వివేకమే విజయసూత్రం | Slick winning formula | Sakshi
Sakshi News home page

వివేకమే విజయసూత్రం

Published Wed, Jan 29 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

వివేకమే  విజయసూత్రం

వివేకమే విజయసూత్రం

అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఎవరికీ తెలియదు. జరిగాక మాత్రం వాటిని సాధించిన వారి జీవితాలు పాఠాలు అవుతాయి. వారి ఆలోచనలు అపురూపం అనిపిస్తాయి. వారి మాటలు స్ఫూర్తిమంత్రాలవుతాయి. పుణెకి చెందిన ఫర్హద్ అసిద్వాలా విజయం కూడా అలాంటి ఓ అద్భుతమే!
 
  ‘‘నువ్వు వేసే తొలి అడుగే అత్యంత ముఖ్యమైన అంశం. తర్వాత నీ శ్రమే నిన్ను నడిపిస్తుంది,  విజేతగా నిలుపుతుంది...’’. తను నమ్మే సూత్రం ఇదేనంటాడు ఫర్హద్.  దీన్ని నమ్మి, ఆచరించి, విజయం సాధించాడు కాబట్టే అంత కచ్చితంగా చెబుతున్నాడు. పుణెలోని ఒక ప్రముఖ విద్యాసంస్థలో బిజినెస్ మేనే జ్‌మెంట్ కోర్సును చదువుతున్న ఫర్హద్ సాధించిన విజయం... బిజినెస్ ‘మేనేజ్‌మెంట్ గురూ’ లనే ఆశ్చర్యపరుస్తోంది.

ఎనిమిది సంవత్సరాల కిందట... ఇంటర్నెట్  బ్రాడ్‌బ్యాండ్‌లు ఇంటింటికీ ప్రవేశించని, గ్రామీణ భారతానికి ఇంకా ఇంటర్నెట్‌తో పరిచయం లేని రోజుల్లో... పట్టణాల్లో కూడా అరుదుగా మాత్రమే ఇంటర్నెట్ కేఫ్‌లు కనిపించే సమయంలో ‘డొమైన్ రిజిస్ట్రేషన్’ బిజినెస్‌ను ప్రారంభించాడు ఫర్హద్. ఐటీ, ఇంటర్నెట్ ఆధారిత టెక్నికల్ కోర్సులు నేర్చుకొంటే మంచి ఉద్యోగం వస్తుంది అని ఎక్కువమంది యువతీయువకులు భావిస్తున్న ఆ రోజుల్లోవారందరికీ భిన్నంగా ఇంటర్నెట్ ఆధారంగా వ్యాపారం చేసేందుకు ప్లాన్ వేశాడు ఫర్హద్. ఇదే అతడు వేసిన తొలి అడుగు...  వైవిధ్యమైన అడుగు.
 
 అప్పటికి ఫర్హద్ వయసు కేవలం 12 సంవత్సరాలు! తిరిగి చెల్లించే షరతులతో అమ్మానాన్నల దగ్గర ఆరు వందల రూపాయలు అప్పుగా తీసుకొని, ఒక డొమైన్‌నేమ్ రిజిస్టర్ చేయించుకొని, తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. మొదట్లో డొమైన్ రిజిస్ట్రేషన్‌లు చేయించి అమ్మాడు. తర్వాత ఇంటర్నెట్‌లో కమ్యూనిటీలు క్రియేట్ చేసి వాటిని అమ్మడం మొదలెట్టాడు. ఇలా వెబ్ ఆధారిత వ్యాపారంలో ఒక్కో మెట్టూ ఎదిగాడు. తెలివితేటలను మాత్రమే పెట్టుబడి పెట్టే వ్యాపారాలను చేశాడు. తను చేస్తున్న పనంతా వ్యవస్థీకృతంగా ఉండాలనే ఉద్దేశంతో ‘రాక్‌స్టా మీడియా’ అనే కంపెనీని స్థాపించాడు. అనేక మందికి ఉపాధి కల్పించాడు.

అదృష్టం కోసం వెతుకులాడకుండా... వివేకమే విజయసూత్రంగా ఫర్హద్ చేసిన ఎనిమిదేళ్ల ప్రయాణం అతడిని అంతర్జాతీయ అవార్డులను అందుకొనే స్థాయికి చేర్చింది. ఒకవైపు చదువుతూనే వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఇతడి బిజినెస్ ఐడియాలు సక్సెస్ కావడమే కాదు, ఆ సక్సెస్‌కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. సీఎన్‌ఎన్ ఐబీఎన్ దగ్గర నుంచి అనేక మీడియా సంస్థలు ఫర్హద్‌ను యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తించాయి. ప్రస్తుతం ఇండియాలోని టాప్ టెన్ యంగ్ బిజినెస్ మ్యాగ్నెట్‌లలో అతడూ ఒకడు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement