‘‘నాన్నా ప్లీజ్ ఏడవకండి!’’
పోగొట్టుకున్న ఈ బంగారుతల్లి కోసం మనం... పోరాటం చేయలేమా!
► పువ్వులా, అప్పుడే విరిసిన హరివిల్లులా సప్త వర్ణాలను విరజిమ్మే నవ్వును హత్య చేశారు!
► విశ్వవిద్యాలయం అంటే సరస్వతి గుడి, చదువుల ఒడి అనే నమ్మకాన్ని హత్య చేశారు!
► ఆచార్యులు అంటే విద్యాబుద్దులనే కాదు, జాగ్రత్తల్నీ చెప్తారనే భరోసాను హత్య చేశారు!
► సీనియర్లంతా జూనియర్లను చేరదీసి, స్నేహం కలుపుకుంటారనే ఆశను హత్య చేశారు!
► క్యాంపస్‌లో, క్యాంటీన్‌లో, హాస్టల్‌లో స్నేహం గుబాళిస్తుందన్న అమాయకత్వాన్ని హత్య చేశారు!
► ఫ్రెషర్ అనే కైండ్‌నెస్ కూడా లేకుండా ర్యాగింగ్ చేసీ చేసీ మానవత్వాన్ని హత్య చేశారు!
► కనిపెంచిన అమ్మపై, నాన్నపై, చదువుతున్న చదువుపై పెంచుకున్న ప్రేమను హత్య చేశారు!
► బాగా చదివి, అమ్మానాన్నల్ని గొప్పగా చూసుకోవాలన్న ఆశయాన్ని హత్య చేశారు!
► ప్రేమదారిలోకి రానందుకు... తిరిగిరానిలోకాలకు తరలిపోయేలా వ్యక్తిత్వాన్ని హత్య చేశారు!
► కష్టమొస్తే చెప్పుకోలేనంతగా, కన్నీళ్లొస్తే మనసు విప్పుకోలేనంతగా ధైర్యాన్ని హత్య చేశారు!
► యూనివర్శిటీ అంటే నరకం తప్ప ఇంకోటి కాదు అనిపించేలా ఆత్మవిశ్వాసాన్ని హత్య చేశారు!
► ఉసురు తీసుకుంటూ కూడా సీనియర్స్‌ని ఒక్క మాటా అనని మంచితనాన్నీ హత్య చేశారు!
► రిషితేశ్వరిని ఇన్ని విధాలుగా హత్య చేశారు!
నవ్వు!!! నవ్వు!!! నవ్వు!! ఈ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాదు అందరినీ నవ్విస్తూ ఉంటాను. కానీ ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచారు నాన్న. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఈ చదువు కోసం నా ఊరు వరంగల్ వదిలి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. ఇలా వచ్చిన నన్ను నా సీనియర్స్‌లో కొంతమంది చదువు వైపు కాకుండా ప్రేమ వైపు లాగడానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలోకి వెళ్లలేదు. దాంతో నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేశారు. అవి వింటేనే నా మొహంలో నవ్వు మాయం అయిపోయేది. ఏడుపు కూడా వచ్చేది. నేను నాన్న దగ్గర ఏమీ దాచేదాన్ని కాదు. కానీ ఇక్కడికి వచ్చాక దాయాల్సి వస్తోంది.
చెప్తే ఏమైపోతారో అని భయంతో దాయాల్సి వస్తుంది. అలా నేను దాచినప్పుడల్లా నాకు నరకయాతన కనిపిస్తుంది.సీనియర్స్‌లో దీప, అవినాష్, లావణ్య, ప్రసాద్ వీళ్లు చేసిన హెల్ప్స్ నేను ఎప్పటికీ మరిచిపోలేను. నాన్నా వీళ్లకి ఒక్కసారి థాంక్స్ చెప్పండి. ఎప్పుడూ వీళ్లతో కాంటాక్ట్‌లో ఉండండి. నా ఆఖరి కోరిక ఒక్కటే... నా చావుకి కారణం ఎవరో వాళ్లకి తెలుసు. వాళ్లు వాళ్ల తప్పు తెలుసుకుంటే చాలు. ఇంక ఎవ్వర్నీ ఇలా (నాలా) బాధపెట్టకపోతే చాలు. ఏ అమ్మాయీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉండదు అని అనుకోవద్దు. యూనివర్సిటీ అంటేనే ఒక పెద్ద నరకం లాంటిది. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచరు. మీకు చెప్పలేక వాళ్లలో వాళ్లు దాచుకోలేక, వాళ్లకి నరకం కనిపిస్తుంది.
అమ్మా నాన్న జాగ్రత్త. నాన్న ప్లీస్ ఏడవకండి. నేనెప్పుడూ మీ దగ్గరలోనే ఉంటాను. అమ్మా నువ్వు కూడా జాగ్రత్త డిప్రెషన్ ఈజ్ నాట్ ఏ సైన్ ఆఫ్ వీక్‌నెస్. ఇట్ మీన్స్ యు స్టేయ్‌డ్ స్ట్రాంగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఐ లవ్ యు మామ్. ఐ లవ్ యు డాడ్. ట్రై టు డొనేట్ మై ఆర్గాన్స్... ఇఫ్ దే ఆర్ ఇన్ గుడ్ కండీషన్. డాడ్! నేను చేయవలసిన పనులు ఉన్నాయి. కొన్ని మీరు చేసేయండి. సీనియర్ లావణ్యకి ఒక ఇంజనీరింగ్ మెకానిక్స్ బుక్ కొనివ్వండి. రాజుకి రూ.350 ఇవ్వండి టి స్కేల్‌కి.. ప్రసాద్ సార్, ఇంకా జితేంద్రకి థాంక్స్ చెప్పండి. బై... ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
ర్యాగింగ్ ఉరి బిగించింది!
నిర్జీవమైన చదువుల తల్లి రిషితేశ్వరి
గళ్ల చొక్కాలో ఉన్న ఆ అమ్మాయి కళ్లు పూర్తిగా మూత పడలేదు. అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలని, అద్భుతంగా ఉండబోయే తన భవిష్యత్తును దర్శించాలని ఆశ పడుతున్న వాటిలా సగం సగంగా తెరుచుకునే ఉన్నాయి. ముగ్ధంగా అమాయకంగా ఉన్న ముఖం... కన్నవారు అపురూపంగా పెంచుకోవడం వల్ల వచ్చిన లావణ్యమైన రూపం... అవన్నీ జీవాన్ని కోల్పోయి కదలికను మానేసి తమ అచేతన నుంచి ఒక చేతనను లేవదీయడానికి సిద్ధమైనట్టుగా ఉన్నాయి. పద్దెనిమిదేళ్ల విద్యార్థిని రిషితేశ్వరి తను ప్రాణాలు కోల్పోయి... లక్ష ప్రాణాలతో వికటాట్టహాసం చేస్తున్న ఒక దుష్ట సంస్కృతి సంహారానికి పిలుపునిస్తూ ఉంది. దీనిని ఇంతటితో ఆఖరు చేయండి అని విన్నవిస్తూ ఉంది. చనిపోయే చివరి క్షణాలలో కూడా... తనకు అన్యాయం జరిగిందని తెలిసీ కూడా... ఆ పిలుపులో ద్వేషం లేదు. ప్రేమ ఉంది. సంస్కారం ఉంది. మనసులు, మనుషులు మారాలి అన్న కన్సర్న్ ఉంది. రిషితేశ్వరి మరణం ఈ వ్యవస్థను బోనులో నిలబెట్టింది.
కుప్ప కూలిన పునాది!
ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అంటే నిర్మాణ శాస్త్రం. తన భవిష్యత్తును ఆ చదువుతో నిర్మించుకుందామని నాగార్జున యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో చేరింది రిషితేశ్వరి. యూనివర్సిటీ అంటే చదువుల ఆలయం అనీ అక్కడ అందరూ చదువులో నిమగ్నమై ఉంటారని అనుకుంది. కాని మొదటి రోజే చేదు అనుభవం! హాస్టల్‌లో చేరిన రోజు రాత్రే కొంత మంది అమ్మాయిలు వచ్చి రూమ్ ఖాళీ చేయాలని అన్నారు. ఇది తమ రూమ్ అనీ తెల్లారే సరికల్లా ఖాళీ చేయకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని భయపెట్టారు. ‘వాళ్లు బెదిరించిన రోజే రిషి మాకు ఫోన్ చేస్తే తెల్లారే సరికల్లా వరంగల్ నుంచి గుంటూరు (పెదకాకాని)కి చేరుకున్నా’ అని చెప్పారు తండ్రి మురళీకృష్ణ. ‘ఇక్కడ ప్రిన్సిపాల్ తాము చెప్పిందే చేస్తాడు. స్టూడెంట్స్ తమ వర్గం వారే ఉంటారు. తమని కాదని ఎవరూ ఏమి చేయలేరు అని సీనియర్లు మా అమ్మాయిని భయపెట్టారు’ అని కూడా చెప్పారు. అయితే ఆ తండ్రి అప్రమత్తమైనట్టుగా ఆ యాజమాన్యం అప్రమత్తం కాలేదు. ఇలాంటి ర్యాగింగ్ పద్ధతులను నివారించడానికి ప్రయత్నించలేదు. ‘నేను మౌఖికంగా ఫిర్యాదు చేస్తే ప్రిన్సిపాల్‌గారు చూస్తామండీ అన్నారు. ఆయన దృష్టిలో చూస్తాను అంటే మీడియాలో రాకుండా చూస్తాను అని అర్థం. లోపల ఏం జరిగినా ఆయనకు పట్టదు. బయట గోల జరక్కుండా మీరు ఏదైనా చేసుకోండి అని ఒక వర్గం విద్యార్థులను ఇతర విద్యార్థుల మీదకు వదిలేసినట్టుగా అనిపించింది’ అని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ ఆవేదనగా అన్నారు.
పేరెంట్స్ మీటింగ్ లేదు!
ఫ్రెషర్స్ వచ్చాక కాలేజ్‌లో అధికారికంగా ప్రెషర్స్ మీటింగ్ జరగాలి. రిషితేశ్వరి చేరాక అలాంటిదేమీ జరగలేదు. రిషితేశ్వరి చనిపోయాక ప్రిన్సిపాల్ హడావిడిగా కొంతమంది పేరెంట్స్‌నీ టెంపరరీ ఫ్యాకల్టీని పిలిపించి ఏదో అయ్యిందంటే అయ్యింది అనిపించారు. ‘ఆ మీటింగ్ గురించి నాకు చెప్పకపోయినా నేను వెళ్లాను. యూనివర్సిటీలో ర్యాగింగ్ ఏ స్థాయిలో ఉందో, మా అమ్మాయి ఎలా ఆ నరకం అనుభవించిందో చెప్పాను. టెంపరరీ ఫ్యాకల్టీ దీనిని ఖండించారు. అయితే నేను పర్మినెంట్ ఫ్యాకల్టీలో ఉన్న ఒక అధ్యాపకుణ్ణి పిలుచుకువస్తే ఆయన నా వాదనను సమర్థించి తన ఉద్యోగం పోయినా సరే రిషితేశ్వరికి న్యాయం జరగాలని అందరి ముందూ ప్రకటించారు. ఆ తర్వాత ఆ అధ్యాపకుణ్ణి టెర్మినేట్ చేసినట్టు పేపర్‌లో చదివాను. ఇంత దారుణంగా సత్యాన్ని తొక్కేయడం ఎక్కడా చూడలేదు’ అని మురళీకృష్ణ అన్నారు.
బ్రేక్‌ఫాస్ట్‌కు ఉంది... భోజనానికి లేదు...
మురళీకృష్ణ, దుర్గాబాయి దంపతులకు రిషితేశ్వరి ఒక్కర్తే అమ్మాయి. పిల్లలు తల్లిదండ్రుల్లో ఒకరితో ఎక్కువగా చనువుగా ఉంటారు. అలా రిషితేశ్వరికి తండ్రి దగ్గర చనువు ఎక్కువ. ప్రతిదీ తండ్రితో పంచుకునేది. ఆయన గొంతు వినకుండా ఏ రోజూ రిషితేశ్వరికి గడవలేదు. జూలై 14న ఉదయం కూడా తండ్రికి కాల్ చేసింది. బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళుతున్నా నాన్నా... అని చెప్పింది. అవే ఆమె ఆఖరి మాటలు అని తండ్రి ఊహించలేదు. ఆయన ఆఫీసుకు వెళ్లిపోయాడు. ఒంటిగంట ప్రాంతంలో వాట్సప్‌లో మెసేజ్ వచ్చింది. కూతురి నుంచే. అలా ఎప్పుడూ ఆ టైమ్‌లో రిషితేశ్వరి మెసేజ్ పెట్టి ఎరగలేదు. ఓపెన్ చేస్తే ‘ఐ లవ్ యూ నాన్నా’... అని ఉంది. మరికొద్ది సేపటికే యూనివర్సిటీ నుంచి ఫోన్. రిషితేశ్వరి చనిపోయిందని. రోజూ భోజనానికి మెస్‌లో కనిపించాల్సిన రిషితేశ్వరి కనిపించకపోయేసరికి రూమ్మేట్స్ రూమ్‌కి వెళ్లి చూశారు. అప్పటికే ఆ నిండు ప్రాణం... స్నేహం, సామరస్యం, సమభావన అనే క్షుద్బాధను అనుభవిస్తూ లోకం నుంచి వీడ్కోలు తీసుకుంది.
ఏం జరిగింది?
ఒక స్నేహితురాలు ఇద్దరు అబ్బాయిలను పరిచయం చేసింది. పరిచయం చేసిన ఆ అబ్బాయిలు ఎప్పుడూ ప్రిన్సిపల్ వెంట కనిపించేవారని తెలుస్తోంది. వారితో స్నేహం రానురాను ఇబ్బందిగా భారంగా మారిందని, ఆ ఒత్తిడి భరించలేకే రిషితేశ్వరి ప్రాణం తీసుకుందని స్నేహితుల ద్వారా తెలుస్తోంది.
చివరి క్షణాలు
రిషితేశ్వరికి డైరీ రాయడం అలవాటు. ఆమె తనకు నచ్చిన, నచ్చని విషయాలు డైరీ రాసుకుంటుంది. చనిపోయే ముందు కూడా ‘మై లాస్ట్ నోట్స్’ పేరుతో ఆ డైరీలోనే మూడు పేజీల సూసైడ్ నోట్ రాసింది. ‘నవ్వడం నాకు ఇష్టం. నవ్వుతూ ఉండటం నాకు ఇష్టం’ అని మొదలయ్యే ఆ నోట్... యూనివర్సిటీ జీవితం నరకప్రాయం అయ్యి నవ్వాలంటే భయపడే స్థితికి ఆమె ఎలా చేరుకుందో తెలుపుతోంది.
తల్లినీ తండ్రినీ ఉద్దేశిస్తూ వాళ్లేమేం పనులు చేయాలో రాసిన రిషితేశ్వరి... తండ్రి తన ముగ్గురు ప్రాణమిత్రులకు చేయవలసిన సాయాన్ని కూడా తెలిపింది. అయితే ఆమె తన చావుకు కారణమైనవారి పేర్లను రాయలేదు. ‘ఈ పరిస్థితికి కారకులెవరో వారికి నా చావు కనువిప్పు కావాలి’ అని రాసింది. పాఠ్యాంశాలను రాయాల్సిన చేతులు మరణవాంగ్మూలాన్ని రాయాల్సి రావడమే అతి పెద్ద విషాదం.
ఆత్మహత్య... కాదు హత్య...
ఇది ఆత్మహత్య అని భావిస్తున్నవారు ఎందరున్నారో, హత్య అని అనుమానపడుతున్నవారు కూడా అంతేమంది ఉన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించినవారు అక్కడ అలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదనీ, గది ఎత్తునూ, ఫ్యాన్ వేలాడుతున్న ఎత్తునూ పరిశీలిస్తే అంత ఎత్తున ఉన్న ఫ్యాన్‌కు చున్నీని వేలాడగట్టుకోవడం చాలా కష్టమనీ అభిప్రాయపడుతున్నారు. మెడపై చున్నీ నలిగిన గుర్తులు కూడా లేవని చెబుతున్నారు. రిషితేశ్వరి రాసే డైరీ తప్ప ఆమె పుస్తకాలు కూడా అదృశ్యమయ్యాయి. ‘సూసైడ్ నోట్‌లో ఉన్న రాత మా అమ్మాయిదే. అయితే మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు’ అని తండ్రి మురళీకృష్ణ అంటున్నారు. ‘హత్య అయినా ఆత్మహత్య అయినా నా కూతురి ప్రాణం పోయింది మాత్రం ర్యాగింగ్ వల్లనే. ముందు అది చావాలి. తర్వాత నా కూతురి చావుకు కారణమైనవారికి శిక్ష పడాలి’ అని ఆయన అన్నారు. ఆ మాట అన్నప్పుడు ఆయన కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. అయితే అవి పోయిన తన కూతురి కోసం మాత్రమే అనిపించలేదు. ఇప్పుడు చదువుతున్న లక్షలాదిమంది ఆడపిల్లల కోసం కూడా అనిపించాయి.
కలిసిన గొంతులు
రిషితేశ్వరి మరణం అప్పటికప్పుడు దావానలంలా వ్యాపించలేదు. కార్చిచ్చులా సమస్తాన్ని దహించేయలేదు. కానీ అది మెల్లమెల్లగా రాజుకున్న మహా అగ్నిధారలా ఇవాళ సమస్త సమాజిక అంతరాల్లో ప్రశ్నను లేవదీస్తోంది. ‘ఇవాళ రిషితేశ్వరి... రేపు మన ఇంటి ఆడపిల్లే కావచ్చు’ అనే నినాదంతో ఫేస్‌బుక్‌లో, సోషల్ మీడియాలో విపరీతమైన నిరసన కొనసాగుతూ ఉంది. ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ రిషితేశ్వరి మరణానికి జవాబు అడిగేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ ఉంది.
- సాక్షి ఫ్యామిలీ టీమ్
మిస్ పర్‌ఫెక్ట్: ‘‘రిషితేశ్వరి మంచి స్టూడెంట్. తన పనేదో తాను చూసుకొనేది. ప్రతిభ, నిజాయతీ లాంటి గుణాలను ఆమెలో చూసిన సీనియర్లు రిషితేశ్వరికి ఈ ఏడాది ‘మిస్ పర్‌ఫెక్ట్’ టైటిల్ కూడా ఇచ్చారు.’’
- జి. సాయిదీప, బీఆర్క్ సెకండియర్, రాజమండ్రి
ఆ అమ్మాయికి నాన్నే సర్వస్వం: ‘‘రిషితేశ్వరిది ఫ్రెండ్లీ నేచర్. ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళ నాన్నకు చెప్పుకొనేది. ఎవర్నీ హర్ట్ చేయదు. ఏదన్నా అంటే, గట్టిగా జవాబిచ్చే ఆమె ఆత్మహత్య చేసుకుందంటే, నమ్మశక్యం కావడం లేదు.’’
- పి. అవినాశ్, బీఆర్క్ థర్డ్ ఇయర్, రాజంపేట
చాలా సెన్సిటివ్: ‘‘రిషితేశ్వరి చాలా సెన్సిటివ్. ర్యాగింగ్‌తో ఇబ్బంది పడుతున్నానని మాతో అన్నప్పుడు చాలా సింపుల్‌గా తీసుకున్నాం. ఇలా అవుతుందనుకోలేదు. క్యాంటీన్‌కు వెళ్ళినప్పుడు తాను తినకుండా మా కోసం ఎదురుచూసిన రోజులు గుర్తొస్తున్నాయి.’’
- దుర్గాప్రసాద్, బీఆర్క్ సెకండ్ ఇయర్, కర్లంపూడి
భయమే ఈ ప్రభుత్వ సందేశమా?
రిషితేశ్వరి ఆత్మహత్య లేఖ ఉన్నా కేసును అటకెక్కించారు: జగన్
హైదరాబాద్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రిషితేశ్వరి రాసిన ఆత్మహత్య లేఖ ఉన్నప్పటికీ.. ఈ ఘటనకు బాధ్యులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టకుండా అటకెక్కించటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో.. విద్యార్థులు, వారి తల్లితండ్రులు భయం భయంగా బతకాల్సిందేనన్నదే ఈ ప్రభుత్వం ఇస్తున్న సందేశమా? అని ప్రశ్నించారు. ‘‘మన నాగరిక సమాజానికి, మన భవిష్యత్తు తరాల వారికి, మన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇస్తున్న సందేశం ‘భయమే’నా? రిషితేశ్వరి ఉదంతంలో విస్పష్టమైన సూసైడ్ నోట్ (ఆత్మహత్య లేఖ) ఉన్నా కూడా.. ఈ ఘోరమైన సంఘటనను కోల్డ్ స్టోరేజీకి పంపించటం చాలా బాధాకరం.. చాలా దుఃఖకరం’’ అంటూ జగన్ ట్విటర్ వ్యాఖ్యల్లో ఆవేదన వ్యక్తం చేశారు.
బాబుగారూ... ఎక్కడున్నారు?
నాడు ఇదే నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో భారీగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ నవ్యాంధ్రను నిర్మిస్తానని నారా చంద్రబాబు నాయుడు ప్రతిన చేశారు. నేడు అదే నాగార్జున యూనివర్సిటీలో భవిష్యత్తును నిర్మించుకోడానికి ఆర్కిటెక్చర్ కోర్సులో చేరి, ర్యాగింగ్ భూతానికి బలైపోయిన రిషితేశ్వరి మరణంపై స్పందించకపోగా, ఆమె తల్లితండ్రులకు కనీస సానుభూతిని కూడా ప్రకటించలేకపోయారు చంద్రబాబు!
⇔ఆమె డైరీ వెల్లడిస్తున్న గుండెను పిండేసే అంశాలు... రిషితేశ్వరి డైరీ అందరి గుండెలను పిండి వేసే అంశాలను వెల్లడించింది. పోలీసులు ఆ డైరీని ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. పాఠకులకు ‘ది హిందూ’ దినపత్రిక ఈ విషయాలను ప్రత్యేకంగా అందించింది. రిషితేశ్వరి రాసిన ప్రకారం విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న పార్టీలో ఫైనల్ ఇయర్ విద్యార్థి మద్యం తాగి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థి ధోరణి ఎంతగా బాధించిందంటే ‘‘అప్పుడే నాకు చచ్చిపోవాలనిపించింది’’ అని ఆమె రాసుకుంది. - ‘ది హిందూ’ కథనం, 25 జూలై 2015
⇔ఆత్మహత్య కేసుపై ఆగని నిరసనలు... రిషితేశ్వరి ఆత్మహత్యతో సంబంధం ఉందనే ఆరోపణపై కాలేజ్ ప్రిన్సిపాల్ జి. బాబూరావు సస్పెండ్ అయినా క్యాంపస్‌లో నిరసనల వెల్లువ ఆగలేదు.ఆత్మహత్యకు కారకులైన వారి మీద ఇంకా చర్యలు తీసుకోనందుకు యూనివర్శిటీ అధికారులకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ శుక్రవారం నాడు స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు వైస్ చాన్సలర్ చాంబర్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌చేస్తేనో.. అతని రాజీనామా అంగీకరిస్తేనో సరిపోదని... ఇంతటి హేయమైన నేరానికి పాల్పడిన అతనిని జైలుకి పంపాలని డిమాండ్ చేశారు. - ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం, 25 జూలై 2015
⇔ర్యాగింగ్ శక్తులపై నిరసన... ‘‘...నిరసనలు పెరగడంతో, పరిస్థితిని అదుపులో ఉంచడం కోసం నాగార్జున విశ్వవిద్యాలయం అధికారులు పది రోజులు సెలవులు నిర్ణయించారు. ...ర్యాగింగ్ కేసులో నిందితులైన విద్యార్థులనూ, అధికారులనూ కాపాడడం కోసమే తరగతులు రద్దు చేసి, సెలవులు ప్రకటించారని పి.డి.ఎస్.ఒ. రాష్ట్ర కార్యదర్శి ఎస్.కె. బాజీ సైదా, ఎస్.ఎఫ్.ఐ. నాగార్జున యూనివర్సిటీ కమిటీ ప్రెసిడెంట్ డి.ఏసురాజు తదితర నేతలు ఆరోపించారు...’’ - ‘దక్కన్ క్రానికల్’ కథనం, 26 జూలై 2015
⇔ రిషితేశ్వరి మరణం: ఆత్మహత్యా? హత్యా? ‘‘రిషితేశ్వరి డైరీని బట్టి... సీనియర్లు రెగ్యులర్‌గా రిషితేశ్వరిని హింసించేవారని అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ...విద్యార్థుల నుంచి డబ్బులు పోగుచేసి, ప్రిన్సిపాల్ క్రమం తప్పకుండా పార్టీలు నిర్వహిస్తుంటారని యూనివర్సిటీ స్టూడెంట్లు ఆరోపించారు. విద్యార్థినులతో కలసి ప్రిన్సిపాల్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాల వీడియోను వారు అందించారు. రిషితేశ్వరి వ్యవహారం గురించి చాలాసార్లు ఆయనకు చెప్పినా, స్పందించలేదని విద్యార్థులు ఆరోపించారు.’’ - ‘మెట్రో ఇండియా’ కథనం, 26 జూలై 2015
విద్యార్థులు లేకుండా విచారణలా?
రిషితేశ్వరి చనిపోయాక విద్యార్థులకు పదిరోజులు సెలవులిచ్చి ఆ తరువాత కమిటీలు వేశారు. విద్యార్థులు లేకుండా కమిటీ ఎవరిని విచారిస్తుంది? కళాశాలలు మళ్లీ మొదల య్యాక విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక అందించాలి. గతంలోనూ యూనివర్సిటీలో అనేక కమిటీలేశారు. ఏ కమిటీ ద్వారా సక్రమంగా న్యాయం జరిగిన దాఖలాలు లేవు. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఉదంతాలు జరుగుతూనే ఉన్నాయి.
- పవన్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు
ప్రిన్సిపాల్‌ను రక్షించే ప్రయత్నం
రిషితేశ్వరిది ఆత్మహత్యేనని యూనివర్సిటీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఘటన వెనుక కారణాలను కప్పిపుచ్చేందుకే కమిటీ ఇలా నివేదికలు ఇస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. యూనివర్సిటీ ప్రక్షాళన పేరుతో ఈ కేసులో వాస్తవాలు చెబుతున్నవారిని బెదిరిస్తున్నారు. సస్పెండ్ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
- వెన్నెల, విద్యార్థి జేఏసీ నాయకురాలు
మాట్లాడితే బెదిరిస్తున్నారు
ప్రభుత్వం నియమించిన కమిటీ తనకు అనుకూల వర్గాల వాదనను విని, అదే ప్రభుత్వానికి నివేదించే కుట్ర జరుగుతోంది. ఈ కమిటీతో మృతురాలికీ, న్యాయం కోసం పోరాడుతున్న స్టూడెంట్స్‌కూ ఎలాంటి న్యాయమూ జరగదు. కమిటీ ముందు ఎవరైనా మాట్లాడుతుంటే వారిని వివిధ రకాలుగా బెదిరిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావును ఎందుకు అరెస్టు చేయరో చెప్పాలి. బహిరంగంగా న్యాయ విచారణ జరపాలి.
- షేక్ బాజీసైదా, విద్యార్థి జేఏసీ కన్వీనర్
ప్రభుత్వం సీరియస్‌గా ఉంది
రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. నాతోపాటు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించి, క్షుణ్ణంగా విచారణ జరిపి ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రెవెన్యూ, పోలీసు, యూనివర్సిటీ అధికారులతో సమావేశమై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తాం.
- బాలసుబ్రహ్మణ్యం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్