థాయ్ ఫ్లవర్ మౌండ్
సాక్షి, విశాఖపట్నం : ఒకప్పుడు ఏదైనా విదేశీ వంటకం టేస్ట్ చేయాలి అంటే కాస్తా శ్రమించేవారు. ఏ దేశం స్పెషల్ కావాలంటే.. ఆ దేశానికి వెళ్లి తీరాల్సిందే. అది వీలుకాని వారు.. విదేశాల నుంచి వచ్చిన వారితో మాట్లాడుతూ.. అక్కడి ఫుడ్ గురించి చెబితే తిన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పర్యాటక స్వర్గధామంగా భాసిల్లుతున్న నగరంలో రోజుకో రెస్టారెంట్ పుట్టుకొస్తోంది. దేశ, విదేశాల ఫుడ్ మెనూ అంతా నగరం నలుమూలల వ్యాపించేసింది. ఆయా రెస్టారెంట్లలో ఇటాలియన్, మెక్సికో, చైనా, ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల వంటలు నగర ప్రజల నోరూరిస్తున్నాయి. ఫ్యామిలీతో కలసి నచ్చిన వంటకాలు రుచి చూడాలంటే ఖచ్చితంగా గులాబీ నోటు జేబులో ఉండాల్సిందే. సిటీలో ఫుడ్‌లవర్స్‌ని నోరూరిస్తున్న వంటకాలను మనం ఓసారి టేస్ట్ చేద్దాం....
ఇరగదీస్తున్న ఇటాలియన్ రుచులు...
ఇటలీ దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రఖ్యాతి ఉందో..అక్కడ లభించే ఫుడ్‌కు అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంది. ఒకప్పుడు ఇటలీకే పరిమితమైన ఫిష్, పొటాటోస్, రైస్, కార్న్, సాసేజెస్, పోర్క్, విభిన్న రకాల ఛీజ్‌లు... ఇటాలియన్ వంటకాలను చవులూరించేలా మారుస్తున్నాయి. కార్న్‌తో చేసే ‘పొలెంటా’ నగరంలో కూడా నోరూరిస్తున్నాయి. ఇద్దరు కలసి ఇటాలియ న్ రుచులను చూడాలంటే కనీసం రూ.1000 నుంచి రూ.2వేలు వెచ్చించాల్సిందే.
లెబనీస్... వెరీ వెరీ టేస్టీ బాస్...
డ్రైఫ్రూట్స్‌ను విరివిగా ఉపయోగించే లెబనీస్ శైలి వంటకాలు కూడా నగరంలో ఆదరణకు నోచుకుంటున్నాయి. శెనగలు ఎక్కువగా వాడే వీరి వంటకాల్లో... ఆల్ షీమీ కోఫ్తాడజాజ్, కబ్సా బిర్యానీ, ఖబ్సాలాహమ్ వంటివి నగరంలో ఫుడీస్‌కు చేరువయ్యాయి. ఆలివ్ ఆయిల్‌తో ఈ వంటకాలు చేయడం కూడా ఆరోగ్యప్రియుల ఆదరణకు కారణం.
మైండ్‌లో ఫిక్సయితే..మెక్సికన్ టేస్ట్ చెయ్యాల్సిందే...
మెక్సికన్‌ను మనం సినిమాల్లో చూసి ఉంటాం. సిటీలో సైతం మెక్సికన్ వంటకాలు మైండ్‌బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. స్పైసీగా ఉండాలంటే మాత్రం మెక్సికన్ ఫుడ్‌పై ఓ కన్నెయ్యాల్సిందే. భారతీయ వంటకాల శైలికి దగ్గరగా ఉండడం కూడా మెక్సికన్ క్యుజిన్‌ని సిటీæజనులకు దగ్గర చేస్తోంది. వ్రోప్స్, నాథూస్, కేజూన్‌స్పైస్... వంటివి నగరంలో బాగా ఫేమస్ ఫుడ్‌గా పేరొందింది. చిప్టోల్ చికెన్ నగర భోజన ప్రియులు మెచ్చే స్టార్టర్‌గా మారిపోయింది. ఫ్యామిలీతో వెళ్లి మెక్సికన్ రుచులను ఆరగించాలంటే రూ.750నుంచి రూ.2వేలు ఉండాల్సిందే.
గ్రీక్ ఫుడ్.. వెరీ గుడ్..
లేట్‌గా వచ్చినా లే‘టేస్ట్’ అనిపించుకుంటున్నాయి గ్రీక్ రుచులు. రోజ్‌మేరీ, థైమ్, బేసిల్ (తులసి) వంటి హెర్బ్స్ (వివిధ రకాల ఆకులు) అధికంగా మేళవించే ఈ వంటకాలు ఇప్పుడిప్పుడే నగరానికి పరిచయమవుతున్నాయి. అలాగే వెరైటీ బ్రెడ్స్ కూడా ఈ గ్రీక్ క్యుజిన్‌కు స్పెషల్. ప్రస్తుతానికి వెజ్ ముసాకా, ఎమిస్టా వంటి వంటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి.
హాట్.. హాట్.. ఆఫ్ఘాన్ ఫుడ్...
ఆఫ్ఘనిస్తాన్ వంటకాలు కూడా.. ఫుడీస్‌ని కట్టిపడేస్తున్నాయి. అక్కడి ప్రజల అభిరుచుల మేరకు తయారు చేసే వంటకాలన్నీ ఇప్పుడు నగరంలోని ఫుడ్డీలకు అందించడం హాట్‌టాప్‌క్‌గా మారుతోంది. నగరంలోని పలు రెస్టారెంట్‌లలో లభిస్తున్న విదేశీ వంటకాలను టెక్కీలు టేస్ట్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ‘కుబ్లీ పలావ్’ భోజనప్రియుల్ని లొట్టలేయిస్తోంది.
అదిరే.. అదిరే.. అరేబియన్
అమెరికా క్యుజిన్‌ను పోలి ఉండే అరేబియన్ శైలి వంటకాలు కూడా నగరంలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. కబ్సా, మురమ్మరాతో పాటు బఖాదరా వంటి డిజర్ట్‌లు కూడా నగర ఫుడీస్‌కు ఫేమస్. అరేబియన్ వంటకాల్లో డ్రైఫ్రూట్స్ బాగా వినియోగించడం సిటీలో మరింత ఆదరణకు కారణమైంది.
థాయ్.. ఇది చాలా టేస్ట్ గురూ...
థాయ్‌లాండ్ అంటే గుర్తొచ్చేది ఒక్క మసాజే కాదు.. వంటకాలు కూడా ఆ దేశంలో మైమరిపిస్తాయి. ఉడికించిన, కాస్త కఠినంగా ఉండే రైస్, లెమన్‌గ్రాస్, స్వీట్ జింజిర్, నూనెలు తక్కువగా ఉపయోగించే ఆరోగ్యకరమైన ఆహారశైలిగా దీనికి పేరు. నగరంలో తోఫూ, బేసిల్–లెమన్ సూప్, పహాడ్‌క్రాపావో మొదలైన థాయ్‌ఫుడ్ బాగా ఆదరణ పొందుతున్నాయి. ఇక రొయ్యల వంటకాలంటే లొట్టలేసే ప్రియులకైతే థాయ్... సూపరోయ్. థాయ్ వంటకాల్ని ఇద్దరు కలసి టేస్ట్ చేయాలంటే రూ.1000 పైనే ఖర్చవుతుంది.
అభిరుచులకు అనుగుణంగా....
సిటీలోని ఫుడ్డీల అభిరుచికి అనుగుణంగా రెస్టారెంట్‌లు వస్తున్నాయి. దీన్నిబట్టి సిటీలోని పలు రెస్టారెంట్‌లలో విదేశీ వంటకాలు హల్‌చల్ చేస్తున్నాయి. రుచులతో పాటు ఆయా రెస్టారెంట్‌లలో వినోదం కూడా ఉండటం విశేషం. వివిధ దేశాల ప్రజలు విశాఖలో పర్యటిస్తున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా సిద్ధం చేస్తున్న ఫుడ్.. నగర వాసులకూ ఫేవరెట్‌గా మారుతున్నాయి.– శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ చెఫ్
Comments
Please login to add a commentAdd a comment