సామాన్యప్రజల సేవయే పరమార్థంగా మఠాన్ని నడిపిన మానవతావాది. నిరక్షరాస్యులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన విద్యాప్రదాత. మనుషుల్లో దేవుడిగా పూజలందుకున్న ఈ ధార్మికవేత్త తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి డాక్టర్ శ్రీశివకుమార స్వామి. 111 ఏళ్ల తమ సుదీర్ఘజీవనంలో ఆధ్యాత్మిక బోధలతో జాతిని చైతన్యవంతం చేసి అభినవ బసవణ్ణగా అందరి మన్ననలను పొందారు.
ఆధ్యాత్మిక శక్తి పుంజం
1908 సంవత్సరంలో పటేల్ హోనప్ప, గంగమ్మ దంపతులకు చివరి సంతానంగా జన్మించిన ఒక సామాన్యుడు ఆధ్యాత్మిక బాటపట్టి ఉద్ధాన శివయోగి వద్ద శిష్యుడిగా చేరాడు. తన సాధనాసంపత్తిని ధారపోసి అతనిని ఆధ్యాత్మిక శక్తిపుంజంగా తయారు చేసి ‘శివకుమార స్వామి’గా లోకానికి అందించారు గురువులైన శ్రీ ఉద్ధాన శివయోగి. గురువుల ఆదేశానుసారంగా తుమకూరులో సిద్ధగంగ మఠాన్ని స్థాపించారు శివకుమారస్వామి.
భక్తినావ–సామాజిక తోవ
9 దశాబ్దాల పాటు సిద్ధగంగ మఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించిన శివకుమారస్వామి ఆధ్యాత్మిక, భక్తి బోధలకే పరిమితం కాకుండా సమాజసేవనూ బాధ్యతగా స్వీకరించి సంఘసేవకుడిగానే ఎక్కువ ప్రాచుర్యం పొందారు. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థల్ని నెలకొల్పి లక్షలాదిమంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందించి గొప్ప విద్యాదాతగా పేరుగాంచారు. విద్యతోపాటు క్రమశిక్షణను, సత్ప్రవర్తనను పెంపొందించేందుకు కృషి చేసిన ఈ మహనీయుడు లక్షలాదిమంది అభాగ్యుల ఆకలి బాధలు తీర్చిన అన్నదాత కూడా.
వరించిన పురస్కారాలు
శ్రీ శివకుమారస్వామిని వివిధ పురస్కారాలు కోరి వరించాయి. వీరి సేవలకు గుర్తింపుగా 2007లో కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డునిచ్చి గౌరవించగా, భారత ప్రభుత్వం 2015లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
సామాన్యుడే మాన్యుడు
వీరి ఆశీస్సుల కోసం ఉన్నత పదవులలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతలు సైతం పరితపించేవారు. వీరిమాటను శిరోధార్యంగా భావించేవారు. కానీ వీరు అతి సామాన్యుడిలా శతాధిక వయసులో కూడా రోజూ శిష్యులను కలుసుకుని మాట్లాడేవారు. వారి దైనందిన సమస్యలకు ఆధ్యాత్మిక మార్గంతో పరిష్కారాలను సూచించేవారు.
ఆధ్యాత్మికతతో క్రమశిక్షణ
‘వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికైనా అవసరం. వ్యక్తిగత క్రమశిక్షణకు బాటలు వేసేది ఆధ్యాత్మిక మార్గం. అదే మన జీవితాలను సరైన దారిలో నిలబెడుతుంది. సమాజంలోని ప్రతీ వ్యక్తి సత్యనిష్టాగరిష్టుడైతే సమస్యలన్నవే ఎదురుకావు. సమాజం ఉన్నతంగా పురోగమించాలంటే మనిషి సరైన దారిలో నడవాలి‘ అంటూ అలాంటి మార్గాన్ని ఆచరణలో చూపించి చైతన్యజ్యోతులను ప్రసరింపజేసిన మహనీయుడు శివగంగస్వామి.
– అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని, వేదపండితులు
శ్రీ శివకుమారస్వామి
Published Sun, Jan 19 2020 1:53 AM | Last Updated on Sun, Jan 19 2020 1:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment