అజిత్ ..రజనీలా స్టైలిష్ స్టార్ కాడు
సావుక్కు బయందవన్ దినమ్ దినమ్ సావాన్!
కొందరికి జుట్టు నెరుస్తుంది...
మనోడికి జుట్టు మెరుస్తుంది...
సదరన్ సినిమాలో అతనొక సిల్వర్ లైనింగ్!
లైఫ్ చాలా సింపుల్... నో వైనింగ్... నో డైనింగ్!!
రిస్కు అజిత్‌కుమార్ ఇంటిపేరు...
మంచితనం ఆయన ముద్దుపేరు...
రత్నం మాటల్లో చెప్పాలంటే -
తన కమ్‌బ్యాక్‌కు అజిత్ పెద్ద కట్నం.
‘నామ వాళనువ్‌ునా... యార వేణా, యతనపేర వేణా కొల్లలావ్‌ు’ (మనం బతకాలంటే... ఎవరినైనా, ఎంత మందినైనా చంపచ్చు). ఇది తమిళ సూపర్‌హిట్ ‘బిల్లా’ లోని డైలాగ్. రీల్ లైఫ్‌లో ఈ డైలాగ్‌తో మాస్‌ను ఉర్రూత లూపిన హీరో అజిత్. కానీ, రియల్ లైఫ్‌లో ఆయన క్యారెక్టర్ మాత్రం ఆ పాపులర్ డైలాగ్‌కు పూర్తి విరుద్ధం. మనం బతకడం కాదు... చుట్టూ అంతా బతకాలి, బాగుండాలి. ఇదీ అజిత్ తత్త్వం.
అందుకే, అజిత్ గురించి మాట్లాడుకొనే ముందు...
నిర్మాత ఏ.ఎం. రత్నం గురించి చెప్పుకోవాలి! ఒకటా... రెండా... బోల్డన్ని కోట్లు పోసి, ‘భారతీయుడు’, ‘జీన్స్’ లాంటి భారీ చిత్రాలు తీసిన నిర్మాత. ఆయన అడగడమే ఆలస్యం... ఏ హీరో అయినా డేట్లివ్వాల్సిందే! నిర్మాతగా రత్నానికున్న క్రేజ్, ఇమేజ్ అలాంటివి.
కానీ... అదంతా గతం! ఇప్పుడు రత్నం వాళ్ళెవరికీ గుర్తు లేడు.
ఒక్కడికి మాత్రం గుర్తున్నాడు. ఆ ఒక్కడూ - అజిత్. రత్నం లాంటి నిర్మాతను నిలబెడితే, ఇండస్ట్రీకి మంచిదని అజిత్ నమ్మాడు. అజిత్ ఎప్పుడూ అంతే! తను నమ్మిందే చేస్తాడు. అప్పుడెప్పుడో తన ‘కాదల్ కోట్టై’ని తెలుగులో ‘ప్రేమలేఖ’గా అందించిన రత్నాన్ని పిలిచి మరీ డేట్లి చ్చాడు. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా మూడు సినిమాలు. నిన్నటి ‘ఆరంబం’... తాజా ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ‘ఎంతవాడు గానీ’గా రానుంది) సూపర్‌హిట్. ఇప్పుడు మూడోది మొదలైంది. రత్నం పుంజుకున్నాడు. వైభవం మళ్ళీ మొదలైంది. ఇదంతా అజిత్ చలవే!
మీకు శ్రీకర్ గుర్తున్నాడా?
పోనీ... గొల్లపూడి మారుతీరావు కొడుకు తీసిన ‘ప్రేమ పుస్తకం’ (1993) సినిమా గుర్తుందా? ఆ శ్రీకరే... ఈ అజిత్. హీరోగా అతని ఫస్ట్ ఫిల్మ్ అదే. నిజానికి, హీరో అజిత్ తొలి అడుగులోనే సినిమా కథంత డ్రామా ఉంది. అవకాశమిచ్చిన గొల్లపూడి కొడుకు శ్రీనివాస్ షూటింగ్ మొదలైన తొమ్మిదో రోజే చనిపోయాడు. వైజాగ్ షూటింగ్‌లో రాకాసి సముద్రపు అల మింగేసింది. శ్రీనివాస్ శవాన్ని శ్మశానం దాకా మోశాడు అజిత్. దుఃఖాన్ని దిగమింగి, కొడుకు ప్రేమించిన వెండితెర పుస్తకాన్ని గొల్లపూడి పూర్తి చేశాడు. అజిత్ హీరో అయ్యాడు. ఆ సినిమా ఆడలేదు. కానీ, అజిత్‌కు తమిళ్ ఛాన్‌సలొచ్చాయి.
రజనీకాంత్, కమలహాసన్‌లను అభిమానించిన అజిత్...
వాళ్ళు క్రమంగా స్లో అవుతున్న టైమ్‌లో వచ్చాడు. లిబరలైజేషన్ ఎరాలోని నవతరం ప్రేక్షకుల టైవ్‌ులో వచ్చాడు. విక్రమ్, విజయ్ లాంటి కొత్త నీటితో పైకొచ్చాడు. తెలుగు ఫీల్డ్‌లోకి మళ్ళీ రాలేనంత బిజీ అయ్యాడు.
తమ్ముడి భార్య మీద కన్నేసిన అన్న!
ఏ హీరో అయినా ఇలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకుంటాడా? అజిత్ ఒప్పుకున్నాడు. తమ్ముడి పాత్ర తనే! మూగ, చెవిటివాడైన అన్న కూడా తనే! ఎంత కష్టం... ఎంత రిస్కు! కానీ, అజిత్ అదరగొట్టాడు. తెలుగులోనూ డబ్ అయింది. ఇప్పటికీ తెలుగువాళ్ళకు అజిత్ అంటే ‘వాలి’ గుర్తొస్తుంది.
యూత్‌ఫుల్, రొమాంటిక్ పాత్రలతో అజిత్ స్టార్టయ్యాడు.
యాక్షన్ పాత్రలకు ఎదిగాడు. నెరిసిన జుట్టుతో మెచ్యూర్ పాత్రలకు మారాడు. 44 ఏళ్ళ వయసుకే పాతికేళ్ళ కెరీర్... 55 సినిమాలు. సినిమాను అజిత్ అమితంగా ప్రేమిస్తాడు. డబ్బు పెట్టిన నిర్మాత, తీస్తున్న దర్శకుడూ బాగుండాలని తపిస్తాడు. రిజల్ట్ - గత ఎనిమిదేళ్ళలో 5 హిట్స్ (‘బిల్లా, మంగాత్తా, ఆరంబమ్, వీరమ్, ఎన్నై అరిందాల్’).
అజిత్... రజనీకాంత్‌లా స్టైలిష్ స్టార్ కాడు!
కమల్‌లా అద్భుతమైన పెర్ఫార్మరూ కాడు! విజయ్, ధనుష్‌లా పచ్చి మాస్ హీరో అసలే కాడు! కానీ, వాళ్ళందరిలో లేనిది ఇతనిలో ఉంది. అదే జనాలకు నచ్చింది. ఎక్‌స్ట్రాలు లేవు... హంగామాలు లేవు... ఇప్పుడతను తమిళ సినిమాకు సెలైంట్ నంబర్‌వన్!
ఎన్ని సినిమాలు చేసినా ‘అమర్కళమ్’ అజిత్ లైఫ్‌లో స్పెషల్.
(‘అద్భుతం’గా డబ్ అయింది. ఎస్పీబీ గుక్కతిప్పుకోకుండా పాడిన ‘నిత్యం ఏకాంత క్షణమే అడిగా...’ పాట గుర్తుందిగా!) నటి శాలినితో అతను కలసి చేసిన సినిమా అదొక్కటే! మొదట వాళ్ళిద్దరూ కేవలం కో-స్టార్స్... ఆపైన ఫ్రెండ్సయ్యారు. ఆ ఫ్రెండ్‌షిప్ ప్రేమైంది. గుడి గంటలు, చర్చి బెల్స్ సాక్షిగా వారిని ఏకం చేసింది. పేరుకు తగ్గట్లే ఆ సినిమా వాళ్ళ లైఫ్‌లో జరిగిన అద్భుతం.
అజిత్... నచ్చింది చేస్తాడు... నచ్చినట్లు బతుకుతాడు
కేరళ అయ్యర్‌కీ, కలకత్తా సింధీకీ హిందువుగా పుట్టి, క్రిస్టియన్ శాలినిని పెళ్ళి చేసుకోవడం కావచ్చు... ఆరు సిన్మాలుగా జుట్టుకు రంగేయకపోవడం కావచ్చు... కలెక్షన్స్ కోసం సినిమా ప్రమోషన్‌కు తిరగకపోవడం కావచ్చు... యాడ్స్‌లో చేయనని భీష్మించుకోవడం కావచ్చు... చివరకు, ఇంట్లో పనివాళ్ళకు ఇళ్ళు కట్టించి ఇవ్వడం కావచ్చు...
సినిమా ఫీల్డ్‌లో అజిత్ ఒక యునీక్ ఎగ్జాంపుల్!
ఆటో మెకానిక్‌గా మొదలై... రేసింగ్‌కి డబ్బు కోసం ఒక గార్మెంట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో ఉద్యోగం చేసి... పత్రికల్లో ప్రకటనలకు మోడల్‌గా మారి... సినిమాల్లో స్థిరపడిన రోజులన్నీ అజిత్‌కు బాగా గుర్తే!
ఒకటే జీవితం... దాన్ని అనుకున్న రీతిలో, ఆనందంగా గడపాలి. అది అతని తత్త్వం. ‘సావుక్కు బయందవన్ దినమ్ దినమ్ సావాన్. బయప్పడాదవన్ ఒరు తడవదాన్ సావాన్’ (చావంటే భయమున్నవాడు రోజూ చస్తాడు. భయం లేనివాడు ఒకేసారి చస్తాడు). ఇది అజిత్ సినిమా పంచ్ డైలాగే కాదు. ఆయన లైఫ్ ఫిలాసఫీ కూడా. అందుకే, భయపడకుండా రిస్క్ చేస్తాడు - అది షూటింగ్‌లో ఫైటైనా! బయట రేసైనా! పద్ధెనిమిదో ఏట నుంచి బైక్, కారు రేసుల్లో దేశ విదేశాల్లో పాల్గొన్న ప్రాణం అజిత్‌ది. ప్రమాదాల పాలయ్యాడు. ఒకటి కాదు... రెండు కాదు... 15 సర్జరీలు... అందులో 5 ఏకంగా వెన్నెముకకే! అయినా ఆగలేదు. ‘బిల్లా’లో డైలాగ్‌లా ‘అయావ్‌ు బ్యాక్’ అన్నాడు. ‘ఫార్ములా 2’ రేస్‌లో పాల్గొన్నాడు. బైకు, కారే కాదు... విమానం నడపాలని అజిత్ ఆశ. ప్రైవేట్ పైలట్ లెసైన్స్ రాలేదు. అజిత్ నిరాశపడి, ఆగిపో కుండా ఏరో- మోడలింగ్ చేశాడు. రెండేళ్ళ క్రితం స్విట్జర్లాండ్‌లో కొన్న కొత్త బి.ఎం.డబ్ల్యు బైక్‌పై పుణే నుంచి చెన్నై దాకా రైడ్ చేశాడు. తనలోని పసితనం కాపాడుకుంటున్నాడు.
మరి, ఇప్పుడు అజిత్ ఏం చేస్తున్నాడు?
నిన్నటి నుంచి తన 56వ సినిమా (నిర్మాత రత్నం) షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. షూటింగై పోగానే, వరుస హిట్ల విజయగర్వం తలకెక్కించుకోకుండా, హాయిగా ఇంట్లో ఏడేళ్ళ కూతురు అనౌష్కతో, రెండు నెలల చంటిపిల్లాడు ఆద్విక్‌తో గడుపుతున్నాడు.
అజిత్ ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలే! సగటు సినీ హీరోగా క్వాలిఫై అయ్యేంత హైట్ అతనికి లేకపోవచ్చు. కానీ, లైఫ్ ఫిలాసఫీలో అతనిది టవరింగ్ పర్సనాలిటీ!
విడ్డూరం ఏమిటంటే - అజిత్ ఫ్యాన్ క్లబ్స్ వద్దం టాడు. అమ్మానాన్నను బాగా చూసుకోండని చెబుతాడు. అవసరంలో ఉన్నవాళ్ళకు అండగా నిలబడమంటాడు. ఎ.ఎం. రత్నానికి అజిత్ చేసింది అదే! అందుకే, చాలా మంది స్టార్స్ ఉండచ్చు. కానీ, అభిమానులు అన్నట్లు ‘అల్టిమేట్ స్టార్’ మాత్రం అజితే! పేరు, ప్రతిష్ఠ, డబ్బు, ఈ స్టార్ స్టేటస్... ఇవాళ ఉంటాయి. మరి, రేపటికి...? అజిత్ ఉంటాడు!!
- రెంటాల జయదేవ
కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్
ఇవాళ తమిళనాట అజిత్ సినిమా వస్తోందంటే, డిస్ట్రిబ్యూటర్లకూ, థియేటర్లకూ పండగే! సినిమా ఎలా ఉన్నా సరే, ఓపెనింగ్స్ అదిరిపోతుంటాయి. ఇంకా చెప్పాలంటే, ఇవాళ రజనీకాంత్ సినిమాల కన్నా ఎక్కువ ఓపెనింగ్స్ అజిత్‌కు వస్తున్నాయని తమిళ సినీ వ్యాపార వర్గాల కథనం. అందుకే, ఫ్యాన్స్ అజిత్‌ను ‘తల’ (నాయకుడనే అర్థంలో ‘తలైవా’కు సంక్షిప్త రూపం), ‘కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్’ అని పిలుస్తుంటారు.
తోటి హీరోలతో పోలిస్తే, సంఖ్యాపరంగా అజిత్ హిట్స్ తక్కువే కావచ్చు. కానీ, సినిమా హిట్టయిందీ అంటే... ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేసినట్లే! బాక్సాఫీస్ వద్ద ఆ క్రేజు, స్టార్‌డమ్ అజిత్ సొంతం. తక్కువ హిట్స్‌తో, ఎక్కువ పాపులారిటీ సాధించిన తమిళ హీరో అంటే అజితే!
మంచితనం ఎక్కువ
‘‘స్టార్స్‌కు భిన్నంగా అజిత్‌లో సింప్లిసిటీ, మంచితనం ఎక్కువ. ఎందరో నిర్మాతలు వెయిట్ చేస్తున్నా, ఆయనే నన్ను పిలిచి మరీ డేట్లిచ్చారు. యూనిట్‌లో ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా, అవసరమైన సాయం చేస్తారు. తమిళనాట యూత్‌కు ఆయనంటే క్రేజ్. ఆయనే తమ రోల్‌మోడల్, ఇన్‌స్పిరేషన్ అంటారు.’’
- ఎ.ఎం. రత్నం, ప్రముఖ సినీ నిర్మాత