ముప్పయి నాలుగేళ్ల్ల సుమితీ సింగ్ అహ్మదాబాద్ నగరంలో సెవెన్ వయోలెట్స్ పేరుతో బేకరీ నడుపుతోంది. కరోనాకు ముందు ఆమె గుర్తింపు అదే. ఇప్పుడామె ఐడెంటిటీ అహ్మదాబాద్ నగరంలో రెండవ కోవిడ్ 19 పాజిటివ్. ఈ కండిషన్‌ను పాజిటివ్ దృక్పథంతో అధిగమించింది సుమితి. ‘ఇంతకీ ఆమె కోవిడ్ బారిన ఎలా పడింది’ తెలిసిన వాళ్లలోనూ, తెలియని వాళ్లలోనూ ఇదే ప్రశ్న.
ఫిన్లాండ్ ప్రయాణంతో...
సుమితికి ఈ ఏడాది మొదట్లో ఫిన్లాండ్‌కు వెళ్లే అవకాశం వచ్చింది. జనవరి రెండో వారానికంతా చైనా వూహాన్ కరోనా వ్యాధితో వార్తల్లోకి వచ్చేసింది. ఫిన్లాండ్‌లో తాను బస చేయాల్సిన హోటల్ వాళ్లను, ట్రావెల్ కంపెనీ వాళ్లను, ఇతర అధికారులనూ అడిగింది. మరేమీ ఫర్వాలేదనే భరోసా వచ్చింది అందరి వైపు నుంచి. అయినప్పటికీ ఎన్–99 మాస్క్, గ్లవ్స్, శానిటైజర్‌లతో పకడ్బందీగా మార్చి మూడవ తేదీన ఫిన్లాండ్‌కు ప్రయాణమైన సుమితి... 12 తేదీన తిరిగి ఇండియాకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ చెక్ చేస్తున్నారప్పటికి. ఆమెను కూడా పరీక్షించారు. ఏ లక్షణాలూ లేవు. క్లీన్‌చిట్ ఇచ్చేశారు ఎయిర్‌పోర్టు వాళ్లు. అయినప్పటికీ సుమితి మాత్రం లైట్ తీసుకోలేకపోయింది. ఇంట్లో వాళ్లకు దూరంగా తాను ఒక గదిలో ఉంటూ ఐసోలేషన్ పాటించింది. అది కూడా చాలా గట్టిగా... అయినా దురదృష్టం! ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆమె మార్చి పద్నాలుగో తేదీ ఉదయానికి జ్వరంతో నిద్రలేచింది. సుమితి వెంటనే డాక్టర్‌ను సంప్రదించింది. దగ్గు కానీ, గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు కానీ లేవామెకి. దాంతో దేశాలు మారినప్పుడు వాతావరణంలో మార్పు కారణంగా వచ్చిన జ్వరం కావచ్చనుకున్నారు డాక్టర్‌లు. జ్వరానికి మందులిచ్చి ఐసోలేషన్ కొనసాగించమని చెప్పారు.
16వ తేదీకి అస్వస్థత పెరిగింది. అప్పుడు కూడా ఇతర కరోనా లక్షణాలు లేవు. మళ్లీ ఇంటికి పంపించేశారు. మార్చి19 నాటికి ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. అప్పుడు పరీక్షించిన డాక్టర్లు కోవిడ్ 19 పాజిటివ్ అని తేల్చారు. వెంటనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అడ్మిట్ అయింది సుమితీ సింగ్. ‘కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించినప్పుడు ఒక్కసారిగా నా గుండెను ఎవరో కోస్తున్నట్లు అనిపించింది. ఏదయితే కాకూడదనుకున్నానో అదే జరిగింది. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది మా ఇంట్లో అందరినీ తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. మా కుటుంబం మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడంతో ఇంట్లో అందరికీ నెగెటివ్ వచ్చింది. అయితే నాకు పాజిటివ్ వచ్చిన వెంటనే అది సమాజానికి వార్త అయింది. న్యూస్ చానెల్స్, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. నన్ను తెలిసిన అందరూ నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. పది రోజులు ట్రీట్‌మెంట్ తీసుకుని 29వ తేదీన డిశ్చార్జ్ అయ్యాను. ఆరోగ్యం కుదుట పడింది. ఇక లాక్‌డౌన్ పూర్తవగానే వ్యాపారాన్ని గాడిలో పెట్టాలి. అంతా రెండు నెలల్లో దారిలోకి వచ్చేస్తుంది’’ అని చిరునవ్వుతో చెప్తోంది సుమితీ సింగ్.
‘మన వాళ్లందరూ మనకు అండగా ఉన్నారనే భావనే వ్యాధిని జయించే ధైర్యాన్నిస్తుంది. మీకు తెలిసిన వాళ్లెవరైనా వ్యాధి బారిన పడితే వాళ్లకు అండగా ఉండండి. భౌతికంగా దూరం ఉంటూ... మానసికంగా వారికి దగ్గరగా ఉండండి’ అని చెప్తోంది సుమితీ సింగ్. – మంజీర
Comments
Please login to add a commentAdd a comment