మూడు నిమిషాలు... 100 ఆసనాలు | Special Story About Samridhi Kalia For Her Global World Record | Sakshi
Sakshi News home page

మూడు నిమిషాలు... 100 ఆసనాలు

Published Tue, Jul 21 2020 12:01 AM | Last Updated on Tue, Jul 21 2020 12:01 AM

Special Story About Samridhi Kalia For Her Global World Record - Sakshi

సమృద్ధి కాలియా ఘనతను చూసి దుబాయ్‌లోని భుజ్‌ ఖలీఫా ఆకాశ హర్మ్యం కూడా కరతాళధ్వనులు చేసింది. జూలై 15న ఆ మహా కట్టడంలోని వ్యూయింగ్‌ డెక్‌ మీద సమృద్ధి పరీశీలకుల సమక్షంలో తన యోగ విన్యాసాలు చూపి ఆశ్చర్య చకితులను చేసింది. ఒక చిన్న కలప బాక్స్‌లో (రిస్ట్రిక్టెడ్‌ స్పేస్‌) నుంచి నేల మీద కాలు పెట్టకుండా మూడు నిమిషాల పద్దెనిమిది సెకన్స్‌లో వంద యోగాసనాలు వేసి అరుదైన రికార్డును సాధించింది. ఈ వయసులో ఇంత సమయంలో ఇన్ని ఆసనాలు వేసిన బాలిక ప్రపంచంలో మరొకరు లేరు.

ఆరేళ్ల వయసు నుంచి
దుబాయ్‌లో స్థిరపడ్డ భారతీయ కుటుంబానికి చెందిన సమృద్ధి అక్కడి అంబాసిడర్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి సిద్దార్థ్‌ కాలియా. తల్లి ప్రేరణ కాలియా. అమ్మమ్మ భారతదేశంలో యోగ సాధకురాలు. అందువల్ల సమృద్ధి కూడా ఆరేళ్ల వయసులో స్కూల్‌లో యోగ క్లాసుల్లో జాయిన్‌ అయ్యింది. ‘నేను మిగిలిన పిల్లలు చేయడాన్ని చూసి సరదాగా చేరాను కాని తర్వాత తర్వాత నాకు యోగా అంటే ఆసక్తి పెరిగింది’ అంది సమృద్ధి. తొలి రోజుల్లో స్కూల్లో యోగా క్లాసుల్లో మాత్రమే సాగిన ఆ అమ్మాయి సాధన రాను రాను ఇంట్లోకి మారింది. ‘ఆమె శరీరం యోగాసనాలకు తగినట్టుగా సులువుగా వొంగడం గమనించాను’ అన్నాడు తండ్రి. క్రమంగా యోగాలో సమృద్ధి నిమగ్నత పెరిగింది. ‘ఆ సమయంలో నా వయసు పిల్లలు కూడా రికార్డులు సాధించడం నేను గమనించాను. నేను కూడా అలాంటి రికార్డు సాధించవచ్చు కదా అనిపించింది. వెంటనే ఆ లక్ష్యం పెట్టుకున్నాను’ అంది సమృద్ధి

1 నిమిషంలో 40 ఆసనాలు
మొన్నటి జూన్‌ 21న సమృద్ధి ఇంటర్నేషనల్‌ యోగా డే సందర్భంగా ఒక నిమిషంలో నలభై యోగాసనాలు వేసి రికార్డు సాధించింది. ఇది చూసి అందరూ ఉత్సాహ పరిచారు. అతి తక్కువ సమయంలో 100 ఆసనాలు వేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ‘ఇందుకు నా శారీరక బలం కంటే కూడా మానసిక బలం ప్రధాన కారణం అనుకుంటున్నాను’ అందా అమ్మాయి. ‘ఇండియాలో ఉండే మా అమ్మమ్మ నాకు స్ఫూర్తి’ అని కూడా చెప్పింది. ప్రతి నిత్యం సమృద్ధి చేసిన సాధన ఫలితాన్ని ఇచ్చింది. నిపుణులు, పరిశీలకుల సమక్షంలో అతి తక్కువ సమయంలో 100 ఆసనాలు వేసి రికార్డు సాధించింది. సమృద్ధికి ఇంకా సైకిలింగ్‌ పట్ల, రిథమిక్‌ యోగా పట్ల, స్విమ్మింగ్‌ పట్ల కూడా ఆసక్తి ఉంది. వాటిని కూడా సాధన చేస్తూ ఉంది. ‘మా అమ్మాయి త్వరలో ప్రపంచ దేశాలలో తన ప్రతిభను చాటనుంది. మేము అన్ని దేశాలలో ఆమె యోగ విన్యాసాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నాం’ అన్నాడు తండ్రి.
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అన్నాడు కవి. దుబాయ్‌లో స్థిరపడ్డ అమ్మాయి భారతీయ మూలమైన యోగాలో ప్రతిభ చాటుతూ దేశ ప్రతిష్టను ఇనుమడింపచేయడం ప్రశంసనీయం. స్ఫూర్తిమంతం.
మా అమ్మమ్మ వయసు 70. ఇండియాలో ఆమె ఉదయాన్నే నాలుగున్నరకు లేచి యోగాసనాలు సాధన చేస్తుంది. నేను ఎందుకు చేయకూడదు అనుకున్నాను. రోజూ నేను చేసిన సాధన ఇవాళ నాకు రికార్డు సాధించి పెట్టింది అంటోంది 11 ఏళ్ల సమృద్ధి కాలియా. మూడు నిమిషాల 18 సెకన్లలో 100 ఆసనాలు వేసి ‘గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement