ఎవరి మాటా వినలేదు | special storty to Disabled | Sakshi
Sakshi News home page

ఎవరి మాటా వినలేదు

Published Mon, Nov 30 2015 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM

ఎవరి మాటా వినలేదు

ఎవరి మాటా వినలేదు

‘నువ్వు చెయ్యలేవు’
‘నీతో కాదు’
‘ఎంత కష్టమో తెలుసా?’...
ఇలా... ఎవరేం చెప్పినా,
ఎవరెన్ని చెప్పినా వీరు వినలేదు!
అన్నీ సక్రమంగా ఉన్న పిల్లలకే
మనం అనేక జాగ్రత్తలు చెబుతాం.
ఇక వీళ్లలా వైకల్యం ఉన్న
పిల్లలకి ఎన్ని చెప్పాలి?
చెప్పారు.
తల్లిదండ్రులు చెప్పారు.
అయినవాళ్లూ చెప్పారు.
అయినా వీళ్లు వినలేదు.
జీవన పోరాటంలో ధైర్యంగా ముందుకు దూసుకెళ్లారు.
ఏ జాగ్రత్తలను, ఏ హెచ్చరికలను,
 ఏ భయాలనూ...
లెక్క చెయ్యక ... మౌనంగా ఎదుగుతున్నారు.
ధీశాలురైన ఈ యువరాజులకు సాక్షి సలామ్.

 
మూర్తి స్వస్థలం నెల్లూరు జిల్లా. పుట్టుకతోనే వికలాంగుడు. డిగ్రీ పూర్తి చేశాడు. తెలిసిన వారి ద్వారా ఓ కాల్ సెంటర్‌కి జాబ్ అప్లికేషన్ పెట్టుకున్నాడు. తల్లీతండ్రీ కూడా కొడుకుతో పాటు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. మూర్తి జాబ్‌కు ఎంపికయ్యాడు. అయితే పేరెంట్స్ వద్దన్నారు. ‘పట్టణంలో ఒక్కడివే ఉండగలవా, ఆఫీస్‌కు వెళ్లి రావాలంటే ఒక్కడివే వెళ్లాలి. అంత దూరం కర్ర పట్టుకొని ఎలా వెళతావు? బస్సులల్లో తిరగగలవా..? ఎందుకింత కష్టం.. ఇన్నాళ్లూ బతికించలేదా.. మేమున్నంతవరకు నీకే లోటూ రాకుండా చూసుకుంటాం..’ అని తిరిగి ఊరికి తీసుకెళ్లారు. ఇప్పుడు మూర్తి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఏ పనీ లేదు. భవిష్యత్తు బెంగతో ఉన్నాడు.
 
నల్లగొండకు చెందిన వెంకట్‌దీ ఇలాంటి కథే.  చిన్నప్పుడు ప్రమాదంలో ఓ కాలు కోల్పోయాడు. ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. ఫార్మా కంపెనీలో జాబ్ వచ్చింది. ఉండటానికి, తినడానికి వసతి సదుపాయాలు ఆ కంపెనీయే కల్పిస్తోంది. అందుకు సరే అంటే ఉద్యోగంలో చేరచ్చు అని చెప్పారు కంపెనీవాళ్లు. దీంతో వెంకట్ పేరెంట్స్ -‘చిన్నప్పటి నుంచి మా వాడు మమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా ఎక్కడా ఉండింది లేదు. వాడు అలా ఉండలేడు. ఇంటికి-ఆఫీస్‌కు అప్ అండ్ డౌన్ చేసే జాబ్ అయితే చేస్తాడు. తనుగా ఎప్పుడూ ఒంటరిగా వెళ్లలేదు. కాబట్టి క్యాబ్ సదుపాయం ఇస్తే బాగుంటుంది’ అన్నారు.’ కంపెనీ రూల్స్ ఒప్పుకోవన్నారు. సెలక్ట్ అయిన జాబ్ పోయింది. ఏడాది పూర్తయినా వెంకట్‌కి ఇంకా జాబ్ రాలేదు.
   
నిజానికే అంగవైకల్యం శరీరానికే గానీ మనసుకు కాదు. నేటి రోజుల్లో అంగవికలురు ఎన్నింటిలోనో తమ సత్తా చాటుకుంటున్నారు. కుటుంబసభ్యుల మీద ఆధారపడి బతుకు భారంగా నెట్టుకురాకుండా కొత్త ఆశలతో తమకు తాముగా నిలబడుతున్నారు. కొందరు తమలాంటి వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. అయితే, ‘అంగవైకల్యం ఉన్నవారిని వారి కుటుంబసభ్యులే భయంతో వెనక్కి లాగుతున్నారు’ అంటున్నారు హైదరాబాద్‌లోని ‘యూత్‌ఫర్ సేవా అనేబుల్ వింగ్’ కి కో ఆర్డినేటర్‌గా ఉన్న విజయ్. ‘పెద్ద పెద్ద కంపెనీల వాళ్లు కూడా డిసేబుల్ వాళ్లను పనిలో పెట్టుకోడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. వికలాంగులు పనులు నిబద్ధతో చేయడమే అందుకు కారణం’ అని ఆయన అంటున్నారు.
 
స్వేచ్ఛ ఇస్తేనే ఎదుగుదల...
 వ్యాపారం, వృత్తి, ఉద్యోగం.. ఏదైనా నచ్చిన పని చేయడానికి తగినంత స్వేచ్ఛ ఉండాలి. అందుకు తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది. వికలాంగులు అవడం వల్ల పిల్లలు కష్టపడతారేమో అని వారు ఆలోచిస్తున్నారు  కానీ, ‘వచ్చిన అవకాశాల్ని పోగొట్టుకుంటూ... మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వస్తాయే రావో అనే సందిగ్ధంలోనే మాలో చాలామంది రోజులను వెళ్లబుచ్చుతున్నాం’ అంటున్నారు మూర్తి. వికలాంగుడైన మూర్తి ఉద్యోగ ప్రయత్నాలు చేసి, అమ్మానాన్నలకు ఉన్న భయాల కారణంగా ఇంటికే పరిమితం అయ్యాడు. ‘నాకేం అవసరం.. అమ్మవాళ్లే అన్నీ చూస్తున్నారు కదా అనే ఫీలింగ్‌లో మరికొందరు ఉంటున్నారు. ‘నాకు నేనుగా బతకాలనే ఆలోచన కలగడం లేదు. పెద్ద చదువులు చదివాను, ఈ జాబే వస్తుందని.. ఇంటి దగ్గరే కూర్చోవడం కన్నా చిన్నవైనా సరే బతుకుదెరువు ప్రయత్నాలు చేయడం మంచిద’ని సూచిస్తున్నారు మహేష్. బధిరుడైన మహేష్ డిగ్రీ వరకు చదివారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో హౌస్‌కీపర్‌గా పనిచేస్తున్నారు. మహేష్‌తో పాటు మరో ఎనిమిదిమంది బదిరులు ఈ హోటల్‌లో ఉద్యోగం చేస్తున్నారు.
 వికలాంగ పిల్లల పెంపకంలో చాలామంది తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలతో వారి ప్రతి అడుగుకూ భయంతో  అడ్డు పడడం సహజమే కానీ... అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ప్రేమ, రక్షణ వలయాలు పిల్లల చుట్టూ ఒక సన్నని పొరలా మాత్రమే ఉండాలే తప్ప అవి ఇనుపకంచెలా మారకూడదు. పిల్లలు తడబడే అడుగులేస్తున్నపుడు పడిపోతారని భయపడి ఎపుడూ ఎత్తుకుని తిప్పితే నడక వస్తుందా..! ఎప్పుడూ తామే వెంట ఉండాలనుకుంటే జీవితం విలువ తెలుస్తుందా..! వికలాంగుల తల్లిదండ్రులూ ఈ విషయాన్ని గుర్తించాలి.
 - నిర్మలారెడ్డి
 
పనులన్నీ పెద్దలే ఎందుకు చేస్తారు?
 మేం చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డాం కాబట్టి మా పిల్లలకు ఎలాంటి కష్టం కలగకుండా చూడాలి అనుకుంటారు తల్లీతండ్రి. అందుకని పిల్లల పనులన్నీ తామే పూర్తి చేయాలని చూస్తారు.   పిల్లలకు సంబంధించిన వార్తలు చూసి లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. పిల్లలు ఒంటరిగా బయటకు వెళితే వారికేదైనా కీడు జరుగుతుందేమో అని ఇంటికే పరిమితం చేస్తారు. పిల్లలను స్నేహితులతో కలవకుండా కట్టడి చేసే తల్లిదండ్రులున్నారు. ఇది పిల్లల భావి జీవితానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్‌ను దూరం చేస్తుంది.చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమీ తెలియదని, అనుక్షణం వెయ్యి కళ్లతో కాచుకోవల్సిందేనని భావిస్తుంటారు.
 
ఇష్టంతో చేరాలి...

నేను ఇంజనీరింగ్ చేశాను. యూత్ ఫర్ సేవా స్వచ్ఛంద సంస్థలో డీటీపీ ఆపరేటర్ గా  చేరాను. నాలాంటి వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇక్కడే డిసేబుల్డ్ వింగ్‌ని ఎంచుకున్నాను. ఇప్పటి వరకు డిసేబుల్ పర్సన్స్‌కి వందల మందికి ఉద్యోగాలు రావడానికి శిక్షణ ఇచ్చాం. వికలాంగులైనా సరే ఇష్టంతో పనిచేయడం మొదలుపెడితే అది ఎంత కష్టమైనా భరిస్తారు. మా సంస్థ వికలాంగులకు ఆంగ్లం, గణితం, కంప్యూటర్ విద్యలలో ఉచిత శిక్షణ ఇస్తోంది. శిక్షణ పూర్తయ్యాక వ్యాపార సంస్థలలో (కె.ఎఫ్.సి, మ్యాక్స్, లైఫ్‌స్టైల్, హాలీడ్ ఇన్...వంటి వాటిలో) అర్హతను బట్టి నియామకాలు ఉంటాయి.
 - విజయ్, యూత్‌ఫర్ సేవా డిజేబుల్ వింగ్ కో ఆర్డినేటర్
 
మానసిక ఎదుగుదల చూడాలి...
 ఎంత వయసు వచ్చినా పిల్లలు తమనే అంటి పెట్టుకుని ఉండాలనుకుంటారు చాలామంది పేరెంట్స్. ఎప్పుడూ వెంటే ఉండటం వల్ల తల్లిదండ్రులతో పిల్లల అనుబంధాలు బాగుండవచ్చు. కానీ, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థం కావచ్చు. మానసిక ఎదుగుదల లేకపోతే జీవితాంతం వారికి వారే భారం కావచ్చు.
 - గీతా చల్లా, సైకాలజిస్ట్
 
మాది మహబూబ్‌నగర్ జిల్లా. బధిరుడిని కావడంతో ఎలా బతుకుతానో అని అమ్మనాన్నలకు బెంగగా ఉండేది. నేను ఇంటి నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చి  శిక్షణ తీసుకున్నాను. గచ్చిబౌలి దగ్గర ఓ పెద్ద హోటల్‌లో జాబ్‌లో చేరాను. నెల జీతం 10 వేలు. ఆరువేల రూపాయలు ఇంటికి పంపిస్తాను. - హరి ఓబులేషు
 
మాది మెదక్ జిల్లా. ఇంటర్‌తో చదువు ఆపేశాను. మా ఫ్రెండ్ జాబ్ ద్వారా విజయ్ అన్నను కలిశాను. ఈ హోటల్‌లో హౌజ్‌కీపింగ్ ఎంచుకున్నాను. నాకు తెలుగులో రాయడం మాత్రమే వచ్చు. ఎలా అని మొదట చాలా భయపడ్డాను.  ఇప్పుడు నా కాళ్ల మీద నేను నిలబడగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది.  - మహేష్
 
ఎక్కువ చదివాను..  నాకు ఫలానా జాబే వస్తుందని.. ఇంటి దగ్గరే కూర్చోవడం కన్నా చిన్నవైనా సరే బతుకుదెరువు ప్రయత్నాలు చేయడం మంచిది. మూగవాడిని అని కూర్చుంటే నా భుక్తి ఎప్పటికీ అమ్మనాన్నలమీదే ఆధారపడి ఉండేవాడిని. అలా ఉండకూడదనే హోటల్‌లో జాబ్ చేస్తున్నాను. - హరిబాబు
 
అమ్మనాన్నలకు వారి భయాలు వారికుంటాయి. అది సహజమే.  కానీ, నిలబడగలం అనే ధైర్యం.. ముందు మనలో ఉండాలి. ఏడాదిగా ఇక్కడ పనిచేస్తున్నాను. పనిలో మంచి పేరు తెచ్చుకున్నాను. ముందు జీవితం అంతా ఎలాగైన బతకగలనన్న ధీమా ఉంది.
 -  మధు
 
ఏమీ రాదని కూర్చుంటే జీవితం ఇలాగే గడిచిపోతుంది. మా స్నేహితుల ద్వారా హోటల్‌లో ఉద్యోగం సంపాదించాను. సొంత కష్టం ద్వారా సంపాదించినది ఎప్పుడూ ఇంకా ఇంకా బలాన్నే ఇస్తుంది. ఆత్మస్థయిర్యాన్ని పెంచుతుంది.
 - జహీర్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement