ఏ చెడు కన్నూ పడని చోటు | special story on Diana death | Sakshi
Sakshi News home page

ఏ చెడు కన్నూ పడని చోటు

Published Tue, Sep 12 2017 12:01 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

ఏ చెడు కన్నూ పడని చోటు - Sakshi

ఏ చెడు కన్నూ పడని చోటు

సమాధి : 1997–2017

నీలికళ్ల  సుందరి, అందాల రాకుమారి డయానాను ఈ ప్రపంచంలో ప్రేమించనిదెవ్వరు? ఆఖరికి మరణం కూడా ఆమెను వెంటాడి, వేధించి మరీ ప్రేమించింది! 1997 ఆగస్టు 31న పారిస్‌లోని ఓ సొరంగ మార్గంలో.. కారు యాక్సిడెంట్‌లో డయానా చనిపోయారు. సెప్టెంబర్‌ 6న పుట్టినింటి ఎస్టేట్‌లో ఆమెను సమాధి చేశారు! ‘ఏ చెడు కన్నూ పడని చోట, ప్రశాంతమైన ప్రదేశంలో నన్ను సమాధి చెయ్యండి’ అని బతికుండగా ఆమె తన పుట్టింటివాళ్లను కోరుకున్నారట!

లండన్‌కి 112 కి.మీ. దూరంలోని నార్థంప్టన్‌షైర్‌లో.. సుమారు పదమూడు వేల ఎకరాల విస్తీర్ణంలో పచ్చగా పరుచుకుని ఉన్న 500 ఏళ్ల నాటి అల్తోర్ప్‌ ఎస్టేట్‌లో గుర్తు తెలియని చోట డయానా భౌతికకాయాన్ని ఖననం చేశారు. డయానా తన 36వ ఏట మరణించారు. ఆమె జీవితకాలంలోని ఒక్కో ఏడాదికి గుర్తుగా ఎస్టేట్‌లోని రౌండ్‌ ఓవల్‌ కొలను చుట్టూ 36 ఓక్‌ మొక్కల్ని నాటారు. అవి ఇప్పుడు 20 ఏళ్ల వయసు గల ఓక్‌ వృక్షాలు. వందలాది వైట్‌ వాటర్‌ లిల్లీ, గులాబీ పూల మొక్కలు ఆ చుట్టూతా ఉంటాయి. బహుశా ఇవన్నీ డయానా కోరుకున్న ‘మరణానంతర ప్రశాంతత’ను ఆమెకు అందిస్తూ ఉండివుండొచ్చు. కానీ, ఒకటి మాత్రం వాస్తవం. ప్రశాంతత కన్నా ముందు ప్రేమ కోసం డయానా పరితపించారు. అదీ.. భర్త ప్రేమ కోసం!

ప్రేమకు ప్రేమ ప్రతీకారం!
బ్రిటన్‌ రాకుమారుడు చార్ల్స్‌తో 1981లో డయానా పెళ్లి జరిగింది. 1996లో వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఎంత పెద్ద రాకుమారి అయినా ప్రేమ దగ్గరికి వచ్చేటప్పటికి మామూలు అమ్మాయిలానే బిహేవ్‌ చేస్తుంది. భర్త తనని కాకుండా మరెవర్నో ప్రేమిస్తున్నాడని తెలిసి, భర్తపై కోపంతో మరెవర్నో ప్రేమించింది డయనా. ఒకర్నీ, ఇద్దరిని కాదు. మొత్తం ప్రపంచాన్నే ప్రేమించింది.. ఒక్క భర్తను తప్ప! భర్త గిలగిల్లాడిపోయి, తన ప్రేమకోసం వచ్చేస్తాడనుకుంది పాపం. అలా వచ్చేవాడైతే.. చార్లెస్‌ అసలు డయానాను ఎందుకు చేసుకుంటాడు? ఆమె అక్కతోనే ఫిక్స్‌ అయిపోయేవాడు!

అవును, డయానా కన్నా చాలా ముందే డయానా అక్క శారా స్పెన్సర్‌ని ప్రేమించాడు చార్ల్స్‌. తర్వాత ‘నువ్వు నచ్చావ్‌’ అంటూ డయానా దగ్గరికి వచ్చేశాడు. తర్వాత ‘నువ్వే నచ్చావ్‌’ అనుకుంటూ మరో ప్రేమికురాలు కామిల్లా పార్కర్‌ దగ్గరికి వెళ్లిపోయాడు. మనిషి ఇంట్లోనే ఉండేవాడు. మనసు కామిల్లా చుట్టూ తిరిగొచ్చేది. ఇదంతా డయానా కళ్ల ముందే! ఏ భార్యకైనా ఈ మాత్రం నరకం చాలు, ఉన్నపళాన పారిపోడానికి.

‘అది నా పర్సన ల్‌’ అన్నాడు
డయానా కూడా పారిపోయింది. మానసికంగా తన ఇంట్లోంచి తనే. చార్ల్స్‌ ఎప్పుడొస్తాడో తెలీదు, ఎప్పుడు వెళ్తాడో తెలీదు. కానీ ఎక్కడికి వెళ్లొస్తున్నాడో ఆమెకు తెలుసు. ఓ రోజు అడిగింది.. ‘తన దగ్గర్నుంచేనా?’ అని. తన అంటే చార్ల్స్‌ ప్రియురాలు కామిల్లా. ‘అది నా వ్యక్తిగత విషయం’ అన్నాడు చార్లెస్‌. భార్యాభర్తల మధ్య వ్యక్తిగత విషయాలు ఉన్నాయీ అంటే ప్రేమ లేకుండా పోయిందని!

మణికట్లు కోసుకుంది!
అసలు పెళ్లయిన కొత్తలోనే బ్లేడ్‌తో తన మణికట్లను కోసుకుంది డయానా! చేతులు రెండూ రక్తం కారుతూ ఉంటే çపనివాళ్లు చూసి అడిగారే కానీ, చార్ల్స్‌ పట్టించుకోలేదు. అప్పటికే పూర్వపు ప్రియురాలు కామిల్లా మత్తులో ఉన్నాడతడు. అంటే.. పెళ్లికి విలువలేదనేగా? డిప్రెషన్‌లో కూరుకుపోయింది డయానా. ఆ డిప్రెషన్‌లోనే చేతులకు గాయాలు చేసుకుంది. హనీమూన్‌కి కూడా అయిష్టంగానే బయల్దేరింది. ‘హనీమూన్‌కి వెళ్తున్నాం. హాయిగా నిద్రపోడానికి మంచి సమయం’ అని ఆమె తన ఫ్రెండ్స్‌కి రాసిన ఉత్తరం ఒకటి ఈ ఏడాది మే నెలలో బయటపడింది!

ఎముకల పోగు అయింది
డయానాకు, చార్ల్స్‌కు 13 ఏళ్ల వయసు వ్యత్యాసం. ఇద్దరి మధ్యా అంత దూరం ఉన్నప్పుడు ఎలా దగ్గరవుతారు? ఈ మాట నిజం కాదు. ప్రేమ ఎంతటి దూరాలనైనా దగ్గర చేస్తుంది. డయానా సిన్సియర్‌గా చార్లెస్‌ను లవ్‌ చేసింది. ఆ ప్రేమకు చార్లెస్‌ ఎప్పుడైతే ప్రతిస్పందించడం మానేశాడో.. అప్పుడే ఆమె హృదయం బద్ధలైపోయింది. ‘‘ఏంటలా చిక్కిపోతున్నావ్‌ డయానా.. ఎముకలు కనిపిస్తున్నాయి తెలుసా?’ అని ఆమె స్నేహితులు అడిగినప్పుడు.. డయానా నిర్జీవంగా ఒక నవ్వు నవ్వేది. ఇదీ పెళ్లయిన కొత్తలోనే! ఈ సంగతులన్నీ ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒకటొకటిగా, ఆమె సన్నిహితుల నుంచి బయటపడుతున్నాయి. ప్రేమ కోసం అలమటించీ, అలమటించీ ప్రేమను వెతుక్కునే ప్రయత్నంలో.. బయటి ప్రేమల అడుసులో కాలు వేసి జీవితంలో ప్రశాంతతను కోల్పోయింది డయానా. అందుకేనేమో.. ఏ చెడు కన్నూ పడని చోట తనను సమాధి చెయ్యమని ఆమె కోరుకుంది.

అత్త అడుగులో కోడలు
∙పెళ్లి ప్రమాణంలో ‘ఒబే’ అనే మాటను పలకడానికి డయానా నిరాకరించారు! ఆమె స్వతంత్ర వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం అది. ‘కలిమిలో లేమిలో, ఆరోగ్యంలో అనారోగ్యంలో నా భర్తతో నేను జీవితాంతం విధేయురాలినై కలిసి ఉంటాను’ అనే ప్రమాణంలోని ‘విధేయురాలినై’ అనే మాటను ఆమె బుద్ధిపూర్వకంగా స్కిప్‌ చేయడం ఆ రోజు రాజకుటుంబీకులను ఆశ్చర్యానికి లోను చేసింది. సంప్రదాయ విరుద్ధమైన ఈ ఉల్లంఘనను డయానా కోడలు కేథరీన్‌ కూడా ఫాలో అయ్యారు! అమె కూడా ‘ఒబే’ అనే మాటలను మినహాయించి మిగతా ప్రమాణమంతా చేశారు. డయనా తన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ని సొంతగా తయారు చేయించుకోకుండా, బయట ఆభరణాల దుకాణంలోంచి ఎంపిక చేసుకున్నారు. దానిని ప్రిన్స్‌ చార్ల్స్‌ అమె వేలికి తొడిగారు. ఆ ఉంగరాన్నే డయానా పెద్ద కొడుకు ప్రిన్స్‌ విలియమ్స్‌ తన భార్య కేథరీన్‌ వేలికి తొడిగాడు.


పెళ్లి రోజు లేడీ డయానా, ప్రిన్స్‌ చార్లెస్‌. తోడు పెళ్లి కూతురు

గ్రేట్‌ బ్రింగ్టన్‌లోని సెయింట్‌ మేరీ వర్జిన్‌ చర్చి:  డయానా శవపేటికను రౌండ్‌ ఓవల్‌ నుంచి రహస్యంగా  తరలించి భూస్థాపితం చేశారని భావిస్తున్న చర్చి లోపలి భూగృహ ప్రదేశం.


రౌండ్‌ ఓవల్‌ కొలనులో డయానా స్మారక మందిరం  (ఎడమ), స్మారక స్థూపం (కుడి). డయానా మృతదేహాన్ని ఖననం చేసిన కచ్చితమైన చోటును మాత్రం ఆమె  పుట్టింటివాళ్లు ఇప్పటికీ గోప్యంగానే ఉంచారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement