స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా | special power of attorney | Sakshi
Sakshi News home page

స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా

Published Mon, Feb 1 2016 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

special power of attorney

ఇండియాలోని మీ ఆస్తిని అమ్ముకోవచ్చు!
లీగల్ కౌన్సెలింగ్
 

నేను విదేశంలో స్థిరపడిన మహిళను. నా భర్త చనిపోయి చాలా ఏళ్లు అయింది. హైదరాబాద్‌లో నాకొక ఇల్లు ఉంది. దాన్ని నేను అమ్మే ప్రయత్నాలు చేస్తున్నాను. ప్రతిసారీ ఎవరో ఒకరు ఇంటిని కొంటానని మాట్లాడ్డం, బేరం కుదుర్చుకోవడం, నేను ఇండియా రావడం జరుగుతున్నది. ఏదో ఒక కారణంతో అమ్మకం ఆగిపోతున్నది. నేను ప్రతిసారీ ఇండియా రావాలంటే  కష్టమవుతుంది. శ్రమతో కూడుకున్న, డబ్బుతో కూడుకున్న వ్యవహారం అవుతోంది. నేను ఇండియా రాకుండా నా తరపువారు ఆ ప్రాపర్టీ అమ్మవచ్చా? వివరించగలరు.
 - ఓ సోదరి


 ప్రతిసారీ మీరు ఇండియా వచ్చి మీ సమయం, డబ్బు వృథా అవకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. మీకు బాగా నమ్మకస్తులైన వ్యక్తికి మీరు ‘స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ’ రాసి ఇవ్వండి. అంటే మీ తరపున ఆ ఇంటికి అతడు అమ్మిపెట్టే వెసులుబాటు అంటే అతడు మీ ఏజెంట్‌గా వ్యవహరిస్తాడు. ఏ వ్యక్తి అయినా అతనికి చాలా ఆస్తులున్న కారణంగా కానీ, ఆస్తులొకచోట, తనొక చోట ఉన్న కారణంగా కానీ - ఆస్తుల నిర్వహణ, క్రయ, విక్రయాల్లో ఇబ్బందులు ఏర్పడినపుడు తన ఆస్తి వ్యవహారాలు చూసిపెట్టేందుకు తన తరపున ఒక ఏజెంట్‌ను నియమించుకోవచ్చును. మీ విషయంలో కేవలం ఒక ఇల్లు అమ్మడానికి మాత్రమే సమస్య అంటున్నారు, కాబట్టి కేవలం ఆ ఇంటికి అమ్మిపెట్టే నిమిత్తమై మాత్రమే మీకు నమ్మకమైన వ్యక్తులకు స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ రాసి రిజిష్టర్ చేసి ఇవ్వండి. అతడు ఆ ఇంటిని మీ తరపున అమ్మివేయగానే పవర్ ఆఫ్ అటార్నీ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.
 
మా వివాహమై రెండు సంవత్సరాలైంది. నా భర్త, అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తుంటే క్రిమినల్ కేస్ పెట్టాను. దానితోపాటు విడాకులకు పిటిషన్ వేశాను. నా కట్నం డబ్బులు తిరిగి ఇవ్వవలసిందిగా ఆ పిటిషన్‌లో అడిగాను. వివాహంలో వరునికి ఏమీ ఇవ్వలేదని (అంటే పీటల మీద వరునికి ఏమీ ఇవ్వలేదని) కాబట్టి కట్న ప్రసక్తే లేదని వారంటున్నారు. దయచేసి వరకట్నమంటే ఏమిటో తెలిపి నా కేస్ నడుపుకునేలాగా సహాయం చేయండి. నా తల్లిదండ్రులు మా అత్తమామలకు మా వివాహానికి ముందే 10 లక్షల రూపాయలు అందచేశారు.
 - గౌతమి, విజయవాడ

 
వరకట్న నిషేధ చట్టం 1961 సెక్షన్ ‘2’ వరకట్నమంటే ఏమిటో అన్న విషయాన్ని చాలా చక్కగా నిర్వచించింది. ఆ సెక్షన్ ప్రకారం...వివాహ సందర్భంగా వధూవరులలో ఒకరు మరొకరికి ఇచ్చిన లేక ఇవ్వడానికి అంగీకరించిన ఆస్తి లేక విలువ గల సెక్యూరిటీని కట్నం అంటారు.

కట్నం డబ్బు రూపంలో కానీ, ఆస్తి రూపంలో కానీ, సెక్యూరిటీ రూపంలో కానీ ఉండవచ్చు.కట్నం కేవలం వివాహం జరిగే సమయంలో ఇవ్వాలని లేదు. వివాహానికి ముందు లేదా తర్వాత కూడా ఇవ్వవచ్చును. అయితే తప్పనిసరిగా వివాహానికి సంబంధించినదై ఉండాలి. కేవలం వరునికి ఇవ్వబడేదే కట్నం కాదు. వధువుకు వరుడు ఇచ్చినా, వరుని తల్లిదండ్రులకు వధువు తల్లిదండ్రులు ఇచ్చినా అది వరకట్నమవుతుంది. మీ సందేహం తీరిందనుకుంటాను. మీ వివాహానికి ముందే మీ పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్‌కు డబ్బు ఇచ్చారు కాబట్టి, అదీ వివాహ నిమిత్తమై కాబట్టి, కచ్చితంగా అది కట్నమే.
 
నేనొక సీనియర్ సిటిజన్‌ను. ఒక మారుమూల గ్రామంలో ఉంటాము. ఇక్కడ కులరాజకీయాలు ఎక్కువ. నేను నిమ్న జాతివాడిననే కారణంగా మా ఊళ్లో గల పురాతన శివాలయంలోకి నన్ను రానివ్వకుండా కొందరు ఆక్షేపిస్తున్నారు. ఈ కాలంలో కూడా ఇది న్యాయమంటారా?
 - పురంధర్, ఆదిలాబాద్

 కచ్చితంగా న్యాయం కాదు. ఇది రాకెట్ యుగం. సాంకేతిక యుగం. ఇంకా ఇలాంటివి జరగడం సిగ్గుచేటు, బాధాకరం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించింది. అందువల్ల పౌరులకు వచ్చిన హక్కులను సివిల్ రైట్స్ లేక పౌరహక్కులు అంటారు. దీనికి సంబంధించి ‘పౌరహక్కుల రక్షణ చట్టం 1955’ వచ్చింది. కులం కారణంగా సామాజిక అసమానతలు పాటిస్తే అది నేరమవుతుంది. దేవాలయ ప్రవేశాన్ని నిషేధించినా, కోనేరు, చెరువుల్లో స్నానం చేయకుండా నిరోధించినా, సాంఘిక అసమానతలు పాటించినా అది నేరమవుతుంది. శిక్షలూ పడతాయి. మీరు చెప్పిన విషయం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచార నిరోధక చట్టం 1989 కిందకు కూడా వస్తాయి.

ఆర్థిక, సాంఘిక బహిష్కరణలకు సంబంధించి శిక్షలు కఠినతరం చేయాలని ఈ సం॥చట్టానికి సవరణ కూడా చేశారు. 5 నుండి 10 సం॥శిక్ష పడే అవకాశం ఉన్నది. న్యాయస్థానాన్ని/పోలీసులను ఆశ్రయించండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement