చిన్న చిన్న విషయాలే పెద్ద పాఠాలు నేర్పిస్తాయి.పెద్ద పెద్ద ఆదర్శలు చిన్న సాధనతోనే ప్రారంభమవుతాయి.చిన్నది ఏదీ వృధా కాదు.చిన్న చిన్న బిందువులేమహా సింధువును సృష్టిస్తాయి.
అందరూ హడావుడిగా వెతుకుతూనే ఉన్నారు. ఆకలి, దాహం కూడా మర్చిపోయారు. ఆ రోజు సబర్మతి ఆశ్రమంలో పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి. వాటిని చూసుకునే వాళ్లు కూడా వెతికే పనిలోనే ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలు దాటిపోయింది. వంటగది ఖాళీగా ఉంది. వండి వడ్డించే వాళ్లు కూడా వెతికే పనిలోనే మునిగి ఉన్నారు. ఇక కస్తూర్బా గాంధీ దగ్గరకు వచ్చింది. ‘‘బాపూ.. అది చిన్న పెన్సిలు ముక్క. ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఊడ్చేవాళ్లు చిన్నదేలే, బాపూజీ పడేశారేమో అనుకుని ఊడ్చేసుంటారు... ఆ చిన్న ముక్క కోసం ఆశ్రమంలోని చిన్నా పెద్దా అందర్నీ ఇలా బాధపెట్టడం బాగోలేదు. మీరు కాస్త ఆలోచించండి.’’ అంది.
ఆమె స్వరంలో చోటు చేసుకున్న తీవ్రతకు గాంధీజీ రాట్నం ఆగింది. ‘‘చూడు బా, ‘చిన్నిముక్క’ అన్న నిర్లక్ష్యం నుండి బయటకు రావడానికే ఈ ఉపవాసం... నువ్వనే బలవంతపు బందిఖానా’’ అని దగ్గరగా కనిపిస్తున్న వ్యక్తితో ‘‘బాలూ, అందరినీ ఇక్కడ సమావేశపరచు’’ అన్నారు. బాపూజీ ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నారేమో, ఆశ్రమవాసులందరూ బిలబిలమంటూ వచ్చేశారు. చివరివ్యక్తి కూడా వచ్చాడని నిర్ధారించుకున్న గాంధీజీ గొంతు సవరించుకున్నారు. ‘దొరికిందా?’ అని క్షణం ఆగారు. అందరి మొహాలూ వాడిపోయి ఉన్నాయి, బా ఏదో అనబోతుంటే బాపూజీ ‘బా నా మీద నేరం మోపుతున్నది, చిన్నముక్క కోసం ఆశ్రమంలో ఉన్న చిన్నాపెద్దలకే కాదు, పశువులకూ శిక్ష విధించానని మనందరి భవిష్యత్తుకూ, మన దేశ భవిష్యత్తుకూ.. ఈ సందర్భంలో మనం ఓపాఠం నేర్చుకుందాం. అదేమంటే, చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి. ఈ రోజు పోయిన ఆ చిన్న పెన్సిలు ముక్కే మనకో ఉపాధ్యాయుడు! ఆ పెన్సిలుతో ఇంకొక గ్రంథం రాయగలను నేను. మీకు తెలుసు, మనకు వచ్చే ఉత్తరాల్లో ఖాళీగా ఉన్న భాగాన్ని నేను జమాఖర్చులు రాసేందుకు ఉపయోగిస్తానని.
దేనినైనా వృథాగా పారేయడం మీకు న్యాయమనిపిస్తోందా?’’ క్షణమాగి అందరివైపూ చూశారు గాంధీజీ. అందరూ ‘న్యాయం కాదు’ అన్నట్టు తలలూపారు.‘‘మనం నీటిని చుక్కచుక్క పెద్ద బొక్కెనలా విలువగా వాడడం ఇటీవలనే నేర్చుకున్నాం, అందుకు నేనెంతో తృప్తిపడుతున్నాను. రేపు మీరెవరైనా మీ మీ గ్రామాలకు వెళ్లినప్పుడు నీటిని పొదుపుగా వాడడమేగాక, తోటివారికి కూడా తప్పకుండా అవగాహన కలిగిస్తారు. ఈ చిన్ని పెన్సిలు ముక్క అంతే! చిన్ని చిన్ని ప్రారంభాలే కదా, పెద్ద పెద్ద కార్యాలకు మూలం, చిన్నదే కదా అని అశ్రద్ధ చేస్తే అన్ని రంగాల్లోనూ పెద్ద అవినీతికి దారితీస్తుందని మీకు తెలుసు. సత్యం, అహింస, నీతి – వీటిని చిన్నగా సాధన చేయడం మనం ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. చిన్న పెన్సిలు ముక్క నుండి నేర్చుకునేది అదే కదా’’ అంటూ గాంధీజీ ఉపన్యాసాన్ని, ఉపవాసాన్ని కూడా ముగించారు. కస్తూర్బాతోపాటు ఆశ్రమవాసులందరూ కూడా అక్కడి నుంచి తృప్తిగా తమ తమ విధుల్లోకి కదిలారు.
– ఝాన్సీ కె.వి.కుమారి
Comments
Please login to add a commentAdd a comment