సంక్రాంతిని దాచి పెట్టుకోవాలి.అది అంత మంచి పండుగ.తొందరగా అయిపోతుందేమోనన్న దిగులుగా ఉందా!ఈ రోజు నుంచే పిండి కొట్టండి. వంటకాలు తయారుచేయండి. డబ్బాలలో దాచి పెట్టుకుని కొంచెం కొంచెం ఆస్వాదిస్తూ తినండి.అప్పుడు పండగ ఎన్నాళ్లో ఉంటుంది.ఇంటిల్లిపాదికీ ఇష్టమైన పిండి వంటలు మీకు కొట్టిన పిండే కదా!
నేతి అరిసెలు/ బెల్లం అప్పాలు
కావలసినవి: బియ్యం – ఒక కేజీ; బెల్లం – 700 గ్రా.; నువ్వులు – 100 గ్రా.; నెయ్యి/నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఏలకుల పొడి – అర టీ స్పూను.
తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, ముందురోజు రాత్రి నానబెట్టాలి ∙మరుసటి రోజు పెద్ద జల్లెడలాంటి దానిలో పోసి సుమారు పావుగంట సేపు బియ్యాన్ని వడకట్టాలి ∙తడిపోయాక, బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక పాత్రలో బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి పాకం పట్టాలి ∙ఉండ పాకం వచ్చేవరకు ఉడికించాలి ∙బియ్యప్పిండి కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి ∙అర టీ స్పూను ఏలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలియబెట్టాలి ∙మిశ్రమం బాగా చిక్కబడేవరకు ఆపకుండా కలుపుతుండాలి ∙బాగా ఉడికిందనిఅనిపించాక దింపేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి ∙తయారయిన అరిసెల పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ, నెయ్యి పూసిన ప్లాస్టిక్ పేపర్ మీద ఒత్తి, కాగిన నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙అరిసెల బల్ల మీద ఉంచి, నూనె పోయేలా గట్టిగా ఒత్తాలి ∙బాగా చల్లారాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
గులాబీ గుత్తులు
కావలసినవి: మైదా పిండి – 3 కప్పులు; బియ్యప్పిండి – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు; ఉప్పు – కొద్దిగా; వంట సోడా – కొద్దిగా, మిఠాయి రంగు – కొద్దిగా
తయారీ: ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, పంచదార వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ దోసెల పిండి మాదిరిగా కలుపుకోవాలి ∙కొద్దిగా నీళ్లలో మిఠాయి రంగు కలిపి, పిండిలో కలియబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో తగినంత నూనె పోసి కాచాలి ∙గులాబీ గుత్తులు తయారుచేసే గుత్తిని ముందుగా వేడి వేడి నూనెలో కొద్దిసేపు ఉంచి వేడి చేయాలి ∙కలిపి ఉంచుకున్న పిండిలో ఆ గుత్తిని జాగ్రత్తగా ముంచి, అదే గుత్తిని నూనెలో ఉంచాలి ∙కొద్దిగా వేగుతుండగా చాకుతో గుత్తి నుంచి గులాబీలను వేరు చే యాలి
∙దోరగా వేగిన తరవాత పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి.
రిబ్బన్ పకోడా
కావలసినవి: బియ్యప్పిండి – 2 కప్పులు; సెనగ పిండి – ఒక కప్పు; వాము – 2 టీ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – రుచికి తగినంత; మిరప కారం – అర టీ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ: ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, సెనగ పిండి, వాము, ఉప్పు, పసుపు, మిరప కారం వేసి కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి
∙తగినన్ని నీళ్లు జత చేస్తూ జంతికల పిండిలా కలుపుకోవాలి ∙జంతికల గొట్టంలో రిబ్బన్ మురుకులు తయారుచేసే అచ్చు ఉంచాలి
∙జంతికల గొట్టంలో కొద్దిగా తడి చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి ∙జంతికల గొట్టంతో రిబ్బన్ మాదిరిగా వేసి దోరగా వేగాక పేపర్‌టవల్ మీదకు తీసుకోవాలి ∙బాణలిలో నూనెలో కొద్దిగా కరివేపాకు వేసి వేయించి తీసేయాలి ∙రిబ్బన్ మురుకులలో కలపాలి ∙బాగా చల్లారాక డబ్బాలో నిల్వ చేయాలి.
మడత కాజా
కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; పంచదార – ముప్పావు కప్పు; నెయ్యి – పావు కప్పు.
తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, నెయ్యి, కొద్దిగా నీళ్లు వేసి గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙పిండి మరీ మెత్తగాను, మరీ గట్టిగాను కాకుండా ఉండాలి ∙గిన్నె మీద పల్చటి తడి వస్త్రం వేసి గంటసేపు వదిలేయాలి ∙ఆ తరవాత వస్త్రం తీసి చేతితో మరోమారు మెత్తగా కలపాలి ∙చపాతీలు ఒత్తే పీట మీద కొద్దిగా పొడి పిండి చల్లాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండిని చపాతీ మాదిరిగా వీలైనంత పల్చగా ఒత్తాలి ∙ఒత్తిన చపాతీ మీద పొడి పిండి జల్లాలి ∙చపాతీని సన్నగా మడుచుకుంటూ రావాలి ∙అలా మొత్తం చపాతీని రోల్ చేయాలి ∙మధ్యమధ్యలో పొడి పిండి జల్లుతుండాలి ∙(అప్పుడే పొరలుపొరలుగా వస్తాయి కాజాలు) ∙అలా మొత్తం చపాతీని రోల్ చేశాక, చివరగా కొద్దిగా తడి చేసి మరోమారు రోల్ చేయాలి ∙చాకుతో కాజా ఆకారంలో ముక్కలుగా కట్ చేయాలి ∙ఒక పాత్రలో పంచదార, ఒక కప్పుడు నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు ఉడికించాలి ∙ఏలకుల పొడి జత చేసి కలియబెట్టి, దింపేయాలి ∙మరోపక్క స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె పోసి కాగనివ్వాలి ∙తయారుచేసి ఉంచుకున్న కాజాలను వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న పాకంలో వేసి సుమారు గంటసేపు మూత పెట్టి వదిలేయాలి ∙పాకం బాగా పీల్చుకుని కాజాలు
తియ్యగా రుచిగా
ఉంటాయి.
మినప జంతికలు/ మురుకు
కావలసినవి: మినప్పప్పు – 2 గ్లాసులు; బియ్యం – 6 గ్లాసులు; వెన్న – 2 టేబుల్ స్పూన్లు; మిరప కారం – ఒక టేబుల్ స్పూను; వాము – అర టేబుల్ స్పూను; నువ్వులు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; నువ్వుల నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ: ∙రెండిటినీ కలిపి మెత్తగా పిండి పట్టించాలి ∙2 టేబుల్ స్పూన్ల వెన్న జత చేయాలి ∙ఒక టేబుల్ స్పూను మిరప కారం, అర టేబుల్ స్పూను వాము, ఒక టేబుల్ స్పూను నువ్వులు, తగినంత ఉప్పు వేసి, కొద్దికొద్దిగా చల్ల నీళ్లు జత చేస్తూ, ఉండలుగా లేకుండా జంతికల పిండి కలుపుకోవాలి ∙జంతికల గొట్టం తీసుకుని లోపలి భాగాన్ని కొద్దిగా తడి చేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె పోసి కాచాలి ∙జంతికల గొట్టంలో తగినంత పిండి ఉంచాలి ∙కాగిన నూనెలో జంతికల మాదిరిగా చుట్టాలి ∙దోరగా వేగిన తరవాత చట్రం సహాయంతో పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి ∙జంతికలు బాగా చల్లారాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
సజ్జప్పాలు
కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; వేడి నూనె – అర కప్పు; ఉప్పు – చిటికెడు; నెయ్యి – పావు కప్పు; బొంబాయి రవ్వ.
తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, వేడి నూనె, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙గంటసేపు పక్కన ఉంచాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగాక బొంబాయి రవ్వ వేసి వేయించాలి ∙అర కప్పు పంచదార, కప్పుడు నీళ్లు వేసి బాగా కలుపుతూ ఉడికించి దింపేయాలి ∙చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙మైదాపిండిని చిన్న సైజు పూరీలా ఒత్తి అందులో కొద్దిగా బొంబాయి రవ్వ ఉండను ఉంచి, అన్నివైపులా మూసేసి, ఉండలా చేయాలి ∙అరిటాకుకి కొద్దిగా నూనె పూసి ఈ ఉండలను చేతితో అరిసెల మాదిరిగా ఒత్తాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, వీటిని అందులో వేసి దోరగా వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙చల్లారాక డబ్బాలో నిల్వ ఉంచాలి ∙ఇవి పది రోజులపాటు తాజాగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment