ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా రోగికి పక్షవాతం లేదా గుండెపోటు లక్షణాలు కనిపించినా వారికి అత్యవసరంగా చికిత్స అందాల్సిన ఆ కీలకమైన సమయాన్ని వైద్యులు ‘గోల్డెన్ అవర్’గా చెబుతుంటారు. తెలుగులో చెప్పాలంటే ఈ వ్యవధిని బంగారు ఘడియలు అనుకోవచ్చు.
రోడ్డు ప్రమాదలు జరిగినప్పుడు : వీటిని వైద్య పరిభాషలో ట్రామా కేసులుగా చెబుతుంటారు. ప్రమాదం జరిగినప్పుడు రోగికి కొన్ని అత్యవసర వైద్యసేవలు అందాలి. ఉదాహరణకు తక్షణం ఆక్సిజన్ అందించాలి. ఇందుకోసం అవసరమైతే శ్వాసనాళంలోకి గొట్టాన్ని వేయాల్సి రావచ్చు. ఇక రక్తస్రావాన్ని ఆపడం, సెలైన్ ఎక్కించడం వంటి చికిత్సలూ అందించాలి. వీటిని అడ్వాన్స్‌డ్ ట్రామా లైఫ్ సపోర్ట్ (ఏటీఎల్‌ఎస్) అంటారు. ఇలాంటి వైద్య సహాయాలు యాక్సిడెంట్ అయిన అరగంట / గంట లోపే అందితే ప్రాణాపాయాన్ని నివారించవచ్చు కాబట్టి దాన్ని గోల్డెన్ అవర్ అంటారు.
హెడ్ ఇంజ్యూరీ అయితే మరింత వేగంగా : తలకు దెబ్బతగిలినప్పుడు (హెడ్ ఇంజ్యురీలో) రోగిని ఎంత త్వరగా ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాపాయాన్ని అంతగా తప్పించవచ్చు. తలకు గాయమైనప్పుడు ప్రాణాపాయం సంభవించే అవకాశాలెక్కువ కాబట్టి ఇలాంటి సమయంలో మరింత త్వరితంగా స్పందించాలి.
గుండెపోటు వచ్చినప్పుడు : గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి వల్ల గుండె కండరానికి రక్తప్రసరణ ఆగితే దాన్ని హార్ట్‌ఎటాక్ అంటారన్నది తెలిసిందే. హార్ట్ ఎటాక్ వచ్చినవారికి గుండెకండరాన్ని కాపాడటానికి ఇచ్చే మందును గుండెపోటు వచ్చిన గంటన్నర (90 నిమిషాల్లో) లోపు ఇవ్వాలి. ఈ చికిత్సను థ్రాంబోలైసిస్ (రక్తపు గడ్డను కరిగించే మందు ఇవ్వడం) అంటారు. ఈ నిర్ణీత సమయం దాటాక థ్రాంబోలైసిస్ చికిత్సతో ఫలితం ఒకింత తక్కువ. కాంప్లికేషన్లూ ఎక్కువ.
బ్రెయిన్‌స్ట్రోక్ (పక్షవాతం ) నివారణకు...
మెదడుకు అందాల్సిన రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే పక్షవాతం వస్తుంది. దీన్నే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. ఇలాంటి వారికి మొదటి నాలుగున్నర గంటలలోపు టిష్యూ ప్లాస్మెనోజిన్ యాక్టివేటర్ (టీపీఏ) అనే మందును ఇస్తారు. కాకపోతే ఎంత త్వరగా ఇస్తే అంత మంచి ఫలితాలుంటాయి. దీన్ని ఇవ్వాలంటే ముందుగా సీటీ స్కాన్, ప్లేట్‌లెట్ కౌంట్ పరీక్ష చేసి ఈ టీపీఏ ఇవ్వవచ్చా అనే విషయాన్ని నిర్ధారణ చేయాలి. ఇది చేయగలిగితే జీవితాంతం బాధపెట్టే పక్షవాతాన్ని నివారించవచ్చు.
సెప్సిస్ : రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితిని సెప్సిస్ అంటారు. వీళ్లకు బీపీ పడిపోతుంది. అలాగే మూత్రపిండాలు, కాలేయం, మెదడు వంటి కీలక అవయవాలు ఫెయిల్ అయ్యేందుకూ అవకాశాలెక్కువ. ఇలాంటి కండిషన్ రాకుండా నివారించడాన్ని వైద్య పరిభాషలో రిససిటేషన్ అంటారు. ఈ రిససిటేషన్ చేయడానికి రోగిని ఐసీయూలో ఉంచి చికిత్స చేయాలి. కొందరిలో ఇలా రక్తంలో ఇన్ఫెక్షన్ వస్తే... బీపీ తగ్గి షాక్‌లోకి వెళ్తారు. అలాంటి సందర్భాల్లో రోగిని వీలైనంత త్వరగా ఆసుపత్రిలో చేర్చాలి. చేర్చడానికి పట్టే వ్యవధి ఎంత తక్కువగా ఉంటే ప్రమాదం అంత తక్కువని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బ్యాక్టీరియల్ మెనింజైటిస్‌ను అనుమానించినప్పుడు నిర్ధారణ కంటే ముందే ఎంత త్వరగా యాంటీబయాటిక్స్ ఇస్తే అంత ఫలితం దక్కుతుంది. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి,
చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్,
రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్
రోగి పట్ల బంగారంలాంటి సమయం...గోల్డెన్ అవర్
Published Thu, Dec 19 2019 12:24 AM | Last Updated on Thu, Dec 19 2019 12:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment