
మెత్తని కత్తి... మైదా!
తిండి గోల
ఆరోగ్యం బాగా లేకపోతే బ్రెడ్ తినిపిస్తాం. పుట్టిన రోజుకు కేక్ కట్ చేసి సంబరం చేసుకుంటాం. పండగ రోజున కాజానో, బొబ్బట్లో, గులాబ్‌జామూన్‌తోనో ఆనందాన్ని పంచుకుంటాం. బ్రెడ్, కేక్, గులాబ్‌జామూన్ ... వీటి తయారీలో మైదా అనే ఒక మృదువైన పిండిపదార్థాన్ని వాడతారు. బాగానే ఉంది కానీ, ఈ పిండిని ఎలా తయారుచేస్తారో తెలుసా! గోధుమలను మిల్లులో బాగా పాలిష్ చేసి, రసాయనాలు కలిపి దీనిని తయారుచేస్తారు. రసాయనాల వల్ల పిండి బాగా తెల్లగా, మెత్తగా మారిపోతుంది. దీంతో దీనిని బ్లీచ్డ్, రిఫైండ్ ఫ్లోర్ అని కూడా అంటుంటారు. మైదాలో అలొక్సన్ అనే విషపూరితమైన రసాయనం వాడుతారని, అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుందని, దీనిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యసమస్యలు వస్తాయనే విమర్శలు అంతటా అధికంగా ఉన్నాయి.
మైదాలో ఉపయోగించే రసాయనాలపై చైనాలో కొన్నేళ్ల క్రితం నుంచే నిషేధం ఉంది. మైదా మధ్య, ఉత్తర ఆసియా వంటకాలలో అధికంగా వాడతారు. మన దగ్గరైతే వాల్‌పోస్టర్లు అతికించడానికీ,. పరోటాలు చేయడానికీ మైదానే ఉపయోగిస్తారు. అలాగే బేకరీ పదార్థాలలోనూ మైదా అధికంగా వాడతారు. గోధుమలను ఎక్కువగా పండించే యూరప్, అమెరికా దేశాలలో ఈ పిండిని అధికంగా ఉపయోగిస్తారు. క్రీ.స్తు పూర్వం 6 వేల ఏళ్ల క్రితమే ఈ దేశాలలో పిండి వాడకం ఉంది. పారిశ్రామిక రంగం ఊపందుకున్న నాటి నుంచి మరీ ముఖ్యంగా 1940 నుంచి 1990ల కాలంలో పిండి నిల్వ ఉండటానికి ఎన్నో పద్ధతులు అవలంబిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మైదా మరింత మెత్తగా మన ఆరోగ్యాన్ని కోస్తూ వస్తోంది. కాబట్టి, మైదాతో తయారయ్యే పదార్థాలను తీసుకోవడం కొంత తగ్గించడమే మేలు.