మాఅమ్మగారు | Special story to sitha lakshmamma | Sakshi
Sakshi News home page

మాఅమ్మగారు

Published Fri, Aug 3 2018 12:07 AM | Last Updated on Fri, Aug 3 2018 10:50 AM

Special story to sitha lakshmamma - Sakshi

కష్టం చూసి  పరుగెత్తుకొచ్చేస్తుంది అమ్మ. మనసు బాగుండకపోతే  మలాం రాస్తుంది అమ్మ. కనకపోయినా..  అమ్మ అనిపిస్తుంది అమ్మ.అమ్మ లాంటి  ఈ మామ్మగారైతే... విధి చిన్నచూపు చూసినా.. ఈ చిన్నారిని ‘మన–వరాలు’  అనే అనుకుంది.

ఇంచుమించు ప్రతి ఇంట్లోను భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్తున్నారు. అటువంటి వారి కోసం చైల్డ్‌ కేర్‌ సెంటర్లు మొదలయ్యాయి. ఈ సెంటర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వీరు పిల్లలను బాధ్యతగానే చూస్తున్నప్పటికీ అడపాదడపా వారి మీద చెయ్యి చేసుకుంటున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పిల్లలను చూడటం ఉద్యోగంలో భాగంగా భావిస్తారు వీరు.  అరవై ఏళ్ల క్రితమే శిశు సంరక్షణం ఇందుకు భిన్నంగా ఆరు దశాబ్దాల క్రితమే శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించారు సీతారామలక్ష్మమ్మ, సీతారామాంజనేయ శర్మ దంపతులు. బాపట్ల దగ్గర వల్లూరుకి చెందిన వీరు వివాహమైన కొత్తల్లో ఉద్యోగరీత్యా గుంటూరు చేరారు. ‘‘పెళ్లినాటికి నాకు పదకొండేళ్లు, ఆయనకు ఇరవై సంవత్సరాలు. మావారు గుంటూరు పొగాకు కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేసేవారు. కొన్ని సంవత్సరాల తరవాత  విజయవాడలో ఒక వ్యాపారి దగ్గర రోజుకి రూపా యి పావలా జీతానికి అకౌంట్లు రాసేవారు.  చాలీచాలని జీతంతో కావడంతో, కిరాణా షాపులలో పొట్లాలు కట్టేదాన్ని నేను’’ అంటారు లక్ష్మమ్మ.

మొదట.. పెద్దవాళ్లకు సేవ
విజయవాడలోని కుర్తాళం ఆశ్రమంలో ఈ దంపతులిద్దరూ ఆరేళ్లపాటు పెద్దవారికి సేవలు చేశారు. తరవాత ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి పదహారు  సంవత్సరాలపాటు ఆశ్రమాలలో జీవనం సాగించారు. ఈ దంపతులకు ఒకే ఒక ఆడపిల్ల. అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన నాటì  నుంచి ఎవ్వరి మీద ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని నష్టానికి అమ్మేశారు. 
‘‘మా వారు రిటైరయ్యారు. పెన్షన్‌ ఏమీ లేదు. మా తిండి మేం తినడానికి ఏదో ఒక పనిచేయాలని నిశ్చయించుకున్నాం. విజయవాడ సత్యనారాయణ పురంలో చైల్డ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభించాం. ఇద్దరు పిల్లలతో ప్రారంభమైన ఈ సెంటర్‌ అతి వేగంగా పాతికమందికి చేరుకుంది. సుమారు 20 ఏళ్ల పాటు పిల్లలతో ఆడుతూ పాడుతూ హాయిగా నడిపాం. వారిని మా సొంత మనవలుగానే భావించాం’’ అని గతం గుర్తు చేసుకుంటారు సీతారామలక్ష్మమ్మ.

వాళ్లమ్మాయే.. ఈ అమ్మాయి
ఆ స్కూల్‌లోనే అందరితో పాటు జయరామ్, రమ దంపతులు వాళ్ల అబ్బాయిని చేర్పించారు. రోజూ ఉదయాన్నే అబ్బాయిని మామ్మ గారి దగ్గర వదిలి, సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లేవారు. అలా వారి కుటుంబంతో వీరికి సాన్నిహిత్యం ఏర్పడింది. ‘‘ఈ అబ్బాయి తరవాత వాళ్లకి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయి మానసిక దివ్యాంగురాలు. అందువల్ల మిగిలినవారి కంటె జాగ్రత్తగా చూడాలి. దేవుడు ఆ పిల్లకు ‘చెప్పిన మాట వినే లక్షణం’ ప్రసాదించాడు. నేను ఏది చెప్పినా తుచ తప్పక ఆచరించేది’’ అంటారు లక్ష్మమ్మ. 

సంరక్షణతో పాటు సంస్కారం
ఈ శిశు సంరక్షణ కేంద్రంలో రైమ్స్‌తో పాటు సంస్కారం కూడా నేర్పారు. శర్మ, లక్ష్మమ్మ.. వాళ్ల చిన్నతనంలో నేర్చుకున్న, చదువుకున్న నీతి కథలు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేవారు. పిల్లలతో అనుబంధం పెంచుకుంటూ, జీవితం హాయిగా, ఆనందంగా గడిపేశారు. వయోభారం మీద పడుతుండటంతో ఇరవై ఏళ్ల తరవాత శిశుసంరక్షణ కేంద్రానికి స్వస్తి పలికి, వడియాలు, అప్పడాల వంటివి తయారు చేసి అమ్మడం మొదలుపెట్టామని  చెప్పారు లక్ష్మమ్మ.  

అనూహ్యంగా.. ఆ రోజు..!
రెండేళ్ల క్రితం సీతారామాంజనేయశర్మ గతించారు. అప్పటికి ఆయనకు వంద సంవత్సరాలు నిండాయి. ‘‘మా వారు ఏదో పని ఉందని బయటకు వెళ్లి, వచ్చి కుర్చీలో కూర్చున్నారు. ‘కాఫీ కావాలా’ అని పిలిస్తే పలకలేదు. ఇక ఎన్నడూ కాఫీ తాగరని అర్థం కావడంతో, నా చేతిలో కప్పు చేతిలోనే ఉండిపోయింది’’ అంటూ కళ్లు తుడుచుకున్నారు లక్ష్మమ్మ. ఇరుగు పొరుగువారు ఆయన అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు. ‘‘నేను కన్ను మూస్తే, నా బాధ్యత ఎవరు తీసుకుంటారనే సంశయంతో నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి చాలామంది నిరాకరించారు. భగవంతుడు పరీక్షలు పెడుతూనే, పరిష్కారాలూ చూపిస్తాడు. ఎట్టకేలకు ఒక ఇల్లు అద్దెకు దొరికింది. ఇప్పుడు నేను ఏ ఇంట్లో ఉంటున్నానో, ఆ ఇంటావిడ తాతగారికి గతంలో నేను ఆశ్రమంలో ఉన్న రోజుల్లో సేవ చేశానట. ఆ కృతజ్ఞతతో వారి మనుమరాలు నాకు ఇల్లు అద్దెకు ఇచ్చి, నన్ను సొంత అమ్మమ్మలా చూసుకుంటున్నారు’’ అని చెప్పారు లక్ష్మమ్మ. మామ్మగారికి ఇటీవల కొద్దిగా అనారోగ్యం చేయడంతో ఆవిడను ఆసుపత్రికి తీసుకువెళ్లి, చూపించి, ‘మేమున్నాం’ అని భరోసా ఇచ్చారు ఇంటి ఓనరు, లక్ష్మీప్రియ తల్లిదండ్రులు.

జన్మజన్మల అనుబంధం
‘‘మాది ఏ జన్మ బంధమో ఈ ఇద్దరు పిల్లలతోపాటు, వారి తల్లిదండ్రులు కూడా ఆత్మీయులు అయిపోయారు. నన్ను సొంత మామ్మగా చూసుకుంటున్నారు. నెలనెలా ఎంతో కొంత డబ్బు ఇస్తుంటారు. ఇంట్లో ఏ శుభకార్యం చేయాలన్నా నా సలహా తీసుకుంటారు’’ అంటున్న మామ్మగారిని చూస్తే అపురూపంగా అనిపిస్తుంది.

నా చెయ్యి మంచిదని..
క్రేన్‌ వక్కపొడి వారు నేటికీ నెలకు నాలుగు వేల రూపాయలు ఒక కొడుకు తల్లికి పంపుతున్నట్టుగానే పంపుతున్నారు. వారు క్రేన్‌ వక్కపొడి వ్యాపారం ప్రారంభించకముందు వాళ్ల ఇంటి పక్కనే పదిహేను సంవత్సరాలు అద్దెకున్నాం. క్రేన్‌ వక్కపొడి ప్రారంభోత్సవం సందర్భంగా, వక్కలు తెచ్చి నా చేత దంపించి, బోణీ చేయించారు. అలా మొదలుపెట్టాక కోటీశ్వరులయ్యారనే భావనతో ఇప్పటికీ నాకు నెలకు నాలుగు వేల రూపాయలు పంపుతున్నారు. 
–  సీతారామలక్ష్మమ్మ

మా అమ్మాయిని తీర్చిదిద్దారు
మాకు ఈ మామ్మగారు భగవంతుడు ఇచ్చిన వరం. మా అమ్మాయిని సొంత మనవరాలి కంటె ఎక్కువగా చూసుకుంటారు. ఇంటికి వచ్చిన వాళ్లకి మంచి నీళ్లు అవ్వడం, కాళ్లు చేతులు కడుక్కుని భోజనం చేయడం, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడం, ఇంటికి ఎవరైనా వస్తే మంచినీళ్లు ఇమ్మని తల్లికి చెప్పడం వంటివన్నీ మామ్మగారి దగ్గరే నేర్చుకుంది. ఇల్లు తుడుస్తుంది, ఇంటికి వచ్చిన వారు వెళ్లేటప్పుడు వారికి పండు, బొట్టు ఇచ్చేవరకు ఊరుకోదు. పదిహేనేళ్లుగా మామ్మగారు మా పిల్లను సాకుతున్నారు. మా పిల్ల ఆవిడను ‘మామ్మగారు’ అనే పిలుస్తుంది. ఇంట్లో ఏదైనా తినే పదార్థాలు ఉంటే మామ్మగారికి ఇచ్చేవరకు ఊరుకోదు. – రమ, జయరామ్‌ దంపతులు, విజయవాడ

– డా. వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement