నల్లటి అపరంజి... | Special Story About Jogbani Tunzi | Sakshi
Sakshi News home page

నల్లటి అపరంజి...

Published Tue, Dec 10 2019 12:21 AM | Last Updated on Tue, Dec 10 2019 1:03 PM

Special Story About Jogbani Tunzi - Sakshi

తెల్లగా ఉన్న చాలా మందిని జుజుబీ అంటూ తోసిరాజంది ఈ నల్లటి జోజిబిని తుంజి. విశ్వసుందరిగా విజయకేతనం ఎగరేసిన ఈ అమ్మాయి ఫెయిర్‌నెస్‌ ఫేట్‌ను సవాల్‌ చేసింది. తెల్లగా ఉంటేనే అందమా?  నలుపులో నాణ్యమైన మెరుపుతో ఉంటే... మేని నిగారింపు జిగేలుమంటే అది అందం కాదా?... ఎన్నెన్నో సందేహాలు! నలుపులో అందం ఉంటుందో ఉండదో ఒకసారి కాస్త పరిశీలిద్దాం. పరికించిచూద్దాం.

కార్యానికైనా, కదనానికైనా, కథనానికైనా శ్రీకారం చుట్టే ముందు కాస్త దైవప్రార్థన ఆనవాయితీ కదా. అందుకే దేముడైన రాముడి స్తుతితో మొదలుపెడదాం. శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం, సీతాపతిం, రఘుకులాన్వయ రత్నదీపం... అవునూ దేవుడికంటే అందమైన వారెవరైనా ఉంటారా? కోరి కోరి అరవింద దళాల్లాంటి కనువిందు చేసే కళ్లూ, ఆకర్షణీయమైన ఒళ్లూ లాంటి మంచి క్వాలిటీలన్నీ పుణికి పుచ్చుకున్నవాడు కావాలనుకుంటే తెల్లటి మేని ఛాయ పొందలేడా? ఈజీగా పొందగలడు. కానీ పొందలేదు. దీనికీ ఓ బ్యాక్‌గ్రౌండు స్టోరీ ఉంది.

పుట్టింది ఉత్తర భారతదేశపు అయోధ్యలో! కావాలనుకుంటే ఫెయిర్‌ కాంప్లెక్షన్‌ పొందడం కష్టమేమీ కాదు. కాకపోతే... రేపు అరణ్యవాసంలో... కానల్లో మెలగాలి. కాలినడకన తిరగాలి. బండలెక్కాలి, కొండలెక్కాలి. మరి ఇన్ని పనులు చేయాల్సి ఉండగా ఎండకన్నెరగకుండా ఉంటే ఎలా? కన్నెర్ర జేసే ఎండలో తిరగకుండే ఎలా? కారడవుల్లో తిరగాలి కాబట్టే కారుమేఘపు రంగులో పుట్టాడు. దక్షిణభారత దేశపు కిష్కింధవాసుల మేని ఛాయకు దగ్గర్లో ఉన్నాడు. మీరూ నేనూ ఒకటే రంగన్నాడు. అందుకే... అందం తెల్లదనంలో లేదు. నాణ్యమైన నల్లదనంలోనే ఉంది.

ఇక శ్రీకృష్ణుడి దగ్గరకు వద్దాం. ఆయనా అంతే. పాలసంద్రాన పవళించే స్వామికి, పాలరంగును మేనిరంగుగా పొందడం కష్టమా? కావాలనుకుంటే ఇంద్రజాలంతో చంద్రవర్ణం పొందలేడా? ఈయనకూ ఓ విజనుంది. ఓ మిషనుంది. రేపుమాపు గోపాలుడవ్వాలి. గోధూళి తగలాలి. గోవర్థనమెత్తాలి. సైనైడ్‌ నిండి ఉన్న కాళిందిలో ఈదులాడితే సైడెఫెక్ట్‌ కొద్దీ శరీరం నల్లబడదూ? రేపు పొద్దస్తమానం యుద్ధక్షేత్రం కురుక్షేత్రంలో ఉన్నప్పుడు ఎర్రటెండకు మేనిరంగు మారిపోదూ! అదేదో అప్పుడు నల్లబడేబదులు... ముందుగానే నలుపులోనే ఆ బాలగోపాలుడు ఆబాలగోపాలమందరినీ ఆకర్షించేంత అందగాడిగా పుడితే పోదా అనుకున్నాడు. దైవస్తుతి ముగిసింది.

