నేటి హిరోషిమా
చరిత్ర
అది 1945, ఆగస్టు 6వతేదీ. ఉదయం ఎనిమిదిన్నర. ఇది ఇండియా టైమ్ కాదు, జపాన్ టైమ్. యుద్ధమేఘాలు గగనతలాన్ని కమ్ముకుని ఉన్నాయి. ఎక్కడ రేడియో విన్నా, ఏ వార్తాపత్రిక చూసినా రెండవ ప్రపంచ యుద్ధం ముగియడానికి సిద్ధంగా ఉందనే సంకేతాలే. యుద్ధం ఎవరికి మేలు చేస్తుందో తెలియదు, కానీ కీడు మాత్రం చాలా మందికి చేస్తుంది. ఆ కీడంతా అమాయకులకే. ఏ పాపం పుణ్యం ఎరగని జీవులకే. ఒక దేశం మరో దేశంతో ఎందుకు యుద్ధం చేస్తుందో తెలియదు వాళ్లకు. ప్రపంచం మొత్తం ఎందుకు రెండుగా చీలి పోయిందో తెలియదు. తమ దేశం ఏ పక్షాన ఉందనే ప్రాథమిక వివరం కూడా ఏ కొద్దిమందికో తప్ప అందరికీ తెలియదు. వారికి తెలిసిందల్లా ఎప్పుడు ఏ విమానం గగనతలాన చక్కర్లు కొడుతుందోనని కళ్లు తల మీద పెట్టుకుని చూస్తూ ఉండడమే.
జపాన్‌లో ఆ రోజు విమానం ప్రొఫెల్లర్ల చప్పుడు ఆ దేశ పౌరులకు జానపద కథల్లోని గుర్రపు డెక్కల చప్పుడును తలపించజేస్తోంది. గుండె గుభిల్లుమంటుంటే పిల్లలు ఎక్కడ ఉన్నారో వెతికిపట్టుకుని తలదాచుకోవడానికి పరుగులు తీస్తున్నారు. సూర్యోదయమైందంటే ఏ శకలం ఎటు నుంచి వచ్చి తాకుతుందోనని ఒళ్లంతా చెవులు చేసుకుని చిటుక్కుమనే శబ్దం కోసం ఎదురు చూడడమే అయింది. ఆ క్రమంలో పెద్ద దేశాల అధినేతలంతా సమావేశమయ్యారనే వార్త వారి చెవుల్లో పన్నీటిని చల్లింది. ఇక యుద్ధం ముగిసినట్లేనట ఆశ నిండిన మాటలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి.
ఇంతలో పెద్ద పెట్టున శబ్దం. పిశాచి రెక్కలు విచ్చినట్లు జపాన్ గగనతలం మీద చక్కర్లు కొట్టింది అమెరికన్ బాంబర్ బి–29. మరో నిమిషంలో వంద పిడుగులు ఒక్కసారిగా నేలకు తాకినట్లు ‘లిటిల్ బాయ్’ అనే ఆ బాంబు జపాన్ భూతలాన్ని తాకింది. షిరోషిమా నగరంలో 90 వేల భవనాలున్నాయి, 1900 అడుగుల ఎత్తు నుంచి శరాఘాతంలా దూసుకొచ్చిన లిటిల్‌బాయ్ తాకిడికి నగరం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఎనభై వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 35 వేల మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. తీవ్రమైన రేడియేషన్‌కు గురై రకరకాల అనారోగ్యాలతో ఏడాదిలోపు సంభవించిన మరో అరవై వేల మరణాలు కూడా లిటిల్‌బాయ్ పొట్టనపెట్టుకున్నవే.
ప్రపంచం ముందు ఒకే ఒక్క ప్రశ్న. ఇంతకీ పెద్ద దేశాల అధిపతులు కూర్చుని చర్చించి సాధించిందేమిటి? సోవియట్ యూనియన్ అధినేత స్టాలిన్, అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్, గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి విన్‌స్టన్ చర్చిల్ (చర్చిల్ తర్వాత క్లెమెంట్ అట్లీ)... జర్మనీలో సమావేశమయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధానికి తెర దించడానికే సమావేశమయ్యారు. ఆ ఏడాది జూలై 27 నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు చర్చించారు. జపాన్ బేషరతుగా లొంగిపోవాలని డిమాండ్. అనధికారికంగా వారంతా జపాన్‌లో రాజరికాన్ని కొనసాగించడానికి ఆమోదం తెలిపిన వారే. కానీ చేసిందేమిటి? బేషరతుగా లొంగిపోవడానికి జపాన్ అంగీకారం తెలిపే లోపే అమెరికా అతి తెలివిగా ఆలోచించింది. యుద్ధంలో అవసరమవుతుందని సిద్ధం చేసుకున్న అణుబాంబులను వాడకపోతే ఎలా? ప్రయత్నం అంతా వృథా అయిపోదూ? ఇప్పుడు వాడకపోతే ఇక వాడే అవసరం రాదేమో! అణుబాంబును ప్రయోగించి చూడడానికి ఇంతకు మించిన మంచి తరుణం రాకపోవచ్చు. ఇప్పుడే ప్రయోగించాలి అనుకుంది. అంతే... హిరోషిమా మీద తొలి అణుబాంబును ప్రయోగించింది. ఆ భయోత్పాతం నుంచి బయటపడేలోపు నాగసాకి పట్టణం మీద ఫ్యాట్‌మ్యాన్ పేరుతో మరో అణుబాంబును ప్రయోగించింది.
నిజానికి జపాన్ అప్పటికి అగ్రదేశాధినేతల డిమాండ్‌ను ధిక్కరించే పరిస్థితిలో ఏ మాత్రం లేదు. యుద్ధానికి చరమగీతం పాడడానికి సిద్ధంగానే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన అణుదాడిని ఆ దేశపు ఆధిక్యభావన ప్రకటనలో భాగంగానే గుర్తించింది ప్రపంచం. ఇకపై ఇలాంటివి జరగడానికి వీల్లేదని శాంతికాముకులు చేసిన అనేక నిరసనల తర్వాత ఆగస్టు ఆరవ తేదీని ప్రపంచదేశాలన్నీ యాంటీ న్యూక్లియర్‌డేగా గుర్తు చేసుకుంటున్నాయి. జపాన్ ప్రజలు యుద్ధం మిగిల్చిన చేదు అనుభవాలను దీటుగా ఎదుర్కొంటూ నేలమట్టమైన నగరాలను పునర్నిర్మించుకున్నారు.
బాంబు ప్రయోగం
బాంబు తాకిడికి ధ్వంసమైన హిరోషిమా
హిరోషిమా ఫొటో ప్రదర్శనను తిలకిస్తున్న స్టూడెంట్స్