నేను కిరణ్ పెషావారియా | special chit chat with kiran bedi | Sakshi
Sakshi News home page

నేను కిరణ్ పెషావారియా

Published Sun, Jan 24 2016 11:39 PM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

నేను కిరణ్ పెషావారియా

నేను కిరణ్ పెషావారియా

ఆడపిల్లలు నడుముకు వడ్డాణం వెతుక్కుంటున్న రోజుల్లో ఆమె బెల్ట్ కట్టుకుంది. పాదాలకు పట్టీలతో మురిసిపోతున్నప్పుడు ఆమె పోలీసు బూట్లు తొడుక్కుంది.
 లావణ్యమైన చేతులు కరుకైన లాఠీని ఝళిపించాయి. అందమైన కళ్లు నేరస్తులపై నిప్పులు చిమ్మించాయి. మీసాలు అక్కర్లేదు.భారతదేశ స్త్రీకి ఉండే దమ్ము ఏమిటో ఆమే చూపింది. అవును ఆమే కిరణ్ బేడీ. అమృత్‌సర్ స్వర్ణాలయ శిఖరంపై విరిసిన వెలుగు కిరణం.ఖాకీ దుస్తులు నేర్చిన కొత్త సంస్కారం.  విధి నిర్వహణకి కొండగుర్తు. నిబద్ధతకు దిక్సూచీ.


ఈ రోజుల్లో ఆడవాళ్లు పెళ్లి తర్వాత ఇంటిపేరును మార్చుకోవడాన్ని ఇష్టపడట్లేదు. కిరణ్ పెషావారియాగా ఉన్న మీరు కిరణ్ బేడీగా మారడం ఎలా అనిపిస్తుంది?

ఇప్పుడు నేను కిరణ్ పెషావారియానే. పెషావారియా అనే సంతకం పెడతాను. నా తాజాపుస్తకంలో కూడా అదే సంతకం ఉంది. మధ్యలో కొద్దికాలం మాత్రమే నా పుట్టింటిపేరు మిస్సయిపోయింది. మహిళలు వారి గుర్తింపును ఎప్పటికీ వదులుకోకూడదు.
     
మీరు దైవాన్ని, విధిని నమ్ముతారా?
నేను మంచి కర్మని, మంచి ఉద్దేశాన్ని, ఎక్కువమందికి మేలు చేయడాన్ని నమ్ముతాను.
     
ఒక మహత్తర ప్రయాణం ఢిల్లీ ఎన్నికలతో ఆగిపోయిందనుకుంటున్నారా?  ఇకపై మీ ప్రణాళిక ఏంటి?
నేను రాజకీయ జగత్తుకు చెందిన దాన్ని ఎప్పుడూ కాదు. ఎలక్షన్లలో పోరాడటానికి కారణం నేను చేయాలనుకున్న సామాజిక సేవా పరిధిని విస్తరించుకోవడానికి మాత్రమే. ముందూ అదే చేశాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను. ఇకముందూ అదే చేస్తాను. ఈ ప్రయాణానికి బ్రేక్ ఉండదు. ఎలక్షన్ కేవలం అదనపు ప్రక్రియ మాత్రమే.
     
మీ భర్త బ్రిజ్ మీ ఓటమితో బాధపడుతున్నారా?
 లేదు. అస్సల్లేదు. నా విషయాల్లో తనెప్పుడూ జోక్యం చేసుకోలేదు. నా ప్రతి నిర్ణయాన్నీ గౌరవించారు.
     
మీ అమ్మాయి సైనాకి వాళ్ల అమ్మ సమయం ఇప్పుడయినా దొరుకుతుందా?
సైనా ఇప్పుడు ఎనిమిదేళ్ల బిడ్డకు తల్లి. చాలా బిజీగా ఉంటుంది.ఇప్పుడు తనే వాళ్ల అమ్మకు సమయం ఇవ్వాలి.
     
మీరు చూసిన పురుషాధిక్యత ఇప్పుడు లేనట్లనిపిస్తోందా? పరివర్తన వచ్చిందంటారా?
ఇది ఒక పురుష ప్రపంచం అని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ, కీలక నిర్ణయం తీసుకునే అధికారం ఇంకా పురుషుల గుప్పిట్లోనే ఉంది. పురుషుల గుప్పిట నుండి మహిళల చేతుల్లోకి కండబలం, ధనబలం, ఎక్కడికైనా వెళ్లగలిగే స్వేచ్ఛ... అనే మూడు శక్తులు ఇప్పటికీ రాలేదు.

ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు?
సాత్వికమైన ఆహారాన్నే తింటాను. కేలరీస్ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. పోషకాలే కాదు, విలువలున్న ఆహారాన్నే ఇష్టపడతాను.మీ భర్తకు రోజుకు ఐదు ప్రేమ లేఖలు రాసేవారు.

ఆ ప్రేమ ఇంకా అలాగే ఉందా?
వయసు పెరిగితే కుదురు కూడా పెరుగుతుంది కదా!

సాక్షి పాఠకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
మళ్లీ కలుద్దాం..!
 
ప్రకాశ్‌లాల్ పెషావారియా, ప్రేమ్‌లతల నలుగురు కూతుళ్లలో ఒక కూతురు కిరణ్. తండ్రి ఆమెను గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి చేయాలనుకున్నాడు. అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల టెన్నిస్ టైటిల్‌ను కిరణ్ బేడీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో, ఆంధ్రా యూనివర్సిటీలోనే గెలుచుకున్నారు. (1968) జాతీయ స్థాయి ఆసియా స్థాయి పోటీలలో కిరణ్ 22 ఏళ్ల వయసుకు ఆ ఆటలో చాంపియన్ షిప్ సాధించినా ఇంతటితోనే ఆగిపోవడంలో విశేషం ఏమీ లేదనుకుంది. ఒక మహిళగా దేశ మహిళలకు ఆదర్శం కావాలి... ఒక యువతిగా దేశ యువతకు స్ఫూర్తినివ్వాలి... అవే ఆలోచనలు.
 
ఐ.ఏ.ఎస్ నుంచి....

దేశ సేవ చేయాలంటే ఏం చేయాలి? ఐఏఎస్ ఒక ఉన్నతమార్గం. ఇంగ్లిష్ సాహిత్యంతో బీఏ చేసి, తరువాత ఎంఏ రాజనీతి శాస్త్రం చదివి తను పుట్టి  పెరిగిన అమృత్‌సర్‌నే కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న కిరణ్ తన దృష్టినంతా సివిల్ సర్వీసెస్ మీదే పెట్టారు.  ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకున్నారు. పరీక్షలు రాస్తే ఫలితాలు వచ్చాయి. ఆమె వెంటనే తన కళాశాలలో పని చేసే తోటి అధ్యాపకుడైన బ్రిజ్ బేడీకి ఫోన్ చేసి తన పేరు ఐఏఎస్‌ల జాబితాలో లేదని, ఐపీఎస్ వచ్చిందని కన్నీళ్ల పర్యంతం అయ్యారు. రాని దాని కోసం బాధపడకుండా వచ్చినదానిలోనే ఎందుకు విజయం సాధించకూడదు అంటూ బ్రిజ్ ఆమెను సాంత్వన పరిచారు. కానీ కిరణ్ తల్లిదండ్రులు మహిళలకు స్థానంలేని పోలీస్ శాఖలో కూతురు చేరడానికి ఇష్టపడలేదు. అయినా బ్రిజ్ ప్రోద్బలంతో పోలీస్ శాఖలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమె బ్రిజ్‌నే వివాహం చేసుకున్నారు. అలా కిరణ్ పెషావారియా కిరణ్ బేడీ అయ్యారు. పెళ్లయిన రెండు మాసాలకే ట్రైనింగ్‌లో చేరాలని కిరణ్‌కి ఆదేశాలు వచ్చాయి. మొదటి పోస్టింగ్ ఢిల్లీలో. అప్పటికి బ్రిజ్ అమృత్‌సర్‌లో ఒక పరిశ్రమను స్థాపించుకున్నాడు. భార్యను ఆపలేదు. 520 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఢిల్లీకి ప్రతి వారాంతంలో వెళుతూ ఉండేవారు.
 
ప్రతి బాధ్యత ఒక సవాలు
1972లో పోలీస్ సర్వీస్‌లో చేరిన నాటి నుంచి 2007లో ‘వ్యక్తిగత కారణాల’తో ఉద్యోగానికి రాజీనామా చేసే వరకు కిరణ్ నిత్యం సంఘర్షణ పడ్డారు. కానీ రాజీ పడలేదు. తలొంచలేదు. ఆమె సామర్థ్యం ఎంత విశిష్టమైనదంటే  విధి నిర్వహణలో ఎంత దూకుడుగా ఉన్నా ఏదో ప్రాధాన్యంలేని పోస్టుకు బదలీ చేసి, ఖాళీగా ఉంచడానికి ప్రభుత్వాలు సాహసించలేదు. ఢిల్లీ ట్రాఫిక్ కమిషనర్, మిజోరం డిప్యూటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్, చండీగఢ్ లెఫ్టినెంట్ గవర్నర్, నార్కోటిక్స్ (మత్తు పదార్థాలు) కంట్రోల్ బ్యూరో డెరైక్టర్ జనరల్, ఐక్య రాజ్యసమితి శాంతి స్థాపక శాఖకు పోలీస్ సలహాదారు వంటి పదవులను ఆమె నిర్వహించారు. ఆసియాలోనే అతి పెద్ద కారాగారం తిహార్ జైలు అధిపతిగా కూడా కిరణ్‌ను పంపించారు. అరాచకానికీ, అకృత్యాలకీ కేంద్రంగా పేరు మోసిన ఆ జైలును ‘ఆరు మాసాలలో ప్రశాంతమైన నిలయంగా మారుస్తాను’ అని ఆమె ప్రతిన పూని, దానిని నెరవేర్చారు.

అడుగడుగునా సంచలనాలు...
కిరణ్ బేడీ ఉద్యోగ జీవితంలో చవి చూసిన అనుభవాలు అసాధారణం. ఇవన్నీ ఆమె సంచలనం కోసం చేయలేదు. విధి నిర్వహణలో భాగంగానే చేశారని మరచిపోకూడదు. ఢిల్లీలో ఇందిర కారును పక్కకు లాగించి అందరి కన్నెర్రకు గురైన కిరణ్, గోవాలో కూడా ఇందిర కారణంగానే వివాదంలో చిక్కుకున్నారు. 1983 మార్చిలో కిరణ్ గోవాలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అక్కడ జౌరీ నదిలో పడవల మీద అవతలి ఒడ్డుకు చేరేవారు. ఆ రద్దీని తట్టుకోవడానికే వంతెన కట్టారు. కానీ అది ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇందిరాగాంధీ రావాలి. కానీ ఆమె రాక వాయిదా పడుతూనే వచ్చింది. ఒకరోజు కిరణ్ అటుగా పోతూ ఈ రద్దీని చూసి విషయం తెలుసుకుని ప్రారంభోత్సవం వరకు రాకపోకలు జరగకుండా ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను స్వయంగా పక్కకు తప్పించి వాహనాలు, మనుషుల రాకపోకలకు అవకాశం కల్పించారు. సరిగ్గా అప్పుడే ఆమె ఏకైక కుమార్తె సైనా భరూచ్ ఆరోగ్యం క్షీణించింది. దీనితో కిరణ్ సెలవుకు దరఖాస్తు పెట్టి వెళ్లారు. అయితే ఆమెకు ప్రభుత్వం సెలవు మంజూరు చేయలేదు. అయినా ఆమె ఢిల్లీ వెళ్లారు. దీనిని ఆసరా చేసుకుని నాటి ముఖ్యమంత్రి ప్రతాప్‌సింహ్ రానే ‘కిరణ్ బేడీ కనిపించడం లేదు’ అంటూ దుష్ర్పచారం మొదలుపెట్టారు. దీనితో మీడియా రానేను చీల్చి చెండాడింది.

ఒక న్యాయవాది కేసులో ఆమెకు ఎదురైన మరో అనుభవం మరీ నాటకీయంగా ఉంటుంది. 1988 జనవరిలో సెయింట్ స్టీఫెన్ కళాశాల (ఢిల్లీ)లో చదువుకుంటున్న ఒక విద్యార్థిని పర్సును ఒక వ్యక్తి అపహరించాడు. వారం తరువాత మహిళలకు చెందిన ఒక మరుగుదొడ్డిలో అసభ్య రాతలు రాస్తూ దొరికాడు.  ఇతడి పేరు రాజేశ్ అగ్నిహోత్రి అనీ, టీస్‌హాజరీ కోర్ట్స్ కాంప్లెక్స్‌లో న్యాయవాది అనీ తేలింది. అయితే బేడీ అతడిని అన్యాయంగా కేసులో ఇరికించారని న్యాయవాదులంతా గొడవ ప్రారంభించారు. అయితే బేడీ అతడికి బేడీలు వేయడం సరైనదేనని సమర్థించారు. న్యాయవాదులు అల్లర్లకు దిగితే లాఠీచార్జి కూడా జరిగింది. చివరికి వాద్వా కమిటీ వేసి, ఆమెను మిజోరాం రాష్ట్రానికి బదలీ చేశారు. అక్కడ నుంచి వచ్చి కొద్దిరోజులు ఢిల్లీలో పని చేశాక, తిహార్ జైలు ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమించారు. 2,500 కరడుగట్టిన నేరగాళ్లు ఉండే ఈ జైలులో ఆమె పలు సౌకర్యాలు కల్పించారు. యోగాకు, చదువుకోవడానికి వీలు కల్పించారు. అయితే చార్లెస్ శోభారాజ్ తప్పించుకున్న ఘటనలో ఆమె ఆరోపణలను ఎదుర్కొని ఆ పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. చిత్రం ఏమిటంటే, దేశంలో చాలామంది రాజకీయ నాయకులు, సహోద్యోగులు ఆమె చర్యలకు, సంస్కరణలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినా అక్కడ ఖైదీలకు చేసిన సేవలకీ, తెచ్చిన మార్పుకీ గుర్తింపుగా మెగెసెసె పురస్కారం దక్కింది. ఇదే చిత్రం.

ప్రేమ... పెళ్లి... డ్యూటీ
1971లో పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఒక టెన్నిస్ కోర్టులో కిరణ్ బేడీ బ్రిజ్ బేడీ కలుసుకున్నారు. తొలి చూపులు కలిశాయి. అతడికి సైన్యంలో, ఇంజనీర్‌గా కొన్ని మంచి అవకాశాలు వచ్చినా భూస్వామి కావడాన అమృత్‌సర్‌లోనే పరిశ్రమ స్థాపించుకున్నాడు. అతడి పట్ల కిరణ్ ప్రేమ గొప్పగా ఉండేది. ఐపీఎస్ ట్రైనింగ్ కోసం వెళ్లినా ఒకే రోజున 1,2,3,4,5 నెంబర్లతో అతడికి ఉత్తరాలు రాసేది. వాళ్ల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ఇద్దరికీ కర్మకాండల మీద పెద్దగా నమ్మకం లేకపోవడంతో ఒక శివాలయంలో ఏడు అడుగులు నడిచారు. ఇద్దరి సంపాదనలో కొంత ఖర్చు పెట్టి మిత్రులకు విందు ఇచ్చారు. అది జరిగిన రెండు మాసాలకే ట్రైనింగ్‌కు ఆమె వెళ్లిపోయింది. ఆయన ‘విజిటింగ్ హజ్బండ్’గా మిగిలి పోయాడు. అయినా ఏనాడూ ఆమె ఉన్నతికి అడ్డు తగలలేదు. 1975లో కూతురు పుట్టింది. మొదటి పేరు సుకృతి. తరువాత పెట్టుకున్న పేరు సైనా. ఆమె జర్నలిస్ట్. భర్త భరూచా కూడా జర్నలిస్ట్. షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు ఆ ఇద్దరు. సైనాకు 13 ఏటనే ల్యూకోడెర్మా సోకింది. అందుకే ఆమె పెద్దగా బయట తిరగరు. తల్లిని డ్యూటీకి వెళ్లవద్దని, తన దగ్గర ఉండమని చిన్నారి సైనా ఎంత చెప్పినా, ‘నేను పోవాలి’ అంటూ కిరణ్ విధులకు వెళ్లిపోయేవారు. దీనితో సైనా అటు ఢిల్లీలోనే ఉన్నా తల్లి ప్రేమకీ, అమృత్‌సర్‌లో ఉండిపోయిన తన ప్రేమకీ నోచుకోలేక పోయిందని బ్రిజ్ బాధ పడుతూ ఉంటారు.

క్రేన్ బేడీ-ఇందిర
1973 సంవత్సరం, గణతంత్ర దినోత్సవం. మొదటిసారి ఒక మహిళ ఖాకీదుస్తులలో కవాతు చేసింది. ఆ దృశ్యం సాక్షాత్తు నాటి ప్రధాని ఇందిరాగాంధీని సైతం ఆనందాశ్చర్యాలలో ముంచెత్తేటట్టు చేసింది. మరునాడే తనతో బ్రేక్‌ఫాస్ట్ చేయవలసిందిగా కిరణ్ బేడీకి ఇందిర వర్తమానం పంపింది. సరిగ్గా తొమ్మిదేళ్లకి మరో సంఘటన జరిగింది. ఆగస్ట్ 5, 1982న ఢిల్లీలో కన్నాట్‌ప్లేస్‌లో డీహెచ్‌ఐ 1817 నెంబరు అంబాసెడార్ కారు రాంగ్ పార్కింగ్‌లో ఉంది. అది పీఎం హౌస్ కారు. అంటే ఇందిరాగాంధీ గృహావసరాలకు ఉపయోగించుకునే వాహనం. ఆ కారును నాటి ఢిల్లీ ట్రాఫిక్ కమిషనర్‌గా ఉన్న కిరణ్‌బేడీ పక్కకు లాగి పెట్టించారు. మరునాడు పేపర్లలో ప్రధాని కారు గురించి వార్త పతాక శీర్షికలలో దర్శనమిచ్చింది. ఆ మరునాడే గోవాకి బదలీ చేస్తూ కిరణ్ చేతికి పత్రాలు వచ్చాయి. ఈ ఉదంతం తరువాతే కిరణ్ బేడీని క్రేన్‌బేడీ అని పిలవడం మొదలైంది. ఇది జరిగిన మూడు దశాబ్దాల తరువాత  2015లో ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్నప్పుడు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమె ఇదే  విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నిజానికి ఇందిర కారును పక్కకు లాగిన ఘనత తనది కాదని నిర్మల్‌సింగ్ అనే ఎస్‌ఐదని కాని నిర్మల్‌సింగ్ కంటే పై అధికారి అయిన అశోక్ టాండన్, అంతకంటే పై స్థాయిలో ఉన్న తాను ఈ విషయంలో ఎస్‌ఐకి గట్టి మద్దతుగా నిలబడ్డామని చెప్పారు. పత్రికల వాళ్లు నిర్మల్‌సింగ్‌పై చర్య తీసుకుంటారా అని అడిగారు. ‘తీసుకోను. పైగా అతడు చూపించినా సాహసానికి పురస్కారం కూడా ఇస్తాను!’ అని ఆనాడు కరాకండీగా చెప్పగలిగారు కిరణ్. నిజమే, ఆమెలో చండశాసనుడైన పోలీస్ అధికారి, చల్లని స్పర్శ ఇవ్వగలిగిన స్త్రీ ప్రవృత్తి రెండూ ఉన్నాయి. 

 
మహిళా ఐపీఎస్ అధికారిగా కిరణ్ బేడీ తాను నిర్వహించిన పదవులన్నిటికీ వన్నె తెచ్చారు. 1986లో ఢిల్లీ నార్త్ డిస్ట్రిక్ట్ డీసీపీగా విధులు నిర్వహించేటప్పుడు మత్తుపదార్థాల నిరోధానికి  కృషి చేశారు.{పతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ డీటాక్స్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తోటి ఉద్యోగులతో కలసి ‘నవజ్యోతి పోలీస్ ఫౌండేషన్’ పేరిట ఆమె నెలకొల్పిన స్వచ్ఛంద సంస్థ దేశప్రజలందరినీ ఆకట్టుకుంది. రెండు మూడేళ్ల క్రితం సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి నిరోధక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.   ఉద్యోగ జీవితంలో ఆరోపణల కారణంగా ఏ ఒక్క ఉద్యోగి మీద చర్య తీసుకోలేదు. వేటు వేయలేదు. పైగా వారిలో విశ్వాసం పెరగడానికి ఒకేరోజు 1,600 మంది సిబ్బందికి పదోన్నతులు కల్పించారు. ‘ఈ దేశంలో దమ్ములున్న ఏకైక మహిళ కిరణ్‌బేడీ’ అని కుష్వంత్ సింగ్ కితాబిచ్చారు.
 
టెన్నిస్‌లో ఆసియా స్థాయి పోటీల్లో ఛాంపియన్ షిప్
టీచర్‌గా కెరియర్ ప్రారంభం
ఐఏఎస్‌కు సెలక్ట్ కాలేదని కన్నీరుమున్నీరు
తోటి అధ్యాపకుడైన బ్రిజ్ బేడీని పెళ్లాడారు
{పధాని ఇందిర కూడా రూల్స్‌కి అతీతం కాదన్నారు
తీహార్ జైల్‌ను పరివర్తన మందిరంగా మార్చారు
అత్తగారంటే దైవసమానం.. అత్తమ్మ ఆశీర్వాదం లేనిదే ఏ పనీ చేసేవారు కాదు
విజయశాంతి ‘కర్తవ్యం’ సినిమాకు కిరణ్ జీవితమే మూలం. అదే హిందీలో ‘తేజస్విని’ పేరుతో వచ్చింది

వరించిన పురస్కారాలు: రామన్ మెగసెసే, రాష్ట్రపతి పతకం, ‘అత్యంత ఆరాధనీయ మహిళ’గా ది వీక్ మేగజైన్ అవార్డు, ఐక్యరాజ్యసమితి అవార్డు, ఐఐటీలో డాక్టొరేట్

- డాక్టర్ గోపరాజు నారాయణరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement