'కీలక సమాచారం సేకరించాం'
గుంటూరు: ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో సమాచారం సేకరిస్తోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ బుధవారం యూనివర్సిటీ లో విచారణ ప్రారంభించింది. ఈ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం విద్యార్థులు, అధ్యాపకులు, యూనివర్సిటీకి సంబంధించిన ఇతర సభ్యులతో సమావేశం అయింది.
ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విచారణను అవసరమైతే మరో 2 రెండు రోజులు పొడిగించే విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు.బుధవారం అధికారులతో మాట్లాడినపుడు కొంత కీలక సమాచారం సేకరించామన్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి రిషతేశ్వరి తల్లిదండ్రులతో మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే తమను నేరుగా సంప్రదించవచ్చన్నారు.
కాగా రెండోరోజు జరుగుతున్న విచారణకు పీడీఎస్‌యూ, ఎంఎస్‌ఎఫ్ ప్రతినిధులు హాజరయ్యారు. యూనివర్సిటీకి సెలవులు ప్రకటించి...విద్యార్థులు ఎవరూ లేకుండానే విచారణ పేరుతో అధికారులు కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కొన్ని విద్యార్థి సంఘాలు విచారణను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.