
‘మంచు’కొస్తోంది...
అంటార్కిటికా.. భూగోళంపైనే అతిపెద్ద మంచుఖండం..
అన్ని ఖండాల కన్నా ఎతై ్తన ప్రాంతం..
కొన్ని శతాబ్దాల తర్వాత అయితే..?
ఏమో.. ఈ మంచుఖండం చాలావరకూ సముద్రంలో కలిసిపోవచ్చు..
ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం కొన్ని అడుగుల మేరకు పెరిగిపోవచ్చు..
తీరప్రాంత నగరాలకు ముంపు, తుపాన్ల ముప్పు తీవ్రం కావచ్చు..
ఎందుకు? ఏమిటి? ఎలా? తెలుసుకుందాం పదండి..
ధ్రువాల వద్ద మంచు కరిగిపోతోంది... ఇది మన చిన్నప్పటి నుంచీ వింటున్నమాటే. మంచు అన్నది కరిగిపోవడం సహజం కదా.. అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. కానీ.. అంటార్కిటికా ఇంతకుముందెన్నడూ లేనంత వేగంగా ఇప్పుడు కరిగిపోతోంది. గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా కోతకు గురవుతోంది. అందుకే గత నెలరోజులుగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు దక్షిణ ధ్రువంపై ఉన్న ఈ మంచుఖండం గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
అంతర్జాతీయ జర్నళ్లు, ఐక్యరాజ్యసమితి ఐపీసీసీ, నాసా, ఈఎస్‌ఏ వంటి సంస్థలూ అంటార్కిటికాలో మంచు ఏటా ఎంతమేరకు కరిగిపోతోంది? భవిష్యత్తులో ఇదెంతవరకూ కొనసాగుతుంది? అన్న దానిపై శాటిలైట్లు, రాడార్‌లు, ఇతర రిమోట్ సెన్సింగ్ పద్దతుల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా అంచనాలతో ఇటీవలే నివేదికలు విడుదల చేశాయి. ఈ నివేదికలన్నీ తేల్చిందేంటంటే.. అంటార్కిటికాలో ముఖ్యంగా పశ్చిమ అంటార్కిటికాలో మంచుఫలకాలు తిరిగి ఎప్పటికీ కోలుకోలేనంత స్థాయిలో కరిగిపోతున్నాయి!
ఆపలేని హిమ ప్రవాహం..
అంటార్కిటికాలోని పశ్చిమప్రాంతంలో ఆరు ముఖ్యమైన హిమానీనదాలు(గ్లేసియర్లు) ఉన్నాయి. వీటిలో పైన్ ఐల్యాండ్ గ్లేసియర్ ఒకటి. దీని నుంచి మంచుముక్కలు కొన్నేళ్లుగా గుట్టగుట్టలుగా సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి. ఈ గ్లేసియర్ నుంచి ఏకంగా 1,640 అడుగుల మందం, 12 మైళ్ల పొడవు, 20 మైళ్ల వెడల్పున్న ‘ఐస్ ఐల్యాండ్ బీ31’ అనే ఓ మంచు కొండే విడిపోయిందని.. అది క్రమంగా సముద్రం వైపుగా కదులుతోందని గతేడాది నాసా వెల్లడించింది. ధ్రువాల వద్ద మంచు ఫలకాలలో పగుళ్లు సాధారణమే అయినా.. ఇంత పెద్ద మంచు కొండలు విడిపోవడం అనేది అసాధారణమని నిపుణులు అంటున్నారు.
పశ్చిమ అంటార్కిటికాలో మంచు వేగంగా కరుగుతోందనడానికి ఇది సంకేతమని చెబుతున్నారు. అలాగే పశ్చిమ అంటార్కిటికాలోని గ్లేసియర్ల అడుగులు కూడా ఏటా 0.6 మైళ్ల మేరకు వేగంగా కోతకు గురవుతున్నట్లు ఇటీవలి అధ్యయనాల తర్వాతే వెలుగు చూసింది. గ్లేసియర్లు అడుగుల వద్ద కోతకు గురవడం అన్నది కూడా ఇంతకుముందెన్నడూ ఇంత వేగంగా జరగలేదు. ఉత్తరార్ధగోళంలోని గ్రీన్‌ల్యాండ్ కూడా కరుగుతోన్నా.. పశ్చిమ అంటార్కిటికా మాత్రమే చాలా వేగంగా కరుగుతోందంటున్నారు.
2010 నుంచే రెట్టింపు...
క్రయోశాట్-2 శాటిలైట్ సమాచారాన్ని బట్టి చూస్తే.. పశ్చిమ అంటార్కిటికా మంచు ఫలకం ఏటా 160 బిలియన్ మెట్రిక్ టన్నుల మంచును కోల్పోతోందట. 2005-10నాటితో పోల్చితే ఇది రెండు రెట్లు ఎక్కువట. స్మిత్ గ్లేసియర్ ఏటా 30 అడుగుల వరకూ కుంగిపోతోందట. పశ్చిమ అంటార్కిటికాలో మంచు కరగడం వల్లే ఏటా 0.1 అంగుళాల చొప్పున సముద్రమట్టాలు పెరుగుతున్నాయట.
ఇది చాలా తక్కువగానే కనిపిస్తున్నా.. కొన్నేళ్లలో గ్రీన్‌ల్యాండ్ గ్లేసియర్ కూడా కరగడం, ఇతర రకాలుగానూ నీరు సముద్రాల్లోకి చేరడాన్ని పరిగణనలోకి తీసుకుంటే సమస్య పెద్దదతువుందని భావిస్తున్నారు. అంటార్కిటికా వేగంగా కరిగిపోతోంది సరే... ఏదోనాటికి ఆ మంచుఖండం మొత్తం మాయమవుతుందా..? అంటే కాకపోవచ్చు. కానీ ప్రస్తుత అంచనాలు చూస్తే మాత్రం మరో వెయ్యేళ్లలో దక్షిణ గోళంలో మంచుఖండం చాలావరకూ సముద్రంలో కలిసినా ఆశ్చర్యం లేదంటున్నారు.
కరిగిపోతే ఏమవుతుంది..?
ప్రపంచవ్యాప్తంగా 2005-10 మధ్యలో సముద్ర మట్టాలు పెరగడానికి పశ్చిమ అంటార్కిటికాలో ఉన్న ఆరు గ్లేసియర్లు కరగడమే 10 శాతం కారణమయ్యాయట. ఈ గ్లేసియర్లు ఇలాగే కరిగిపోతే గనక.. సముద్ర మట్టాలు వందేళ్లలోనే ఏకంగా 4 అడుగుల మేరకు పెరుగుతాయని అంచనా. అదేవిధంగా మొత్తం పశ్చిమ అంటార్కిటికాలోని మంచు ఫలకం కరిగిపోతే 10 నుంచి 15 అడుగుల మేరకు సముద్రమట్టాలు పెరుగుతాయని, ఫలితంగా తీరప్రాంతాలకు ముంపు, తుపానుల ముప్పు పెరుగుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఉదాహరణకు 2012లో అమెరికాను అతలాకుతలం చేసిన శాండీ తుపాను సముద్రమట్టం ఒక అడుగు ఎక్కువగా ఉన్న చోట్లలోనే తీరాన్ని దాటి పెను విధ్వంసం సృష్టించింది. సముద్రమట్టం ఒక్క అడుగు పెరిగితేనే తుపాన్లకు ఎంత ఊతం లభిస్తుందో చెప్పడానికి ఇదో నిదర్శనంగా నిలిచింది. అదే భవిష్యత్తులో 10 నుంచి 15 అడుగులు పెరిగితే న్యూయార్క్, దక్షిణ ఫ్లోరిడా, వర్జీనియాలోని అనేక ప్రాంతాలు జలమయం అవుతాయి. వీటికి తోడు తీరప్రాంతాలకు తుపాన్ల ముప్పు ఎక్కువ అవుతుంది. ఒక్క అమెరికానే కాదు.. సింగపూర్, బంగ్లాదేశ్, ప్రపంచవ్యాప్తంగా ఇతర లోతట్టు తీరప్రాంతాలన్నింటికీ ముప్పు పెరుగుతుంది.
గ్రీన్‌హౌజ్ వాయువులే ప్రధాన కారణం...
ధ్రువాల వద్ద మంచు కరగడానికి ప్రధానంగా భూతాపోన్నతి (గ్లోబల్ వార్మింగ్)ని పెంచే గ్రీన్‌హౌజ్ వాయువులు పెరగడమే కారణమని పరిశోధకులు అంటున్నారు. అంటార్కిటికాపై గాలుల ప్రభావం పెరగడం వల్ల వేడి నీరు గ్లేసియర్ల అడుగుభాగాన్ని తాకడం పెరిగిందని, దీంతో గ్లేసియర్ల అడుగులు వేగంగా కోతకు గురవుతున్నాయని చెబుతున్నారు. భూతాపోన్నతి వల్ల భవిష్యత్తులో వే డినీటి ప్రవాహం మరింత పెరుగుతుందని అంటున్నారు. అదేవిధంగా అంటార్కిటికాపై ఓజోన్ పొర కూడా క్షీణించడం వల్ల కూడా అక్కడ సముద్ర జలాలు వేడెక్కడంతోపాటు గాలి ప్రవాహంలో మార్పులు వచ్చాయట.
పరిష్కారమెలా..?
అంటార్కిటికాలో మంచు కరగడాన్ని ఎవరూ ఆపలేక పోయినా.. అక్కడ మంచు కరగడం అనేది ఎప్పటికప్పుడు గ్రీన్‌హౌజ్‌వాయువుల విడుదల స్థాయి, భూతాపోన్నతి పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను తగ్గిస్తే గనక భూతాపోన్నతి తగ్గి భవిష్యత్తులో మంచు కరిగే వేగం తగ్గవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే సీవోటూ, ఇతర గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాల నియంత్రణకు ఇకనైనా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయం చూడాలని చెబుతు న్నారు. గ్రీన్‌హౌజ్ వాయువుల నియంత్రణకు వచ్చే కొన్ని దశాబ్దాల్లో తీసుకునే చర్యలపైనే దక్షిణ గోళంపై మంచు ఖండం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
- హన్మిరెడ్డి యెద్దుల