ఇహ ఇప్పుడు ఇహంలోకి వద్దాం. ఎలెక్స్‌హేలీ రాసిన ఏడుతరాలు చదివారా? తన మూలాలు తెలుసుకుంటూ చేసిన ప్రయాణాన్ని చూశారా? ఏడుతరాల తర్వాత ఎలెక్స్‌ తెల్లటివాడేమో. కానీ తరాలను తవ్వుకుంటూ పోయినప్పుడు... వేరులను వెతుక్కుంటూ వెళ్లినప్పుడు... తాతల తండ్రులు... తండ్రుల తాతలు... వాళ్ల మూలపురుషుడు కింటాకుంటే నల్లనివాడని! కింటాకుంటే పుట్టిన రాత్రి ఆనవాయితీగా ఆ బిడ్డను తండ్రి ఉమరో చంద్రుడికి చూపాడు. ‘నీకంటే గొప్పవాడు... ఇదుగో చూడు’ అనేసరికి నాణ్యమైన ఆ నల్లదనాన్ని చూసి తెల్లగా మెరుస్తున్న చంద్రుడు కాస్తా తెల్లబోయాడు. వెన్నెలరూపంలో వెలవెలబోయాడు.

చరిత్ర నుంచి కాసేపు పక్కకు వెళ్లి పక్షిలోకంలోకి వెళ్దాం. ఈ సంగతి వింటే... ఆర్నీ... వార్నీ... ఆర్నిథాలజీలో కూడా అదే చెబుతోందా అంటూ మీరు అచ్చెరువొందకమానరు. కళ్లముందు తెల్లగా కనిపిస్తూ తిరగాడే ఫారం కోళ్లంటే మీకిష్టమా? లేక నీలిరంగులో ఎగురుతూ ఉండే పాలపిట్టంటే మీకు గౌరవమా? నీలిపింఛం ఉన్నందుకేగా నెమలికి ఆ కంఠంలో క్రేంకార గీర. అడవి పిట్టలను వదిలేసి మన సినిమాల్లోని ఆడపిల్లల అందాలకు వద్దాం. మన అలనాటి మేటి మహానటి సావిత్రి రంగులో ఓ వన్నె తక్కువే. ఆమె తెల్లటి తెలుపేమీ కాదు. రమణీయంగా, ఆకర్షణీయంగా ఉండే నటీమణుల్లో వాణిశ్రీ, వాణీవిశ్వనాథ్, అర్చన, భానుప్రియ, నల్ల రంగు పిల్లగా మరోచరిత్ర సృష్టించిన సరితలాంటి వనితలంతా నల్లవారే. ఇక రేఖ, స్మితాపాటిల్, నందితా దాస్‌లు  కన్నుతిప్పుకోలేనంతటి అందగత్తెలంటే కాదనే దమ్ములెవరికి ఉన్నాయ్‌ చెప్పండి?

కొందరు సైన్సును తప్ప మరోదాన్ని నమ్మరు. సైంటిఫిగ్గా నిరూపిస్తే చేస్తే తప్ప ఒక పట్టాన ఒప్పరు. అలాగే. నల్లదనం గొప్పదనాన్ని సైన్స్‌ సాయంతోనే చెబుదాం. అన్ని రంగుల్ని బెదరగొట్టీ, చెదరగొట్టీ, తిరగబెట్టీ వెనక్కుపంపితే కనిపించేది తెలుపు. అన్ని వర్ణాల్నీ తన అక్కున చేర్చుకుని, తనలో ఇముడ్చుకుంటే వచ్చే వర్ణం నలుపు. అందుకే ఫిజిక్సు మ్యాజిక్సు ప్రకారం చూసినా అన్నింటినీ దగ్గర చేసుకునే గుణం ఒక్క నల్లదనానికే ఉంది. గొప్పదనాన్ని గుర్తించే గుణం తమిళులకుండబట్టే మంచిదనానికి ‘నల్ల’ అనే మాటతో గౌరవించారు వారు.

నలుపే అందం అని చెప్పడానికి ఇన్ని మాటలేల? నలుపంటే చిమ్మచీకటి కాదు... నిద్రలో కమ్మటి కలలవాకిలి. స్వప్నాల లోగిలి. ఒకింత ముదురు రంగు మంచిగంధానికే సౌరభం. ముగ్గుపిండికి కాదు. కారుమబ్బు చివరనున్న నల్లంచుకే వెండి తేజంపు మెరుపు. తెల్లమబ్బుకు కాదు. పేలవమైనదెప్పుడూ తెల్లగానే ఉంటుంది. నవనవలాడేదెప్పుడూ నల్లగానే ఉంటుంది. ఈ మాటనే జోజిబిని తుంజి మరోమారు నిరూపించింది. – యాసీన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement