శుభమైనా, సుఖమైనా; మంచికైనా మాటకైనా; వార్తకైనా, వలపుకైనా; అనుబంధమైనదీ అన్యోన్యమైనదీ ‘మధుర’ రసమే గాని మరొకటి కాదు. మిఠాయిని అందిస్తే మైత్రి కుదిరినట్లే. ఇది మన సాంప్రదాయం. జీవశాస్త్రం కూడా దీనికి దాసోహమే. రుచిని గ్రహించేది నాలుక. షడ్రసాలకు సంబంధించి నాలుకపై ఒక్కొక్క చోట ఒక్కొక్క రసానికి సంబంధించిన ‘రసగ్రంధులు’ ఉంటాయి. ఏ పదార్థానికైనా ముందుగా తగిలేది నాలుక చివరి భాగమే. ఈ జిహ్వాగ్ర స్థానంలోనే మధుర రసాన్ని ఆస్వాదించే ‘రస గ్రంధులు’ ఉంటాయని వైద్యశాస్త్రం నిరూపించింది. ఉప్పు, పులుపులకు పార్శ్వ భాగం, ఇతర స్థానాలలో తిక్త కటు కషాయాలు (చేదు, కారం, వగరు) ఉంటాయని శాస్త్రం చెబుతోంది. ఈ షడ్రసాలకు సంబంధించి నిర్దిష్టమైన ఆరోగ్య మరియు పోషక ప్రయోజనాలు, అతి సేవన వలన కలిగే అనర్థాలు సుస్పష్టంగా వివరించింది ఆయుర్వేదం.
మధుర రసం: (అష్టాంగ హృదయ సంహితా)
ఇది అన్నిటి కంటె శ్రేష్ఠమైనది. జన్మతః అందరికీ హితకరం. ఓజస్సు, ఆయుష్షు, శరీరకాంతి వర్ధకం, ధాతు పుష్టికరం, కేశ వర్థకం. కంఠస్వరాన్ని మెరుగు పరుస్తుంది. బాలింతలలో చనుబాలు (స్తన్యం) కలగడానికి దోహదకారి. బాలురకు, వృద్ధులకు, గాయపడిన వ్యక్తులకు కూడా హితకరం. (అంటే వ్రణాలు మానడానికి సహాయకారి అని అర్థం). విషహరం కూడా. వాతపిత్త హరం. మధుర రసం ‘గురువు’. అంటే జీర్ణమవటానికి ఎక్కువ సమయం పడుతుంది. అనంతరం శరీరం బరువుగా ఉంటుంది. అందువలన స్థూలకాయానికి దారి తీస్తుంది.
ఆజన్మ సాత్మ్యాత్ కురుతే ధాతూనాం ప్రబలం బలం‘ బాలవృద్ధ క్షతక్షీణ, వర్ణ కేశేంద్రియ ఓజసాం.... స్తన్యం సంధానకృత్... ఆయుష్యో.. జీవనః...
అతిగా సేవిస్తే...
స్థౌల్యం, మధుమేహం, అగ్ని మాంద్యం, ఆంత్రకృతములు, ఇతర కఫ జన్య రోగాలు, కంతులు కలుగుతాయి. సన్యాసం (కోమా) కూడా సంభవించే అవకాశం ఉంది.కురుతే అత్యుపయోగేన సమేదః కఫజాన్, గదాన్‘స్థౌల్య అగ్నిసాద, సన్యాస, మేహ, గండ, అర్బుదాదికాన్‘తీపి ఎక్కడుంటుంది? ఎలా వస్తుంది?
ప్రకృతిసిద్ధ ద్రవ్యాలు:
పండ్లు (ఫలాలు): అరటి, సీతాఫలం, సపోటా, పనస, మామిడి, ఖర్జూరం వంటి ఫలాలు అత్యంత మధురంగా ఉంటాయి. అలాగే దానిమ్మ, బొప్పాయి, జామ, ఆపిల్ మొదలైనవి. ద్రవరూప రసంతో ఉండేవాటిలో బత్తాయి, కమలా, ద్రాక్ష, పుచ్చకాయ ప్రధానమైన వి. స్ట్రాబెర్రీ, చెర్రీ, రామాఫలం మొదలైనవి కూడా ఎక్కువ తీపిగా ఉంటాయి.
ద్రవాలు: చెరకు రసం, కొబ్బరి నీళ్లు, పాలు, తేనె (కొంచెం వగరు కూడా కలిపి ఉంటుంది)
ఔషధ ప్రధానమైనవి: అతి మధురం, శతావరీ (పిల్లి పీచర) మొదలైనవి.
ఆహార శాకాలు: తియ్య గుమ్మడి, చిలగడ దుంప, సొరకాయ, బీరకాయ, టొమాటో మొదలైనవి.
పప్పులు: నువ్వులు, పెసలు, సెనగలు మొదలైనవి.
2. పిండి వంటలు: వీటి తయారీలో వరి పిండి, గోధుమ పిండి, మైదా పిండి ప్రధాన భూమికలు. పప్పులలో నువ్వులు, మినుములు, పెసలు, సెనగలు, కందుల వంటివి విరివిగా వాడతారు. శర్కర, బెల్లం ప్రధాన పాత్రధారులు. కొన్ని పాయసాలలో పాలు, తేనె, భాగస్వాములు. మరిగించిన నూనెలతో చేసిన డీప్ ఫ్రైలను మిఠాయిలుగా మలుస్తారు.
ఉదా: కాజా, లడ్డు, కజ్జికాయ, జిలేబి, అరిసెలు మొదలైనవి. అలాగే పాలు, మీగడలు ప్రధానంగా ఉండే బర్ఫీ, రసగుల్లా, రసమలైల వంటివి కోకొల్లలు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన మిఠాయిలు ప్రాచుర్యం పొందుతున్నాయి. చాక్‌లేట్లు, ఐస్‌క్రీమ్‌ల వంటివి అదోరకం.
తెలుగు వారి పిండివంటల్లో... మినపసున్ని, బూరెలు, కొబ్బరి లస్కోరా, అరిసెలు, హల్వాలు అత్యంత ప్రధానమైనవి. చాలా వాటిల్లో నెయ్యి కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది.తీపి ఏదైనా ఒకటే విలువా? ఒకటే ప్రయోజనమా? కాదు, కానే కాదు. ప్రకృతి సిద్ధమైనవి ఆరోగ్యపరంగా ప్రథమ స్థానంలో ఉంటాయి. వీటిలో ఉండే సహజమైన పీచు మరియు ఇతర పదార్థాల వల్ల దేహానికి హాని కలుగదు. పిండివంటల్లో వాడే ఇతర పదార్థాలు (వరి, గోధుమ), నూనె, నెయ్యి... వీటి వల్ల ఆయా మిఠాయిల గుణధర్మాలు మారి, కేలరీలు పెరిగి, శరీరం మీద వివిధ ప్రభావాలు చూపిస్తాయి. మరో విషయం ఏమిటంటే, ‘రిఫైన్డ్ ఆయిల్స్, స్వీట్ కోసం ఎసెన్స్, నిల్వ కోసం రసాయనాలు.. ఇలా ఎన్నెన్నో రసాయనిక పదార్థాలు అతిథులుగా చేరి అపార నష్టం కలిగిస్తాయి. బజారులో, స్వీట్ షాపుల్లో లభించే వాటిలో అత్యధిక శాతం ఇలాంటివే.
ఆధునిక జీవ రసాయన శాస్త్రం
మిఠాయిలన్నీ కార్బోహైడ్రేట్సు ప్రధానమైనవే. ఇవి ధాతు పరిణామంలో గ్లూకోజ్‌గా మారాల్సిందే. అందుకు ఇన్సులిన్ అవసరం కాబట్టి మధుమేహ రోగులు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రకృతిసిద్ధ మధుర ద్రవ్యాలలో నేరుగా ‘సుక్రోజ్’ ఉంటుంది. (సుక్రోజ్ = ఫ్రక్టోజ్+ గ్లూకోజ్). కాబట్టి వీటి అరుగుదల ధాతుపరిణామాలలో ఇన్సులిన్ అతి తక్కువ పాత్ర పోషిస్తుంది. ఇది గమనించాల్సి ఉంది.
గుర్తుంచుకోవలసిన సారాంశం:
రసములారింట ‘మధురమ్ము’ రమ్య రసము
ప్రకృతి దత్తపు మధురిమల్ వరము మనకు
తీపి యెంతేని సర్వదా తృప్తికరము
ఆయురారోగ్యసిద్ధికై అగ్రగామి
లె గువ వహియించి మితిమీరి తినగవలదు
గృహ మిఠాయిలు తినవయ్య ఇంపు మీర
అంగడివి యేల దేహ బాధార్తి యేల
సప్త ధాతుసారమునకు సహకరించు
మినపసున్నిని సేవించు తనివి తీర!
అమిత తక్షణ శక్తికై అరటి పండు.
డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వే వైద్య నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment