చదువు కళ ఉన్న ముఖం తెలిసిపోతుంది. ప్రియాంక చతుర్వేది అలాంటి కళే కలిగిన నాయకురాలు. రాజ్యసభ అభ్యర్థిగా ప్రియాంకను నామినేట్ చేస్తున్నట్లు శివసేన ప్రకటించగానే పార్టీలోని అనేక ముఖాలు కళావిహీనం అయ్యాయి. అయితే శివసేన ప్రియాంకను రాజ్యసభకు పంపించాలని నిశ్చయించుకోడానికి తగిన కారణమే ఉంది.
ప్రియాంక చక్కటి ఇంగ్లిష్ మాట్లాడతారు. హిందీ కూడా బాగా వచ్చు. ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి మహారాష్ట్రలో స్థిరపడిన కుటుంబం కనుక మరాఠీ కూడా కొట్టిన పిండే. మహారాష్ట్రలో ఉండేవారంతా మరాఠీలోనే మాట్లాడాలని శివసేన అంటున్నా.. రాజ్యసభలో మాత్రం తన స్వరం వినిపించడానికి ఆ పార్టీకి ఇంగ్లిష్, హిందీ తప్పనిసరి అవుతోంది. అందుకే ప్రియాంకను ఎంచుకుంది. ప్రియాంక గత ఏడాది ఏప్రిల్ వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 2010 లో పార్టీలో చేరి, రెండేళ్లలోనే నార్త్–వెస్ట్ ముంబై జాతీయ యువజన కాంగ్రెస్‌కు ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. అయితే ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కొందరు ఆమెతో అమర్యాదగా ప్రవర్తించినప్పుడు.. వారిని పార్టీనుంచి బయటికి పంపించిన కాంగ్రెస్.. ఆ తర్వాత కొద్ది రోజులకే వాళ్లను వెనక్కు తీసుకోవడంతో ఆగ్రహించి పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. వచ్చిన రెండో రోజే శివసేనలో చేరిపోయారు. ‘పార్టీలో నేను మామూలు శివసైనికురాలిగా ఉంటాను’ అని ఆమె అన్నారు కానీ, ఠాక్రేనే.. సైనిక దళానికి ఒక నేతగా ఉండమని కోరారు. ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తున్నారు.
ప్రియాంక జన్మస్థలం ఉత్తర ప్రదేశ్. పెరిగిందీ, చదువుకున్నదీ ముంబైలో. జూహూలోని సెట్ జోసెఫ్స్ హైస్కూల్‌లో చదివారు. విలేపార్లే లోని నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనమిక్స్‌లో కామర్స్ డిగ్రీ చేశారు. తర్వాత పెళ్లి, ఇద్దరు పిల్లలు. రాజకీయాల్లోకి రాకముందు, వచ్చాక కూడా మంచి కాలమిస్టుగానే ఆమెకు పేరు. బాగా రాస్తారు, రాసినంత బాగా మాట్లాడతారు. ‘తెహల్కా’, ‘డైలీ న్యూస్ అనాలిసిస్’, ‘ఫస్ట్‌పోస్ట్’.. వీటికి వ్యాసాలు రాశారు. రెండు మూడు ఎన్జీవోలకు ధర్మకర్త కూడా. బాలల విద్య, స్త్రీ సాధికారత, స్త్రీ ఆరోగ్యం.. ఇవీ.. వ్యాసకర్తగా, సామాజిక కర్యకర్తగా ఆమె స్వీకరించిన బాధ్యతలు. ఏ ప్రభుత్వమైనా మొదట స్త్రీ శిశు సంక్షేమం కోసం పని చేయాలని ప్రియాంక అంటారు. అప్పుడు అభివృద్ధి దానంతటే వస్తుందని చెబుతారు. ముంబైలో ‘ఎంపవర్ కన్సల్టెంట్స్’ అని.. మీడియా, పి.ఆర్. ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఒకటి ఉంది. డిగ్రీ అయిపోగానే ఆ కంపెనీ డైరెక్టర్‌గా చేరారు ప్రియాంక. ముంబైలోనే ‘ప్రయాస్ చారిటబుల్ ట్రస్ట్’ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ఆధ్వర్యంలో రెండు పాఠశాలు ఉన్నాయి. స్థోమత లేని 200 మంది పిల్లలకు ఆ పాఠశాలల్లో ఉచిత విద్య లభిస్తోంది. ఆ సంస్థకు కూడా ట్రస్టీగా ఉన్నారు ప్రియాంక. మోదీ అంటే ఆమెకు పడదు. ఇక చూడాలి.. ఈ శివసైనికురాలు రాజ్యసభలో మోదీ సైన్యాన్ని తన వాక్పటిమతో, సామాజికాంశాలలో తనకున్న పరిజ్ఞానంతో ఎలా అదరగొట్టి, బెదరగొట్టి దారికి తెస్తారో!
Comments
Please login to add a commentAdd a comment