బినోతా నాద్‌కర్ణి గోవాలో ఆర్కిటెక్టు. ఆమెకు సైక్లింగ్ అంటే ఇష్టం. ఏడాది కిందట ఆమె ఒక చాలెంజ్ చేశారు. ఆ చాలెంజ్‌ను ఈ ఏడాది జనవరి 31వ తేదీతో విజయవంతంగా పూర్తి చేశారు. ‘నో షుగర్ చాలెంజ్’ అది. ఏడాది పాటు చక్కెరకు దూరంగా గడపడం! వండర్ అనిపిస్తుంది మనకు.
అయితే చక్కెర తినకుండా ఏడాది పాటు ఉండడం పెద్ద విషయమేమీ కాదని అంటారు బినోతా! స్వీట్లు, చాక్లెట్లు, క్రీమ్ బిస్కెట్లు, ఐస్‌క్రీములను దూరంగా ఉంచడం తనకు ఏ మాత్రం కష్టం కాలేదని చెబుతూ, ‘‘చక్కెర లేని టీ తాగడానికి మాత్రం ఒక వారం రోజుల పాటు కష్టపడ్డాను’’ అన్నారు బినోతా. ఆ కష్టం కూడా నాలుక మీదుండే రసన నాడులు (టేస్ట్‌బడ్స్) అలవాటు పడే వరకు మాత్రమేనట. ఛాలెంజ్ తీసుకున్న ఈ ఏడాదిలో నాలుగు కేజీల బరువు తగ్గడంతోపాటు దేహం తేలిగ్గా అనిపించడం కూడా తనను ఉల్లాసంగా ఉంచుతోందని ఆమె అంటున్నారు. ఇంతకీ ఆమె ఈ చాలెంజ్‌ని ఎందుకు తీసుకున్నారో తెలిస్తే మాత్రం మనసు కరిగిపోవడం ఖాయం.
స్నేహితురాలి కోసం
యాభై రెండేళ్ల బినోతా నాద్‌కర్ణి స్నేహితురాలు క్యాన్సర్ బారిన పడింది. ట్రీట్‌మెంట్ జరుగుతోంది. చక్కెర ఒక్క పలుకు కూడా తీసుకోకూడదని చెప్పేశారు డాక్టర్లు. క్యాన్సర్ వచ్చిందనే బాధ కంటే చక్కెర తినకూడదన్న మాటకే ఆమె ఎక్కువగా కదిలిపోయింది. తన జీవితంలో తీపి కరువైందని, ఇక ఏ రకంగానూ సంతోషాలు ఉండవని వాపోయింది. స్నేహితురాలికి ధైర్యం చెప్పారు బినోత. ఎంతగానో నచ్చచెప్పారు. క్యాన్సర్ బారిన పడిన బాధలో తన స్నేహితురాలికి ప్రతిదీ కొండంత కష్టంగా అనిపిస్తోందని కూడా అర్థమైంది బినోతకు. ‘‘చక్కెర లేకుండా జీవితం గడపడం కష్టమేమీ కాదు. కావాలంటే చెప్పు, నీ కోసం నేను కూడా చక్కెర మానేస్తాను’’ అని ఆ క్షణంలో స్నేహితురాలికి మాటిచ్చారు బినోత. ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడే ఉన్నారు.
మాటిచ్చి ఏడాది దాటింది. స్నేహితురాలు తన కోసం తన నాలుకను తియ్యదనానికి దూరం చేసుకోవడం ఆమెలో గొప్ప మార్పునే తెచ్చింది. ఆ మార్పు తను కూడా చక్కెరకు దూరం కావడం వరకే పరిమితం కాలేదు. వ్యాధితో పోరాడటానికి మానసికంగా సిద్ధమయ్యేటంతగా ప్రభావితం చేసింది. తన స్నేహితురాలి గురించి ఇన్ని సంగతులు చెప్పిన బినోతానాద్‌కర్ణి తన ఫ్రెండ్ పేరు మాత్రం చెప్పడం లేదు. ఆ స్నేహితురాలి ఫొటోను ఫేస్‌బుక్ కానీ ఇతరత్రా ఎక్కడా షేర్ చేయడం లేదు. ‘‘అలా చేస్తే ఇక ఆమె ఎక్కడ కనిపించినా ఆమెను క్యాన్సర్ పేషెంట్‌గా చూస్తారు తప్ప, ఎవరూ ఆమెను మామూలు మనిషిగా చూడరు. ఆమె గోప్యతను కాపాడడం కూడా స్నేహితురాలిగా నా ధర్మం’’ అంటారు బినోత.
తల్లికి డయాబెటిస్
దాదాపుగా ఇదే సమయంలో బినోత తల్లి కూడా డయాబెటిస్ బారిన పడ్డారు. ఆమెది కూడా చక్కెర మానేయాల్సిన అత్యవసర స్థితే. ‘‘మా అమ్మకు కాఫీలో చక్కెర బదులు తేనె, బెల్లం వంటివి వాడడం కూడా ఇష్టం ఉండేది కాదు. ‘తీపి లేకుండా నేను తాగుతున్నాను కదమ్మా, అంత కష్టమేమీ కాదు, నువ్వు ఒకసారి ప్రయత్నించు’ అని చెప్పగలిగాను. ఇప్పుడు నా స్నేహితురాలికీ, మా అమ్మకు నేనొక వింత, విచిత్రం మాత్రమే కాదు.. మిగతావారికీ పెద్ద ఉదాహరణ కూడా. చక్కెర తినకుండా, ఆహారంలో ఉండే సహజమైన చక్కెరలతోనే దేహంలో షుగర్ లెవెల్స్ సమతూకంగా ఉంచుకోగలిగిన రోల్‌మోడల్‌ని’’ అంటూ సైకిల్‌ని పరుగు తీయిస్తారు బినోతా నాద్‌కర్ణి. ఆమె గోవా వీధుల్లో వారంలో ఐదు రోజులు సైకిల్ మీదే కనిపిస్తారు.
“తన స్నేహితురాలి గురించి ఇన్ని సంగతులు చెప్పిన బినోతానాద్‌కర్ణి తన ఫ్రెండ్ పేరు మాత్రం చెప్పడం లేదు. ఆమె గోప్యతను కాపాడడం కూడా స్నేహితురాలిగా నా ధర్మం’’ అంటారు బినోత”.
బినోతా నాద్‌కర్ణి: కూతుళ్లతో... సైక్లింగ్ చేస్తూ... స్నేహితురాలి కోసం తల్లి తీసుకున్న ఛాలెంజ్‌ను అభినందిస్తున్న బినోత కూతుళ్లు.
Comments
Please login to add a commentAdd a comment