కంగారు పాట్లు..!
సమ్‌థింగ్ స్పెషల్
ఆస్ట్రేలియా జనాభా కన్నా ఆ దేశంలో ఉన్న కంగారూల సంఖ్యే ఎక్కువ. ఆ దేశ జాతీయ జంతువు అయిన కంగారూలు కేవలం అడవులకు మాత్రమే పరిమితం కాకుండా జనారణ్యంలోకి కూడా చొరబడిపోతుంటాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేంత వరకూ వచ్చేస్తుంటాయి. ఇక కాస్త అటవీ ప్రాంతానికి దగ్గరగా నివాసం ఉండే వాళ్ల ఇళ్లల్లోకి కంగారూల చొరబాట్ల గురించి వేరే చెప్పనక్కర్లేదు. అలా వచ్చిన కంగారూగా కూజాలో తలపెట్టి ఇరుక్కుపోయిన కంగారు ఇది. దక్షిణ ఆస్ట్రేలియా ప్రాంతంలోని ఒక పల్లెటూరులో ఈ కంగారూ పడ్డ పాట్ల ఫోటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అయ్యాయి.
నీళ్ల కోసం ఒక పూలతోటపక్కకు వచ్చి అక్కడ ఉంచిన కూజాలోకి తలపెట్టింది కంగారూ. తల సులభంగా లోపలకు వెళ్లింది కానీ.. బయటకు తీసుకోవడం మాత్రం చాలా కష్టం అయ్యింది. కొంతసేపటికి దీని పాట్లను అక్కడి వ్యక్తులిద్దరు గమనించారు.. సున్నితంగా తప్పిద్దామంటే ఇది చేతికి చిక్కే జంతువు కాదు.. నియంత్రించడానికి కష్టం. దీంతో వారు కాస్త బుర్రకుపదును పెట్టి తాడును కూజాకు కట్టి లాగారు. తోకవైపు ఒకరు, తలవైపు మరొకరు నిలబడి కూజా నుంచి దాన్ని తప్పించడానికి ప్రయత్నించారు. అలా కొన్ని గంటల పాటు శ్రమపడ్డారు. చివరకు విజయం సాధించారు. కూజా నుంచి తల బయటకు రావడంతో కంగారూ ‘బతుకు జీవుడా..’ అనుకొన్నట్టుగా బిత్తరచూపులతో పరుగులు తీసింది!