కరోనాతో కన్నుమూత : గీతా రాంజీ, వైరాలజిస్ట్
లండన్ నుంచి వారం క్రితమే తను నివాసం ఉంటున్న దక్షిణాఫ్రికా తీరప్రాంతం డర్బన్ చేరుకున్న గీతా రాంజీ.. కరోనా లక్షణాలేమీ లేకుండానే కరోనాతో మంగళవారం కన్నుమూశారు! ఆమె మరణంతో ప్రపంచ క్రిమిశాస్త్ర పరిశోధనారంగం దాదాపుగా ఒక విధమైన కుంగుబాటు స్థితిలోకి వెళ్లిపోయింది. ‘‘ప్రపంచానికి ఇప్పుడు ఆమె అవసరం ఉంది. ఈ సమయంలోనే ఆమె మనకు దూరం అయ్యారు’’ అని యు.ఎన్.ఎయిడ్ అధినేత్రి విన్నీ బియాన్యిమా అన్నారు.
అంటువ్యాధి మీద ఎప్పుడూ ఇద్దరు పోరాడుతుంటారు. ఒకరు వ్యాధిగ్రస్థులు. ఇంకొకరు వ్యాధిని ఈ భూమండలం నుంచే సమూలంగా నిర్మూలించేందుకు పరిశోధనలు చేస్తున్నవారు. ప్రొఫెసర్ గీతా రాంజీ గత ముప్పై ఏళ్లుగా హెచ్.ఐ.వి., టీబీ క్రిముల కీలెరిగి వాత పెడుతూ ఒక్కో విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇక తనకూ ఆమె చేతిలో చావు తప్పదని అనుకుందో ఏమో కరోనా మహమ్మారి మాయోపాయం పన్ని ఆమెను తీసుకెళ్లిపోయింది.
కరోనాతో మరణించిన తొలి భార త సంతతి దక్షిణాఫ్రికా మహిళ గీతా రాంజీ. గురువారం నాటికి ఆ దేశంలో దగ్గర దగ్గర 200 వరకు కరోనా మరణాలు నమోదయ్యాయి. గీతారాంజీ అంత్యక్రియల విషయమై గురువారం మధ్యాహ్నం వరకు కూడా ఆ దేశ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటనేమీ వెలువడలేదు. చనిపోయింది సాధారణ వ్యక్తి కారు. సహజమైన మరణమూ కాదు. సాధారణ పరిస్థితులూ లేవు. మనకు ఉన్నట్లే అక్కడా 21 రోజుల లాక్‌డౌన్ ఉంది. మార్చి 27 నుంచి అమలు అవుతోంది. ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి లేనిదే గౌరవ వందనంతో కూడిన ఒక ప్రత్యేక కార్యక్రమంగా గీతారాంజీ అంతిమ సంస్కారాలను నిర్వహించేందుకు లేదు.
గీతారాంజీ ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్టు. ప్రాణాంతక క్రిముల స్వభావాల మీద, అవి సంక్రమించ జేసే వ్యాధుల మీద అధ్యయనం చేస్తుంటారు. ఆ వ్యాధులకు టీకాలు కనిపెడుతుంటారు. దర్బన్‌లోని ‘సౌతాఫ్రికన్ మెడికల్ రిసెర్చ్ కౌన్సిల్’లో హెచ్.ఐ.వి. నివారణ విభాగం డైరెక్టర్‌గా, ప్రయోగాల ప్రధాన పరిశోధకురాలిగా పని చేస్తున్నారు. ఆ పని మీదే ఇటీవల లండన్ వెళ్లి తిరిగి డర్బన్ వస్తున్నప్పుడు ఆమెకు తెలియకుండానే ఆమెలోకి కరోనా ప్రవేశించింది! పైకి లక్షణాలేమీ చూపించకుండా దొంగదెబ్బ తీసింది.
గీతారాంజీ భర్త ప్రవీణ్ రాంజీ. డర్బన్‌లోనే పేరున్న ఫార్మసిస్టు. ఇద్దరు మగ పిల్లలు. లండన్‌లో మంచి ఉద్యోగాలలో ఉన్నారు. ఆమె వాళ్లకు ఎప్పుడూ చెబుతుండే మాట ఒక్కటే.. ‘సమాజాన్ని చూడండి. సమాజానికి ఏమైనా చేయండి. మనకు కావలసినవన్నీ దేవుడు అమర్చిపెట్టాడు. సమాజానికి అవసరమైన వాటిని మనం చేర్చిపెట్టాలి’ అని. హెచ్‌ఐవీ బారిన పడుతున్న అమాయక, నిరుపేద దక్షిణాఫ్రికా మహిళల కోసం గీతారాంజీ మంచి ఫలితాన్నిచ్చే నివారణోపాయాలను, పెద్దగా ఖర్చుతో కూడుకోని వైద్య విధానాలను కనిపెట్టారు. అందుకు గుర్తింపుగా రెండేళ్ల క్రితం ఆమె ‘విశిష్ట మహిళా శాస్త్రవేత్త’ అవార్డును అందుకున్నారు. లిస్బన్ (పోర్చుగల్)లోని ప్రతిష్ఠాత్మకమైన ‘యూరోపియన్ డెవలప్‌మెంట్ క్లినికల్ ట్రయల్స్ పార్ట్‌నర్‌షిప్’ సంస్థ ఆ అవార్డును ఇచ్చింది. విజ్ఞానశాస్త్ర అధ్యయన, పరిశోధనా రంగాలలోకి ఎంత ఎక్కువగా ఆడపిల్లలు వస్తే అంత ఎక్కువగా అంతుచిక్కని ఆరోగ్య విపత్తులకు అద్భుతమైన పరిష్కారాలు లభిస్తాయని అంటుండేవారు గీతారాంజీ.
పిల్లలు పుట్టాకే మాస్టర్స్ డిగ్రీ
తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో జన్మించారు గీతారాంజీ. 1970లలో నాటి ఉగాండా క్రూర పాలకుడు ఇడీ అమీన్ బారి నుంచి తప్పించుకుని ఇండియా వచ్చేసింది గీత కుటుంబం. హైస్కూల్ వరకు ఇండియాలోనే చదివి, పై చదువులకు ఇంగ్లండ్ వెళ్లారు గీత. అక్కడే కెమిస్త్రీ, ఫిజియాలజీలో బియస్సీ (ఆనర్స్) చేశారు. క్లాస్‌మేట్ ప్రవీణ్ రాంజీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతడు కూడా భారతీయ సంతతి ఆఫ్రికనే. తర్వాత ఇంగ్లండ్ నుంచి డర్బన్ వచ్చారు. అక్కడ పేరున్న ఒక మెడికల్ స్కూల్‌లోని పిల్లల వైద్య, చికిత్సల విభాగంలో గీత పని చేశారు. పిల్లలు పుట్టాక కొద్దిపాటి విరామం అనంతరం మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment