గ్రానైట్‌... రాంగ్‌ రూట్‌లో రైట్‌ రైట్‌! | Illegal granite mining in Bapatla | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌... రాంగ్‌ రూట్‌లో రైట్‌ రైట్‌!

Published Tue, Nov 26 2024 9:25 AM | Last Updated on Tue, Nov 26 2024 9:25 AM

Illegal granite mining in Bapatla

బల్లికురవ, సంతమాగులూరు నుంచి గ్రానైట్‌ పలకలు ఎగుమతి

మార్టూరు నుంచి సైతం అక్రమ రవాణా

జీరో బిల్లులతో రోజుకు 110 లారీల తరలింపు

లారీకి రూ.32 వేలు వసూలు చేస్తున్న టీడీపీ నేతలు

చెక్‌పోస్టు నిర్వహణ కంపెనీకి రూ.16 వేలు, దందా నిర్వాహకులకు రూ.16 వేలు

తెర ముందు మార్టూరుకు చెందిన అనిల్‌

తెర వెనుక గ్రానైట్‌ మంత్రి ముఖ్య అనుచరుడు, పర్చూరు టీడీపీ నేత

మాచర్ల, పిడుగురాళ్ల, చిలుకలూరిపేట, నరసరావుపేట నేతలకు నెల మామూళ్లు

∙నెలకు రూ.10.56 కోట్ల వసూలు

జీరో దందాతో ప్రభుత్వానికి నెలకు రూ.23.10 కోట్ల పన్ను ఎగవేత 

ప్రభుత్వ పెద్దలకూ వాటాలంటూ జోరుగా ప్రచారం

సాక్షి ప్రతినిధి,బాపట్ల: రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరు మండలాల నుంచి గ్రానైట్‌ పాలీషింగ్‌ పలకలు అక్రమంగా తరలిపోతున్నాయి. ప్రభుత్వానికి ఎటువంటి సేల్స్‌టాక్స్, మైనింగ్‌ టాక్స్‌ చెల్లించకుండానే జీరోలో రోజుకు పదుల సంఖ్యలో లారీల పలకలు అటు తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా తరలిస్తున్నారు. పై రెండు మండలాల నుంచే రోజుకు 40 నుంచి 50 లారీలు తరలిపోతున్నాయి. మంత్రి ప్రధాన అనుచరుడు ఈ అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా కాంట్రాక్ట్‌ దక్కించుకున్న కంపెనీ మాత్రం అనధికారికంగా ఆ బాధ్యతలను మంత్రి అనుచరుల చేతుల్లో పెట్టి వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. 

జీరోలో పలకలు తరలించాలనుకునే వ్యాపారుల వద్ద లారీకి రూ.32 వేలు కప్పం కట్టించుకొని చెక్‌ పోస్ట్‌ కంపెనీ పేరున స్లిప్పులు ఇస్తున్నారు. వాటిని చూసి చెక్‌ పోస్ట్‌ సిబ్బంది పచ్చ జెండా ఊపుతున్నారు. వాస్తవానికి టన్ను పాలీషింగ్‌ పలకలకు సేల్స్‌టాక్స్‌ రూ.1300, మైనింగ్‌ టాక్స్‌ రూ.700 చొప్పున రూ.2 వేలు చెల్లించాలి. లారీ సగటున 35 టన్నుల పలకలు తీసుకెళుతుంది. ఈ లెక్కన ప్రభుత్వానికి లారీకి రూ.70 వేలు పన్ను చెల్లించాల్సి వుంది. కానీ మంత్రి అనుచరులకు రూ.32 వేలు చెల్లిస్తే దర్జాగా గ్రానైట్‌ పలకలను తీసుకెళ్లే అవకాశం ఉండడం, దాని మూలంగా లారీకి రూ.25 వేలు మిగులు తుండడంతో చాలామంది వ్యాపారులు జీరోలో గ్రానైట్‌ పలకలు తీసుకెళ్లేందుకు మొగ్గు చూపిస్తున్నారు.

దందా అంతా అనిల్‌ కనుసన్నల్లోనే...
కూటమి అధికారంలోకి వచ్చిన ప్రారంభం నుంచి మార్టూరుకు చెందిన వ్యాపారులు పర్చూరు నియోజకవర్గ టీడీపీ నేతకు కప్పం కట్టి జోరోలో గ్రానైట్‌ పలకలు ఇతర రాష్ట్రాలకు తరలించేవారు. మార్టూరు నుంచి రోజుకు 70కి పైగా లారీలు ఈ తరహాలో అక్రమ రవాణా సాగించేవి. ప్రారంభంలో లారీకి రూ.28 వేలు కప్పం కట్టించుకునేవారు. ఆ తర్వాత మంత్రి నియోజకవర్గం నుంచి గ్రానైట్‌ పలకలు ఎగుమతి అవుతుండటంతో మంత్రి ప్రధాన అనుచరుడికి ఈ జీరో వ్యాపారంపై కన్నుపడింది. పర్చూరు టీడీపీ నేతతో మిలాఖత్‌ అయ్యారు. 

అప్పటికే ఈ వ్యవహారంలో ఆరితేరిన మార్టూరుకు చెందిన అనిల్‌ అనే వ్యక్తికి దందాను అప్పగించారు. అనిల్‌ మంత్రి ప్రధాన అనుచరుడికి సైతం అత్యంత సన్నిహితుడు కావడంతో జోడీ కుదిరింది. ఇందుకు మంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. లేకపోతే బల్లికురవ, సంతమాగులూరు నుంచి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా గ్రానైట్‌ తరలుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటారు? మొత్తంగా గ్రానైట్‌ జీరోవ్యాపారం జోరందుకుంది. ప్రస్తుతం అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలనుంచి రోజుకు 110 లారీల గ్రానైట్‌ పలకలు అక్రమంగా ఇతర రాష్ట్రాలు, అక్కడినుంచి ఇతర దేశాలకు దర్జాగా తరలి పోతున్నాయి.

ఆ నేతలకు నెలకు కోట్లలో ఆదాయం...
ఒక్కోలారీలో 35 టన్నులకు తగ్గకుండా గ్రానైట్‌ పలకలను తరలిస్తారు. ఇందుకోసం దందా నిర్వాహకులు గతంలో కంటే రూ.4 వేలు పెంచి లారీకి రూ.32 వేలు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన జోజుకు 110 లారీలకు రూ.35,20,000, నెలకు రూ.10,56,60,000 వసూలు చేస్తున్నారు. ఈ మొత్తంలో చెక్‌పోస్టుల కాంట్రాక్ట్‌ నిర్వాహకులకు లారీకి రూ.16 వేలు చొప్పున సగం డబ్బులు చెల్లించి మిగిలిన దాంట్లో కొంత మొత్తంలో చిలుకలూరిపేట, నరసరావుపేట, మాచర్ల, పిడుగురాళ్ల టీడీపీ నేతలకు వాటాలు పంచుతున్నారు. వారితోపాటు అటు మైనింగ్, పోలీసు, విజిలెన్స్‌ తదితర అధికారులకు నెలకు కొంతమొత్తం చెల్లిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని పర్చూరు నేత, మంత్రి అనుచరుడు వాటాలుగా పంచుకుంటున్నట్లు సమాచారం. నెలకు కోట్లలోనే రాబడి ఉండడంతో దందా పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ రాబడిలో కొంత మొత్తాన్ని ప్రభుత్వంలోని కొందరు పెద్దలకు సైతం చేరవేస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ రాబడికి గండి..
టీడీపీ నేతల అక్రమ దందా పుణ్యమా అని పలువురు గ్రానైట్‌ వ్యాపారులు పన్నులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్‌ తరలిస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ప్రతి టన్ను పాలిషింగ్‌ పలకలకు సేల్స్‌టాక్స్‌ రూ.1300, మైనింగ్‌ టాక్స్‌ రూ.700 చొప్పున మొత్తం రూ. 2 వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ లెక్కన జీరోలో వెళ్లే 35 టన్నుల లారీకి రూ.70 వేలు టాక్స్‌ చెల్లించాలి. రోజుకు 110 లారీలకు అనుకుంటే రూ.77 లక్షలు, ఆ ప్రకారం నెలకు రూ.23.10 కోట్లు టాక్స్‌లు చెల్లించాల్సి ఉంది. కానీ వ్యాపారులు ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా అక్రమ మార్గంలో గ్రానైట్‌ను తరలి­స్తున్నారు. అయినా అధికారులు తమ­కేమీ పట్టనట్లు మిన్నకుండి పోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement