అందుకే నా డిక్షనరీ నుంచి ఇవన్నీ తీసేశా..! | special chit chat with hero raviteja | Sakshi
Sakshi News home page

అందుకే నా డిక్షనరీ నుంచి ఇవన్నీ తీసేశా..!

Published Sun, Nov 30 2014 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

అందుకే నా డిక్షనరీ నుంచి ఇవన్నీ తీసేశా..!

అందుకే నా డిక్షనరీ నుంచి ఇవన్నీ తీసేశా..!

రవితేజ అంటేనే ఓ పవర్‌హౌస్. ఆయనెంత జోష్‌గా ఉంటారో, తన చుట్టూ ఉన్న వాతావరణాన్నీ అంతే జోష్‌గా ఉంచుతారు.  ఎంతో కష్టపడి... చాలా ఇష్టపడి...  ఈ స్థాయికి చేరుకున్నారు రవితేజ.  మీ విజయ రహస్యం ఏంటంటే... వర్క్... వర్క్... వర్క్ అని చెబుతారు. తన సినిమాల విడుదల సమయంలో  తప్ప మీడియాకు చాలా దూరంగా ఉంటారాయన. వ్యక్తిగత విషయాలు కూడా ప్రస్తావించడానికి ఆసక్తి చూపించరు.  ఆ కోణంలో ‘సాక్షి’ చేసిన చిరు ప్రయత్నమిది.
 
ఎలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా మీరు స్టార్‌గా ఎదిగారు. అది అందరికీ తెలుసు. కానీ, మీ కుటుంబం గురించి ఎప్పుడూ చెప్పరెందుకని?
(నవ్వేస్తూ...) వర్క్‌ను ఇంటికి తీసుకెళ్లను. ఇంటిని వర్క్ దగ్గరకు తీసుకు రాను. ఇంట్లో అందరం హ్యాపీ. వర్క్ చేస్తున్నప్పుడు నేను హ్యాపీ. నా ఫ్యామిలీ విషయాలు బయటకు చెప్పడానికి పెద్దగా ఇష్టపడను.
     
కానీ... మీ ఫ్యాన్స్ తెలుసుకోవాలనుకుంటారు కదా?

చెప్పక తప్పదంటారు... నాకో బాబు, పాప. మా ‘సార్’ పేరు మహాధన్ (నవ్వుతూ...). మూడో తరగతి. పాప పేరు మోక్షత. ఆరో తరగతి.
     
మహాధన్ పేరు కొత్తగా ఉంది.. ఎవరు పెట్టారు?

నేను పూజలు, పురస్కారాలకు దూరం. మా అమ్మకు దైవభక్తి ఎక్కువ. విష్ణు సహస్రనామంలో ‘మహాధన్’ అనే పదం ఉంటుందట. దాన్నే మా అబ్బాయి పేరుగా మా అమ్మ పెట్టింది.
     
మీ పిల్లలకు సినిమాలంటే ఇష్టమేనా?
ఎందుకుండదు? మావాడున్నాడే, వాడు నన్ను ఇమిటేట్ చేస్తుంటాడు. మావాడి ముందు నేను పనికి రాను. అసలు వాడితో పోల్చుకుంటే నేను చాలా అమాయకుణ్ణి. నా సినిమాలు చూసి, అచ్చం నాలా చేస్తుంటాడు.
    
మామూలుగా మీ ఫ్యామిలీతో విహార యాత్రలకు వెళుతుంటారా?

తప్పకుండా వెళతాను.
     
మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకుంటున్నారా?
ఇప్పటి వరకు యూరోప్, అమెరికా తీసుకెళ్లలేదు. కొంచెం గ్యాప్ దొరికితే ముందు మా ట్రిప్ యూరోప్‌కే. అక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. చాలా పాజిటివ్ కంట్రీ. అమెరికాలో డిస్నీల్యాండ్. పిల్లలకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది.
   
పిల్లల చదువు గురించి పట్టించుకుంటారా?

అప్పుడప్పుడూ అడుగుతుంటాను. వాళ్లు కూడా ‘మాకు ఇన్ని మార్కులొచ్చాయి’ అని చూపిస్తుంటారు. మా అమ్మాయి అయితే వళ్లో కూర్చుని బోల్డన్ని కబుర్లు చెబుతుంది. నేను పిల్లలతో చాలా జోవియల్‌గా ఉంటాను.
    
జనరల్‌గా మీకెలాంటి ప్రదేశాలంటే ఇష్టం?
చల్లగా ఉండే ఏ ప్రదేశాలైనా ఇష్టమే. మామూలుగా బాగా చల్లగా ఉన్నప్పుడు చాలామంది పనిచేయడానికి ఇష్టపడరు. కానీ, నాకు ఎంత చల్లగా ఉంటే అంత ఎక్కువ పని చేయబుద్ధి అవుతుంది. నాకు సమ్మర్ అంటే చిరాకు.
 
మీ లక్ష్యం ఏంటి?
ఏమీ లేదు. ఈ రోజు ఏంటి? అని ఆలోచిస్తాను. మహా అయితే రేపేం చేయాలని ఆలోచిస్తాను. అంతేకానీ ఎల్లుండి గురించి ఆలోచించను. ఎప్పటి గురించో ఇప్పుడే ఆలోచించేస్తే మనశ్శాంతి ఉండదు. నేను నా మైండ్‌నీ, హార్ట్‌నీ వీలైనంత ఖాళీగా ఉంచుకుంటా. ప్రశాంతంగా జీవించాలన్నది నా కోరిక. అంతే!
   
దేవుడున్నాడంటే ఒప్పుకుంటారా?

ఒక శక్తి ఉందని నమ్ముతా. కానీ గుడికెళ్లి దేవుణ్ణి ఇబ్బంది పెట్టను.
     
ఎప్పుడైనా బాధనిపిస్తే చాలామంది ఆధారపడేది దేవుడి మీదే! మరి మీరు?

బాధను నాకు నేనుగా తగ్గించుకుంటా. ఏ భారమైనా మోసే దమ్ము ఈ గుండెకు ఉంది. ఎంతటి బాధనైనా సరే తేలికగా తీసుకుంటాను. అనవసరంగా హైరానా పడిపోయి, ఆరోగ్యం పాడు చేసుకోను. ఏం జరిగితే అది జరుగుతుందిలే అనుకుంటాను. మరి.. నా అదృష్టమేమో కానీ.. మొదటి నుంచీ నేనింతే!

ఇప్పుడు సెటిలయ్యారు కాబట్టి, ఎన్నయినా చెబుతారు...?
లేదు, లేదు. అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్నప్పుడు కూడా నేనింతే! ఆలోచిస్తూ.. కూర్చుంటే జీవితంలో ఏదీ సాధించలేం. ‘ఏం జరిగినా ప్రయత్నం మానకూడదు. ఏం చేసినా నమ్మి చేయాలి’ అనేది నా సిద్ధాంతం. ‘రవితేజ అదృష్టవంతుడు’ అని ఎవరైనా అంటే... నేను ఒప్పుకోనండి. ఎందుకంటే నా ఎదుగుదల విషయంలో 99 శాతం నా కష్టానికి దక్కితే అదృష్టానికి ఒక శాతమే దక్కుతుంది. నేను దేవుణ్ణి నమ్మను. నిజాయతీని నమ్ముతాను.
    
ఒకప్పుడు చాలా కష్టపడ్డారు కదా... ఇప్పుడు రిలాక్స్ కావాలనిపిస్తోందా?
అస్సలు లేదు. ‘రిలాక్స్, స్లో, పోస్ట్‌పోన్, నెగటివ్, డల్’ ఇలాంటి పదాలు వినడానికి నేను ఇష్టపడను. వాటిని గనక దగ్గర చేసుకుంటే... జీవితంలో మనం సాధించాలనుకున్నవాటికి దూరమైపోతాం. అందుకే నా డిక్షనరీ నుంచి ఇవన్నీ తీసేశా. చెబితే.. ఘాటుగా ఉంటుందేమో కానీ.. నా మరణమే నాకు రిలాక్సేషన్!

నా సినిమా కెరీర్  ప్రారంభమైనప్పట్నుంచీ నాకు  అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం.  నేను ఆయన్ను ‘డాన్ శీను’ ఆడియో వేడుకకు రావాల్సిందిగా కోరినప్పుడు, వస్తానని మాటిచ్చారు. కానీ, చివరి నిమిషంలో రాలేకపోయారు. అమితాబ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘బుడ్డా హోగా తేరా బాప్’ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే.

ఆ చిత్రం విడుదల సమయలో పూరి జగన్నాథ్ కార్యాలయంలో అమితాబ్‌ను కలిశాను. ఆ తర్వాత ఆ చిత్రం ప్రీమియర్ షోకు వెళ్లాం. అప్పుడు తీయించుకున్నది ఈ ఫొటో. అమితాబ్ లాంటి గ్రేట్ పర్సన్‌తో ఫొటో అంటే చిన్న విషయం కాదు. అందుకే, ఈ ఫొటోను పదిలంగా దాచుకున్నా.
 
 - డి. జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement