లవ్‌ యూ చందమామ | Special Story on Moon | Sakshi
Sakshi News home page

లవ్‌ యూ చందమామ

Published Fri, Sep 6 2019 6:44 AM | Last Updated on Fri, Sep 6 2019 6:44 AM

Special Story on Moon - Sakshi

వెన్నెల రోజున భూమి ఎలా ఉంటుంది? వెన్నెల కురిసే ఆ రోజున కాస్తంత ఎత్తు మీద నుంచో, వీలైతే ఏ కొండపై నుంచో చూడండి. ఎలా కనిపిస్తుంటుంది భూమి?వెన్నెల టాల్కమ్‌ పౌడర్‌ను దూమెరుగ్గా రాసుకుని, ఫ్రెష్‌గా ఉన్నట్టుంటుంది భూమి.రాత్రి చీకటిలో డార్క్‌ కాంప్లెక్షన్‌ చాయతక్కువగ ఉన్నట్టుండే ధరణి... ఫెయిర్‌నెస్‌ క్రీము రాసుకుని ఫెయిర్‌గా కనిపిస్తున్నట్టుంటుంది. ఆ నిగారింపుల మిలమిలలతో, వెన్నెల సింగారింపుల కళకళలతో మెరిసిపోతుంటుంది.

చందమామ అనగానే అందరికీ భావావేశమే. కోటిపూలతో కొండెక్కీ, బంతిపూలతో బండెక్కీ, పల్లకీలో పాలుపెరుగులతో, పరుగుపరుగున పనసపండుతో, అలయకుండా అరటిపండుతో రావాలనీ... అన్నింటినీ తెచ్చి తమ చిన్నారికి ఇవ్వాల్సిందే అని అన్నమయ్య డిమాండ్‌ చేశాడు. ఇక శ్రీరాముడు మాత్రం తక్కువా? చందమామ అందితేగానీ అన్నం తిననని మారాం చేశాడు. అద్దం చేతనుంచుకొని, దాంట్లో చూసి, అద్దం ఫ్రేమ్‌లో బిగించాడు  కాబట్టే రామ‘చంద్ర’మూర్తి అయ్యాడేమో.  ఇంతటి చందమామ గురించి ఎన్నెన్నో విశేషాలు.  అందులో కొన్నింటిని తెలుసుకుందాం.గ్రహాల మధ్య గురుత్వాకర్షణ శక్తి ఉంటుందన్న విషయం తెలిసిందే కదా. ఆ శక్తి కారణంగానే అవి పరిభ్రమిస్తూ ఒకదానితో ఒకటి ఢీకొనకుండా  తిరుగుతూ ఉంటాయి. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగానే సముద్రజలాలు ఆకర్షితమై ఆటుపోట్లు వస్తుంటాయని తెలుసు. మరి భూభాగం సంగతో?... అక్కడా ఆ శక్తి పనిచేస్తుంటుంది. జలాలు ద్రవరూపంలో ఉంటాయి కాబట్టి ఆటుపోట్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ... నీటిమట్టం పెరగడం తగ్గడం జరుగుతుంది. అలాగే మన కాళ్ల కింది భూభాగమూ కాస్తంత ఉబుకుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ భూమ్మీద ఉన్న సమస్త కొండగుట్టలూ, భవనాలూ, నిర్మాణాలూ ఒకింత పైకి లేస్తాయి. మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి. కాకపోతే  దాన్ని మనం గమనించలేం అంతే.  

చంద్రుడు సరిగ్గా భూమి చుట్టే తిరుగుతున్నాడా?
చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడని మనం చిన్నప్పట్నుంచీ చదువుకున్నాం. అది నిజమే అయినా పూర్తిగా వాస్తవం కాదు. భూమీ, చంద్రుడూ పరస్పరం ఆకర్షించుకుంటూ ఉంటాయి కాబట్టి చంద్రుడు తిరిగే కేంద్రం భూమి కేంద్రస్థానానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఆ ఊహాకేంద్రకాన్ని మనం ‘బ్యారీసెంటర్‌’ అని పిలుస్తాం. ఈ బ్యారీసెంటర్‌ అన్నది భూమి పైపొర అయిన క్రస్ట్‌లో ఉంటుంది.

అక్కడా కావాల్సినంత చెత్త!
మనిషి అంటేనే చెత్త పుట్టించేవాడు. తానెంత మంచి పిక్నిక్‌ స్పాట్‌కు వెళ్లినా తాగేసిన నీళ్లబాటిళ్లు, ఇతరత్రా చెత్తనక్కడ పడేస్తూ ఉంటాడు. చంద్రుడూ ఇందుకు మినహాయింపు కాడు. మీకు తెలుసా? ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకూ మానవుడు వెళ్లినప్పుడు వదిలేసినవీ, మనం పంపించిన ఉపగ్రహాల వల్ల వెలువడినవీ... ఇవన్నీ కలిసి దాదాపు లక్షా ఎనభై రెండు వేల కిలోల (కచ్చితంగా చెప్పాలంటే 1,81,437 కిలోల) చెత్త చంద్రుడి ఉపరితలం మీద చేరిందట. 

అదో మరుస్థలి కూడా...
అంతేకాదు... అక్కడ ఓ శ్మశానం కాని శ్మశానమూ ఉంది. ఆ కథాకమామిషూ చూద్దాం. యూజీన్‌ షూమాకర్‌ అనే ఓ అద్భుతమైన ఖగోళ పరిశోధకుడూ, జియాలజిస్టూ చాలా కీలకమైన పరిశోధనలు చేశాడు. చంద్రుడి మీదకు వెళ్లాలన్నది అతడి తీరని కోరిక. కానీ అతడిలోని చిన్న శారీరక లోపం చంద్రుడిమీదకు వెళ్లడానికి అవరోధంగా మారింది. తన ప్రగాఢ వాంఛ అందని చందమామఅయ్యింది. ఖగోళరంగంలో అతడి కీలక పరిశోధనలకు ఓ నివాళిగా అతడి చివరి కోర్కెను మరోలా తీర్చారు శాస్త్రవేత్తలు. అతడు చనిపోయాక అతడి చితభస్మాన్ని లూనార్‌ ప్రాస్పెక్టర్‌ ద్వారా1998లో చంద్రుడి మీదకి తీసుకెళ్లి అక్కడి చంద్రధూళిలో ఖననమయ్యేలా చూశారు. అలా అతడి చివరి కోర్కెను తీర్చారు నాసా వారు.

అంతేనా... చంద్రుడి మీద తమ చితాభస్మం పడాలన్నది చిరకాలంగా చాలా మంది మన భూలోక వాసుల కోరిక కూడా. అందుకే దాదాపు క్రీస్తుపూర్వం 450 నాటి నుంచే కొందరి కోరిక మేరకు వారి చితాభస్మాన్ని ఎల్తైన ప్రదేశం నుంచి ఆకాశంలోకి విసిరేసేవారు. అది చంద్రుడి మీదికి చేరి అక్కడ ధూళిలో కలిసిపోతుందని వాళ్ల ఆశ. అయితే ఇలాంటి కోరికలెవరికైనా ఉంటే అవి భవిష్యత్తులో తీరే అవకాశాలున్నాయి. ‘లూనార్‌ మెమోరియల్‌ సర్వీస్‌’  పేరిట ‘ఎసైలమ్‌ స్పేస్‌’ వంటి కొన్ని కంపెనీలు చంద్రుడి మీద వారి చితాభస్మాలనూ, అవశేషాలను ఖననం చేసే పనికి పూనుకుంటున్నాయి. 2013 నెలకొల్పిన ఎసైలస్‌ స్పేస్‌ సంస్థ ఇస్తున్న భరోసా ప్రకారం... కేవలం చంద్రుడి మీదే కాకుండా... సౌరకుటుంబానికి ఆవలనున్న సుదూర అంతరిక్ష స్థలాల్లోనూ ఆ చితాభస్మాన్ని వదులుతామంటూ ఆ కంపెనీ వాగ్దానాలు చేస్తోంది. అయితే ఈ దిశగా వారి మొదటిమజిలీ శ్మశానస్థలి మాత్రం జాబిల్లేనట.

చంద్రకంపాలూ ఉంటాయి
భూమ్మీద భూకంపాలు వస్తాయన్నది మనకు తెలిసిందే కదా. అలాగే చంద్రుడిమీద కూడా అలాంటివే సంభవిస్తాయి. మనం భూకంపం అన్నట్టుగానే దాన్ని చంద్రకంపం అనవచ్చు. ఇంగ్లిషులో  ‘మూన్‌క్వేక్‌’ అన్నమాట. ఇందులోనూ మళ్లీ నాలుగు రకాలుంటాయి. చాలా లోతుగా వచ్చే డీప్‌ క్వేక్స్, ఏవైనా ఉల్కలు చంద్రతలం మీద పడటం వల్ల వచ్చే కంపనాలైన మీటియోరైట్‌ ఇంపాక్ట్స్, సూర్యుడి ఉష్ణోగ్రత ప్రభావం వచ్చే థర్మల్‌ క్వేక్స్‌... ఈ మూడూ ఒకింత తక్కువ శక్తిమంతమైనవి. కానీ రిక్టర్‌ స్కేలు మీద 5.5 వరకు వచ్చే ‘షాలో మూన్‌ క్వేక్‌’ లనేవి మాత్రం చాలా భయంకరమైవి. మన భూమ్మీద భూకంపం వస్తే అది సెకన్లపాటు, మహా అయితే కొన్ని అరనిమిషం ఉంటుంది. కానీ చంద్రకంపం దాదాపుగా అరగంట పాటూ రావచ్చు. నాసా పరిశీలన ప్రకారం.. ఒక గంట మోగుతున్నప్పుడు ఆ లోహంపై కలిగే ప్రకంపనల్లాగే చంద్రకంపం సమయంలో చంద్రుడి ఉపరితలం అలా ప్రకంపనాలకు లోనవుతుంటుంది. నాసా భాషలో చెప్పాలంటే ‘ద మూన్‌ రింగ్స్‌ లైక్‌ ఎ బెల్‌’!

ఇప్పట్లో పిక్నిక్‌ స్పాట్‌ కాబోదు
చంద్రుడి మీదకెళ్లడం మన ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. అక్కడి చంద్రధూళి మానవుల ఆరోగ్యానికెంతో ప్రమాదం. మనం స్పేస్‌ సూట్‌ తొడుక్కుని పోయినప్పటికీ ఆ ధూళి ఎలాగోలా మన బట్టల్లోకి చేరిపోతుంది. ఈ ధూళి కారణంగా మనకు ‘లూనార్‌ హే ఫీవర్‌’ అనే వైద్య సమస్య రావచ్చట. దీన్నే ‘మూన్‌ డస్ట్‌ ఫీవర్‌’ అని కూడా అంటారట.

అందరి చంద్రుడు అందని చంద్రుడవుతున్నాడా?
మనందరికీ ప్రియాతి ప్రియమైన చందమామ రోజురోజుకూ మనకు దూరమవుతున్నాడా? ఒకనాటికి మనకు అందకుండా పోతాడా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతి ఏడాది చంద్రుడు మననుంచి 3.78 సెం.మీ. దూరంగా జరుగుతున్నాడట. ఇప్పటికైతే జాబిల్లి దూరమవుతున్నందువల్ల మనకా ప్రభావం గణనీయంగా కనిపించకపోవచ్చు.  కానీ ఒకనాటికి బాగా దూరం వెళ్లిపోతే మన భూగోళం తిరిగే వేగం (భూభ్రమణ వేగం) కూడా తగ్గిపోతుందట. అయితే ఆ ప్రమాదం మాత్రం ఇప్పట్లో లేదంటున్నారు శాస్త్రవేత్తలు. 

మీరు చందమామ అనండి. జాబిల్లి అనండి. ఇంగ్లిష్‌లో మూన్‌ అనండి. లూనా అనండి. కానీ చందమామ కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు. మన ఎన్నో ఎమోషనల్‌ అంశాలకు ఒక కేంద్రస్థానం. సౌరకుటుంబంలో మన భూమితో పాటు పుట్టిన మన ఉపగ్రహం. భూమిని మనం భూమాత అంటాం. అంటే మన తల్లిలాంటిదే మన భూగ్రహం. మరి దాని తోబుట్టువు మనకు మేనమామే కదా. అందుకే చంద్రుణ్ని మనం చందమామ అంటాం. తల్లి పుట్టిలు మనం మేనమామకు చెబితే ఎలా ఉంటుంది. అందుకే మన తల్లి అయిన భూమాత పుట్టుకకు సంబంధించిన ఎంతో సమాచారం తెలుసుకోవాలన్నా చంద్రుడికి తెలుసేమో. దాని గురించి ఆయన్నే అడగాలేమో! అలా అడగగా వెల్లడయ్యే ఎన్నో అంశాలు తెలిసిరావచ్చు. మరెన్నో రహస్యాలు విడివడవచ్చు.  మన చంద్రుడికి సంబంధించిన చిత్రవిచిత్రాల్లో ఇవి కొన్ని మాత్రమే. తెలుసుకోవాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. అందుకే అప్పటి విక్రమార్కుడు చెట్టెక్కి శవాన్ని దించినట్టుగా మన ఈ పరిశోధనా విక్రముడు... చంద్రుడి ఎత్తులు విక్రమార్కుడిలా ఎక్కుతూనే ఉంటాడు. తెలియని చిక్కు ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉంటాడు.– యాసీన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement