ఆమె ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ. ఇల్లు గడవడానికి భర్తకు చేదోడువాదోడుగా ఉండేందుకు ఓ చిన్న వ్యాపారం ప్రారంభించింది. అంచెలంచెలుగా ఎదిగింది. తాను ఎదగడమే కాదు... మరో పదిమందికి ఉపాధి కల్పించింది. ఏటా పాతిక లక్షల రాబడిస్థాయికి చేరింది. దేశవిదేశాలలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆమె పేరు గోదావరి సాత్పుతే. ఆమె సాధించిన విజయాల వెనుక ఉన్న శ్రమ, పట్టుదల ఆమె మాటలలో...
మాది షోలాపూర్‌జిల్లా బార్షీ తాలూకా జమగావ్‌లోని ఓ సాధారణ కుటుంబం. ఏడవ తరగతి వరకు చదువుకున్నాను. 2000లో శంకర్‌తో నా వివాహం జరిగింది. అప్పటికి ఆయన ‘గాడ్గే ట్రాన్స్‌పోర్ట్’ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అక్కడ వచ్చే జీతంతో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఒకరోజు నా భర్త కాగితంతో తయారుచేసిన ఆకాశకందిళ్లను (ఆకాశదీపంలాంటిది. వీటిలో ఎలక్ట్రిక్ లైట్ అమర్చుకుని, పై కప్పు నుంచి వేలాడదీయవచ్చు) తీసుకు వచ్చారు.
నేను వాటిని ఏ భాగానికి ఆ భాగం విడదీసి, అది ఎలా తయారైందో తెలుసుకుని, అతికించేశాను. విషయం తెలుసుకుని ఊరుకోకుండా, స్వయంగా వాటిని తయారుచేయడం ప్రారంభించాను. నా భర్త తన సహాయసహకారాలు అందించారు. అలా తయారుచేసిన కందిళ్లను మొదట్లో ఇరుగుపొరుగు వారికి విక్రయించేదాన్ని. వ్యాపారాన్ని విస్తరించేందుకు నా భర్త జీతం నుంచి కొంత, నేను సంపాదించిన దానిలో నుంచి కొంత డబ్బు దాచేదాన్ని.
అది చాలకపోవడంతో లోన్ కోసం ప్రయత్నించినా, లాభం లేకపోయింది. నా భర్త పనిచేసే కంపెనీ యజమాని, మా బంధువులు కొద్దికొద్దిగా ఆర్థిక సహాయం చేయడంతో వ్యాపారం ప్రారంభించాను. కొద్దిరోజుల తర్వాత భారతీయ యువశక్తి ట్రస్ట్ సంస్థతో నాకు పరిచయం కావడంతో, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.35 వేలు రుణం లభించింది. ఆ పెట్టుబడితో వ్యాపారాన్ని విస్తరించాను.
ఉపాధి...
పదిమందితో ప్రారంభమైన మా వ్యాపారంలో ప్రస్తుతం 75 మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరిని ఎనిమిది బృందాలుగా విభజించి ఆకాశ కందిళ్లను తయారుచేస్తున్నాం. ఒక్కో మహిళకు రోజువారి కూలీగా 250 రూపాయలు చెల్లిస్తున్నాం. వివిధ కార్యక్రమాలకు, పండుగలకు అనేక కంపెనీల వారు మా దగ్గర నుంచి వీటిని కొనుగోలు చేస్తుంటారు. కాగితాల కటింగ్ పని నుంచి కాగితాలు అతికించడం, డెకరేషన్, కందిలి తయారుచేసేంత వరకు ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తుంటారు. వీటిని విక్రయించే పని నా భర్త, మరిది రత్నాకర్‌లు స్వయంగా చూసుకుంటారు.
మా మరిది ఎంబిఏ చేయడం వల్ల మార్కెటింగ్ పని సులువుగా ఉంది. మా ఆయన డ్రైవర్‌గా పనిచేయడం వల్ల ఇందుకు అవసరమయ్యే ముడిసరుకు లభించే ప్రదేశాలు, హోల్‌సేల్ విక్రయాలు బాగా తెలుసు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి ముడిసరుకులు కొనుగోలు చేస్తున్నాం. ఏడాదికి రూ.25 లక్షల ఆదాయం వస్తోంది.
ఉమ్మడికుటుంబం...
ప్రతి మహిళ ఆర్థికంగా వృద్ధి సాధించాలంటే కుటుంబ సహకారం ఎంతో అవసరం. మాది ఉమ్మడికుటుంబం కావడంతో, వ్యాపారం ఎలాంటి అరమరికలు లేకుండా సజావుగా సాగుతోంది. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా, తమలో దాగి ఉన్న కళానైపుణ్యాన్ని బయటకు తీసి గుర్తింపు సంపాదించాలి.
- ఎం. శ్రీనివాస్, న్యూస్ లైన్, పుణే సిటీ
- సుధీర్ చక్రవర్తి, న్యూస్ లైన్, పింప్రీ
లండన్ వెళ్లినప్పుడు...
‘‘యూత్ బిజినెస్ ఇంటర్నేషనల్ (వైబీఐ) ఆధ్వర్యంలో 40 దేశాలలో ఈ శాఖలు ఉన్నాయి. కాగా బీవైఎస్‌టీనే నా పేరును సిఫారసు చేసింది. నాకు ఇంగ్లీష్ రాకపోవడంతో, దుబాసీని నియమించారు. లండన్‌లోని స్టాండ్‌ప్యాలెస్ హోటల్‌లో విడిది ఏర్పాటుచేశారు. మేము ఏడు రోజుల పాటు లండన్‌లో ఉన్నాం. మొదట రెండు రోజులు గైడ్ సహాయంతో వివిధ ప్రదేశాలను సందర్శించాం. ఒకరోజు ప్రిన్స్ చార్లెస్ మాకు డిన్నర్ ఇచ్చారు. ప్రతిఒక్కరితో ఐదు నిమిషాలు మాట్లాడారు. నాతో కరచాలనం చేయబోగా, భారతీయ సంప్రదాయం ప్రకారం నమస్కారం చేశాను’’.
- గోదావరి సాత్పుతే
పురస్కారాలు...
2011 సంవత్సరంలో ‘సిటీ మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్’ అవార్డు, లక్షాయాభై వేల రూపాయల నగదు బహుమతి
స్థానిక కార్పొరేషన్, వివిధ మండళ్ల ద్వారా అనేక పురస్కారాలు
లండన్‌లో ప్రిన్స్ చార్లెస్ చేతుల మీదుగా 2013 యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ పురస్కారం, లక్ష రూపాయల నగదు బహుమతి.