదిసార్లు సరిచూసుకుంటారు. తెలిసినవారిని సలహాలు అడుగుతుంటారు. అన్నీ సరిగ్గా ఉన్నా సరైన మేకప్ లేకపోతే వేడుకలో కళావిహీనంగా కనిపిస్తారు. అయితే ‘వేసవిలో మేకప్ చాలా కష్టం, ఎక్కువసేపు భరించలేం’ అనుకునేవారు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ముస్తాబైతే ఏ వేడుకలోనైనా వెలిగిపోవచ్చు.
 
మేకప్‌కి ముందుగా:
ఒక పాత్రలో మూడు టీ స్పూన్ల పాలు తీసుకొని, వేళ్లతో అద్దుకుంటూ ముఖంపై మృదువుగా మసాజ్ చేయాలి. జిడ్డు చర్మం గలవారు పాలలో సెనగపిండి కలిపి మసాజ్ చేయాలి. ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకొని, మెత్తటి వస్త్రంతో తుడుచుకోవాలి. పొడిచర్మం గలవారు క్లెన్సింగ్ మిల్క్‌తో మసాజ్ చేసుకొని, శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మలినాలు తొలగిపోతాయి. నాణ్యమైన మేకప్ ఉత్పత్తులను ఎంచుకోవాలి.
మేకప్ ఇలా...
ప్రైమర్: దీంట్లో ఫేస్, ఐ ప్రైమర్ విడివిడిగా ఉంటుంది. వీటిని ముఖానికి, కళ్ల కింద రాసుకోవాలి.
 ఫౌండేషన్: ఎస్.పి.ఎఫ్ లేని ఫౌండేషన్‌ను బ్రష్‌తో వేసుకోవాలి (వేసవి కదా అని ఎస్.పి.ఎఫ్ మేకప్‌కి ముందుగా వాడితే మేకప్ తెల్లటి ప్యాచ్‌లుగా కనిపిస్తుంది. ఫొటో ఫ్లాష్‌కి ముఖం మరింత తెల్లగా అనిపించడమే కాకుండా, ఫొటోలలో కూడా మేకప్ ప్యాచ్‌లుగా పడే అవకాశం ఉంది).

కన్సీలర్: దీనిని కంటి కింది భాగంలో ఐ బ్రష్‌తో వేయాలి. కన్సీలర్‌కి ముందుగా ఎస్.పి.ఎఫ్ లోషన్ వాడకూడదు.
 బ్లష్: ఫౌండేషన్ ముఖమంతా సరిగ్గా బ్రష్‌తో వేశాక.. చెంపలు గులాబీల్లా మెరిసిపోవడానికి బ్లష్‌ను ఉపయోగించాలి. అలాగని బ్లష్ మరీ ఎక్కువగా ఉపయోగిస్తే ఎబ్బెట్టుగా కనిపిస్తారు.

బ్రోంజర్: ఫొటోలలో మంచి లుక్‌తో ముఖారవిందం కనిపించాలంటే చీక్ బోన్స్ దగ్గర అంటే బుగ్గల పైభాగంలో, చుట్టూ ‘మ్యాట్ బ్రోంజర్’ వాడాలి. దీనివల్ల మేకప్ పగలు కూడా సహజమైన చర్మకాంతిలో కనిపిస్తుంది.
ఇల్యుమినేటర్: చీక్ బోన్స్, ముక్కు, కళ్ల కింద, నుదురు, కణతలు... ఇలా ముఖంలో హైలైట్‌గా కనిపించే భాగాలపై లిక్విడ్ ఇల్యుమినేటర్ బ్రష్‌తో చేసుకోవాలి.

కనుబొమలు: ఐ బ్రో పెన్సిల్ లేదా జెల్‌తో కనుబొమలను తీరుగా తీర్చిదిద్దుకోవాలి.
 ఐ షాడో: కనురెప్పల పైన లేత రంగులను షాడో బ్రష్‌తో తీర్చిదిద్దాలి. కనురెప్పలను ఒంపుగా వచ్చేలా ఐ లైనర్, మస్కారాలను ఉపయోగించాలి.
పౌడర్: మేకప్ పూర్తయ్యాక టచప్ కోసం పౌడర్‌ని అద్దాలి.
పెదవులు: లిప్ స్టెయిన్, లిప్ లైనర్, లిప్‌స్టిక్‌లతో పెదవులను అలంకరించాలి.  
చెక్: మేకప్ అంతా సరిగ్గా వచ్చిందా లేదా అని అద్దంలో చూసుకుంటూ, అదనంగా ఉన్న పౌడర్, ఫౌండేషన్‌ని బ్రష్‌తో తీసేయాలి. కళ్లు, పెదవుల మేకప్ తీరుగా ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి.

ఇలా వేసుకున్న మేకప్ 2 నుంచి 5 గంటల సేపు ఉంటుంది. మేకప్ కొన్ని గంటల పాటు డల్ కాకుండా ముఖం తాజాగా ఉండాలంటే మ్యాక్ స్ప్రే ఉపయోగించాలి.మేకప్ పూర్తయ్యాక ఆభరణాలను, కేశాలను, దుస్తులను నచ్చిన రీతిలో అలంకరించుకోవాలి. ఈ తరహా మేకప్ పెళ్లికూతురితో పాటు పెళ్లికి వెళ్లే అతివలకూ ఉపయోగ కరంగా ఉంటుంది.
నోట్: గాడీ మేకప్ వల్ల వేసవి ఉక్కపోతలో చీకాకు కలగవచ్చు. అందుకని లైట్ మేకప్‌కు ప్రాముఖ్యత ఇవ్వాలి.

సన్‌స్క్రీన్ లోషన్ వాడేవారు...
మేకప్ చేసుకునే ముందు అంటే గంట ముందు సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. సన్‌స్క్రీన్ వాడాలనుకునేవారు ఫౌండేషన్ క్రీమ్‌తో కలిపి 3-4 చుక్కలు మాత్రమే లోషన్‌ను ఉపయోగించాలి. జిడ్డు చర్మం గలవారు మేకప్‌కి ముందు రెండు చుక్కల సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవచ్చు.

వెంట తప్పనిసరి...
మేకప్ చేసుకొని బయటకు వెళ్లేవారు ఫౌండేషన్‌ని కూడా వెంట తీసుకెళ్లడం మంచిది. వెళ్లిన చోట అవసరమైనప్పుడు కొద్దిగా టచప్ చేసుకోవచ్చు. ముఖంపై చమట, జిడ్డు చేరినప్పుడు క్లాత్‌ను ఉపయోగించకుండా టిష్యూ పేపర్‌తో అద్ది, తీసేయాలి.
 తరచూ మేకప్ వేసుకునేవారు... పెరుగు, సెనగపిండి కలిపి ముఖానికి మసాజ్ చేసుకొని, శుభ్రపరుచుకొని తర్వాత ఫ్రూట్ లేదా ముల్తానీ మిట్టితో ప్యాక్ వేసుకోవాలి. కలబంద (అలోవెరా) రసాన్ని ముఖానికి రాసి, మసాజ్ చేసి, శుభ్రపరుచుకొని, గుడ్డులోని తెల్లసొనతో ప్యాక్ వేసుకోవాలి. మేకప్ వల్ల వచ్చే చర్మ సమస్యలు, మొటిమలు తగ్గుతాయి. పసుపు, పాలు లేదా పసుపు, పెరుగు కలిపి ఏదైనా ఒక ప్యాక్‌ని ముఖానికి వేసుకోవాలి.
 - నిర్వహణ: నిర్మలారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement