జంటలను కలిపే కళ్యాణ క్షేత్రాలు
జమలాపురం / తెలంగాణ తిరుపతి
కళ్యాణ క్షేత్రాలు
శ్రీ వేంకటేశ్వరుడు భక్తుల పక్షపాతి. అందుకే ఏడు కొండల మీద ఉన్న తనను అందుకోలేని భక్తుల కోసం తానే దిగివచ్చి, తెలుగు నాట కొన్ని మహిమాన్విత క్షేత్రాల్లో వెలిశాడు. పశ్చిమ గోదావరిజిల్లాలోని ద్వారకా తిరుమల అలాంటి క్షేత్రమే కాబట్టి చిన్న తిరుపతిగా పేరు పొందింది. అదేవిధంగా తెలంగాణలో తెలంగాణ తిరుపతిగా పేరుందిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కూడా అంతే విశిష్టమైనది. ఖమ్మం జిల్లా మధిర సమీపంలో ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామం జములవాయి దుర్గం పైన ఉన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రం తెలంగాణా రాష్ట్రానికే తలమానికంగా విరాజిల్లుతోంది. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి కృపను పొందడం ఆనవాయితీగా ఉంది.
ఆలయ చరిత్ర ........
జమలాపురం గ్రామం పేరు జాబాలి మహర్షి నుంచి వచ్చి ఉంటుందని ఒక భావన. పూర్వం జాబాలి మహర్షి ఈ గ్రామంలోని కొండ (గుట్ట) పై తపస్సు ఆచరించేవాడట. ఇక్కడే తన మునివాటికను నిర్మించుకున్నాడట. జాబాలి ఉన్న చోటు కాలక్రమంలో జములవాయి అయి ఉంటుందని అంటారు. శ్రీ వేంకటేశ్వరుడు ఈ క్షేత్రంపై స్వయంభువుగా వెలిశాడని, లేదు జాబాలి తపస్సుకు మెచ్చి వెలిశాడని కథనాలు ఉన్నాయి. ఏమైనా జాబాలి కాలంలోనే ఆలయానికి అంకురార్పణ జరిగి ఉండాలి.
ఆయన హయాంలోనే ఇక్కడ పుష్కరిణి నిర్మాణం జరిగిందని చరిత్ర. కాకతీయ రాజులలో ప్రసిద్ధుడైన ప్రతాప రుద్రదేవుడు తన జైత్రయాత్ర సందర్భంగా ఓరుగల్లు నుంచి ఖమ్మం మీదుగా ప్రయాణిస్తూ జములవాయి దుర్గానికి వచ్చాడనీ, పుష్కరణిని బాగు చేయించి దేవాలయాన్ని పునరుద్ధరణ చేసి ఇక్కడ దుర్గం నిర్మించాడనడానికి ఆధారాలున్నాయి. అలాగే శ్రీవేంకటేశ్వరుని భక్తుడైన విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు జమలాపుర దుర్గాన్ని దర్శించి ఆలయాన్ని పునరుద్ధరణ చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న మరో కథను చెప్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి అర్చకులలో ఆరవతరానికి చెందిన అక్కుభట్టు అనే పురోహితుడు వృద్ధాప్యంలో కొండ పైకి ఎక్కలేక చేతిలో ఉన్న స్వామి వారి నైవేద్యంతో కొండ మొదలులో కూలబడ్డాడు.
అక్కడి నుంచి కదల్లేక ఎక్కడ ఉన్నాడో అక్కడే నైవేద్యం పెట్టి ‘ఇక నా గతి ఇంతే నీ గతి అంతే’ అంటూ దుఃఖంతో వెనుదిరిగాడు. ఇంతలో ఒక గంభీరమైన ధ్వని వినిపించినట్లయింది. ‘నేను వచ్చుచున్నాను నీవు వెనుదిరగక ముందుకు పద’ అనే మాటలు వినిపించాయి. అక్కుభట్టు అట్లే గ్రామం వైపు నడుస్తుండగా చెవులు చిల్లులు పడేంత ధ్వని వచ్చింది. దీంతో వెనుదిరిగి చూడగా ఒక గొప్ప వెలుగు గుట్టపై నిలబడినట్లయింది. ఆ జ్యోతి కనిపించిన చోట చూడగా మహా అద్భుతంగా ఇంతకు ముందు ఎన్నడూ లేని శ్రీస్వామి వారి పాదం కనిపించింది. అప్పుడు అక్కుభట్టు భక్తిపారవశ్యంతో పూజలు చేయడం ఆరంభించాడు. అప్పటినుంచి అక్కుభట్టు వారి వంశీకులే అర్చకత్వం చేస్తున్నారు. శ్రీవారి పాదాన్ని నేటికీ చూడవచ్చు.
పెళ్ళిళ్ళ సందడి.....
శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పెళ్ళిళ్ళు చేసుకుంటే శుభం కలుగుతుందనేది ఈ ప్రాంత వాసుల విశ్వాసం. దీంతో శావ్రణ, కార్తీక మాసాల్లో, వేసవి కాలంలో పెళ్ళిళ్ళు కోలాహలంగా జరుగుతాయి. పెళ్ళిళ్ళ నిర్వహించుకోవడం కోసం దశాబ్దాల క్రితం టీటీడీ ఇక్కడ కళ్యాణ మండపాన్ని నిర్మించింది. దాతల వితరణతో నిర్మించిన ప్రయివేటు సత్రాల్లో కూడా వివాహాలు జరుగుతున్నాయి. గత దశాబ్దకాలం గా టీటీడీ అధికారులు ఇక్కడ ‘కళ్యాణమస్తు’ పేరుతో పేదజంటలకు తాళిబొట్టు, వస్త్రాలు అందచేసి ఉచితంగా వివాహాలు చేస్తున్నారు.
ఉత్సవాలు
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి ఏటా మార్చి- ఏప్రిల్ నెలల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. జనవరి 1న, ఉగాది పర్వదినాల్లో తెలంగాణా, ఏపీ రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది భక్తులు వచ్చి స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకోవడ ం ఆనవాయితీగా ఉంది.
- గంధం శ్రీనివాసరావు ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా
బస్సు మార్గం: హైద్రాబాద్ నుంచి ఖమ్మం మీదుగా మధిర పట్టణానికి చేరుకుని మధిర డిపో బస్సుల ద్వారా జమలాపురం ఆలయానికి చేరుకోవచ్చు. ఖమ్మం నుంచి జమలాపురంకు 80 కి.మీ. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం తదితర ప్రాంతాల నుంచి జమలాపురంకు బస్సులున్నాయి. విజయవాడ నుంచి కంచికచర్ల, ఎర్రుపాలెం మీదుగా జమలాపురం చేరుకునే రహదారి సౌకర్యం ఉంది. విజయవాడ-భద్రాచలం జాతీయ రహదారిలోని మైలవరం మీదుగా జమలాపురం చేరుకోవచ్చు.
రైలు మార్గం: సికింద్రాబాద్- తిరుపతిల మధ్య ప్రయాణించే కృష్ణా ఎక్ప్‌ప్రెస్, గుంటూరు - సికింద్రాబాద్‌ల మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్, డోర్నకల్ టు విజయవాడ ప్యాసింజర్‌ల రైళ్ళు ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఆగుతాయి. ఇక్కడ నుంచి కేవలం 6 కి.మీ. దూరంలోనే జమలాపురం ఆలయం ఉంది. 25 కి.మీ. దూరంలో ఉన్న మధిర రైల్వే స్టేషన్‌లో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. ఇక్కడ నుంచి బస్సులు జమలాపురం ఆలయానికి వస్తాయి. విమాన మార్గం: హైద్రాబాద్ విమానాశ్రయం నుంచి 250 కి.మీ. దూరంలో జమలాపురం ఉంటుంది. గన్నవరం విమానాశ్రయం నుంచి 75 కి.మీ. దూరంలో ఉంది.