నదుల స్వగత కథనం | Soliloquy rivers article | Sakshi
Sakshi News home page

నదుల స్వగత కథనం

Published Mon, Feb 23 2015 11:41 PM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

నదుల స్వగత కథనం - Sakshi

నదుల స్వగత కథనం

నడకే నాట్యం
గమనం

 
స్వదేశీ యాత్రికులు పెద్దగా దృష్టి పెట్టలేదు కానీ విదేశీ యాత్రికులు నా తీరాన విస్తృతంగా పర్యటించారు. గ్రీకు యాత్రికుడు టాలమీ, చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్‌లు నా తీరాన్ని ప్రపంచానికి తెలియచేశారు. స్వాతంత్య్రపోరాటంలో గాంధీజీ వచ్చి గిరిపుత్రులను స్వాతంత్య్రోద్యమబాట పట్టించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ వచ్చి లండుంగ్రీ- చందిలిడుంగ్రీ కొండల మధ్య హీరాకుడ్ ఆనకట్ట కట్టి జాతికి అంకితం చేశారు. ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన మానవ నిర్మిత ఆనకట్ట అంటూ పిల్లలు పాఠం నేర్చుకుంటూంటే విని మురిసిపోతుంటాను. నా మీద చిన్న పెద్దా కలిసి ముప్పైకి పైగా పవర్ ప్లాంటులున్నాయి. హీరాకుడ్‌తోపాటు రవిశంకర్‌సాగర్, దూధ్వా, సోందూర్ రిజర్వాయర్లు, హాస్‌దేవ్ వంటి ప్రధాన ప్రాజెక్టులతోపాటు చిన్న పెద్ద ఆనకట్టలు నా నీటిని ప్రజోపకరంగా మారుస్తున్నాయి.
 చత్తీస్‌ఘడ్‌లో పుట్టి తూర్పు కనుమల గుండా ప్రవహిస్తూ ఒడిషాలో అడుగుపెట్టి బంగాళాఖాతంలో కలిసే మధ్యలో  సియోనాథ్, జోంక్, హాస్‌దేవ్, మాండ్, ఇబ్, ఓంగ్, తేల్ నదులు నాతో జతకడతాయి. ఇన్నేసి నదులు నా స్నేహం కోసం వచ్చాయని సంతోషపడుతూ పరుగులు తీస్తుంటాను. కనుచూపు మేరలో కటక్ ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఇంతలో నా ప్రవాహం నుంచి ఒక పెద్ద పాయ చీలిపోతుంది. కట్‌జోరి పేరుతో కొత్త పేరు పెట్టుకుని ఆ పాయ తన ఉనికిని చాటుకునే లోపు నీరు పల్లమెరుగు అనే నానుడిని రుజువు చేస్తూ ఆ ప్రవాహం కాస్తా మరో ఐదు పాయలుగా చీలిపోతుంది. అవి పైకా, బిరుప, చిత్రోక్తల, గెంగుటీ, లున్ పేర్లతో సాగరం వైపు పరుగులు తీస్తుంటాయి. నేను పారాదీప్‌కు సమీపంలో జగత్‌సింగ్‌పూర్ దగ్గర సాగరంలో కలిసిపోతాను.

నా ప్రవాహం ఎంత విశాలంగా ఉండేదంటే... బంగాళాఖాతం నుంచి నౌకలు దాదాపుగా 150 కిలోమీటర్ల లోపలికి వచ్చేవి. హీరాకుడ్... నీటికి ఆనకట్టతోపాటు నౌకలకు అడ్డుకట్ట అయింది. ప్రాచీనకాలంలో సంబల్‌పూర్ వర్తకవాణిజ్య కేంద్రం కావడానికి కారణం నా ప్రవాహమే. తూర్పు కనుమల మధ్య దారి వెతుక్కుంటూ మెలికలు తిరుగుతూ నెమ్మదిగా ప్రవహించే నేను సత్‌కోసియా దగ్గర కొండలను ఒరుసుకుంటూ నేలకు ఉరుకుతాను. నన్ను కళ్లారా చూడడానికే ఆనకట్ట డెక్ మీద 21 కి.మీల దూరం ప్రయాణించే పర్యాటకులను చూడడం నాకు అద్భుతమైన అనుభూతి. మన సాంకేతిక పురోగమనానికి నిదర్శనంగా ఆనకట్టకు ఉత్తరాన గాంధీ మినార్, దక్షిణాన నెహ్రూ మినార్‌లుంటాయి. హిండాల్కో హీరాకుడ్ స్మెల్టర్, హిండాల్కో హీరాకుడ్ పవర్, సామలేశ్వరి స్పాంజ్ ఐరన్ లిమిటెడ్, టి.ఆర్. కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి భారీ పరిశ్రమలకు నేనే పెద్ద ఆసరా.

గిరిపుత్రుల సామూహిక వేడుకలు...

సంబల్‌పూర్‌లో అడుగుపెడుతుంటే ప్రకృతిని ప్రేమించే గిరిజనుల ఆహార్యం గుర్తొచ్చి మనసు పులకిస్తుంది. గోండు, భుయాన్ గిరిపుత్రులు ఏడాదిలో ప్రతి దశనూ వేడుక చేసుకుంటారు.ఎర్రటి, పసుపువర్ణం వస్త్రాలు ధరించి జుట్టును కొప్పు పెట్టి పూలు చుట్టుకుని అచ్చమైన అడవి మల్లెల్లాంటి యువతులు అర్ధ వలయాకారంగా నిలబడి సంగీతానికి, సాహిత్యానికి అనుగుణంగా లయబద్ధంగా అడుగులు కదుపుతూ చేసే ‘దాల్‌ఖాయ్’ నృత్యం, పిల్లల కోసం చేసే ‘కర్మా’ నృత్యం, రాధాకృష్ణుల ప్రేమ ఇతివృత్తంతో యువతీయువకులు చేసే ‘కోయిసాబాదీ’ నృత్యం కనువిందు చేస్తాయి.

 బౌద్ధ పరిమళాలు...

నా తీరం చారిత్రక కట్టడాలు, పచ్చటి కొండలు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల సుమహారం.  హ్యూయాన్‌త్సాంగ్ ఇక్కడ అంగుళం అంగుళాన్ని పరికించి గ్రంథస్థం చేస్తుంటే చూసి పొంగిపోయాను. బౌధ్‌లో అడుగుపెట్టగానే మధ్యయుగం నాటి బౌద్ధ విగ్రహాలు కళ్ల ముందు మెదలుతాయి. చౌహాన్ పాలకులు కట్టించిన పటానేశ్వరి ఆలయం, సామలేశ్వరి గుడి, బారా జగన్నాథ ఆలయాలు పర్యాటకులతో కళకళలాడుతూంటాయి. వీటన్నింటికంటే ఆసక్తికరమైనది బిమలేశ్వర్ ఆలయం. హుమా ఆలయంగా పిలిచే ఈ కట్టడం కొద్దిగా ఒరిగి ఉంటుంది. ఒరిగి నిలబడడం ఓ ప్రపంచ వింత అయితే ‘లీనింగ్ టవర్ ఆఫ్ పిసా’లాగ బిమలేశ్వర్ ఆలయమూ ఓ వింతే.
 ప్రెజెంటేషన్: వాకా మంజులారెడ్డి
 email: manjula.features@sakshi.com
 
 
 
మహానది ప్రవాహ దూరం: 858 కి.మీ.లు
పుట్టింది: చత్తీస్‌ఘర్ కొండల్లో
సాగరసంగమం: బంగాళాఖాతంలో ఒరిస్సా రాష్ట్రంలోని పారాదీప్ దగ్గర
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement